Jump to content

బుర్రకథ

వికీపీడియా నుండి
(బుర్ర కథ నుండి దారిమార్పు చెందింది)
బుర్రకథ కళాకారుci
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న రవీంద్ర భారతిలో బుర్రకథ కళాకారుల ప్రదర్శన

బుర్రకథ అనేది ఒక జానపద కళారూపం. ఇందులో పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.

ఒక కళారూపం

[మార్చు]
బుర్రకథ కళాకారులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతి వద్ద ప్రదర్శింపబడిన బుర్రకథ

తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి. ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఞానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో దీన్ని బాగా వాడుకున్నారు. జంగంకథ, పంబలకథ, జముకులకథ, పిచ్చుకుంట్ల కథ, తరువాతవచ్చింది. డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.

దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుంబిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పథం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది.

నాజర్ బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం బెంగాల్ కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.

ప్రదర్శనా విధానం

[మార్చు]

వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది. - వీరిని కథ, రాజకీయం, హాస్యం అని పిలుస్తారు. మధ్యలో ఉండే కథకుడు పాడేదానికి చెప్పేదానికీ ఇటూ అటూ ఉన్న ఇద్దరూ తందాన తానా అని వంత పాడతారు.

  • కథ: ఇతనే ప్రధాన కథకుడు. ముఖ్య కథను, వర్ణనలనూ, నీతినీ, వ్యాఖ్యలనూ వచనంగా - అంటే మాటల్లో చెబుతూ, సందర్భం వచ్చినచోట భావపరమైన స్ఫూర్తిని కలిగించేందుకు రసవంతమైన పాటలు,పాడతాడు. కథకుడు ముఖ్య కళాకారుడు. ఇతనే ముఖ్య కథకుడు. ఇతను హాస్యంగా మాట్లాడడం చాలా అరుదుగా ఉంటుంది. ఒక వేళ ఎప్పుడైనా వేరే కబుర్లతో మిగిలిన ఇద్దరూ పక్కదారి పడుతున్నా.. ముఖ్య కథలోకి తీసుకొస్తూ నిబద్ధతతో కథ చెప్పడం ఇతని బాధ్యత. ఈ పాత్ర పోషించే వ్యక్తికి మాటా, ఆటా, పాటా బాగా తెలిసి ఉండాలి. ఇక కథ సంగతి సరేసరి. అతని (ఆమె) వేషధారణ కూడా రంగుల అంగరఖా, తలపాగా, నడుముగుడ్డ, ముత్యాల గొలుసు, కాలిగజ్జెలతో కనుల పండువుగా ఉంటుంది.
  • రెండో వ్యక్తి. ఇతను ముఖ్య కథకుడి కుడిభుజం వైపు ఉంటాడు. అంటే - బుర్రకథ చూసేవారు ఎడమ పక్కనుంచి ఒకటి, రెండు, మూడు అని లెక్కపెడితే మొదట లెక్కకు వచ్చేది ఇతనే! ఇతను హాస్యగాడు కాదు. ఇతన్ని రాజకీయం అంటారు. అంటే - ముఖ్య కథకుడు ఎక్కువగా పాటలతో కథను చెబుతుంటే - మధ్యలో వచనం వచ్చినప్పుడల్లా సీరియస్‌ చర్చల్ని ఇతను కథకుడితో చేస్తుంటాడు. లేదా అతను వచనంతో కథ చెబుతుంటే - ఆహా ఓహో అంటూ వంత పాడుతుంటాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. మూడో వ్యక్తి హాస్యం చేసినప్పుడు అతనితో ఇతను చర్చిస్తాడు. ఆ సమయంలో కథకుడు వెనక్కి వెళ్తాడు. రాజకీయం, హాస్యం ఇద్దరూ సరదా సంగతులు చర్చించుకున్నాక- మళ్లీ మధ్యలోని కథకుడు ముందుకొచ్చి ముఖ్య కథను కొనసాగిస్తాడు. అయితే కొందరు అపోహపడే విధంగా రాజకీయం అనే ఈ వ్యక్తి - హాస్యగాడితో చర్చిస్తాడే గానీ హాస్యాన్ని పంచడం ఇతని బాధ్యత కాదు. కథ చెప్పేటప్పుడు ముఖ్య కథకుడికి అండగా ఉండి సహకరించడమే ఇతని ముఖ్య బాధ్యత.
  • మూడవ వ్యక్తి హాస్యం. బుర్ర కథ మొత్తం తీక్ష్ణంగా సాగితే ఇబ్బంది కాబట్టి - అవకాశం ఉన్నప్పుడల్లా ఇతను హాస్యంగా మాట్లాడతాడు. - ప్రస్తుత నిత్య జీవితానికి సరిపడే విధంగా కబుర్లు చెబుతూ - ముఖ్య కథకి అప్పుడప్పుడు అడ్డుకట్ట వేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ - అది కేవలం వినోదం కోసమే! హాస్యగాడు తన హాస్యంతో ముఖ్య కథ తాలూకు విలువని తగ్గించకూడదు. ఎక్కడైనా అలా తగ్గితే కథకుడు జోక్యం చేసుకుని - కథ తాలూకు గాంభీర్యాన్ని కోల్పోకుండా చూస్తాడు. తిరిగి కథలోకి జనాన్ని తీసుకు వెళతాడు.
  • మొత్తం మీద చూస్తే - బుర్ర కథలో ముఖ్య కథకుడు గంభీరమైన కథకుడైతే, హాస్యగాడు హాస్యం చేస్తాడు. రాజకీయం చేసే వ్యక్తి చేయాల్సిన పని - సమతౌల్యం( బ్యాలెన్స్‌ ) | కథకుడికి వత్తాసు పలుకుతూ కథ తాలూకు విలువనీ గాంభీర్యాన్నీ కాపాడడం, ప్రేక్షకుల ఆసక్తిని కాపాడేందుకు హాస్యగాడితో కలిసి హాస్య చర్చలో పాలుపంచుకోవడం రెండింటినీ జాగ్రత్తగా నిర్వహిస్తాడు. అయితే ఇతను హాస్యగాడు కాదు.[1]

కథావస్తువులు

[మార్చు]

బుర్రకథలలో కథావస్తువు కొరకు అనేక వనరులు ఉన్నాయి. అత్యధికంగా ఉపయోగించబడే వనరుల జాబితా.

  • దేవతా కథలు
  • పౌరాణికాలు
  • జానపదాలు
  • రాజకీయాలు
  • చరిత్రకారులు
  • ఉద్యమకారులు
  • వివిధ రంగాలలో ప్రముఖులు
  • పల్లె పట్టణ సమస్యలు ఇలా వివిధములు

బుర్రకథలో ప్రముఖులు

[మార్చు]
హైదరాబాద్‌కు చెందిన బుర్రకథ కళాకారులు

షేక్ నాజర్ బుర్రకథలో పేరొందిన వాడు. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి. షేక్ నాజర్, నిడదవోలు అచ్యుతరామయ్య గార్లకు కర్నూల్లో ఒక వేదికపై ఒక సూర్యవంక, చంద్రవంకలు ఇచ్చి గౌరవించారని విజయవాడకు చెందిన ఆలపాటి రామారావు గారు తెలిపారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గుంటూరు జిల్లా, తెనాలి, మారీసుపేట వాస్తవ్యులైన ప్రమీల సిస్టర్స్ బుర్రకథ చెప్పడంలో అందెవేసిన కళాకారులు. శ్రీమతి చెన్ను ప్రమీల ప్రధాన కథకులు. వీరు జముకుల కథ కూడా ప్రతిభావంతంగా చెబుతారు. కన్యక, చెల్లి చంద్రమ్మ, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి చరిత్ర మొదలగు కథలను రసవత్తరంగా ప్రదర్శిస్తారు. వీరు ఆకాశవాణి, దూరదర్శన్ లో అనేక ప్రదర్శనలను ఇచ్చారు. శ్రీమతి చెన్ను ప్రమీల ప్రస్తుతం వరంగల్ జిల్లా, మామునూరు, జవహర్ నవోదయ విద్యాలయంలో సంగీతం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బుర్రకథ&oldid=4368438" నుండి వెలికితీశారు