బుట్టబొమ్మలు

వికీపీడియా నుండి
(బుట్ట బొమ్మలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దస్త్రం:BUTTABOMMALU-2.jpg
ఆలుమగల ఆకారాల్లోని బుట్టబొమ్మలు
బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.

బుట్టబొమ్మలు[మార్చు]

బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు ఉన్నాయి.

ప్రదర్శన[మార్చు]

ఈ బొమ్మల్ని పురుషులే ఆడిస్తారు. ఈ బొమ్మల్లో భార్యాభర్తలు, వారి ప్రేమ కలాపాలు, వారి ప్రేమను భగ్నం చేసే దుష్ట పాత్ర, స్త్రీ బొమ్మతో కామకేళీ విలాసాలు. ఇది చూచిన భర్త వెంటబడి దుష్టపాత్రను తరమడం తరువాత భార్య వెంట పాత్ర, స్త్రీ పాత్ర క్షమించమని వేడుకోవడం ఇలా బొమ్మల ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనానికి కూడా డప్పుల వాయిద్య ముంటుంది. బొమ్మను ధరించిన పాత్రధారి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని అడుగులు వేస్తాడు.

బుట్టబొమ్మల్లో పాములవాడి బొమ్మ కూడా ఉంటుంది. నాగస్వరం ఊదుతూ, నృత్యం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బొమ్మలు నాలుగైదు కూడా ఉంటాయి. ఈ బొమ్మలో శింగి, సింగడు వంటి హాస్యపాత్రలు కూడా ఉంటాయి. బొమ్మలను అతి సహజంగా జీవకళ ఉట్టిపడేలా రంగు రంగులలో చిత్రిస్తారు.

బుట్టబొమ్మల తయారీ[మార్చు]

బుట్టబొమ్మల తయారీలో పలు రకాలు ఉన్నాయి.

మొదటి రకం

వెదురు బద్దలను సన్నగా చీల్చి వాటిని మధ్యలోనూ లోపలి భాగంలోనూ తగిన ఖాళీ వదిలి బొమ్మలకు అనువైన ఆకారాలుగా మార్చుకొంటారు. దానిపై దళసరి బట్టను చుట్టి సూదితో దగ్గరగా తగిన బిగువుతో కుడతారు. తరువాత ఆబట్టపై చింత గింజలపొడి, ఉడకబెట్టిన పిండిలాంటి గంజి మిశ్రమంగా చేసి గుడ్డపై పూస్తూ పోతారు. అలా నాలుగైదుసార్లురాసి కావలసిన మందంవచ్చాక ఎండలో పెట్టి దానిపై ఉడ్ ప్రైమరీ అనబడు పెయింటును పూస్తారు. తరువాత ఆయిలు పెయింట్లతో అందముగా అలంకరించి ప్రదర్శనకు సిద్ధము చేస్తారు.

రెండవరకం

తలభాగమును షాపులలో కొని దానికి మిగిలిన ఆకారాన్ని సన్నటి ఇనుప ఊచలను కావలసిన ఆకారంలో వంచి దానిపై ఈనెలతో అల్లిక చేస్తారు. అలా అల్లుతూ కావలసిన బొమ్మ ఆకారం తయారుచేస్తారు. దానిపై దలసరిబట్టను వేసి తరువాత మిగిలినదంతా మొదటి రకంగానే చేస్తారు.

మూడవ రకం

ఇది నూతనంగా కొంచెం ఎక్కువ పెట్టుబడి కలిగినది రబ్బరును కావలసిన ఆకారములో కత్తిరించి కొన్నిచోట్ల ప్లాస్టిక్ వినియోగించి పూర్తి చేస్తారు. తరువాత బొమ్మకు పెయింట్ల అవసరం లేకుండా మామూలు బట్టలు జుట్టు మొదలయినవి అతికిస్తారు.

బొమ్మలు-రకాలు[మార్చు]

గేదెల ఆకారాల్లోని బుట్టబొమ్మలు
పెళ్ళికొడుకు,పెళ్ళికూతురు.

సందర్భమేదైనా ఈ రెండు బొమ్మలను తప్పనిసరిగా వాడుతారు. పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు అలంకరణతో ఆరడుగుల ఎత్తు నుండి ఇరవై అడుగుల ఎత్తు వరకూ తయారు చేస్తారు.

గుర్రాలు
గేదెలు

ఎద్దు తల ఆకారం గల బొమ్మను గూడు మాదిరిగా వెదురుబద్దలతో లేదా ఇనుప ఊచలతో చేయబడిన దాని ముందు భాగాన తగిలించి ఎద్దు ఆకారానికి మరుస్తారు.

ఏనుగులు
ఎద్దులు
పాములవాడు
దేవతా బొమ్మలు

దేవతల బొమ్మలలో ముఖ్యమైనవి కాళికమరియు వినాయకుడు, ఆంజనేయుడు మొదలయినవి.

ఇతర విశేషాలు[మార్చు]

బుట్టబొమ్మలను తయారు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కట్టా సూర్యనారాయణ నేర్పరి. ఈయన తన తండ్రి మల్లయ్య వద్ద బుట్టబొమ్మల తయారిని నేర్చుకున్నాడు. మల్లయ్య 1930లో మైసూరు దసారా ఉత్సవాలలో బుట్టబొమ్మలను చూసి వాటి తయారీని నేర్చుకొని వచ్చాడు. బుట్ట బొమ్మల తయారీ, ప్రదర్శనలలో పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు, మండలంలోని జగన్నాధపురం మంచి పేరు కలిగి ఉన్నది. ఇక్కడ పూర్వం అధిక జనాభాకు ఇదే ప్రధాన వ్యాపకముగా ఉండిననూ ప్రస్తుతము ఈ కళకు తగ్గుతున్న ఆదరణ దృష్ట్యా ఇతర వృత్తులలోకి వలస పోతున్నారు. వలస పోయిన వారు పోగా ఇంకనూ దాదాపు ఇరవై వరకూ ప్రదర్శన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఊరి వారికి పలు సినిమాలలో సైతం తమ కళాఖండాలను ప్రదర్శించే అవకాశం కలిగినది.

మూలాలు[మార్చు]

  • తెలుగువారి జానపదకళారూపలు - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. తెలుగు విశ్వవిద్యాలయము (1992) పేజి.611-613

బయటి లింకులు[మార్చు]