బాలనాగమ్మ (1959 సినిమా)
ఇదే పేరుతో వచ్చిన మూడు సినిమాల కోసం బాలనాగమ్మ చూడండి.
బాలనాగమ్మ (1959 సినిమా) (1959 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
నిర్మాణం | ఎస్.ఎస్. రాజు, డి.ఎస్. రాజు, పి. వెంకటపతిరాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, ఎస్వీ.రంగారావు , అంజలీదేవి, రేలంగి, రాజసులోచన, సంధ్య |
సంగీతం | టి.వి.రాజు |
గీతరచన | సముద్రల జూనియర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటరమణా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
బాలనాగమ్మ వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో శ్రీ వెంకటరమణ ఫిల్మ్స్ పతాకంపై ఎస్.ఎస్.రాజు, డి.ఎస్.రాజు, పి.వెంకటపతిరాజుల నిర్మాణసారధ్యంలో ఎన్.టి.ఆర్.,ఎస్వీ రంగారావు, అంజలీదేవి ప్రధానపాత్రలుగా పోషించిన 1959 నాటి తెలుగు జానపద చిత్రం.
కథాసారాంశం[మార్చు]
భూచక్రపురం ఏలే నవభోజరాజు, భూలక్ష్మీదేవులకు సంతానం లేక బాధపడుతుంటారు. నిగమానందస్వామి అనే సిద్ధుడు వచ్చి భూలక్ష్మీదేవి పరమేశ్వరుని ప్రార్థించి ఆలయంలోని మామిడిచెట్టు పండు తింటే సంతానం కలుగుతుందని చెబుతాడు. ఆమె సంతోషం పట్టలేక పుట్ట మీద ఎక్కి మామిడిపండ్లు కోసుకుంటుంది. పుట్టలోని నాగరాజు బుస్సున లేచి ఆగ్రహించి కాటువేయపోతాడు. అంత మహారాణి తన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటుంది. నాగరాజు సరే బిడ్డలు పుట్టిన ఆరు నెలలకు ఖచ్చితంగా వచ్చి కాటు వేస్తానంటాడు. ఆమెకు ఏడుగురు ఆడపిల్లలు పుడతారు. కడగొట్టు కూతురే మన కథానాయకి బాలనాగమ్మ. అతిలోక సౌందర్యవతి. నాగరాజు కాటుకి గురియైన మహారాణి తన బిడ్డలను జాగ్రత్తగా పెంచమని మారు వివాహము చేసుకోవద్దని చెబుతుంది. మహారాజు రాచకార్యాలు వదిలివేసి బిడ్డల పెంపకంలో మునిగి పోతున్నాడని గ్రహించి మంత్రి రాజును పునర్వివాహము చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. విధిలేక మహారాజు కూడా పిల్లల పెంపకం కోసం పెళ్ళి చేసుకుంటాడు. కాని సవతి తల్లి మహారాజు లేని సమయం చూసి వారిని నానా హింసలు పెట్టి చంపబోతుంది. మహారాజును వశీకరించుకుని బిడ్డలను చంపమని ఆజ్ఞాపిస్తుంది. కన్నతండ్రి బిడ్డలను చంపలేక అడవిలో వదలి పెట్టి వస్తాడు. పిల్లలకు మేనమామ అయిన పానుగంటి ప్రభువు రామవర్థిరాజు విషయము తెలుసుకుని తన ఏడుగురు కుమారులను మేనకోడళ్ళ అన్వేషణ కోసం పంపిస్తాడు. ఆఖరివాడైన కార్యవర్థిరాజు , బాలనాగమ్మను చూసి వివరాలు తెలుసుకుని ఆమె తన మరదలేనని తెలుసుకుంటాడు. మిగిలినవారు కూడ కలుసుకుని వారిని వివాహమాడతారు. సుఖసంతోషాలతో సాగిపోతున్న వారి జీవితంలో గండికోటయుద్ధం వస్తుంది. రాజులందరూ యద్ధానికి వెళతారు. గర్భవతిగా నున్న బాలనాగమ్మను వదలలేక కార్యవర్థిరాజు కోటకు రక్షణగా ఉండే బాధ్యత నీదేనని తలారి రాముడికి అప్పగిస్తాడు. కార్యవర్థీరాజు గుమ్మం బయట గీత గీసి ఎట్టి పరిస్థితులలోను గీత దాటి బయటకు రావద్దని బాలనాగమ్నకు చెబుతాడు. మాయలమరాఠీ బాలనాగమ్మ అందాన్ని చూచి మోహించి ఎలాగైనా ఆమెను వివాహము చేసుకోవాలనుకుంటాడు. బాలనాగమ్మ మగబిడ్డను ప్రసవిస్తుంది. మరాఠీ జంగమదేవర వేషములో వచ్చి ఆమెను తీసుకు వెళ్లిపోతాడు. కార్యవర్థిరాజు బాలనాగమ్మను వెదుక్కుంటూ వెళతాడు. మరాఠీ అతనిని రాయిగా మార్చేస్తాడు. పెద్దమ్మల దగ్గర బాలనాగమ్మ కొడుకు బాలవర్థిరాజు పేరుతో ఎంతో గారాబంగా పెరుగుతూ ఉంటాడు. తలారి రాముడి ద్వారా విషయము తెలుసుకుని బాలవర్థిరాజు , తలారిరాముణ్ణి తీసుకుని తల్లిదండ్రులను వెదుక్కుంటూ వెళతాడు. పూలమ్మి సాయంతో మరాఠీ దగ్గర చేరి తల్లిని కలుసుకుని మరాఠీ జీవన రహస్యము తెలుసుకోమంటాడు. సప్తసముద్రాల ఆవల చెట్టుతొర్రలోనున్న చిలకను చంపి శిలగా మారిన తన తండ్రిని తల్లిని రక్షించుకుంటాడు.
చిత్ర బృందం[మార్చు]
తారాగణం[మార్చు]
- రామారావు - కార్యవర్థిరాజు
- అంజలీదేవి – బాలనాగమ్మ
- సి.యస్.ఆర్.- నవభోజరాజు
- S.V.Ranga Rao – Mayala Maraathi
- Raja Sulochana – Sangu
- Hemalatha – Bhoo Lakshmi Devi
- Surya Kala – Manikyamba
- Relangi – Talari Ramudu
- Junior Bhanumathi – Nambi Nanchari
- Master Satyanarayana – Balavardhi Raju
పాటలు[మార్చు]
- అందమూ ఆనందమూ ఈ అందము అనందము ప్రియా నీదేరా - పి.సుశీల
- అనిలో వైరుల దోర్బలంబణచి మేమంత:పురము చేరుదాకన్ (పద్యం) - ఘంటసాల
- అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు నానప్పలమ్మ కొడుకునండి - పిఠాపురం నాగేశ్వరరావు
- ఇంటిలోని పోరు ఇంతింత గాదురా ఇద్దరూ పెళ్ళాలు వద్దురా శివుడా - ఘంటసాల
- ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే - ఎ.పి.కోమల బృందం
- నీకేలరా హహః ఈ వేదన హహ ఎన్నికైన చిన్నదానరా - పి.సుశీల
- జయము జయము శ్రీ వెంకటరమణా (బుర్రకథ) - ఘంటసాల బృందం
- జయజయ గిరిజా రమణా జయజయశంకర నాగాభరణా - పి.లీల
- జోజో రాజా చిన్నారి రాజా నిదురించవోయి రాజా నా బాలవర్దిరాజా - సుశీల
- బలే బలే ఫలరసం బలముకాచు ఈ రసం మాసిపోవు నీరసం - ఘంటసాల బృందం
- లాలి లాలి నా పాపల్లారా లాలి లాలి లాలి నా పాపల్లారా లాలి జో జో - పి.లీల బృందం
- విరిసింది వింతహాయీ మురిసింది నేటిరేయి అందాల చందమామా చెంతనుంది అందుకే - జిక్కి, ఘంటసాల
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.