బొల్లిన మునుస్వామి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో ఉన్నత పదవులలో ఉన్నారు. మునుస్వామి రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రధానమంత్రి పదవి పొందేందుకు ముందు ఆయన ప్రభుత్వం నియమించిన అగ్రికల్చర్ కమిషన్, బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ, బ్యాంకింగ్ ఎకోకొరియర్ కమిషన్ వంటి కమిటీలు, కమిషన్లలో సభ్యునిగా పనిచేశారు.

1908లో మద్రాసు విశ్వవిద్యాలయము నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా రాణించాడు. జస్టిస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు. చిత్తూరు మునిసిపల్ కౌన్చిల్ సభ్యునిగా, చిత్తూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, అనంతరం అధ్యక్షునిగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా అంచలంచెలుగా ఎదిగాడు. అవిభక్త మద్రాసు రాష్ట్ర ప్రధాన మంత్రి (బ్రిటీషు వారి పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రిగా పిలచేవారు) గా 1930-1934 వరకు పదవిని అత్యున్నతంగా నిర్వహించాడు.[1]

1930ల్లో జస్టిస్ పార్టీలో నాయకునిగా ఎదిగిన మునుస్వామి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసే జస్టిస్ పార్టీ తీరుమార్చే ప్రయత్నాలు చేశారు. స్వయంగా బ్రాహ్మణేతరుడైనా, తాను బ్రాహ్మణులను ద్వేషించడం ప్రధానాంశంగా అభివృద్ధి చెందిన జస్టిస్ పార్టీలో నాయకుడైనా ద్వేషం తగదని, బ్రాహ్మణులతో సఖ్యతగా, ప్రేమతోనే అభివృద్ధి సాధించాలని వాదులాడేవారు. బ్రాహ్మణులను కూడా జస్టిస్ పార్టీలో చేర్చుకోవచ్చన్న ప్రతిపాదనను చేసినవారు ఆయన.

మద్రాసు శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలిసి జమీందారులకు వ్యతిరేకంగా, ఎస్టేట్ లెవల్ చట్ట సవరణకు పూనుకున్నాడు. ప్రధాన మంత్రిగా ఎన్నో ప్రజాహిత, అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టాడు. జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.

నాయుడు సేవలు గుర్తించిన బ్రిటీషు ప్రభుత్వం 1926లో రావు బహద్దర్, 1930లో దివాన్ బహద్దర్ బిరుదులను ప్రదానం చేసింది.

వీరు 8వతేదీ నుండి అస్వస్థతకు గురియై, జనవరి 13, 1935 తేదీన ఉత్తరాయణం ప్రవేశించిన పుణ్యతిథిన వైకుంఠప్రాప్తిని పొందారు.[2]

ఈయన జీవిత చరిత్ర "శ్రీయుత దివాన్ బహదూర్ మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము"ను ఆయన వద్ద ఆంతరంగిక సహాకుడుగా పనిచేసిన ఉమాపతి వ్రాశాడు.

మూలాలు[మార్చు]

  1. రావి, కొండలరావు (2004). నాగయ్య స్వీయ చరిత్ర. హైదరాబాదు: ఆర్కే బుక్స్. p. 67.[permanent dead link]
  2. శ్రీయుత దివాన్ బహదూర్ మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము, విక్టోరియా జూబిలీ ముద్రాక్షరశాల, చిత్తురు, 1935; పేజీ: 6.

బయటి లింకులు[మార్చు]