భక్త కన్నప్ప
భక్త కన్నప్ప నాయనార్ | |
---|---|
జననం | తిన్నడు c. 3102/3101 BCDDDE |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భక్త కన్నప్ప |
భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.[1][2]
ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి రక్తం కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే (కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము
కథ
[మార్చు]కన్నప్ప తెలుగు వాడు.. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. తిన్నడికి నాగడు సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడ - కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు.
ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి, చెట్టుముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు, దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖీనదీ తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కన్పించాయి.
తిన్నడికి ఆ పర్వతమెక్కి - గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు (పిలకవున్న దేవుడు) అని నాముడు చెప్పాడు. కాముడు పందిని వచనము చేయ మొదలుపెట్టాడు. ఆ కొండఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందెన్నడు తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వ జన్మసంస్కార ఫలితము. తన మీదనుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లనిపించసాగింది..దేహస్పృహకూడా మందగించసాగింది.. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు..ముద్దులు గుమ్మరించాడు..ఆనందబాష్పాలు రాలటంతో, శివునితో ' ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రీ ఆకలిగా ఉందేమోకదా నీకు..ఉండు ఆహారం తీసుకువస్త్తాను' అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక, వెళ్ళలేకపోయాడు...చివరికి శివుని ఆకలిదీర్ఛుటకు వెంటనే కొండదిగాడు. కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. 'నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నదినుండి నోటినిండా నీళను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తనతలమీద వుంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో వుంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తలమీద వున్న పూలతో శివుని అలంకరంచాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చినపందిమాంసమును దేవునిముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు... ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథున్ని కదిలించింది.... మరునాడు ప్రొద్దున మళ్లీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్లలేదు.
తిన్నడు దేవునికాహారము సేకరించటానికి వెళ్ళగా, ఆలయ అర్చకుడు సివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు, నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్ఛకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ్ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు. పూజారి వెళ్లగానే, తిన్నడు మళ్లీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈవిధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఈక ఉండబట్టలేకపూయాడు. రోదిస్తూ పరమశివుని ప్రార్థంచాడు. "ఈ ఘోరకలిని ఆపుస్వామి..." అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తిప్రపత్తులను చూపదలచాడు. అర్చకునకు కలలో కనిపించి "నీవు లింగము వెనుక దాగి యుండు. బయటకు రాక అక్కడ ఏమిజరుగబోతోందో గమనించు" అని ఆదేశించాడు.
ఆరవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరుగగలదా అని తనని గూర్చి మరచిపోయాడు. గుదికి పరుగెత్తి వెళ్ళాడు. వెళ్లిచూడగానే - శివుని కుడికన్ను నుండి రక్కము బయటకి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికావైద్యం చేశాడు. కాని రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది. 'కన్నుకు కన్ను' సిద్ధాంతముగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యము చేస్తుండగానే - ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి - తన ఎడమ కన్నును పెకళించబోయాడు.
పరమ శివుడు వెంటనే ప్రత్యక్షమయి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. " నిలువుము కన్నాప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల ఆంతర్యము కన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగించినది నీవొక్కడివే కన్నప్పా! " అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్పా అని మూడుమారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట.
తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము. శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసొకొని ప్రక్కకు చేర్ఛుకున్నాడు. కన్నప్పకు చూపువచ్చింది. సాక్షాత్తూ శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తితత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలువ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నంచేసుకున్నాడు. ఈ భక్తిసామ్రాజ్యరారాజు..ఒక్క శైవులకే కాదు.. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]నాగడికి తిన్నడు విద్యలు నేర్పి రాజుని చేశాడని వ్రాశారు. తప్పుకదా! నాగడు తిన్నడికీ సకలవిద్యలూ నేర్పి రాజుని చేశాడు అని ఉండాలి.సరిదిద్దగలరు.
మూలాలు
[మార్చు]- ↑ Michell, George (2013). Southern India: A Guide to Monuments Sites & Museums. Roli Books Private Limited. ISBN 81-7436-903-1.
- ↑ E, Desingu Setty (1990). The Valayar of South India: Society and religion. Inter-India Publications. ISBN 81-2100-237-0.