Jump to content

బి.ఎస్.కేశవన్

వికీపీడియా నుండి
బళ్లారి షమన్న కేశవన్
జన్మించారు. 10 మే 1909
మృతిచెందారు. 16 ఫిబ్రవరి 2000 (వయస్సు 91)
జాతీయత భారతీయుడు
వృత్తి. లైబ్రేరియన్
అవార్డులు పద్మశ్రీ

బళ్లారి షమన్న కేశవన్ (1909 మే 10-2000 ఫిబ్రవరి 16) స్వతంత్ర భారతదేశపు మొదటి జాతీయ గ్రంథాలయాధికారి.[1][2] 1958 ఆగస్టు 15న మొదటిసారిగా భారత జాతీయ గ్రంథ పట్టిక (Indian National Bibliography - INB ) రూపొందించడానికి, ప్రచురించడానికి అయన నాయకత్వం వహించారు. అందువలన ఆయనను భారత జాతీయ గ్రంథ పట్టిక పితామహుడిగా కూడా పిలుస్తారు. తరువాత అతను కొత్త ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ (INSDOC) కు మొదటి డైరెక్టర్ గా నియమించారు.[3] దేశానికి ఆయన చేసిన గొప్ప సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అతను 16 ఫిబ్రవరి 2000 న, 91 సంవత్సరాల వయసులో మరణించాడు.[4]

కుటుంబం, విద్య

[మార్చు]

కేశవన్ 1909 మే 10న మద్రాసు (తరువాత చెన్నైగా మార్చారు)లో భక్తి ప్రపత్తులు, విద్యాధికుల కుటుంబంలో జన్మించాడు. తల్లితండ్రులు తాతగారు ఇతనిని తీర్చిదిద్దారు. మద్రాసులో మెట్రిక్యూలేషన్ వరకు చదివాక మైసూరులో తాతగారింటికి అతని కుటుంబం తరలి వెళ్లింది. మైసూరు విశ్వవిద్యాలయం, మహారాజా కళాశాల నుండి 1929లో పట్టభద్రుడైన తరువాత, అతను ఇంగ్లాండ్ వెళ్లి, అక్కడ 7 సంవత్సరాలు ఉండి లండన్ విశ్వవిద్యాలయం నుండి 1936లో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ పట్టా, లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా పొందాడు.[5][6] అక్కడ బ్రిటిష్ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు బెర్ విక్ సేయర్స్, అరండేల్ ఇసర్జల్ వంటి వారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. తరవాత జెర్మనీ లోని జీవ విశ్వవిద్యాలయం నుంచి జర్మన్ భాషలో ఉన్నత అధ్యయనం, లండన్ ప్రాచ్య కళాశాలలో సంస్కృతంలో స్నాతకోత్తర పట్టా పొందాడు.[6]

ఉద్యోగాలు, పదవులు

[మార్చు]

కేశవన్ మైసూరు విశ్వవిద్యాలయం, మహారాజా కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించి అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన 1944 లో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సి.ఎస్ర్.ఐ.ఆర్.) కు చెందిన Dictionary of Economic Products and Industrial Resources of India (తరువాత ఇది Wealth of India గా మార్పు చెందింది) లో సహాయ కార్యదర్శిగా 1946 వరకు పనిచేసాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ కు క్యూరేటర్ గా కూడా పనిచేశారు.[6]

భారత జాతీయ గ్రంథాలయం

[మార్చు]

1947 లో భారత పాకిస్తాన్ విభజన తరువాత కలకత్తాలోని ఇంపీరియల్ గ్రంథాలయాధికారి పాకిస్తానుకు వెళ్లిపోవడంతో, అప్పటి విద్యామంత్రి డా.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఇంకా కార్యదర్శి డా.భట్నాగర్ ల చొరవతో కేశవన్ ని 1948లో ఆ స్థానంలో ఎంపిక చేసారు. 1948 లో దానిని భారత జాతీయ గ్రంథాలయంగా మార్చడానికి డా. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, హుమాయూన్ కబీర్ ల చొరవతో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది.భారత జాతీయ గ్రంథాలయం ఏర్పడడానికి రూపకర్త అయ్యారు.[6]

గ్రంథాలయాధికారిగా, జాతీయ గ్రంథాలయం నిర్మించడానికి, భారత జాతీయ గ్రంథ పట్టిక ప్రారంభించడానికి, ఇన్-ఛార్జ్ గ్రంథాలయాధికారిగా కేంద్ర రిఫరెన్స్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు.[5]

  • కేశవన్ భారత జాతీయ గ్రంథాలయానికి తగిన భవనం కొరకు చూస్తుండగా డా.నిహార్ రంజన్ రే పండితులు, ఇంకా అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి. రాజగోపాలాచారి సహకారంతో బ్రిటిష్ వైస్ రాయ్ లు నివసించిన బెల్వడేర్ ప్రసాదాన్ని ప్రభుత్వం జాతీయ గ్రంథాలయం ఏర్పాటుకు కేటాయించింది. ఆయన హయాంలో సిబ్బంది 40 నుంచి 500 కు పెరిగారు. బడ్జెట్ కూడా అప్పట్లో రు.4 లక్షలకు పెరిగింది .
  • బ్రిటిష్ జాతీయ వాజ్మయ సూచి (BNB-British National Bibliography) ప్రభావంతో కేశవన్ భారత జాతీయ గ్రంథ పట్టిక (INB - Indian National Bibliography) రూపొందించారు. దీనికి 1954 పుస్తకాల సంప్రదాన చట్టం (డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ యాక్ట్) ఆధారంగా రూపొందించారు. ఈ చట్టం రూపకర్త కూడా కేశవన్. ఈ చట్ట ప్రకారం భారత దేశం లో ప్రచురించబడే ప్రతి పుస్తకము, పత్రికకు సంబంధించి 4 ప్రతులను 30 రోజుల లోపు భారత జాతీయ గ్రంథాలయానికి, ఇతర 3 చెన్నై , ముంబై , ఢిల్లీలలో అదే స్థాయి పౌర గ్రంథాలయాలకు పంపాలి. ఆ విధంగా జాతీయ గ్రంథాలయానికి అందిన పుస్తకాలు పత్రికలూ గ్రంథ సూచీలో చేర్చబడుతాయి 1958 జనవరి - మార్చి సంచికగా త్రైమాసికముగా ప్రారంభమయి 1964 నుండి మాసపత్రిక గా మార్పు చెందింది.[6]

1948 నుండి 1963 వరకు, ఇంకా 1970 నుండి 1971 వరకు రెండు సార్లు భారత జాతీయ గ్రంథాలయానికి అధిపతిగా పనిచేశారు.

ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్

[మార్చు]

న్యూ ఢిల్లీలోని భారత జాతీయ శాస్త్ర ప్రలేఖన కేంద్రం - ఇన్సడాక్ (ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ -INSDOC) కు కేశవన్ 1963లో సంచాలకుని (డైరెక్టర్) పదవి చేపట్టాడు. ఆయన ఎన్నో విజయాలు సాధించారు. జాతీయ శాస్త్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాడు. డాక్యుమెంటేషన్ అండ్ రిప్రోగ్రఫీ కోర్సులో అసోసియేట్ షిప్ పట్టా (Associateship in Documentation and Reprography) ద్వారా అనేకమందికి ఆధునిక సాంకేతిక పద్ధతుల శిక్షణ మొదలు పెట్టారు. కేశవన్ ఆ సంస్థ నుంచి ముఖ్యమైన ప్రచురణలు ఆరంభించాడు. అవి -

  • "ఇండియన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్స్" (Indian Science Abstracts) ప్రారంభం,
  • అనేక వైజ్ఞానిక పత్రికల సమైక్య సూచి (NUCSSI - National Union Catalogue)" ప్రచురణ,
  • పత్రికల వ్యాసాల బట్వాడా సేవలను ప్రారంభించారు.
  • భారతదేశంలోని శాస్త్రీయ పరిశోధన సంస్థల డైరెక్టరీ [7]

కేశవన్ నాయకత్వం లోని ఇన్సడాక్ ను, సేవలను అభివృద్ధి చెందిన దేశాలు, యునెస్కో గుర్తించాయి. 1969 లో ఇన్సడాక్ సంచాలకుడిగా పదవీ విరమణ చేసాడు.

గౌరవ పదవులు , గుర్తింపులు

[మార్చు]

అంతర్జాతీయ, జాతీయ సంస్థలలో అనేక పదవులను నిర్వహించారు. ఇతని సేవలను ప్రభుత్వం ఇతర సంస్థలు ఉపయోగించుకున్నాయి. ముఖ్యంగా ప్రణాళికా సంఘం , విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, విశ్వవిద్యాలయాల శాఖలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో వంటివి. అదనంగా, అతను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ (FID) కి ఉపాధ్యక్షులు (వైస్ ప్రెసిడెంట్ )గా, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ కి అధ్యక్షుడుగా, ఇఫ్లా (IFLA), మొదలగునవి. ఇంకా అనేక కమిటీలలో సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.[8][6]

1960లో భారత ప్రభుత్వం కేశవన్ కి 'పద్మశ్రీ' పురస్కారం అందచేసింది . ఆయనకు పాండిత్య భాండాగారి (Scholar Librarian) అను పేరు ఉండేది. [6]

ప్రచురణలు

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ చేపట్టిన ప్రాజెక్ట్ (NBIL - National Bibliography of Indian Literature) జాతీయ భారతీయ సాహిత్య వాజ్మయ సూచి. 16 భారతీయ భాషలలో సాధారణ కృతులు, తత్వ శాస్త్రం, మతం, సామజిక శాస్త్రాలు, సాహిత్యం, భాషా శాస్త్రం, లలిత కళలు, చరిత్ర, భూగోళ శాస్త్రం, పర్యాటకం ఇతర విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఈ సూచీలో చేర్చుతారు. ఈ సూచీకి కేశవన్ సంకలన కర్త, ప్రధాన సంపాదకుడు.[6] ఆయన అనేక తన స్వంత రచనలు ప్రచురించారు, వాటిలో ప్రముఖమైనవి -

  • భారతదేశంలో ప్రింటింగ్, పబ్లిషింగ్ చరిత్ర (History of Printing and Publishing in India), 3 సంపుటాలు నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. నాల్గవది ప్రచురించలేదు. దీనిని 70లలో ప్రారంభించి 80లలో పూర్తి చేసారు.[6]
  • ది బుక్ ఇన్ ఇండియాః ఎ కంపైలేషన్ (The Book in India: A Compilation).[8]

కేశవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ (కెఐఐకెఎం)

[మార్చు]

భారతదేశంలో గ్రంథాలయ సమాచార శాస్త్ర రంగంలో పరిశోధన అభివృద్ధి కోసం ప్రొఫెసర్ కేశవన్ అభిమానులు, శిష్యులు ఆయన జ్ఞాపకార్థం, దార్శనికతను సజీవంగా ఉంచడం కోసం సికింద్రాబాద్ (తెలంగాణ)లో "కేశవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ (KIIKM) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.[9]

మూలాలు

[మార్చు]
  1. Robert, Wedgeworth (1993). World Encyclopedia of Library and Information Services (3 ed.). ISBN 0-8389-0609-5. Retrieved 9 February 2016.
  2. "The man who made National Library – P.T. Nair publishes biography of BS Kesavan". The Telegraph. Archived from the original on 4 December 2005.
  3. Robert, Wedgeworth (1993). World Encyclopedia of Library and Information Services (3 ed.). ISBN 0-8389-0609-5. Retrieved 9 February 2016.
  4. "Padmashree BS Kesavan Passes Away". Archived from the original on 15 December 2010. Retrieved 9 February 2016.
  5. 5.0 5.1 Robert, Wedgeworth (1993). World Encyclopedia of Library and Information Services (3 ed.). ISBN 0-8389-0609-5. Retrieved 9 February 2016.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 రాజు, ఏ.ఏ.ఎన్. (2022-01-01). "పాండిత్య భండాగారి బి.ఎస్. కేశవన్ (1909-2000)". గ్రంథాలయ సర్వస్వం. 82 (10). విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్: 4–5.
  7. Robert, Wedgeworth (1993). World Encyclopedia of Library and Information Services (3 ed.). ISBN 0-8389-0609-5. Retrieved 9 February 2016.
  8. 8.0 8.1 Robert, Wedgeworth (1993). World Encyclopedia of Library and Information Services (3 ed.). ISBN 0-8389-0609-5. Retrieved 9 February 2016.
  9. "Padma Shri Awardees of the Department". Department of Library and Information Science, University of Delhi. Retrieved 2025-01-13.

బయటి లింకులు

[మార్చు]