బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రి.శ 1600వ సంవత్సరములో భారతదేశము ప్రవేశించిన ఆంగ్లేయ వర్తక సంఘము ఈస్టు ఇండియా కంపెనీ. వీరుకూడా 17 వ శతాబ్దములో భారతదేశము ప్రవేశించిన అనేక విదేశ వర్తకసంఘములలాగనే స్వదేశరాజులు, నవాబులను ఆశ్రయించి వారి అనుమతులు పొందుటకు అణిగిమణిగి యుండి వర్తకమును సాగించిరి. కాలక్రమేణ ఆ ఆంగ్లేయ వర్తకసంఘమువారి ప్రముఖ అధికారులైన రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సు కుతంత్రములతో దేశీయ పరిపాలకులను కూలత్రోసి పాలనాధికారములు చేపట్టి పరిపాలింప ప్రారంభించి తదుపరి కట్టుదిట్టములైన బ్రిటిష్ పరిపాలనకు మార్గదర్శకులైరి. 19 వశతాబ్దమునాటికి లండనులోని బ్రిటిష్ ప్రభుత్వము బ్రిటిష్ సామ్రాజ్యప్రతినిదిగా భారతదేశమున అధికభాగమును బ్రిటిష్ ఇండియాగా ప్రత్యక్షముగా పరిపాలింపసాగెను. ఆనాటి అనేక స్వతంత్ర రాజులు, రారాజులు నవాబులను సామంతులుగాచేసి, వారి బిరుదులను హోదాలను నిలిపి వారి సంస్థానములకు సైనిక రక్షణ కలిపించునెపముమీద ఒప్పందములుచేయించుకుని ఆంగ్లప్రభుత్వ ప్రతినిధికి దేశీయ సంస్థానములలో “రెసిడెంట్” అను పదవి కలిపించిరి. ఆవిధముగా స్వదేశ సంస్థానములనుకూడా సామంత రాజ్యములుగా ఒక శతాబ్దముపాటు పరిపాలించిన చరిత్ర చిరపరిచితము. చరిత్రకారులుగాకపోయినప్పటికినీ ఆకాలమునాటి సైనికులుగనో, రాజకీయనాయకులగనో స్వానుభవముతోచేసిన రచనలవల్ల బ్రిటిష్ ఇండియా చరిత్రలోని విశేషమైనవి కొన్ని అప్పుడప్పుడు ఇప్పటికినీ వెలుగునకు వచ్చుచున్నవి. అట్టి విశేషములలోనొకటి బ్రిటిష్ సామ్రాజ్యము 1947సంవత్సరము భారతదేశమునుండి అస్తమించునాటి అఖండ భారతదేశ విభజన తరుణములో స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు .[1][2]

స్వదేశ సంస్థానములు[మార్చు]

1909లో హైదరాబాద్ రాష్ట్రము.

భారతదేశపు బ్రిటిష్ పరిపాలనాకాలములో (18-20 వ శతాబ్ద మధ్యకాలము) "ప్రిన్సిలీ స్టేట్సు" అనబడిన అనేక చిన్న పెద్ద రాజులు నవాబులు పరిపాలనక్రిందయున్నటువంటి రాజ్యములే స్వదేశ సంస్థానములు. వాటిని పరిపాలించు రాజులు, నవాబులు మొగల్ సామ్రాజ్యములో సామంతలుగనుండిన వారే. సా.శ. 1707 సంవత్సర మొగలాయి చక్రవర్తి ఔరంగజీబు మరణానంతరము తదుపరి చక్రవర్తులు బలహీనులైన పరిస్థితులలో మొగలాయి సామ్రాజ్యము విఛిన్నమై క్షీణించి అస్తమించప్రారంభించింది. అప్పటినుండి సామ్రాజ్యములోని సామంతరాజులు, నవాబులు స్వతంత్రులై వారి రాజ్యమును వారు రక్షణకలిపించుకొనలేని పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వముకంటే వేరే సార్వభౌముడు లేనందుననూ, వారి వారి అంతఃకలహములు, వారసత్వపు వైరములతో బ్రిటిష్ ప్రభుత్వమునాశ్రయించి సంధి వప్పందములు కుదుర్చుకొనుచుండుట వలన బ్రిటిష్ ప్రభుత్వము స్వలాభదృష్టితో అనేక రాజ్యతంత్రములు ప్రయేగించి రాజ్యాక్రమణలు చేసి తాము పరిపాలించు బ్రిటిష్ ఇండియాను క్రమేణ విస్తరించిరి. బ్రిటిష్ ప్రభుత్వముకు దాసోహమనిన రాజులు, నవాబులు లాగనే బ్రిటిష్ ప్రభుత్వపు కుటిల రాజకీయములు రాజ్యాక్రమణలకు వ్యతిరేకించి ప్రాణాలకు లెక్కసేయక పోరాడిన రాజులు నవాబులు కూడా భారతదేశ చరిత్రలో చిరస్మరణీయులే. బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమున అస్తమించునాటికి అఖండ భారతదేశములో దాదాపుగా మూడవవంతు భూభాగము "ప్రిన్సిలీ స్టేట్సు"అనబడిన స్వదేశ సంస్థానాధీశుల క్రిందయుండెను.[3] 1941 జనాభా లెఖ్కల ప్రకారము 39 కోట్ల మొత్తం భారతదేశపు జనాభాలో స్వదేశ సంస్థానములలోని జనాభా9కోట్లుగా నుండెనని 1947నాటికి స్వదేశ సంస్థానములు చిన్న-పెద్ద కలిపి 562 అనియు చరిత్రలో కనబడుచున్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశ స్వదేశ సంస్థానములను బుధ్దిపూర్వకముగనే బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రసంస్థానములుగ గుర్తించి రాజకీయములు చేసిరి. 1930-40 దశాబ్దములలో ప్రభాతము అను పత్రికలో దిగవల్లి వేంకట శివరావు గారివ్యాసములో స్వదేశ సంస్థానములు భారతదేశ రాజ్యాంగ సమశ్యగ చారిత్రక విశేషములు కొన్నివివరించిరి. అప్పటికి (1930-40 దశాబ్దములలో సంగతి) 662 సంస్థానములున్నవి. అందు 200 ఎంచతగినరాజ్యములు. అందులోను 9 ముఖ్యమైనవి. భౌగోళకముగనూ, జనాభాసంఖ్యని బట్టి అవరోహణంగా హైదరాబాదు, జమ్మూ-కశ్మీరము, మైసూరు, బరోడా, గ్వాలియర్, భోపాల్, బికనీరు, కొచ్చిను, తిరువాంకూరు. ఆ9 దింటిలో అతిపెద్దది హైదరాబాదు నిజాం రాజ్యము విస్తీర్ణములోను జనాభాసంఖ్యలోను అతిపెద్ద స్వదేశ సంస్థానము. ఆస్ట్రేలియా దేశ జనాభాకంటే ఎక్కువైనది. తరువాత జమ్మూ కశ్మీరము, . అంత పెద్ద సంస్థానములేగాక కొన్ని అతిచిన్నవి కొన్నియకరముల విస్తీర్ణము మాత్రము గల చాల చిన్న చిన్న సంస్థానములు గూడకలవు.

స్వదేశ సంస్థానముల పై బ్రిటిష్ రాజ్యతంత్ర ప్రభావము[మార్చు]

భారతదేశమును చిరస్థాయిగా తమ పరిపాలనక్రిందనుంచుకునుటకు తమసార్వభౌమత్వము సాగించుటకు అనుగుణముగా ముందుచూపు కలిగిన అనేక రాజ్యతంత్రములు అవలంబించిరి. స్వతంత్రరాజుల మధ్య పరస్పర విరోధములు, హిందూ మహ్మదీయ ఇతర అల్పసంఖ్యాక వర్గముల విభేదములను ఆసరాగా తీసుకుని భారతదేశములో తమ సార్వభౌమత్వ మనివార్యమని తలపోయుచుండిరి. ఆంగ్లేయులు పరిపాలకులుగా రాజ్యా ధికారములు చేపట్టకముందు మొదట వర్తక కంపెనీగాయుండిన రోజులలో వారి స్థావరములన్నీ సముద్రతీరములైయుండెను. సముద్ర చోరులవలన స్వసంరక్షణకొరకని నియమించుకునియున్న సైనికబలగమును నానాటికి వృధ్దిచేసిరి. కొల్హాపురు, సావంతవాడి, జంజీర, జఫారాబాదు క్యాంబె మున్నగు సముద్రబలముగల రాజ్యములతో సముద్రచౌర్యమునణచు షరతులుగల సంధిచేసుకునిరి. 1739 లో పీష్వాతో చేసుకున్న సంధికూడా సముద్రతీర రక్షణ, వాణిజ్యమునకు సంబంధించిన సంధి. ఫ్రెంచివారి పలుకుబడి హైదరాబాదు నవాబు గారితో తగ్గి ఆంగ్లేయులతో పెరగనారంభించింది. ఆ నవాబుగారివలననే వీరు ఉత్తర సర్కారులున సంపాదించారు. దానికి అధికార రూపమున స్థిరపరచుకొనుచు మొగల్ చక్రవర్తి ఫర్మానా 1765 లో పోందిరి. ప్రెంచి వీరుడు నెపోలియన్తో 1798 సంవరత్సరములో ప్రారంభమైన ప్రపంచయుధ్ద ఫలితముగ భారతదేశమున తమపట్టు ఇంకా బలపడుటకు అవసరమగుటవలన ఆంగ్లేయులు స్వదేశ సంస్థానాధీశుల స్నేహసహాయములు మరింత అవసరమైనవి. అప్పటినుండి స్వదేశ సంస్థానములపై బ్రిటిష్ రాజ్యతంత్ర ముఖ్యోద్దేశ్యము తాము పరిపాలించు బ్రిటిష్ ఇండియాను విస్తరించుటయూ, స్వదేశ సంస్థానాధీశులను తమ చెప్పుచేతలక్రిందనుంచుకుని తమ ఖర్చులన్నీ వారు భరించుటగానుండినది. తరువాత కాలము 20 శత మునుండి భారతదేశములో జాతీయచైతన్యము, రాజకీయ పరిజ్ఞానము పెరుగుచున్నప్పటినుండి బ్రిటిష్ వారి రాజ్యతంత్రములకు ముందుచూపు కలిగి తమ సార్వభౌమత్వ మనివార్యముచేయుటకై జాతీయరాజకీయ పార్టీ అగు కాంగ్రెస్సుకు రాజకీయ గతిరోధములు కలిపించుటకూడా వీరి రాజ్యతంత్రముల ఉద్దేశ్యమైనదని చెప్పవచ్చును. గవర్నర్ జనరల్ హేస్టింగ్సు(1813-31) రచించిన గ్రంథము private Journal of Hastings లో బ్రిటిష్ రెసిండెంట్లు ఏవిదముగా రాజులకెదురుతిరుగు ద్రోహులతో స్నేహముచేసి రాజులను కూలద్రోయుటకు సహాయపడినదీ సూచించబడింది. స్వతంత్రసంస్థానాధీశులనందరినీ సామంతులుగనే యుంచుటకు ప్రయత్నించవలెనని తన ప్రైవేట్ జర్నల్లో వ్రాశెను. అంతే కాక వారి రాజ్యములు వారికుండనిచ్చినందున ఆ సంస్థానాధీశులు తమ సైనికబలగము తమకుపయేగించి సహాయపడుటకు తోడ్పడవలెననియూ, వారిలో వారికి తగాదాలుచ్చినచోఆయారాజులు తమ దగ్గరకు తీర్పునకుచ్చి వీరు చెప్పినటుల వినవలెననియూ పేర్కొనబడింది. ప్రెంచివారి భయమున్నంతకాలము సమాన గౌరవషరత్తులతో జరుగు సంధులు 18 వ శతాబ్దంతమునాటికి అంతరించి బ్రిటిష్ వారివేపు మగ్గుచూపించు సంధి షరత్తులు మొదలైయ్యను. అంతే కాక సంస్థానముల సహాయమునిమిత్తము బ్రిటిష్ వారుంచు బ్రిటిష సైనికుల జీతభత్తెముల కింద సంస్థానాధీశులు కప్పముచెల్లించు షరత్తులుకూడా విధించిరి. ఆవిధముగ సంస్థానాధీశులు రెక్కలు విరిగిన పక్షులుగచేయబడిరి. సంస్థానాధీశులు చెల్లించవలసిన కప్పముల భారము నానాటికి పెరుగుచుండట భరించలేక దాని బదులు వారి రాజ్యభాగములు వీరిక వ్రాసియిచ్చుటయూ జరుగుచుండెను. గూఢచారి పనులకొరకుద్దెశించబడి స్వదేశ సంస్థానములలో రెసిండెంటును పెట్టుటనేది యోక కుతంత్రపు రాజనీతి. ఆ రెసిండెంట్ల ద్వారా సంస్థానాధీశులపై సర్వాధికారపు పట్టును గట్టిపరచుచుండిరి. 1818 గవర్నర్ జనరల్ హేస్టింగ్సు ఉదయపురం మహారాణా గారితో చేసిన సంధి ఒక ఉదాహరణము. 1857 విప్లవానికి సంస్థానాధీశులు మొదట మదత్తుపలికిననూ బ్రిటిష్ వారి బిగింపులకులోనైన వీరు 1857 విప్లవమునకు తోడ్పడలేదు 1857 విప్లవం తరువాత సంస్థానాధీశులతో బ్రిటిష్ వారి సంబంధములు కొత్తమలుపులు తిరిగినవి. అనేక విషయములలో బ్రిటిష్ వారిదే ఆఖరుమాటగా, నిర్ణయముగ పరిగణింపబడు పరిస్థితులు. సంస్థానాధీశుల వంశపారంపర్యపు హక్కు కలదని నిరూపించుట కూడా బ్రిటిష్ వారే నిర్ణయించుచుండిరి. 1857 లో సిపాయిల విప్లవమునకు ఢిల్లీ మొగలాయి చక్రవర్తి తోడ్పడెనని అతనిని దోషిగా నిర్ణయించి విచారించి ఖారాగార శిక్షవిధించుటతో మొగలాయి సార్వభౌమత్వము పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఆంగ్లేయరాజ్యమకుటమే సార్వభౌమైనది. [3]

పలువిధముల రాజ్యతంత్రములతో స్వదేశ సంస్థానములనిరికించి వారిని కంపెనీవారి పలుగకుబడిమీద ఆధారపడునట్లుచేసిన రీతి:
1.రక్షిత రాజ్యములు (Protectorate) : మైసూరు నవాబు టిప్పుసుల్తానును హతమార్చిన తరువాత మైసూరు రాజ్యములోని కొన్ని భాగములు హైదరాబాదు నవాబుగారికిచ్చి పూర్వపు రాజ కుటుంబమువారిని మైసూరు సంస్థానాధీశులుగా చేసి ఆ రాజ్యమున తమ రక్షిత రాజ్యముగా ఘషించిరి. అంతకు పూర్వమే అటుల రక్షిత రాజ్యములుగా నున్న రాజ్యములు తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానములు.

2. ఏదో కారణముపై సంస్థానాధీశులను పదవిహీనులు చేయుట, తమరాజ్యాధికారము నెలకొల్పినుట

3. "సంరక్షణ నిర్భందము" (Protective custody) అను రాజ్యతంత్రమును ప్రయోగించి మొగలాయి చక్రవర్తి షా ఆలంను తమ చెప్పుచేతలలో నుంచుకునితమకు అనూకాలుముగ అనేక ఫర్మానాలు పోెందెను.

4. ఆవరణ నీతి ( Ring Fence Policy) రింగు ఫెన్సు నీతి లేదా శాత్రవ మధ్యరాజ్యము (Buffer బఫ్ఫర్ స్టేట్) అనబడిన స్నేహముగనూ అశ్రియింపుగనూ నుండిన స్వదేశసంస్థానములను తమకు వ్యతిరేకులై తిరుగుబాటుదారులుగ నుండిన రెండు స్వదేశ సంస్థానముల మధ్య నెలకొలుపు కుటిలోపాయమే బఫ్పర్ స్టేట రాజ్యతంత్రము. ఇట్టి కుతంత్రమును ప్లాసీ యుధ్దానంతరము మహారాష్ట్రదండులచే తమస్థావరములపై దాడులు చేయకుండా అయోద్య రాజ్యమును తమ వశమైన తరువాత తమ కనుకూలుడైన నవాబునే సింహాసనాధీశుని చేసి అయోధ్యను బఫ్ఫర్ స్టేటుగా పెట్టిరి. అదియే నీతి మైసూరురాజ్యమున గూడా టిప్పుసుల్తాను మరణానంతరము అవలంబించిరి.

5.సబార్డినేట్ అయిసొలేషన్ (Subordinate isolation) అననబడు రాజ్యతంత్రపూరితమైన విధానము 1813లో ప్రారంభమైనటుల కనబడుచున్నది. 1798-1805 మధ్య గవర్నర్ జనరల్ వెల్లస్లీ దూర దృష్టితో స్వదేశ సంస్థానాధీశులు ఫ్రెంచివారికి తోడ్పడకుండా కేవలము కంపెనీవారికి లోబడినుండునటుల చేయలేకపోయను. సంధిపత్రములలో ఉభయలు నొకరినొకరు సహాయముచేసుకునవలెననియేగాక చిన్నగా ఇంకోటికూడ చేర్చేను విధేయులైయుండవలెనని. వెల్లస్లీతరువాత నెపోలియన్ భయముపోయిన పిదప హేస్టింగ్సు ఆ రాజనీతిని కచ్చితముగా అమలుచేశెను. 1802 లో పీష్వాతోచేసిన సంధిలో అతని సర్వాదికారములు తీసివేయబడునని సూచనలుండెను.. 1813లో పీష్వాల సర్వాధికారము ఉడబెరికబడనివి.

6. బ్రిటిష్ సామ్రాజ్యము పేరట లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వము అవలంబించిన రాజనీతి కణుగుణముగనే వారి అత్యున్నత న్యాయస్థానమైన ప్రీవీ కౌన్సిల్ (Privy Council) ఇచ్చిన తీర్పులుగూడా భారతదేశములోని స్వతంత్ర రాజ్యములు బ్రిటిష సామ్రాజ్యములోని అనేక సామంతరాజ్యములన్న దృష్టకోణమును నిర్ధారించి తీర్పులిచ్చుటవలన ఇచ్చటి స్వదేశసంస్థానములు భారతరాజ్యాంగమునకు మున్ముందు సమశ్యగానెలకొలిపి బ్రిటిష్వారి సార్వభౌమౌత్వము సర్వదా సాగేలా పునాదులు వేశారు. అట్టి ప్రీవి కౌన్సిల్ తీర్పు ఉదాహరణకు కర్ణాటక నవాబు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము తనరాజ్యములో వసూలుచేసుకున్న సిస్తు తనకు రావలసిన భాగము రాబట్టుటకు ప్రీవీ కౌన్సిల్ లో దావా వేయగా ప్రీవీ కౌన్సిల్ వారు తీర్పు చెప్పుటకు నిరాకరించి ఆ వివాదము రెండు స్వతంత్రరాజ్యముల మధ్య దనీ వారుభయులు పరిష్కొనరించు కునవలసినదని త్రోసిపుచ్చుట స్వదేశ సంస్థాననములు స్వతంత్రులని చట్టరీత్యా పునాది వేశిరి

7. గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన అనుబంధ సమాశ్రయమను (subsidiary alliance) రాజ్యతంత్రముతో కూడిన రాజనీతిని తదుపరివచ్చిన గవర్నర్ జనరల్ డల్ హౌసీ అమలుచేసి వలసరాజ్య విస్తరణచేశాడు. డల్ హౌసీ దొర యుద్ధములు చేయకుండా రాజ్యకుతంత్రములు ప్రయోగించి ఇంకా కొన్ని స్వతంత్రరాజ్యములను కలుపుకుని భారతదేశములోని బ్రిటిష్ వలసరాజ్యమును విస్తరించాడు. బ్రిటిష్ వారి ఆధిక్యత, దొరతనం(European superiority) నిలబెట్టుకునటయే అతని లక్ష్యముగానుండిన రాజనీతి. అతను అవలంబించిన అబిమతములు స్వతంత్రరాజ్యములను పరిపాలించుచున్న రాజు వారసుడు లేకుండా మరణించినచో వారసుడును దత్తతచేసుకునటకు ముందు రాజ్యము బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వమును అనుమతి అడుగవలసియున్నది కావున అనుమతి యివ్వకపోయినయెడల స్వతంత్రరాజ్యపాలనా అధికారమునకు అనుమతి నవీకరణకాజాలదు అప్పుడు ఆ రాజ్యము బ్రిటిష్ ఇండియాలో కలిపివేయబడవలెనని ఆ క్రొత్త విధానము అమలుచేశాడు. ( చూడు డల్ హౌసీ)

విక్టోరియా రాణిగారి రాజాజ్ఞ స్వదేశ సంస్థానముల స్వతంత్రతకు వాగ్దానము[మార్చు]

బ్రిటిష్ ఇండియా ప్రభుత్వమును బ్రిటిష్ సామ్రాజ్యమకుటములో కలిపినటుల 1858 నవంబరు 1 తేదీన విక్టోరియా రాణిగారు చేసిన ప్రకటనలో " స్వదేశ సంస్థానధీశుల హక్కులు, దర్జాలు గౌరవములు మా స్వంత వానివలెనే గౌరవింతుమనియు సంధినియమములు పాటింతుమనియు" కొన్ని రాజ్యతంత్రములైన వాక్యములు చేర్చబడియుండెను <[3]

1935 రాజ్యాంగ చట్టముద్వారా స్వదేశ సంస్థానములకు కల్పించిన స్థానము[మార్చు]

1935 వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము ప్రవేశపెట్టిన కేంద్రీకృత (ఫెడరల్) పరిపాలనా వ్యవస్థ దేశమున ఒక పెద్ద పరివర్తన తీసుకురాగా దానితోపాటు వచ్చినది స్వదేశ సంస్థాదనములకు రాజ్యాంగహోదా

బ్రిటిష్ పరిపాలనాకాలమునాటి భారతరాజ్యాంగములో స్వదేశ సంస్థానముల స్థానము[మార్చు]

1930 దశాబ్దమునాటి 662 సంస్థానములు రాజకీయముగా మూడు తరగతులుగానుండెను.[4] సుమారు 100 సంస్థానములు సంపూర్ణ ఆంతరంగిక ప్రభుత్వమును కలిగియున్నవి. సామ్రాజ్య వ్యవహారములందును, విదేశ వ్యవహారములందును బ్రిటిష్ ప్రభుత్వమువారికి లోబడియున్నవి. 127 సంస్థానములు తమ ఆంతరంగిక వ్యవహారములందు బ్రిటిష్ ప్రభుత్వమువారి సలహా అధికారమునకు లోబడియున్నవి. బ్రిటిష్ వారి సలహాను శిరసావహింపవలసినదే. తక్కిన సంస్థానములుపై కూడా బ్రిటిష్ ప్రభుత్వమువారు తమఅధికారము చెలాయిచే స్దితిలోనుండిరి. ఆనాటి అన్ని సంస్థానముల పరిపాలకులూ నిరంకుశులే. ప్రజాభిప్రాయమునకు స్థానము లేదు. అంతేకాక వారు రాజ్యముపేరట చేసే ఖర్చులలో తమ రాజకుటంబ వ్యవహారములకు, దర్బారు దర్జాలకు, రాజనగరులనిర్మాణమునకు, ఇంకా అర్ధాన్నమైన పద్దులు రాజుగారి వేట, మృగరక్షణ మొదలగు ఖర్చులకే తమ రాజ్యాదాయమును ఖర్చు పెట్టుచుండిరి. జునగడ్ మహారాజ తన పెంపుడు కుక్కలకు వివాహ నిమిత్తము అనేక వేల రూపాయు సాలూనా ఖర్చుపెట్టినట్లు తెలియుచున్నది.[1] సంస్థానాభివృధ్ధిగాని, ప్రజాక్షేమంగాని వారి దృష్టిలో రెండవస్థానమే. అటులనే భావల్పూర్ నవాబుగారు ( పంజాబూ సింథుకి మధ్యనుండిన చిన్న రాజ్యము) తమ సమయమును ఎక్కువగా ఇంగ్లండులో గడుపుచుండిరి.అయినాకానీ ఆ నవాబుగారు ప్రజాదరణముపొందియేయుండెను. 1929-30 బిక్కనీరు సంస్థానము యొక్క ఆదాయవ్యయములుచూచినచో పరిపాలనా వ్యయముక్రింద 1255000 రూపాయలవగా యువరాజు వివాహమునిమిత్తము 825000 రూపాయలనిట్లుగా కనపడుచున్నది. ఆ సంస్థానములలో బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన రాజ్యాంగ చట్టముల ప్రకారము శాసనసభలున్నప్పటికినీ వాటికి శాసనాధికారములు స్వల్పము. ఎక్కువ సంస్థానములు నిరంకుశములుగానుండిననూ కొన్ని ప్రజాహితైకముగా నుండెను. అట్టి ప్రజాహితైక స్వదేశసంస్థానములలో చెప్పుకోదగ్గవి మైసూరు, బరోడా, తిరువాంకూరు కొచ్చినులని తెలియుచున్నది. ఆ నాలుగు సంస్థానములలో పరిపాలన ప్రజాప్రాతినిధ్యముతోకూడిన దైయుండుటయేగాక అచ్చట విద్యాసంస్థ బ్రిటిష్ఇండియాలో కంటే ఉన్నతంగా నెలకొల్పబడియున్నటులనూ, అనేక స్వదేశసంస్ధానములలో పెద్దపెట్టుబడితో కూడిన అభివృధ్దిపనులు విఫలమైనటులనూ అందుకొరకు బ్రిటిష్ ప్రభువుల వద్దనుండి అమితమైన అప్పులు చేసియుండినట్లును తెలియుచున్నది.

స్వదేశసంస్థానాదీశులకిచ్చిన 21, 19,11,9 ఫిరంగిపేలుడుల గౌరసూచకములు[1][మార్చు]

ఎక్సాల్టెడ్ హైనెస్ (Exalted Highness) అనీ, హైనెస్ (Highness) అని గౌరావార్దం సంబోధనచేసి ఆయా సంస్థానీదీశుల హోదా తెలుపుతూ వారి రాకకు గౌరవచిహ్నముగా ఫిరంగీలను పేల్చడం పరిపాటిచేశారు. మిక్కిలి గౌరాకార్ధము తీసుకున్నవారు కేవలము హైదరాబాదు నిజాము గారు మాత్రమే. 21 ఫిరంగీల ప్రేల్చుడుతో ఆహ్వానింపబడినవారిలో హైదరాబాదు నవాబుతో పాటుగా బరోడా, మైసూరు, జెమ్మూ-కాశ్వీరం, గ్వాలియర్ మహారాజులున్నప్పటికీ హైదరబాదు నిజాముగారికి ఎక్సాల్టెడ్ హైనెస్ (Exalted Highness) అని సంబోధనయుడెడిది మిగతావారికి హైనెస్ (Highness) అని గౌరావార్దం సంబోధనయుండెడిది. 19 పిరంగీల ప్రేలుడునిచ్చిన వారిలో ఐదుగురు సంస్థానాధీశులుండిరి భోపాలు, ఇందౌర్, ఉదయపూరు, కొల్హాపూరు, ట్రావెన్కూరు సంస్థానాధీశులు. 107 మందికి 9 గాని 11 గాని ఫిరంగీప్రేలుడునూ, ఇంక మిగతా దాదాపు 450 మంది సంస్థానాధీశులకు అసలు ఫిరంగిప్రేలుడేలేని హోదా నిచ్చిరి బ్రిటిష్ ప్రభువులు. వైస్రాయికి స్వదేశసంస్థానాదీశుల వ్రాతప్రతులలో వారికి ఫిరంగీ పేలుడి సంఖ్యపెంచమని అభ్యర్థించుటకూడా ఉంది. ......సశేషం

స్వదేశ సంస్థానములు భారతదేశ రాజ్యాంగమునకు సమశ్య[మార్చు]

1899-1905 మధ్య పరిపాలించిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ పరిపాలనలో ప్రజాహిత పరిపాలననుపేక్షించిన కొన్నిసంస్థానాధీశులకు పట్టాలనొసగ తిరస్కరించెను. భారతదేశ స్వాతంత్ర్యసమరయోధము చివరలో స్వదేశసంస్థానములను అండగా పెట్టుకొని రాజకీయములుచేసిన ముస్లింలీగు నాయకుడు జిన్నా మొదటి రౌండు టేబుల్ సమావేశములో భారతదేశ స్వాతంత్ర్యమునకు ప్రతినిధత్వము కేవలము కాంగ్రెస్సురాజకీయపార్టీ కాదనియూ ముస్లిముల తరఫున ముస్లిమ్ లీగును, స్వధేశసంస్థానములు కూడా కలవనియు వారి గొంతు నొక్కుతున్న కాంగ్రెస్సురాజకీయ పార్టీ చేతికి అఖండ భారతదేశ ప్రభుత్వమునిర్మించి పరిపాలించుట కథికారములేదని వాదన ప్రవేశపెట్టెను. అటుతరువాత 2వ రౌెండు టేబులు సమావేశము(1932) లో భారతదేశానికి బ్రిటిష్ ప్రభువులిచ్చు కేంద్రీకృతముగనుండెడి కొత్తరాజ్యాంగములో తాముకూడా భాగీదారులుగ నుండుటకు స్వదేశ సంస్థానప్రతినిధులు తమ సమ్మతి తెలిపిరి. అది బ్రిటిష్ ప్రభువులకణుగమైన సమ్మతి. స్వదేశ సంస్థానాధీశులందరు నిరంకుశ పరిపాలకులైయుండినందున వారి సంస్థానములలో శాసనసభలునెలకొల్పు రాజ్యాంగము భారతదేశమునకిచ్చి ప్రజాపరిపాలనా పధ్దతి ప్రవేశపెట్టితమని తమ సార్వభౌమత్వమును కొనసాగించారు.

స్వదేశ సంస్థానముల అంతిమ దశలు[మార్చు]

1947 ఫిబ్రవరి 20వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటు (హౌస్ ఆఫ్ కామన్సు) లో క్లెమెంటు అట్లీ చేసిన ఘోషణ చారిత్రాత్మకమైనది. ఎట్టిపరిస్థితులలోనైనను బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశమునుండి జుాన్ 1948 లోపల వదలిపెట్టవలసియున్నదన్న ఘోషణ. అప్పటి వైస్రాయి వావెల్ ను తొలగించి మౌంటు బాటన్ను వైస్రాయిగా నియమించెను. అప్పటినుండి 16 నెలలోభారతదేశము వదలి వచ్చెేయుటకు తీసుకోవలసిన నిర్ణయములు, చేయవలసిన కార్యక్రమముల బాధ్యత మౌంటు బాటన్ భుజములపై పెట్టబడింది. గానీ ఎలా వదలాలి ? ప్రభుత్వమును ఎవరకి అప్పగించవలెనను రెండు గడ్డు ప్రశ్నలకు సమాధానము వెతికి ఆచరించవలసియున్నది. అంతవరకూ అఖండ భారతదేశమును విభజించరాదనియే ధోరణిలో భారతదేశమున బ్రిటిష్ సామ్రాజ్యము సార్వభౌమత్వము నిలబెట్టి వుంచుటకు సూచించిన మార్గములో చివరగా సర్ స్టఫర్డు క్రిప్సు విచారణ సంఘమువారి వింతరాజ్యాంగము.

క్రిప్సు విచారణ సంఘమువారు సూచించిన వింత రాజ్యాంగము[మార్చు]

1946 జూలైలో బ్రిటన్ ప్రధాన మంత్రిగా క్లెమెంట్ అట్లీ (Clement Atlee) పదవి చేపట్టిన తరువాత భారతదేశానికి స్వతంత్రమునిచ్చుటకు అన్ని వర్గములకు సమ్మతమైన మార్గము కనుగొని సూచించమని 1947 మార్చిలో భారత వైస్రాయి లార్టు ఆర్చిబాల్డు వావెల్ (Lord Archibald Wavell) తో కూడిన సర్ స్టఫర్డు క్రిప్సు (Sir Stafford Cripps) అధ్యక్షతన విచారణ సంఘము నియమించబడింది. ఆ విచారణ సంఘము మహ్మదీయుల కొరకు దేశ విభజనచేయమన్న ముహమ్మద్ అలీ జిన్నా (Muhammad Ali Jinnah) ప్రతిపాదనను త్రోసిపుచ్చింది. స్వదేశ సంస్థానములతో కలసియుండిన అఖండభారతదేశమున కేంద్రీయుతమైన రాష్ట్ర ప్రభుత్వములను నెలకొల్పుటకు సూచించెను. హిందు, ముస్లిమ్ వర్గములవారిని సంత్ప్తుప్తిచేయుటకై చేసిన ఆ క్రిప్సు విచారణ సంఘపు రాజ్యాంగ పరిష్క్రుతి (constitutional award) లో భారత రాజ్యాంగము మూడు సమూహములకలియికగా ప్రతిపాదించబడెను. (1) అధిక సంఖ్యలో హిందువులున్నరాష్ట్ర శాసన సభలన్నీయు ఒక సమూహముగనూ (2) ముస్లిములు అధికముగయున్న రాష్ట్రములలోని శాసన సభలను రెండు సమూహములుగ పశ్చమోత్తర పరగణములవి రెండవ సమూహముగను, బెంగాల్- అస్సమ్ రాష్ట్రశాసన సభలను మూడవ సమూహముగను విభజించి ఆ మూడు సమూహముల శాసనసభలు కలిసిన ఒక కేంద్ర ప్రభుత్వశాసనసభనేర్పచవలసియున్నది. దేశ రక్షణ, విదేశ వ్యవహారములు, సమాచారయంత్రాంగము కేంద్ర ప్రభుత్వముక్రిందనుంచి మిగత పరిపాలనా అధికారములకు సంబంధించిన విభాగములకు శాసనములు చేయు హక్కును రాష్ట్ర ప్రభుత్వ శాసనసభలకివ్వబడెను. నిరంకుశపరిపాలనాధికారములుగల స్వదేశసంస్థానములనూ ప్రజాప్రాతినిధులకు బాధ్యతగలిగి యుండు రాష్ట్రీయప్రభుత్వములును కలసియుండు వింతసంయుక్త రాజ్యాంగమివ్వచూపిన క్రిప్సు పరిష్కృతి విఫలమగుటలో ఆశ్చర్యములేదు.[4] క్రిప్సునిచారణ సంఘముచేసిన అట్టి వింత రాజ్యాంగము విఫలమగుటకు కారణము ఆ సంఘమువారు కాంగ్రెస్సువారినీ, ముస్లింలీగువారినీకూడా సంతోష పెట్టుటకు అందు చేర్చిన పరస్పరవికటితమైన పరిఛ్ఛేదములే (CLAUSES క్లాజులు). కాంగ్రెస్సు వప్పుకున్నాగాని ముస్లింలీగువారు తిరస్కరించారు. దాంతో లండనులోని అట్లీప్రభుత్వము భారతవైస్రాయిగా వావెల్ ని తీసివేసి మౌంటుబాటన్ను నియమించి 1948 జూన్ లోగా ఎట్టిపరిస్తితు లలోనైననూ భారతదేశమును తమ బ్రటిష్ పరిపాలన ముగించుదరని బ్రిటిష్ పార్లమెంటులో ఉద్ఘోషించారు. అప్పటికి రాజుల ఛేంబరు (Chamber of Princes) కు ఛాన్సలరైయుండిన భోపాల్ నవాబు సర్ హమీదుల్లా ఖాం గారు ఆసందర్భమున నిష్ఠూరముగా వాపోయినదేమనగా సర్వస్వతంత్రులైన స్వదేశ సంస్ధానాదీశులు ఒక రాజకీయపార్టీ నిర్మాణించు ప్రభుత్వము క్రింద ఎలావుండగలవు అని ప్రశ్నించారు .

అఖండ భారతదేశ విభజనే మార్గమన్న నిర్ణయము - స్వదేశ సంస్థానము లంతరించవలసిన పరిస్థతి[మార్చు]

క్రిప్సు మిషన్ విఫలమైనతరువాత మౌంటుబాటన్ ప్రభృతులు ఆనాటి సమశ్యకు (ప్రభుత్వాదికారము ఎవరకు అప్పచెప్పి తాము వెడలిపోవాలి అన్న సమశ్యకు) మార్గము అప్పటిలో రిఫారముల కమీషనర్ (Commissioner of Reforms) గానుండిన ఐ.సి.యస్ అధికారియైన వి.పి. మినన్ (వప్పల్ పంగుణి మినన్; V. P. Menon) కు అప్పచెప్పి సమాధనము సూచించమనగా 1947 మే నెలంతా కష్టపడి వి. పి. మినాన్ గొప్పచతురతతో తయారుచేసిన మార్గసూచకమునే మౌంటుబాటను స్వయముగా లండను తీసుకునిపోయి 1947 జూన్ 3వ తేదీ బ్రిటిష్ పార్లమెంటు చేత ఆమోదించుకుని వచ్చాడు. ఆ జూన్3వ తేదీ ప్రణాలిక ప్రకారము బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశమును వదలిపెట్టిన నాటినుండి బ్రిటిష్ సామ్రాజ్యముయొక్క సార్వభౌమత్వము స్వదేశ సంస్థానముల పై అంతమొందును అని పేర్కొన బడింది. ఆ జూన్ 3 వ తారీఖు నాటి ప్రణాళికలోనే అఖండభారత ధేశము ఇండియా డొమినియను గనూ, పాకిస్తాను డొమినియన్గనూ విభజించి ప్రభుత్వాధిఖారములను బ్రిటిషవారు రెండు దేశములకూ వేరువేరుగా అప్పజెప్పుదరని చెప్పబడియున్నది. ఆ ప్రణాలిక వెలువడిన వెనువెంటనే కలిగిన స్పందన స్వదేశ సంస్థానాధీశుల నిస్పృహ నిరాశ లకు చిహ్నముగా ఛేంబరు ఆఫ్ ప్రిన్సెస్ కి అధ్యక్షుడుగానుండిన భోపాలు నవాబు గారు రాజీచేశాడు. కార్యప్రణాలికలు, సమావేశములతో మౌంటుబాటన్ ప్రభృతులు నిమగ్నమైయిరి.అఖండ భారతదేశమును ఇండియా, పాకిస్తాన్ డొమీనియన్లుగనే గాక యావత్తు స్వదేశ సంస్థానములకు కూడా అధినివేశ ప్రతిపత్తి (Dominion Status) కలుగునన్న రాజకీయమైన అతితెలివిచేతనో వైస్రాయి కార్యదర్శి గానుండియున్న సర్ కొన్రారడ్ కార్ ఫీల్డు (Sir Conrad Corfield) అసాధ్యమైనట్టియు వింత దృష్టికోణమును వెలిబుచ్చెను [1] సర్ కొన్రారడ్ కార్ ఫీల్డు దొర అప్పటిలో మౌంటుబాటన్ సలహాదారులలో స్వదేశ సంస్థనలను పర్యవేక్షించే బ్రిటిష్ రాజకీయవిభాగమునకు అదిపతిగా నుండి స్వదేశ సంస్థానాధీశులకు సన్నిహితస్నేతుడుగనూ ముఖ్యముగ నిజాముగారికి చాల సన్నిహితుడుగనూ నుండినవాడనీ, కానీ మౌంటుబాటన్ తో విభేదములకలిగి యుండెననీ తెలియుచున్నది.[5] అదృషటవశాన మౌంటుబాటన్ ఆ ప్రతిపాదనతో ఏకీభవించక నెహ్రూతో ఏకీభవించి నెహ్రూ అప్పుడే నియమించిన రాష్ట్రీయ విభాగమును వల్లభాయి పటేల్ గారి నియంత్రణలో నెలకొలిపి కార్ ఫిల్డు దొరనితొలగించడం జరిగింది.

స్వదేశ సంస్థానముల భవిష్యత్తు స్పష్టమగుట[మార్చు]

1947 జూలై 18 తేదీన ఇండియా ఇండిపెండెన్సు చట్టం పై బ్రిటిష్ రాజు 6వ జార్జి హస్తాక్షరమైనది. భారతదేశము లోని బ్రిటిష్ సార్వభౌమత్వమంతరించటంతో స్వదేశ సంస్థానములు ఎవరకివారు స్వతంత్ర దేశములైనటులకాదని అంతకుముందే 1947 జూన్ వర్కింగ్ కమిటీ నిర్ణయములలో కాంగ్రెస్సువారు వక్కాణించి స్వదేశసంస్థానముల భవిష్యత్తుపై తమవైఖరి స్పష్టముచేసిరయుండిరి. గతరెండు శతాబ్దములలో బ్రిటిష్ సామ్రాజ్య సార్వభౌమత్వమును అంగీకరించుతూ అన్ని స్వదేశ సంస్థానములు సంధిపత్రములపై హస్తాక్షరములుచేసినవారైయుండుట చేత భారతదేశములో బ్రిటిష్ సార్వభౌమత్వమంతమొందడంతో స్వదేశ సంస్థానముల వప్పందములుగూడా అంతమొందెను. బ్రిటష్ వారు భారతదేశములో వహించుతున్న సార్వభౌమత్వము అన్యాక్రాంతము చేయబడని అధికారమనియూ (transferable కాదని) స్వధేశ సంస్థానాధీశులు బ్రిటిష్ ప్రభుత్వము స్థానములో వచ్చిన ప్రభుత్వముతో కొత్త వప్పందములు చేసుకునుటయో లేదా ఇతర రాజకీయ ఏర్పాటు చేసుకునుటయే చేయవలెనని బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లే కూడా అధికారరూపకంగా ఆమేరకు పార్లమెంటులో ఘోషణ చేసియుండెను. అఖండ భారతదేశము రెండు అధినివేశ స్వరాజ్యములు (Dominions) గా విభజించబడి అఖండ కేంద్రశాసనసభ కూడా రెండుగనైన ది. తరువాత 1947 జూలై నెలాఖరుకు వైస్రాయి మౌంటుబాటన్ స్వదేశ సంస్థానాధీశులను సంబోధించుతూ ఛేంబరు ఆఫ్ ప్రిన్సెస్ లో ఆవిషయమే ఘోషించియుడెను . భారతదేశ స్వదేశ సంస్థానములపై బ్రిటిష్ సార్వభౌమత్వమంతమొందినదనియూ, స్వదేశ సంస్థానములు ఇండియా డొమినియన్తో గానీ లేదా పాకిస్తాను డొమినియన్తో గానీ అంగీకార వప్పందములు చేసుకొననియడల అది బ్రిటిష్ సార్వభౌమునత్వమవమానపరచినట్లనియూ ఘోషించెను. దేశ రక్షణ విదేశవ్యవహారములు తమ సంస్థానములకు చేయు హక్కు డొమినీయన్ ప్రభుత్వములకలందులకు తమ తమ రాజకీయ హోదాలు కలిగియుండుటకు, ప్రివిలెజస్సులకొరక ఆ రెండు డొమినీయన్ ప్రభుత్వములను సంప్రతించవలసినదనియూ సలహానిచ్చెను. అంతేకాక ఏప్రిల్ 19వ తేదీ గ్వాలియర్లో నెహ్రూ చేసిన ప్రసంగములో కూడా ఆమేరకు స్వదేశ సంస్థానములను హెచ్చరించి భారతదేశ డోమీనియన్లో చేరుటకు అంగీకారము తెలుపని వారు భారతదేశానికి శత్రువులుగా పరిగణింప బడుదురని నిస్సంశమయుగా ఘోషించియుండెను. వల్లభ్భాయి పటేల్ తోను, వి.పి. మినాన్ ఆధ్వర్యమున కొత్తగా నెలకొల్పబడ్డ రాష్ట్ర వ్వవహారాల విభాగమునకు 1947 జూలై చివరనాటినుండి అనేక స్వదేశ సంస్థానధీశులు భారతదేశ డొమీనియనలో విలీనమగుటకు తమ తమ అంగీకారములు పంపనారంభించిరి. భారతడొమీనియన్ లో స్వదేశ సంస్థానముల విలీనమునకు సంస్థానాధీశుల అంగీకార-స్వీకారముల గూర్చి నెహ్రూ- పటేల్ ప్రభుతృలకు కలిగియున్న ధ్యాన్నము పాకిస్థాన్ డొమీనియన్ లో జిన్నా చూపలేదని తెలియుచున్నది. పాకిస్థాన్ డొమీనియన్ లో నున్నట్టి క్వలత్ మరియూ భాహవల్పూరు స్వదేశ సంస్థానములతో చాల సులువుగనే వప్పందముల కలుగునని ఆతనికి ధైర్యమైయుండెను. స్వదేశ సంస్థానముల భవిష్యత్తు యొక్క స్ధితిగతులు తనకు చాల చివరిదాక తలకెక్కలేదనియు దానిని గూర్చిన విషయములు ప్రముఖమైనవన్న సంగతి క్రమేణా అవగతమైనదనియూ మౌంటు బాటన్ అంగీరంచియుండెను

భారత డొమినియన్లొ విలీనమగుటకు సమ్మతి పత్రసమర్పించుటలో వెనుకముందాడిన స్వదేశ సంస్థానాధీశులు[1][మార్చు]

1948 జూన్ లోపల బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశమును విడనాడునని వెలువడిన బ్రిటిష్ సామ్రాజ్యపు నిర్ణయముతో స్వదేశ సంస్థానము లేవిధముగా పరిగణింపబడునన్న అంశము అప్పటినుండి తీవ్ర చర్చాంశమైనది. 1947 జూన్ 3 తేదీనాటి బ్రిటిష్ పార్లమెంటు ప్రకటన పర్యవసానముగ స్వదేశ సంస్థానముల భవిష్యత్తు విషయంలో తెలియుచున్న చరిత్రాంశములు (1) స్వదేశ సంస్థానములపైన తమ సార్వభౌమత్వము ఇంకోరికి అప్పచెప్పజాలమనియూ, వారితోనే ఆ సార్వభౌమత్వ మంతమొందునను బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రకటనచేయుటవలన భారతదేశము లోని 562 స్వదేశ సంస్థానములు సర్వస్వతంత్రులమగుదమనే స్వాభావికమైన స్పందనకు దోహదమైనది. (2) ఇటువంటి స్పందన సమశ్య పూరితమగునని ముందుగనే గమనించిన నెహ్రూ 1947 జనేవరి మరియూ ఏప్రిల్ నెలలోజరిగిన బహిరంగ సభలలో చేసిన ఘోషణద్వారా భారతడొమినియన్ లో కలిసిపోవుటకు నిరాకరించు స్వదేశ సంస్థానములు శత్రువులుగ పరిగణింపబడునను హెచ్చెరించియుండెను. అంతేకాక 1947 జూన్ కాంగ్రెస్సు మహా సభలో తమ వైఖరి (బ్రిటిష్ సామ్రాజ్యమునుండి నిష్క్రమించబడ్డ స్వదేశ సంస్థానములు ఎవరికివారు స్వతంత్రులు కాజాలరన్నతీర్మానము ద్వారా) స్పష్టం చేసియుండెను. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వమునుండి పరిపాలనాధికారము భారతడొమినియన్ చేతికందగనే స్వదేశ సంస్థానములపై సార్వబౌమౌత్వము కూడా కలుగనని ఆనాటి అధినేతలైన నెహ్రూ పటేల్ ప్రభృతులు తలచిరని పేర్కొనుట వారి రాజకీయపరిజ్ఞానము, మేదాశక్తిని సంకుచితముగా సమీక్షించినట్లగును. నెహ్రూ ముందుచూపుతోనే అప్పటికే(1947 జూలై) రాష్టవ్యవహారాల విభాగమును వల్లభాయిపటేలు నాయకత్వములో నెలకొలిపి వి. పి. మినన్ ను కార్యదర్శిగా నియమించెను. అప్పటిదాకా ప్రతి సంస్థానములో నుండిన బ్రిటిష్ రెసిడెంట్లు ఆనాటితో విముక్తికాబడినట్లు పరిగణించి వారిద్వారా వ్యవాహరక సూచనలు చెల్లవని నిశ్చయించబడింది. (3) స్వతంత్ర భారతడొమినియన్లో కలిసిపోవుదుమని ప్రతివక్క స్వదేశ సంస్థానాధీశులు లిఖిత పత్రములు ఢిల్లీ లోని రాష్ట్ర వ్వవహారాల విభాగమున కందజేయవలనెని నిర్ణయించబడింది. ఆ దిశలో జరిగిన కొన్నిఇతర ముఖ్య చరిత్రాంశములు సంస్థానాధీశులు తామంతటతామే ముందుకు వచ్చుటకు ప్రోత్సాహకముగ అధికారముచేపట్టనున్న భారతడొమినియన్ ప్రభుత్వము చేసిన కార్యాచరణ
(1) జూలై 5వతారీకున ప్రకటించబడిన ఆశ్వాసనములు
(అ) దేశ రక్షణ, విదేశ వ్యవహరములు, వార్తాసూచనవ్యవహారములు తప్ప(ఇవి భారత ప్రభుత్వము క్రిందనుండును) మిగత కీలక పరిపాలనా విభాగములు స్వదేశ సంస్థానముల ప్రభుతము క్రిందనుండుననియూ
(ఇ) స్వదేశ సంస్థానాధీశుల గౌరవ హోదాలు, స్వాభిమాన దర్జాలు, రాజరికపు సౌఖ్యములు, లాంఛనములు ( princely privileges and princely perquisites) కలిగి యుందురనియూ ఆశ్వాసనములియ్యబడెను.
(2) అన్నిరకముల హోదాగల సంస్థానాధీశులకు ఒకేరమైన పారదర్శమైన అంగీకార దస్తావేజు (Standard common instrument of accession) తయారుచేసిరి
(3) తత్సంబందిత విషయముల మధ్యస్తీకరణము (negotiation బదలాయింపు)చేయుటకొరకై కేంద్రీయ వ్యవస్థనెలకొల్పబడెను
(4)ఉన్నస్థితి కాపాడు పత్రము(Stand still Agreement) కూడా నిర్మించబడెను. అట్టి Stand still Agreement కావలనని కోరిన సంస్థానము, జమ్మూ-కాశ్మీరు. అంతేకాక
(5) అవసరమైనచో ఇండియా ఇండిపెండెన్సు బిల్లును సవరణచేయుటకు కూడా వ్యవస్థచేయబడెను.

విలీనమగటకు సమ్మతి తెలుపుటలో కొన్ని సంస్థానముల తీరు[మార్చు]

21 ఫిరంగి హోదా కలిగిన అతి పెద్దదైన హైదరాబాదు నిజాంగారి సంస్థానము, 19 ఫిరంగీల తిరువాంకూరు సంస్థానమునుండి కనుక మొదటగా సమ్మతిపొందగలిగితే మిగతా సంస్థానముల వారు కదలి వచ్చెదరని వల్లభాయి పటేలు, మౌంటుబాటన్లు సమాలోచన చేసిరియుండిరి. వారు కనక నిరాకరించినచో మిగత సంస్థానాధీశులు, మైసూరు, భోపాలు, ధోల్పూరు మున్నగు అనేక ఇతర సంస్థానాధీశులు కూడా వెనుకంజ వేయుదురనికూడా తలచబడింది. కాంగ్రెస్సు ప్రభృతులైన నెహ్రూ, గాంధీలను చాలమంది సంస్థానాధీశులు విముఖత్వముతో చూచుదు రనియూ అందుకు కారణము జమీందారులను, జాగీరు దారులను తొలగించవలెనన్న కాంగ్రెస్సు అధికారములోకి రాగనే అతి త్వరలోనే సంస్థానాధీశులను కూడా రూపుమాపునని భోపాలు నవాబుగారైన హమీదుల్లా ఖాన్ తన అభిప్రాయమును వెలిబుచ్చిరి. స్వతంత్ర భారతడొమినియన్ లో చేరుటకు వెనువెంటనే సుముఖమైన అంగీకారమును తెలిపిన సంస్థానాదీశులలో రామ్పూరు నవాబు గారు(15 ఫిరంగీల హోదాగలిగిన). రామ్పూరు సంస్థానము ఉత్తర ప్రదేశములో హిందూవులు అధికసంఖ్యలోకలిగియుండిన నొక చిన్న స్వదేశ సంస్థానము. నవాబుగారటుల అంగీకారము చేయగనే పాకిస్తాన్లో చేరవలెనన్న మహ్మదీయులు వ్యతిరెకత జూపుతూ అలజడి కలిగించిరి.

అంగీకారము తెలుపక నాన్చిన సంస్థానాధీశులు[మార్చు]

రాజస్థాను లోని అధిక హిందూజనసంఖ్యతో హిందు రాజపుత్ర రాజుల పరిపాలనలోనుండిన సంస్థానములలో ప్రముఖమైనవి జోధపూరు, ఉదయపూరు, జైసల్మీరు. ఇవి పాకిస్థానుకు ఆనుకుని యున్నవి. పెద్ద స్వదేశసంస్థానములో నొకటైన జోదపూర్ సంస్థానము(మార్వాడ్) గొప్ప జనప్రియుడైన మహారాజా ఉమ్మైదు సింగు కుమారుడు హన్వంత్ సింగు 1947 జూలైనాటికి పరిపాలించుచుండెను. జోధపూరు సంస్థానము లోనుండిన అమర్కోట 1843లో బ్రిటిష్ ప్రభువులు కబళించిరి తరువాత పాకిస్తాన్లో చేర్చబడింది. తిరిగి అమర్కోటను తమకిచ్చెదమని ఆశ జూపించి మహ్మదలి జిన్నాచెప్పుడుమాటలకు లోనై పాకిస్తాన్లో చేరుట కంగీరించునను విషయము కాంగ్రెస్సు అధినేతలకు ఆత్రుత కలిగించియుండెను.
ఇండోర్ (ఇందౌర్) సంస్థానం
19 వ శతాభ్దములో భారతదేశపు బ్రిటిష్ ప్రభువుల ఆధిక్యతను ధిక్కరించి పోరాడి స్వతంత్రవీరులైన హోల్కర్లు పరిపాలించిన ప్రాచీన సంస్థానము. ఇప్పటి మధ్యప్రదేశ రాష్టములో ప్రముఖ పట్టణం ఇండోర్ (ఇందౌర్ అని హిందీలో). భారతదేశము స్వతంత్ర డొమినియనుగా అయిన 1947వ సంవత్సరము నాటికి ఆ ఇందౌర్ సంస్థానము రెండవ యశ్వంతరావు అధికారములోనుండెను. ఏకారణముచేతనో అతను భారతదేశ డొమినియన్లో చేరుటకు అంగీకారము గానీ నిరాకారముగానీ చేయక అంతర్యామితో నిమగ్నుడై కాలాయాపనచెసి చివరకు వైస్రాయి మౌంటుబాటన్ అధికార సూచనకు స్పందించి వ్యక్తిగతముగ కలయ వచ్చి ఏమియును తేల్చక నిష్క్రమించెను. కానీ కొలది రోజులకే రాష్ట్ర వ్యవరాల విభాగమునకు ఇతని అంగీకార దస్తావేజు సాదారణ తపాలాద్వారా చేరుట యావన్మందికి ఆశ్చర్యముకలిగించింది.

విముఖతచూపిన స్వదేశ సంస్థానాధీశులు[మార్చు]

విముఖత చూపిన స్వదేశ సంస్థానములలో హైదరాబాదు నిజాం, జమ్మూ-కాశ్మీర, తిరువాంకూరు, ఇందౌర్, సంస్థానములను గూర్చి చెప్పదగ్గ చరిత్రాంశములు కనబడుచున్నవి.

తిరువాంకూరు సంస్థానము[మార్చు]

తిరువాంకూరు సంస్థానము ఇప్పటి తిరువనంతపురం వర్మ వంశీయులైన రాజులు 18వ శతాబ్దమునుండి పరిపాలించుచూ బ్రిటిష్ వారి నిష్క్రమించునాటికి అన్నితీరులా అభివృధ్దిచెంది ఆస్ట్రేలియా దేశమంత జనాభాసంఖ్య కలిగియున్న సంస్థానము. స్వతంత్ర భారత డొమీనియన్లో చేరుటకు నిరాకరించిన సంస్థానములలోనొకటి. మహారాజా ప్రతినిధిగా వ్యవహారములు నడపిన ఆ సంస్థానము యొక్క దివాను, సర్ సి.పి. రామస్వామి అయ్యర్ 1947 జూలై 14 తేదీన తన సంస్థానము స్వతంత్రముగా నుండునని ప్రకటించెను. కానీ మౌంటుబాటన్-వల్లభ్ భాయి పటేల అదినేతల బుజ్జగింపులు, హెచ్చరింపులతో భారతడొమినీయన్లో చేరుటకు జూలై30 తేదీన ఆ సంస్థాన మహారాజు గారి అంగీకారము తెలిపిరి.

హైదరాబాదు సంస్థానము[మార్చు]

అసఫ్ జాహి వంశమువాడొకడైన నిజాం ఉల్ముల్కు అను నవాబు మొగల్ సామ్రాజ్య ప్రతినిధిగ 1713 నియమించబడ్డాడు. ఔరంగజీబు మరణానంతరము క్రమేణా మొగలాయి సామ్రాజ్య క్షీణంచుచుండిన రోజులలో అతను కూడా స్వతంత్ర రాజుగ పరిపాలన సాంగించెను. 7తరాల తరువాత వారసుడైన అతని సంతతివాడు మీర్ ఊస్మాన్ అలిఖాన్ బ్రిటిష్ సామ్రాజ్య నిష్క్రమణ ప్రయత్నములు జరుగుతున్న 1947 నాటికి హైదరాబాదు నిజాముగా ఆ సంస్థానమును పరిపాలించుచుండెను. అప్పటి ప్రపంచములో కల్లా గొప్ప ధనికుడని పేరుపొందియుండి, బ్రిటిష్ ప్రభువుల కొలువులో పలుకుబడి గల్గియుండినవాడు. 85శాతం జనాభా హిందువులుకలిగియుండి ఆస్ట్రేలియా దేశముంతటి (జనాభా సంఖ్యవారీ) హైదరాబాదు సంస్థానమునకు ప్రత్యేక పార్లమెంటు, కంరెన్సీ(మారక ద్రవ్యము), సైనికబలగము యుండియున్నది. ఉత్తర సర్కారులు అనబడిన రాజ్యభాగమును(రాజమండ్రినుండి మచిలీ పట్టణం దాకా) వారికి చక్కబెట్టిన నిజామునకు, అతని సంస్థానమునకు బ్రిటిష్ ప్రభువులు చాల ప్రాముఖ్యతనిచ్చియుండిరి. 1947 జనేవరి నుండి అతి వేగముగ నెలకొంటున్న రాజకీయ పరిస్థితులలో హైదరాబాదు నిజాంగారి అభిమాన పాత్రులు, మిత్రులైన బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ సామ్రాజ్య నిష్క్రమణతో భారతదేశములోని అనేక స్వతంత్రరాజ్యములు స్వతంత్ర దేశములగా పరిగణింపవలెనన్న ధోరణి ప్రవేశ పెట్టిరి. ఉన్నత జీతబత్తెములపై నిజాం నియమించుకున్నరాజకీయ సలహాదారుడు సర్ వాల్టర్ మాంక్టన్ దొర నిజాం తరఫున హైదరాబాదు సంస్థానము బ్రిటిష్ వారి మిత్రరాజ్యమనియు చాల చక్కగా పరిపాలించిన కరవు రహితమైన రాజ్యమనియు, భారతదేశములో విలీనమైనచో నిజాము రాజ్యములోనున్న ముస్లిం జనాభా తిరుగుబాటు చేయుదురనియు బ్రిటిష్ సామ్రాజ్య ప్రతినిధి వైస్రాయి మౌంటుబాటన్ కాంగ్రెస్సువారి చెప్పుచేతలలోనుండబట్టి నిజామున కన్యాయము జరుగు చుండెనని బ్రిటిష్ పార్లమెంటు విపక్ష రాజకీయనాయకుల అనురాగము పొందుటకు ప్రయత్నించెను. తమ అభిమానపాత్రుడు, మిత్రుడైన నిజామును అవసరసమయములో విడనాడకుండ చేయూత నియ్యవలసిన సమయమని బ్రిటిష్ విపక్షనాయకుడైన చర్చిల్ వ్యాఖ్యానములు చరిత్రలోకెక్కినవి. పాకిస్తాన్ అధినేత జిన్నాహ పాకిస్తాన్లో చేరమని నిజామును ప్రేరేపించెనప్పటికినీ తన రాజ్యము భారతదేశముతోగానీ, పాకిస్తాన్ తోగానీ చేరక స్వతంత్ర డొమినియన్గ నుండునని జూన్ 3 తారీకునాటికే ఫర్మానా విడుదల చేసియుండెను గానీ చివరగా నిజాము కొంత మెత్తబడి హైదరాబాదు సంస్థానముయొక్క విదేశవ్యవహారములు, రక్షణ, సమాచార- ప్రచారములు భారతదేశకేంద్ర ప్రభుత్వమున కప్పచప్పుటకు సంసిద్దుడైననూ భారతదేశములో చేరిపోవుటకు మాత్రము నిరాకరించెను. ఆగస్టు 15 తరువాత హైదరాబాదు సంస్థానమును గురించి తెలుసుకోవలసిన చరిత్రాంశములు వివరములు పెక్కు ఉన్నాయి.

జమ్మూ-కాశ్మీర సంస్థానము[మార్చు]

భారతడొమినియన్లో చేరుటకు విముఖత చూపియుండిన స్వదేశ సంస్థానములలో మరొకటి జమ్మూ కాశ్మీర సంస్థానము. జనాభావారి తక్కువైనప్పటికినీ వైశాల్యములో హైదరాబాదు సంస్థానమంతటి పెద్దదైన సంస్థానము. 85శాతం మహ్మదీయ ప్రజలు కల ఆ సంస్థానము 1925 నుండి మహారాజ సర్ హరి సింగు అని ప్రసిధ్దిచెందిన హిందుమతస్తుడైన రాజు పరిపాలనలోనుండెను. మహారాజ హరి సింగు 1915లో నేషల్ డిఫెన్సు అకాడమి పట్టభద్రుడైయ్యను. మహారాజ ప్రతాప్ సింగు పరిపాలనాకాలములో జమ్మూ-కాశ్మీరు సైన్యమునకు ముఖ్య సైనికాధికారిగనుండెను. మహారాజైనతరువాత ఇతను రెండవ ప్రపంచయుధ్ధములో పాల్గొని యోగదానము చేయుటకు తన సైన్యమును ప్రోత్సహించి బ్రిటిష్ వారి అభినందనలకు పాత్రుడై 1944వసంవత్సరం బ్రిటిష్ వార్ కాబినెట్కు ఆహ్యానించబడెను. తన సంస్థానములో రాజకీయ వత్తిడివలన 40 మంది ఎన్నుకొనబడిన సభ్యులతో 75 సభ్యుల శాసన సభనేర్పరచి నామమాత్రపు ప్రజాపరిపాలనా పధ్దతి నడుపుచుండెను. ముస్లిం కానఫరెన్సు అనబడు రాజకీయ విపక్ష పార్టీ స్థాపనతో మహారాజ హరి సింగు నిరంకుశపాలనకు వ్యతిరేకత పెరిగింది. 1932 నుండి షైక్ అబ్దుల్లా ఆ పార్టీకి అధ్యక్షుడుగానుండెను. 1939 లో నెహ్రూ సలహా ప్రకారము తన పార్టీని నేషనల్ కానఫరెన్సుగా మార్చిన కారణముగ ముస్లిం కానఫరెన్సుపార్టీ చీలి గులాం అబ్బాసు నాయకత్వములో ముస్లింలీగు పార్టీ గనే కొనసాగెను. షైక్ అబ్దుల్లా నెహ్రుకి సన్నిహితుడిగానుండెను. నిరంకుశుడైన మహారాజ హరి సింగును తీసివైసి ప్రజాప్రతినిధిగనుండిన సంస్థానాధీశుని నియమించవలెనని ఆందోళన ఉదృతము చేయగా అప్పటి ప్రధానమంత్రి రామచంద్ర కక్ ప్రభుత్వము 1945 లో అతనిని నిర్బంధములోనుంచి అతనిపై న్యాయస్థానములో అభియోగము నడిపించెను. షైక అబ్దుల్లా తరఫున న్యాయవాదిగా నెహ్రూ స్వయాన్న కాశ్మీరుచేరుకున ప్రయత్నించగా అతనిని రానీయక దారిలోనేనిర్బందించి వెనుతిరిగి పంపివైసెను. ముస్లిం కానఫరెన్సు పార్టీ అధ్యక్షుడైన గులాం అబ్బాసు మహ్మద్ అలి జిన్నాతో సన్నిహతుడైయుండి ఆ సంస్థానము లోని ముస్లిములను కలసికట్టుగ పాకిస్తానులో చేరుటకు మదత్తుచేసెను. జమ్మూ కాశ్మీర రాజ్యమునకు ప్రధాన మంత్రిగా యుండిన రామచంద్ర కక్ భారతదేశములోని కాంగ్రెస్సు అధినేతల అభిమతమునకు వ్యతిరెకించినవాడు. కొత్తగా నెలకొల్పబోవు ఇండియా డొమీనియన్లోనో లేదా పాకిస్తాన్ డొమినియన్ లోనో విలీనమగుటకు ఆగస్టు 14 వతేదీలోగా అంగీకారములు పంపవలసినదన్న వైస్రాయి హెచ్చరికలను పెడచెవిన పెట్టమని మహారాజ హరిసింగుని ప్రెరేపించెను. జమ్మూ కాశ్మీర రాజ్యము స్వతంత్రరాజ్యముగా నుండునని ఘోషించెను. వైస్రాయి మౌంటు బాటన్ స్వయముగా కాశ్మీరుకి సమావేశము చేయ రాగా తనకు అనారోగ్య కారణమువలన ఉపస్థితికాజాలనని తెలియచేసెను. మహాత్మాగాంధీ మహారాజుతో కలసి నచ్చచెప్పిన తరువాత ఆగస్టు 10 వతేదీన హరిసంగు తన ప్రధానమంత్రి కక్ ను పదవీ విముక్తిచేసి మేజర్ జనరల్ జనక్ సింగును ప్రధానమంత్రిగా నియమించెను. జమ్మూ కాశ్మీరు సంస్ధానమునతో stand still agreement చేసినయడల డొమినియన్లో చేరుటకు అంగీకరించెదమని ఆ కొత్త ప్రధాన మంత్రి రెండు డొమీనియన్లకు తంతి ద్వారా తెలియజేసెను. అందుకు భారత డొమీనియను అంగీకరించకపోగా పాకిస్థాన్ డొమినియన్ అందుకు అంగీకరించెను. ఆగస్టు 15 వ తారీకు తరువాతకూడా స్వదేశ సంస్థానముగనే యుండిన జమ్మూ-కాశ్మీర రాష్ట్ర వివరములు తెలుసకోవలసిన చరిత్రాంశములు.

స్వదేశ సంస్థానములు భారతడొమినీయన్లో విలీనమగటకు వైస్రాయి మౌంటుబాటన్ చేసిన కృషి[మార్చు]

ఆ కాలమునాటి వివిధ రాజకీయ నేతలందరితోకంటే నెహ్రూతో వైస్రాయి లార్డు మౌంటుబాటన్ సఖ్యముగనుండెననియూ నేహ్రూచేసే సూచనలకు సుముఖముగా స్పందించెననియూ, అనేక సమావేశములలోను, సన్నివేశములలోను నెహ్రూదే ఆఖరిమాటగా వైస్రాయి అంగీకరించియుండెనన్న సంగతి పరిచితమైన చరిత్రాంశమైనది. స్వదేశ సంస్థానాధీశులకు జూలై25 వతారీకున వైస్రాయి మౌంటుబాటన్ తన అధికార నివాసములో గొప్పవిందుభోజనముతో అధికార సమావేశముచేసెను. స్వదేశ సంస్థానాధీశులకు సానుకూలమైన షరతులనేకములను, వప్పందములను భారతడొమినియన్ ప్రభుత్వము వప్పుకొనక తప్పనిసరి అగునటుల తాను స్వాయన్న కృషిసలిపి చేసితిననియూ ఆ సందర్భములో అతను స్వదేశ సంస్థానాధీశులకు తెలియచేెసెను. విలంబనచేయక అతి త్వరలోనే తమ తమ అంగీకార పత్రములు దాఖలుచేయమనియూకూడా నచ్చచెప్పెను. చాలమంది స్వదేశ సంస్థానాధీశులా విందుభోజనములో పాల్గొనిరి. కానీ భోపాలు మరియూ ఇండొర్ నవాబులు పాల్గొనటకు తిరస్కరించిరి. అంతేకాక స్వదేశ సంస్థానముల విలీన విషయములో మౌంటుబాటన్ దొర స్వయాన్న ఆంగ్ల రాజు(6వ జార్జి) వంశీయుడగుటవలన అతను వ్యక్తిగతస్థాయిలో స్వదేశ సంస్థానాధీశులకు అభిమానపాత్రుడైయుండెను. భారతడోమినియన్లో విలీనమగుటకు సమ్మతి పత్రములను పంపమని అతను ప్రోత్సహించుటవలన చాలమంది సంస్థానాధీశులు తమ పత్రములను ఆగస్టు 15 వ తారీకులోపలనే పంపించినటుల తెలుయుచున్నది.[1]

భారతడొమినియన్లో విలీనమగుటకు ఆసక్తిచూపి ఇతర సంస్థానధీశులను ప్రోత్సాహపరచిన సంస్థానాధీశులు[మార్చు]

స్వాభిమానులైన చాలమంది సంస్థానాధీశులకు బ్రిటిష్ వారి చెప్పుచేతలకింద యుండుట సంకటముగయుండినది. బ్రిటిష్ పరిపాలననుండి ముక్తిపొందిన తరువతా పరిపాలనాధికారములు వహించిన కాంగ్రెస్సు అధినేతలైన నెహ్రూ ప్రభృతులతో చాలమంది సంస్థానాధీశులు అప్పటికే విభేదములుగలిగియుండిన సంగతి పరిచితమైన చరిత్రాంశము. అయినప్పటికినీ భారతదేశమునుండి బ్రిటిష్ సామ్రాజ్యము నిష్క్రమించి దేశానికి స్వాతంత్ర్యము కలుగుట గొప్ప అవకాశముగా కొందరు సంస్థానాధీశులు చూడగలిగియుండిరి. స్వతంత్ర భారతదేశము తమకు, తమ కుటుంబ సభ్యులకు రాజకీయముగనేకాక, సాంఘిక, వాణిజ్యావకాశములు కలిపించగలదన్నముందుచూపు, పురోగమనదృష్టి కలిగినట్టి ప్రముఖులైన ఆరుగురు సంస్థానాధీశులు 1947 ఆగస్టు 9 తేదీన ఒక ప్రకటన చేసియుండెను. గ్వాలియర్ సంస్థానాధీశుడు మహారాజసిందియా, ఫరీద్ కోట, భగత్ సంస్థానముల రాజులిద్దరు, భరత్ పూరు, ఆల్వారు, పన్నా సంస్థానముల మహా రాజులు ముగ్గురు. వీరు ఆరుగురు కలసి ప్రకటనచేసి సాటిసంస్థానాదీశులను ఢిల్లీలో సమావేశ పరిచి స్వతంత్రభారతదేశమున కల సదవకాశములు వివిరించి భారత,పాకిస్తాన్ డొమినియన్లలో వారి వారి స్థానములను బట్టి విలంబనచేయక విలీనమగుటకంగీకారములు తెలుపమని ప్రోత్సహించియుండిరి.[1]

పాకిస్థాన్ డొమీనియన్లో చేరవలసిన సంస్థానముల తీరు[మార్చు]

డొమీనియన్ లో స్వదేశ సంస్థానముల విలీనమునకు సంస్థానాధీశుల అంగీకార-స్వీకారముల గూర్చి నెహ్రూ- పటేల్ ప్రభుతృలకు కలిగియున్న ధ్యాన్నము పాకిస్థాన్ డొమీనియన్ లో జిన్నా చూపలేదని తెలియుచున్నది. పాకిస్థాన్ డొమీనియన్ లో నున్నట్టి క్వలత్ మరియూ భాహవల్పూరు స్వదేశ సంస్థానములతో చాల సులువుగనే వప్పందముల కలుగునని ఆతనికి ధైర్యమైయుండెను. కాని ఆ సంస్థానముయొక్క నవాబు తగువిధమైన కలత కలిగించింది. బలూచిస్థాన్ యొక్క పెద్ద భాగము ఆ క్వలత్ సంస్థానములో నుండియున్నదగటుయూ దానినానుకునియున్న ఆఫగనిస్థాన్ స్వతంత్రదేశముగ పరిగణించబడినటులనే తన సంస్థానముగూడ స్వతంత్రదేశముగ పరిగణింపవలెనని ఆ సంస్థానముయొక్క నవాబు అతని వాదన. భారతదేశములోని హైదరాబాదు నిజాంగారి సలాహాదారుడు గయుండిన మాంక్టన్ దొరే ఇతని సలహాదారుడనియూ, ఆ సంస్థానము పాకిస్థాన్లో విలీన అంగీకారము తెలుపుటకు చాల ఆలశ్యమైనదనియూ, హుంజా అను ఇంకో సంస్థానము పాకిస్థాన్లో కలయుట 1973 దాకా జరగనేలేదని తెలుయచున్నది.[1]

1947 ఆగస్టు తరువాత ఇండియా డొమినియనులో విలీనమైన స్వదేశ సంస్థానములు[మార్చు]

అఖండ భారతదేశమునువిభజించి రెండు దేశములుగా చేయుట నిశ్చయమైన తరువాత బ్రిటిష్ అధికారి సర్ ర్యాడ క్లిఫ్ ( Sir Cyril Radcliff) గీసిన విభజనగీత ప్రకారము పాకిస్తాన్ గా వచ్చిన భూభూగము ముస్లిమ్ లీగు అధినేత, మహ్మాద్ అలి జిన్నాహ కన్న కలలు నిష్ఫలము చేసింది. అధిక ముస్లిముల జనసంఖ్యయున్న రాష్ట్రములనన్నియు ఏకమొత్తముగా పాకిస్తాన్ గా అగునని అతడు కలలు కనియుండెను. అలా కాక అధికముగ మస్లిములున్న రాష్ట్రములను ర్యాడ క్లిఫ్ గీతలతో విభజించడం జరిగింది దాని ఫలితముగ తాను పరిపాలించబోయే పాకిస్తాన్ అనబడు దేశము చిన్న దేశమగుటయే గాక 18 శాతం దేశభాగము 56శాతం జనాభాతో తన రాజధానియగు కరాచికి 1500 మైళ్ల ఇండియా భూభాగాము దాటిన తరువాత తూర్పు పాకిస్తాన్(East Pakisthan) గానుండినది. అఖండ భారతదేశములోనుండిన అనేక స్వదేశ సంస్థానములలో అతి పెద్దవైన హైదరాబాదు నిజాం సంస్థానము, జమ్మూ కాశ్మీరు సంస్థానము స్వతంత్ర రాజ్యములుగనుందుమని ప్రకటించెను. ఆ సంస్థానములను పాకిస్థాన్ డొమినియన్లో చేరమని మహ్మదలి జిన్నాహ చాల కుతూహలముతో ఆసంస్థానాధీశులను వెంటాడి ప్రోత్సాహ పరచినా లాభంలేకపోవటవల్ల జమ్మూ-కాశ్మీరు సంస్థానములో రాజకీయ కుటిల చర్యలు చేపట్టెను. అనేక చరిత్రాధారములతో కొన్ని వివిరములు(క్రింద క్లుప్తముగా ఇవ్వబడెను) ప్రముఖ పత్రకారుడు దిలీప్ హిరో రచించిన పుస్తకము "ది లాంగెస్టు ఆగస్టు"లో చూడవచ్చును.[2]

ఆగస్టు 1947 తరువాత జమ్మూ-కాశ్మీరు సంస్థానము[మార్చు]

జమ్ము కాశ్మీరు సంస్థానము భారత డొమినియన్లో విలీనమగటకంగీకారము 1947 అక్టోబరు నెలాఖరు దాకా తెలుపలేదు. స్వదేశ సంస్థానములు తమ అంగీకారములను ఆగస్టు 14వ తేదీలోగా తెలుపవలెనను లక్ష్యమును వైస్రాయి మౌంటు బాటను నిర్ణియించియుండెను. అందుచేత కాంగ్రెస్సు అధనేతలు నెహ్రూ- పటేలు ప్రభృతుల కోరికపై మహాత్మా గాంధీ ఆగస్టు1 తేదీ కాశ్మీరు వెళ్ళి చర్చలు జరిపి అంగీకారము తెలుపమని నచ్చచెప్పి, అచ్చటి రాజకీయ విపక్షనేత షైక్ అబ్దుల్లాను నిర్భందమునుండి విడుదలచేయమని సలహానిచ్చిన తరువాత మహారాజ హరి సింగు అప్పటిదాకా ప్రధానమంత్రిగానుండి భారతదేశ జాతీయనాకులతో విభేదములుగల రామచంద్ర కక్ ను ఆగస్టు 10 వ తారీకున తొలగించి మేజర్ జనరల్ జనక్ సింగును నియమించెను. ఇతను తంతి ద్వారా ఇండియా పాకిస్థాన్ డొమీనియన్లకు stand still agreement చేయమని కోరియుండెను. అందుకు ఇండియా డొమినియన్ తిరస్కరించుట గొప్ప సదవకాశముగా తలచిన మహ్మాదలి జిన్నాహ జమ్మూ కాశ్మీరు రాజ్యము కనుక పాకిస్తాన్ డొమినియనులో విలీనమైనచో stand still agreement ఇచ్చుట కంగీకరించి యుండెను. అయినప్పటికినీ జమ్మూ-కాశ్మీరు మహారాజు హరి సింగు ముందుకు రానందున జిన్నాహకు రెండే మార్గములు తోచినవి. మహారాజుని వప్పించటము లేదా ఆ రాష్ట్రమందున్నముస్లిం కాన్ఫరెన్సు పార్టీ మరియూ వారితో పొత్తుగలిగి యున్న అజాద్ ఫౌజులన్న మాజీసైనికులు సభ్యులుగానున్న పార్టిని పురికొలిపి మహారాజు పై తిరుగబాటు సృష్టించుట. అందు మొదటి లక్ష్యముకాజాలని దగుటవలన రెండవ లక్ష్యసాధనకు బాధ్యత తన ప్రధానమంత్రి లియాఖ్వత అలి ఖాం (Liaquat Ali Khan) కి వప్పచెప్పియుండెను.

మహా రాజ హరి సింగు సమశ్యలు[మార్చు]

రెండవప్రపంచయుద్ద సమయమున అనేక వేలమంది జమ్ము కాశ్మీర సంస్థానపు యువకులను భారత సైనిక సిబ్బందిలో చేర్చుకునియుండిరి. వారి వారి దగ్గరయున్న ఆయుధములను ప్రభుత్వమునకప్పగించమని హెచ్చిరికచేయ బడెను. కానీ స్పందన లభించలేదు అంతేగాక ఆగస్టు 14 తేదీనుండి స్వతంత్ర పాకిస్తాన్ దేశపు జండాలు ఎగురవేయబడెను. పాకిస్థాన్ ఆవతరణ సందర్భముగా వేడుకలు జరుపుకొనిరి. జమ్మూ కాశ్మీరు లోని పూంచి-మీర్పూర్ పరగణాలలో పుట్టిన తిరుగుబాటు నణచుటకు మహారాజు తన సైన్యము నంపగా అచ్చట తిరుగుబాటు దారులైన కొద్దిమందిపైన కసితీర్చుటకు అమాయక మహ్మదీయుల గృహములు, గ్రామమములు తగులబెట్టుట, హతమార్చుట మొదలగు, సైనిక దుష్చర్యలు జరిగియుండెను. ఆ సంఘటనాంతరము అనేకవేల మహ్మదీయులు పశ్చమ పంజాబుకు వలసపోయిరి. మహారాజ హరి సింగు నిరంకుశత్వమును నిరసించిన కొందరి ముఠాలతో ముస్లిం కానఫరెన్సు రాజకీయ పార్టీ చేతులుకలపి మాజీ సైనికులు కలసియున్న అజాద్ ఫౌజ్ అను మరియొక పార్టీ నెలకొల్పబడింది. మాజీసైనికులైయుండిన ఆ పార్టీ శ్రీనగరుని ముట్టడించుటకు కుట్రలుపన్ని చుట్టుపక్కలనుండిన అడవి-కొండ జాతి ముఠాలను చేర్చుకునిరి. వారికి సైనిక తర్ఫీదుతో ఆయుధములు ఆయుధ సామగ్రీ సరఫరాచేసి వారికి సహాయ సహకారమిచ్చుటకు పాకిస్థాన్ ప్రదానమంత్రి లియాక్వత్ అలి ఖాం నేతృత్వములో పాకిస్థాన్ సైనికాధికారికి బాధ్యత ఇచ్చియుండెను. పూంచి పరగణాలలో జరిగినట్టి విద్రోహక చర్యలు వార్తాపత్రికలు ప్రకటించియుండిన చరిత్రాంశములైనవి. ఆ సంస్థానమునకు ఆఖరు బ్రిటిష్ ముఖ్య సైనికాధికారి మేజర్ జనరల్ స్కాట్. అతని తరువాత వచ్చిన ఆధికారి బ్రిగేడియర్ రాజీందర్ సింగు భారతదేశవైపు సానుభూతి గలవాడు. మహారాజు సెప్టెంబరు మాసములో పాకిస్తాన్ గవర్నర జనరల్ మహ్మద్ అలి జిన్నాహను కలుసుకొనుటకు నిరాకరించుటవల్ల హరిసింగుపై పాకిస్తాన్ అధికారుల వైషమ్యింకనూ వృధ్ది పొందెను. పాకిస్తాన్లోని పశ్ఛమ పంజాబునుండి కాశ్మీరుకు రవాణారాకపోకలు నిలుపివేయబడినవి. పెరుగుచున్న విద్రోహక చర్యలమధ్య, మహారాజ హరి సింగుకు తగిన సమర్ధన ముండవలెనన్నచో సంస్థానములో విపక్ష రాజకీయపార్టీ అగు నేషనల్ కానఫరెన్సుపై మహారాజు హరిసింగు సానుభూతిగ నుండినచో మహారాజుకు తగిన మదత్తు కలుగునని నెహ్రూ సలహా యిచ్చియుండెను. ఆ సలాహ ప్రకారము 1945 నుండి నిర్భందములో నుంచబడియున్న ఆ పార్టీ నాయకుడైన షైక అబ్దుల్లాను సెప్టెంబరు 29 న విడుదలచేశెను. అప్పటినుండి మహారాజు యొక్క సార్వభౌమత్వమును సిరసావహించిన షైక అబ్దుల్లా రాజ్యములోని విద్రోహక చర్యలనరికట్టుటకు కృతనిశ్చ యుడైయ్యను. అటుతరువాతనుండి జరిగిన షైక అబ్దుల్లా-నెహ్రూ చర్చలు జమ్మూ కాశ్మీరు సంస్థానము భారతదేశములో విలీనమగుటకు దోహదముచేశను. జమ్మూ కాశ్మీరులో పరాయిదేశపు వారు భూస్వాములు(జమీందారులు) కాకుండ భారతదేశ రాజ్యాంగములో సవరణచేయవలసినదని షైక్ అభ్దుల్లా నెహ్రూకి నొక్కివక్కాణించెను అక్టోబరు మాసము నుండి కాశ్మీరులో విద్రోహక చర్యలు అధికమై పరిస్థితులు విషమిస్తున్నవి. మహారాజు తన ప్రధాన మంత్రిని అక్టోబరు 15 తారీకు మరో సారి మార్చి భారతదేశమున న్యాదీశుడిగ చేసిన మెహర్ చంద్ మహాజన్ ను నియమించెను. పాకిస్థాన్లో విలీనమవమని వెంటాడుతున్న పాకిస్తానీ అధికారిని శ్రీనగరులోనుండివెడలమని కొత్త ప్రధానమంత్రి ప్రభుత్వ ఉత్తర్వులు చేసియుండెను. జమ్ము- కాశ్మీరు సంస్థానముయొక్క ప్రభుత్వ యంత్రాంగము యుండిన పట్టణం, శ్రీనగర్.

ర్యాడ్ క్లిఫ్ గీతను తుడిచిపెట్టుటకు ప్రయత్నించిన పాకిస్ధాను[మార్చు]

విద్రోహక చర్యలు చేసి మహారాజ హరి సింగును కూలద్రోయు ప్రయత్నములు అచ్చటి ఆందోళనకారులైన అజాద్ ఫౌజు సభ్యులద్వారానే కాక పాకిస్థాన్ లోనుండిన ముస్లిం నేషనల్ గార్డు లనబడిన మాజీ సైనికుల వ్యవస్థ ద్వారాకూడా చేయబడియుండెను. అక్టోబరు నెలలో జమ్మూ-కాశ్మీరు సంస్థానములో నుండిన ఉత్తర పశ్చమ ఫ్రంట్ పరగణాలలో విద్రోహక చర్యలు ఉదృతము చేయుటకు ప్రేరేపింపబడినట్లు చరిత్రాంశములు కనబడుచున్నవి. 1947 అక్టోబరు మధ్యనాటికి పూంఛ్ మీర్పూరు పరగణాలలో చాల భాగము అజాద్ ఫౌజుదార్ల అధీనములోనుండినది. ముజఫరాబాదులో మహ్మదీయేతరులు లేకుండా తరిమి కొట్టబడిరి. ర్యాడ్ క్లిఫ్ గీత దాటి ఇండియా డొమినియన్లోకి చొచ్చుకుచ్చిన పాకిస్తాన ఆక్రమణనరికట్టి వెనుకకు మళ్లమన్న జమ్ము-కాశ్మీరు ప్రభుత్వపు ఆరోపణకు మహ్మదాలి జిహన్నా అది వివాదస్పదమైన ఆరోపణమనియూ బయటివారిచేత విచారించుట ఉచితమని పేర్కోనియుండెను. అట్టి పాకిస్థాన్ ఆక్రమణలనరికట్టని పరిస్థితులలో తాను ఇండియా డొమినియన్ సైనిక సహాయము కోరవలసియున్నదని ప్రధానమంత్రి మహాజన్ అక్టోబరు 18న చేసిన తంతికి మహ్మదలి జిన్నాహ ప్రధానమంత్రిని చర్చనిమిత్తము కరాచికి పంపమనియూ, జమ్ము-కాశ్మీరు సంస్థానము ఇండియా డొమినియన్లో చేరుటకు ఇదివక నెపమని ఆరోపించుతూ మహారాజు హరిసింగుకు జవాబు పంపెను. అక్టోబరు 20 తారీకున జిన్నాహకు తెలుపకనే పాకిస్తానీ సైనికులను అబొతాబాదు నుండి తూర్పు కాశ్మీరుకు కదలించుట, మహారాజు గారి సైనికులు పశ్చమ పంజాబులోని గ్రామములపై దాడి జరిపి ప్రాణనష్టముకలింగించుట జరిగియుండెను. అబొతాబాదు నుండి బైయలుదేరిన పాకిస్తానీ సైన్యము మెజర్ అన్వర్ నాయకత్వములో అక్టొబరు 22 వ తారీకునాటికి ముజఫరాబాదు, యూరీ, బారముల్లా గుండా శ్రీనగరును ముట్టడి చేసి బనిహల్ కనుమల నాక్రమించి ఇండియా నుండి జమ్మూకాశ్మీరు రాజ్యము నకువచ్చు రహాదారి మార్గములకు గతిరోధము కలిపించిరి. మహారాజుగారి సైనికులు బారముల్లాలో పాకిస్తాని సైనికులనెదుర్కోని పోరాడిరి. కొంతవరకు అడ్డుకునగలిగిననూ, వెనుకకు త్రోలుటలో విఫలమై యూరీలో తలదాచుకునిరి. జమ్మూ-కాశ్మీరు సంస్థాన చరిత్రలో 1947 అక్టోబరు నెలలో మరువాని చరిత్రాంశములు కొన్ని తెలుసుకొనదగినవి

విద్రోహక చర్యలనరికట్టటకు మహారాజు విఫలప్రయత్నం : 1947 అక్టోబరు 24వతారీకున పాకిస్థాన్ సైనిక సహాయముతో జరిగిన శ్రీనగరు ముట్టడిని అరికట్టుటలో మహారాజుగారి సైన్యము పూర్తిగా విఫలమై హతమార్చబడింది. అజాద్ ఫౌజుదారుల ఆక్రమణలోనుండిన పూంచి-మీర్పూరు పరగాణలను అజాద్ జమ్మూ-కాశ్మీరు (అజాద్ కాశ్మీరు) అను స్వతంత్ర దేశముగా ఘోషించి పలందూర్ కేంద్రముగా స్వతంత్రపరిపాలనకు ముస్లిం కాన్ఫరెన్సు పార్టీ సభ్యుడైన మహ్హమద్ ఇబ్రహీం ఖాంను అధ్యక్షతన ప్రభుత్వమును నెలకొల్పిరి. అదే రోజున జమ్మూ-కాశ్మీరు సంస్థానముయొక్క ఉపప్రధానమంత్రి, బాత్ర న్యూఢిల్లీ చేరుకుని ఆ విద్రోహక చర్యల నరికట్టుటకు ఇండియాడొమినియన్ సైనిక సహాయముకోరిన అధికార పత్రములను నెహ్రూ, వల్లభ్బాయి పటేల్ కు అందజేసెను.

సైన్యమును శ్రీనగరు పంపిచుటకు గవర్నరు జనరల్ నిరాకరణ: 25వతారీకున సమావేశమైన డిఫెన్సు కమిటీ అధ్యక్షుడైన గవర్నర్ జనరల్ మౌంటుబాటన్ స్వతంత్ర రాజ్యముగా నుండిన జమ్మూ కాశ్మీరుకు పరాయిదేశము సైన్యమును పంపుట ఉచితముకాదని నిర్ణయించిరి. జమ్మూ కాశ్మీరు సంస్థానము ఇండియా డొమినియన్లో విలీనమగుటకు మహారాజ హరిసింగు అంగీకార పత్రమును పొందుటకు ముందుగా ఉన్నతాధికారుల బృందం వి. పి మినాన్ నుతో పంపిచబడెను. అప్పటికే శ్రీనగరు పట్టణంలోకి అజాద్ కాశ్మీరు ముఠాలు చేరుకుని విజయోత్సవవేడుకల జరుపుకొనుచుండిరి. మహారాజ హరిసింగు శ్రీనగరులో నుండుట అపాయకరమని 26వ తారీకున జమ్మూకి చేర్చిరి. ఆ రోజున బారముల్లాలో ముస్లిమ్ నేషనల్ గార్డు సభ్యులు స్వదేశపు అజాద్ ఫౌజుదారులతో చేయి కలిపి చేసిన దుశ్చర్యలు, లూటిలు, బ్రిటిష్ అధికారి కర్నల్ డైక్ ను అతని భార్యతో సహ హత్యచేయుట వందాలది అసహాయ స్త్రీల మానభంగముచేయుట హిందూ మహ్మదీయులని తేడాలేకుండా విచ్చలవిడిగా చేసిన అమానుష చర్యలు, చెప్పరాని ఘోరములు చరిత్రలోకెక్కినవి. కాశ్మీరులో జరిగిన ఘోరకృత్యములు తెలుసుకున్న ఇండియా డొమీనియను ప్రభుత్వము సైన్యమునంపుటకు గవర్నర్ జనరల్ మౌంటు బాటన్ నిరాకరించెను. జమ్మూ కాశ్మీరు మహారాజు హరి సింగు విలీన అంగీకారము దాఖలు చేయువరకూ సైన్యమును పంపరాదనెను. అంతే కాక మహారాజు అంగీకారముతీసుకున్న తరువాత రాష్ట్రములో శాంతిభద్రతలు నెలకొన్న తరువాత ప్రజలతీర్మానము (ప్లెబిసైట్) ప్రకారము నడువలెనని తన నిర్ణయమును వెల్లడి చేసెను.

జమ్మూ కాశ్మీరు సంస్థానమును ఇండియా డొమీనియన్లో విలీనముచేయుటకు మహారాజు హరిసింగు అంగీకారము: అదేరోజు జమ్ము వెళ్లిన వి. పి. మినాన్ కు ఇండియా డొమినియన్లో జేరుటకు మహారాజ హరి సింగు 1947 అక్టోబరు 26న తన అంగీకార దస్తావేజు అందజేసెను. శాంతి భద్రతలు రాష్ట బాధ్యతగా నుండునన్న షరత్తు అంగీకార పత్రములో పేర్కోనబడియుండెను. గవర్నర్ జనరల్ కు సమపర్పించిన ఆ అంగీకార దస్తావేజుతో పాటు జమ్మూ కాశ్మీరు రాష్ట్రమున షైక్ అబ్దుల్లా ప్రభుత్వము నెలకొల్పుటకు నియమించినటుల తన నిర్ణయము కూడా తెలిపెను.

శ్రీనగరు చేరుకున్న భారతదేశపు సైన్యము: రక్షణ మంత్రి బల్దెవ సింగు ఉత్తర్వులు ప్రకారము భారతసైనిక దళములు వాయుమార్గమున అక్టోబరు 27 తారీకుపొద్దున్న శ్రీనగరు విమానాశ్రయము ప్రవేశించి పరిస్థితులు అదుపులోకి తీసుకుని అక్టోబరు 31 నాటికి అజాద్ కాశ్మీరు సైనికులను శ్రీనగరు బయటకు తరిమివేయబడిరి. ఆ సమచారముతెలుసుకున్నతరువాత పాకిస్తాన్ గవర్నర జనరల్ మహ్మదలీ జిన్నా తన సైనికాధికారి జనరల్ ఫ్రాంక్ మెస్సెర్వికి పాకిస్తానీ సైన్యమును శ్రీనగరు తరలించమని ఉత్తర్వులుచేసెను. కాని పాకిస్తాని సైన్యాధక్షుడు ఆ ఉత్తర్వులను సిరసావహించుటకు నిరాకరించెను. ఢిల్లిలోనుండిన ఫీల్డు మార్షల్ అచిన్లెక్ కమాండులో క్రింది అధికారియైయిన మెస్సెర్వి ఒకే కమాండులో నుండిన సైనికాధికారులు రెండు వైపులా పోరాడుట యుద్దనీతికి విరధ్దమనియూ అదీకాక ఇండియా డొమీనియన్లో విలీనమైనతరువాతనుండి జమ్మూ కాశ్మీరు రాజ్యము స్వతంత్రరాజ్యము కాదనియు అచ్చటి రక్షణ పరిస్థితులకొరకు సైనిక బలగమునంపుట ఇండియా డొమినియన్ హక్కనియూ అట్టి స్థితిలో పాకిస్తాన్ సైన్యమునంపుట చట్ట విరుధ్దమనియు తన నిరాకరణకు కారణములుగా తెలిపెను. అట్టి న్యాయ విరుధ్దమగు జిన్నాహ ఉత్తర్వులును అమలుచేయవలసినచో తాను తన యావత్తు బ్రిటిష్ సైనిక బలగమును పాకిస్తాన్ సైన్యమునుండి ఉపసంహరించుకుని బ్రిటన్ కి పోవలసిన పరిస్థితి కలుగనని పాకిస్తాన్ సైనికాధికారి చేసిన తిరుగు హెచ్చరికతో పాకిస్తాన్ గవర్నరు జనరల్ జిన్నా ఏమియును చేయలేక ఉక్రొషముచే రాజకీయ మెలికలు సృష్టించెను .
ఇండియా డొమినియన్లో జమ్మూ-కాశ్మీరు విలీనము గుర్తించమన్న పాకిస్థాను: జమ్మూ కాశ్మీరులో జరుపవలసిన ప్రజాభిప్రాయ నిర్ణయము (PLEBISCITE) ను గురించి 1947 అక్టోబరు 30 తేది మౌంటుబాటన్- జిన్నాహల సమావేశము జరిగియుండెను. షేర్ ఎ కశ్మీరు అని ప్రసిధ్ది చెందిన షైక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీరు రాష్ట్రమునకు ప్రథమ ముఖ్యమంత్రిగ నైయ్యెను. జమ్మూ కాశ్మీరులో ప్రజాభిప్రాయము (PLEBISCITE) అంతర్జాతీయుల పర్యవేక్షణలో చేయబడునని ఇండియా డొమానియన్ ప్రధాన మంత్రి నవంబరు 2న ప్రకటించెను. పాకిస్తాన్ ప్రధానమంత్రి తన ప్రకటనలో ఇండియా డొమీనియన్లో జమ్మూకాశ్మీరు విలీనము అన్యాయపురీతిగ జరిగినదనియూ తమచే గుర్తింపు పొందబోధని ప్రకటించెను.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 “PARTITION” Barney White-Spunner(2017)Simon & Schuster India,New Delhi pp210-245
  2. 2.0 2.1 "The Longest August" Dilip Hiro (2015) Nation Books pp59,79,98
  3. 3.0 3.1 3.2 "The British Rule in India" దిగవల్లి వేంకట శివరావు(1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp 18-56
  4. 4.0 4.1 "స్వదేశ సంస్థానములు" దిగవల్లి వేంకట శివరావు (1948) ప్రభాతము
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-12. Retrieved 2018-04-06.