బైచరాజు వేంకటనాథకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైచరాజు వేంకటనాథకవి పంచతంత్రమును పద్యకావ్యమునుగా రచించిన కవి.

కవి పరిచయము[మార్చు]

ఈకవి క్షత్రియుడు. ఈతని తాతయైన బైచరాజునుబట్టి యీకవి కీయింటిపేరు కలిగినట్లు తోచుచున్నది. కవి తనవంశకర్తయైన బైచరాజునిట్లు వర్ణించియున్నాడు:-

ఉ. ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుడు బైచనృపాలు డద్ధరి
త్రీరమణీమనోహరునితీవ్రయశస్సృతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.

కవికాలము[మార్చు]

ఈ కవికాలమును సరిగా నిర్ణయించుటకు దగిన యాధారము లేవియు దొరికినవికావు. తమనిఘంటువునందు బ్రౌన్‌దొరవా రితడు 1500 వ సంవత్సరప్రాంతముల యందుండినట్లు వ్రాసియున్నారు. ఇందుకు విరుద్ధములైన ప్రమాణములు కనబడు వఱకును మన మాకాలమునే సిద్ధాంతముగా గ్రహింపవచ్చును. ఈ వేంకటనాధుడు పూర్వకవి వర్ణనము నీ క్రిందిపద్యమును జేసియున్నాడు-

మ. హృదయబ్రహ్మరధం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు
త్సదనాస్థానికి దెత్తు మానసనభస్సంచారి గావింతు హృ
ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కష్టవ
స్తుదులం బ్రాజ్ఞల దిక్కయజ్వ నమరేశున్ సోము శ్రీనాధునిన్.

ఇందు శ్రీనాథుడు పేర్కొనబడియుండుటచేత ఈకవి 1450 వ సంవత్సరమునకు బూర్వపువాడు కాడనుట నిశ్చయము. కవి కత పెదతండ్రినిగూర్చి "లింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు" అని వ్రాసియున్నందున నతడు మహమ్మదీయులకును హిందువులకును దక్షిణహిందూస్థానములో యుద్ధములు జరుగుచున్న కాలములో నుండి యుండవలెను. ఇతడు తన గ్రంథమును హరిహరనాథున కంకితముచేసి, ఆ విషయమున నిట్లు వ్రాసికొనియున్నాడు-

క. ఏచనువు గలదు హరిహర
సాచివ్యము నొంద నన్యజనులకు మది నా
లోచింప దిక్కయజ్వకు
నాచనసోమునకు మఱియు నాకుందక్కన్.

హరిహరనాథునకు గృతియిచ్చుటచే నితడు నెల్లూరిమండలములోనివాడని తోచుచున్నది. అప్పకవిగాని మఱి యే యితర లక్షణ కర్తగాని యీతనిపద్యములను లక్ష్యములనుగా జేకొనియుండలేదు. ఆ హేతువునుబట్టి యితడాధునికుడని యూహించుటకంటె నీతని గ్రంథమునందు లక్షణవిరుద్దములయిన ప్రయోగము లుండుటచేత నుదహ రింప మానిరని తలచుట మేలు. ఇతడు కవిత్వ మెట్లుండవలెనో యీ క్రిందిపద్యమున దెలిపియున్నాడు-

చ. ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ
స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం
జనుగవబోలి తేటయును జాటుదనంబును గాక యుండ జె
ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాకయుండినన్.

రచనా శైలి[మార్చు]

వ్యాకరణదోషము లనేకము లున్నను మొత్తముమీద నీతని కవిత్వము పయినిజెప్పినట్లే యుండి ప్రౌడమయి హృదయాహ్లాదజనకముగా నున్నది. పర్వతరాజపుత్రుడయిన యీ వేంకటనాథకవి పంచ తంత్రములోని కొన్ని పద్యములను ఉదాహరణములుగా ఈ క్రింద ఇవ్వడమైనది.

చ. పలికినమాట నిల్వ డెడపందడపం జెడనాదు వచ్చుమె
చ్చుల దిగమ్రింగు దొల్తొలుత జూచినచూపుల జూడ డేర్పడం
జులకదనం బొనర్చు నెరసుల్ఘటియించు నదల్చివైచు గే
వలనృపసంశ్రయంబు పగవారలకు స్వల దివ్వనుంధరన్- [మిత్రభేధము]

చ. ఇట ననుడించి యేమిగత మేగెను చెప్పగదన్న యెట్టులె
క్కటిని జరింతు నన్న తృటికాలము ని న్నెడబాసియున్కి దు
ర్ఘటముగదన్న నాకడను గల్గిన యీధృతి యెందు బోయె ని
ప్పటికి విచిత్ర మన్న విధి భద్రవిరోధిగదన్న యెన్నగన్- [సుహృల్లాభము]

చ. సురియ కరంబునం గొనక శూరుడు నీతికళావిలాసభా
సురుడు వధించు వైరి విరసున్ దవుదవ్వుల జెంత నుండియున్
సురియ ధరించియున్ మగువచొప్పున నేమియు జేయలేడు త
న్గెరలగజేయ మానవ నికృష్ణుడు మాటలు వేయునేటికిన్- [సం.విగ్ర]

ఉ. చెప్పిన నంతరంగమున సింగడుబూరడునై స్రియంబు సాం
పుప్పతిలంగ బల్కెనది యోయి కృతఘ్నుడ నీవు కావె య
ప్ప్పప్ప సుహృత్తముం డయినయాయన నింటికి దెచ్చి వెల్పు నే
చొప్పున గొల్తు రట్లు పరిశుద్ధసపర్యల గొల్చు టొప్పదే- [లబ్ధనాశము]

ఉ. నావిని బ్రాహ్మణుండనియె నన్ను బ్రయత్న మెలర్ప బట్టికిం
గావలిపెట్టి పుట్టినిలు గాల్పగ నీ వటుపోవ నేను నా
లో వివరంబుమాలి మృగలోచన ముంగిస నే కిశోరర
క్షావిధి కొప్ప నేర్పఱచి జాఱితి మందిర బాహ్యభూమికిన్- [అసంప్రేక్ష్యకార్వితము]

మూలాలు[మార్చు]

ఆంధ్ర కవుల చరిత్రము అను గ్రంధమునుండి గైకొనబడినై. ఈ గ్రంధాన్ని (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు