Jump to content

భగవద్గీత-జ్ఞాన యోగము

వికీపీడియా నుండి
భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక


జ్ఞాన యోగము, భగవద్గీతలో నాలుగవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

జ్ఞాన యోగం

ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు, మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు. కాని కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది.

అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు. మరి మనము ఇప్పటి వాళ్లము. నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను.

ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ప్రతి యుగంలోను నేను అవతరిస్తాను.

ఈ విధంగా తెలుసుకొన్నవాడు, రాగ, ద్వేష, క్రోధ, భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మ ఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు.

గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆకర్తను, అవ్యయుడను. నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు. ఏ కర్మలు చేయాలో, ఏవి చేయకూడదో చెప్తాను విను.

కర్మ, అకర్మ, వికర్మ అని మూడు రకాలు. కర్మగతి గాఢమైనది. కర్మలలో ఆకర్మలను, ఆకర్మలలో కర్మలను చూసేవాడు, ఫలాపేక్ష రహితుడు, కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలేనివాడు, జయాపజయాల పట్ల సమబుద్ధిగలవాడు, సందేహ రహితుడు, ఈర్ష్యా రహితుడు బంధాలలో చిక్కుకోడు.

ఈశ్వర ప్రీతిగా మాత్రమే కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు. ఇవ్వబడునది, ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.

కొందరు ఆత్మను ఆత్మ యందె, ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో, మరికొందరు వాయు గమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని, ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.

ద్రవ్యరూప యజ్ఞాన్ని, వ్రతరూప తపోయజ్ఞాన్ని, ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని, వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశేషం అమృతం లాంటిది. యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి. అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే.

తత్వవేత్తలను వినయముతో సేవించి, ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నా వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు. మోహానికి గురికావు. ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్ని వలె, కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు. కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు. శ్రద్ధజ్ఞానాలు లేనివారు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేని వాడు చెడిపోతారు. ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకోన్నవాడిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానం చే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు. లే.