బైసికిల్ థీవ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైసికిల్ థీవ్స్ (ఇటాలియన్: లాద్రి డి బైసిక్లెట్టె; యునైటెడ్ స్టేట్స్ లో మొదట బైసికిల్ థీఫ్ అన్న పేరుతో వచ్చింది) విట్టొరియో ద సిక దర్శకత్వం వహించిన 1948 నాటి ఇటాలియన్ చలనచిత్రం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాకా రోమ్ లో ఓ పేద ఉద్యోగస్తుడు, అతని కొడుకు చుట్టూ అల్లుకున్న కథ ఇది. తన కుటుంబాన్ని పోషించకునేందుకు ఉపకరించే, అత్యంత అవసరమైన తన ఉద్యోగం సైకిల్ ఉంటేనే ఉంటుంది, లేకుంటే పోతుంది. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న తన సైకిల్ కోసం అతను నగరమంతా తిరుగుతూ వెతకడం చిత్ర కథాంశం.
ఇటాలియన్ నియోరియలిజం అన్న సినీ ఉద్యమంలో వచ్చిన సినిమాల్లో అత్యుత్తమమైనదిగా ఈ సినిమా విస్తృతంగా గుర్తింపు పొందింది. సినిమాకి 1950ల్లో ఆస్కార్ గౌరవ పురస్కారం లభించింది. విడుదలైన నాలుగు సంవత్సరాలకే సైట్ & సౌండ్ పత్రిక నిర్వహించిన సినీ రూపకర్తలు, విమర్శకుల పోల్ లో సార్వకాలికంగా అతిగొప్ప చిత్రంగా నిలిచింది.;[1] 50 సంవత్సరాలు గడిచాకా కూడా అదే పోల్ లో సార్వకాలికంగా అత్యుత్తమ చిత్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది.[2] 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి చూసితీరాల్సిన 10 సినిమాలు అంటూ బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వేసిన జాబితాలో బైసికిల్ థీవ్స్ నిలిచింది.

ఇతివృత్తం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధానంతరం, రోమ్ నగరంలో ఆంటోనియో రిచ్చి (లంబెర్టో మెగ్గియోరని) తన భార్య మరియా (లియానెల్లా సెరెల్), కొడుకు బ్రూనో (ఎంజో స్టయోలా), పసిబిడ్డలతో కూడిన సంసారాన్ని పోషించేందుకు పని కోసం చాలా ఆత్రుతతో ప్రయత్నిస్తూంటాడు. ప్రకటనలను గోడలకు అతికించే పని దొరుకుతుంది కానీ ఈ పనికి సైకిల్ అవసరమైనందున తానీ పనికి ఒప్పుకోలేనని భార్యతో చెప్తాడు. ఆమె తనకు పుట్టింటి నుంచి సంక్రమించిన, విలువైన, ప్రత్యేకమైన బెడ్ షీట్లను అమ్మివేసి ఆ డబ్బుతో సైకిల్ కొంటుంది. తమ సంతోషకరమైన భవిష్యత్తును తలుచుకుంటూ సైకిల్ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. దారిలో ఆమె ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ జ్యోతిష్కుడి వద్ద ఆమె గతంలో జోస్యం చెప్పించుకుందనీ, అతను ఆంటోనియోకు ఉద్యోగం లభిస్తుందనీ, కానీ అతను భార్యకు అందుకు రుణపడివుంటాడని చెప్పినట్టు ఆంటోనియో తెలుసుకుంటాడు. జ్యోతిష్కుడి మీద మూఢనమ్మకం పెట్టుకోవడాన్ని అతను దూషిస్తూ, అతనికి ఇచ్చిన డబ్బు వృధా అంటూ భార్యను ఆటపట్టిస్తాడు.

పనిలో చేరిన తొలిరోజే ఆంటోనియో నిచ్చెనమీద ఉండి పనిచేస్తూండగా ఓ యువకుడు (విట్టోరియో ఆంటనాచ్చీ) సైకిల్ దొంగలించుకుని పోతాడు. ఆంటోనియో శాయశక్తులా వెంబడిస్తాడు కానీ అతన్ని దొంగ జట్టులోని ఇతరులు అడ్డుకుని పడేస్తారు. పోలీసులు దొంగతనంపైన రిపోర్టు నమోదుచేసుకుంటారు కానీ ఈ విషయంతో తాము చేయగలిగింది స్వల్పమేనని హెచ్చరిస్తారు. అంతేకాక దొంగిలించిన వస్తువులు పిజ్జారియో విట్టోరియో మార్కెట్లో చేతులుమారే అవకాశం ఉందని సూచిస్తారు. ఆంటోనియో పలువురు స్నేహితులు, చిన్నవయసులో ఉన్న కొడుకు బ్రూనోలతో కలిసి వెతకడానికి వెళ్తాడు. ఆంటోనియోదని భావించిన సైకిల్ ఒకదాన్ని పట్టుకుని పోలీసు అధికారికి చూపిస్తారు, కానీ సీరియల్ సంఖ్య సరిపోలదు.

పోర్టా పోర్టీస్ మార్కెట్ వద్ద ఓ ముసలాయనతో ఆ దొంగని ఆంటోనియో, అతని కొడుకు బ్రూనో కనిపెడతారు. అతన్ని వెంటాడతారు కానీ పట్టుకోలేకపోతారు. దొంగ వివరాలు చెప్పమని ముసలాయన్ని అడుగుతారు. కానీ ముసలాయన ఆ దొంగ గురించి తెలియనట్టు నటిస్తాడు. వారు ఆ ముసలాయనను చర్చి వరకూ అనుసరిస్తారు, కానీ చర్చి కార్యకలాపాలు చెదరగొట్టి ఆ హడావిడిలో ముసలాయన తప్పించుకుంటాడు. పిల్లాడి వల్లే ముసలాయన తప్పించుకుపోయాడంటూ ఆంటోనియో చెంపదెబ్బ కొట్టడంతో, బ్రూనో చాలా నిరుత్సాహానికి గురవుతాడు. బ్రూనోని వంతెనపై నుంచోబెట్టి ముసలతన్ని వెతికేందుకు బయలుదేరుతాడు ఆంటోనియో. ఇంతలో పిల్లాడెవరో నదిలో మునిగిపోతున్నాడని విని పరుగుపరుగున వస్తాడు. కానీ మునిగిపోతున్న పిల్లాడు బ్రూనో కాదని తెలిసి స్థిమితపడతాడు. దీంతో పిల్లాడికి లంచ్ ట్రీట్ ఇచ్చేందుకు ఓ రెస్టారెంట్ కి తీసుకుపోతాడు ఆంటోనియో. అక్కడ తమకున్న సమస్యలన్నిటినీ కొద్దిసేపు మరచిపోతారు. కానీ ఇంతలో ఓ సంపన్న కుటుంబం భోజనం చేస్తూ, ఎంజాయ్ చేయడం గమనిస్తారు. దాంతో తామున్న పరిస్థితి హఠాత్తుగా గుర్తుకువస్తుంది.

ఈ స్థితిలో ఆంటోనియో జ్యోతిష్కుణ్ణి కలుస్తాడు. అతడు నీకు ఈరోజు సైకిల్ దొరుకుతుంది, లేదా అసలు ఎన్నటికీ దొరకదు అంటూ జోస్యం చెప్తాడు. ఇంతలో దొంగ కనిపించగా తండ్రీకొడుకులు కష్టపడి దొంగను పట్టుకుంటారు. దొంగ చుట్టుపక్కల వాళ్ళు అతన్ని సమర్థిస్తూ తిరిగి ఆంటోనియోనే తప్పుపడతారు. బ్రూనో పోలీసును తీసుకురాగా అతను దొంగ ఇంటిని వెతుకుతాడు. కేసు చాలా బలహీనంగా ఉందని, నీ వైపు సాక్ష్యమేదీ లేదని చెప్తాడు. అవసరమైతే దొంగకు అనుకూలంగా, అతను దొంగతనం జరిగిన సమయానికి తమ వద్దే ఉన్నాడని చెప్పేందుకు ఇరుగుపొరుగు వారు సిద్ధంగా ఉన్నారు. దాంతో తండ్రీ కొడుకులు నిరాశతో, చుట్టుపక్కల వారు వెక్కిరిస్తూ, బెదిరిస్తూండగా బయలుదేరుతారు.

వాళ్ళ దారిలో ఓ ఫుట్ బాల్ స్టేడియం వద్ద ఆగుతారు. లోపల ఆట జరుగుతూండగా, బయట ఎన్నో సైకిళ్ళు స్టాండ్ వేసివుంటాయి. స్టేడియం గేట్ వద్ద ఓ సైకిల్ తాళం వేసివుండనిది వుంటుంది. పరధ్యానంగా నడుస్తూ నేలమీద కూలబడి, హ్యాట్ చేతిలోకి తీసుకునివుంటాడు ఆంటోనియో. స్తబ్దత నుంచి మళ్ళీ వేగం పుంజుకుని, బాధ, ఆవేశం తిరిగితెచ్చుకుంటాడు. ఇంతలో బ్రూనోకి కొంత డబ్బు ఇచ్చి, స్ట్రీట్ కార్ తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్తాడు.

బ్రూనో వెళ్ళాకా ధైర్యం చేసి సైకిల్ తీసుకుని తొక్కడం ప్రారంభిస్తాడు. వెనువెంటనే అరుపులు, కేకలు ప్రారంభం అవుతాయి. స్ట్రీట్ కార్ మిస్సైన బ్రూనో తన తండ్రిని గుంపు చుట్టుముట్టి సైకిల్ మీంచి లాగెయ్యడం, కొట్టడం, అవమానించడం చూసి అవాక్కవుతాడు. జనం ఆంటోనియో హ్యాట్ లాగిపారేసి, పోలీస్ స్టేషన్ కి తీసుకుపోవడం ప్రారంభిస్తారు. కానీ ఆంటోనియో హ్యాట్ పట్టుకునివున్న బ్రూనోని చూసిన సైకిల్ యజమాని జాలికలిగి ఆంటోనియోని వదిలెయ్యమని ఇతరులతో చెప్తాడు.

ఆంటోనియో, బ్రూనో మెల్లిగా నడుస్తూంటారు. బ్రూనో తండ్రికి హ్యాట్ తిరిగిచ్చి ఏడుస్తూండగా, ఆంటోనియో ఆలోచనా శక్తిని కోల్పోయినట్టు అయిపోతాడు. దారినపోయే ట్రక్కు తన భుజానికి రాసుకుంటూ పోయినా ప్రతిస్పందించకుండా అయిపోతాడు ఆంటోనియో. ఒకరినొకరు కొద్ది సేపు చూసుకుంటారు. ఆంటోనియో కన్నీళ్ళను అతి కష్టంపై ఆపుకుంటూండగా బ్రూనో అతని చేయి తన చేతిలోకి తీసుకుంటాడు. క్రమంగా వారిద్దరూ జనంలో కలిసిపోతారు.

మూలాలు[మార్చు]

  1. Ebert, Roger (March 19, 1999). "The Bicycle Thief / Bicycle Thieves (1949) review". Chicago Sun-Times. Archived from the original on 2010-07-20. Retrieved July 20, 2010. CS1 maint: discouraged parameter (link)
  2. Sight and Sound Top Ten Poll Archived 2017-02-01 at the Wayback Machine, director's list 2002. Last accessed: 2014-01-19.