Jump to content

భారత ఇండోనేషియా సంబంధాలు

వికీపీడియా నుండి
భారత ఇండోసేషియా సంబంధాలు

భారతదేశం
ఇండోసేషియా
దౌత్య కార్యాలయం
జకార్తాలో భారత ఎంబసీన్యూఢిల్లీలో ఇండోనేషియా ఎంబసీ
రాయబారి
ఇండోనేషియాకు భారత రాయబారిభారతదేశంలో ఇండోనేషియా రాయబారి
సుకర్ణో, జవహర్‌లాల్ నెహ్రూలు - ఇందిరా గాంధీ, మెగావతి సుకర్ణోపుత్రి, గుంటూర్ సుకర్ణోపుత్రలతో. భారత ఇండోనేషియా సంబంధాలు మొదటి నుండి సౌహార్దంగా, స్నేహపూర్వకంగా ఉన్నాయి.

భారతదేశం, ఇండోనేషియా 1949 ఏప్రిల్ 16న దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి.[1] భారతదేశం 1946 సెప్టెంబరు 2న ఇండోనేషియా స్వాతంత్ర్యాన్ని గుర్తించింది.[2] ఈ రెండూ ఇరుగుపొరుగు దేశాలు -భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం వెంబడి ఇండోనేషియాతో సముద్ర సరిహద్దును పంచుకుంటాయి.

భారత-ఇండోనేషియా సంబంధం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. 1950లో, ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో, వలస శక్తుlu "విచ్ఛిన్నం" చేయటానికి ముందు "1000 సంవత్సరాలకు పైగా" రెండు దేశాల మధ్య ఉన్న "స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని" ఇండోనేషియా, భారతదేశాల ప్రజలకు పిలుపునిచ్చాడు.

భారతదేశానికి జకార్తాలో రాయబార కార్యాలయం ఉంది. ఇండోనేషియాకు ఢిల్లీలో రాయబార కార్యాలయం ఉంది.[3] భారతదేశం ఇండోనేషియాను ఆగ్నేయ ఆసియా సమాఖ్య (ASEAN) లో కీలక సభ్యదేశంగా పరిగణిస్తుంది. రెండు దేశాలూ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. రెండు దేశాలకూ గణనీయమైన ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది.[4]

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం, ఇండోనేషియాలు ఉన్నాయి.[5] రెండూ G-20, E7 (దేశాలు), BRICS, అలీన ఉద్యమం, ఐక్యరాజ్యసమితి లలో సభ్యదేశాలు.

2013 బిబిసి వరల్డ్ సర్వీస్ పోల్ ప్రకారం, 51% ఇండోనేషియన్లు భారతదేశ ప్రభావాన్ని సానుకూలంగా చూస్తూండగా, 21% మంది ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.[6]

చరిత్ర

[మార్చు]

పురావస్తు శాస్త్రం

[మార్చు]

బాలిలోని సింబెరాన్ ప్రదేశంలో, దక్షిణ భారత దేశానికి చెందిన రౌలెట్ సామాను లభించాయి. కార్బన్ డేటింగ్‌ ప్రకారం ఇవి, సా.పూ. 660 (+/- 100) కాలానివని తేలింది. బాలి ద్వీపంలో, ఇండోనేషియన్లు, భారతీయుల మధ్య జనాభా మార్పిడి, అంతర్వివాహాలూ సా.పూ. రెండవ శతాబ్దం నాటికే జరిగేవని తేలింది.[7]

మతపరమైన సంబంధాలు

[మార్చు]
భారత ఉపఖండం నుండి ఆసియా అంతటా ముఖ్యంగా ఆగ్నేయాసియాలో హిందూమత విస్తరణ. సుమారు 1వ శతాబ్దంలో ఆగ్నేయాసియాలో తొలి హిందూ స్థావరాలు స్థాపించడంతో మొదలైంది.

ఇండోనేషియా, భారతదేశాల మధ్య సంబంధాలు రామాయణం కాలం నాటివి.[8] భారతదేశపు తొలి ఇతిహాసం రామాయణంలో "యవద్వీప" (జావా) ప్రస్తావన ఉంది. రాముడి సైన్యాధిపతి సుగ్రీవుడు సీతను వెతుక్కుంటూ తన మనుషులను యవద్వీపానికి పంపాడు. ప్రాచీన కాలం నుండీ భారతీయులు ఇండోనేషియాను సందర్శిస్తున్నారు. ప్రాచీన ఇండోనేషియన్లు (ఆస్ట్రోనేషియన్ ప్రజలు) ఆగ్నేయాసియా సముద్రాలు, హిందూ మహాసముద్రంలో సముద్ర వాణిజ్యాన్ని ప్రారంభించారు. ప్రాచీన భారతీయులు హిందూ మతాన్ని, సంస్కృతం, బ్రాహ్మి లిపితో సహా భారతీయ సంస్కృతిలోని అనేక ఇతర అంశాలను వ్యాప్తి చేశారు. ఇండోనేషియా భాషలలోని అనేక సంస్కృత అరువు పదాలలో భారతీయ ప్రభావాల జాడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇండోనేషియా అనే పేరు లాటిన్ భాషలోని "ఇండియా" అనే అర్థం వచ్చే "ఇండస్", గ్రీకు భాషలోని "నీసోస్" (అంటే "ద్వీపం") ల నుండి వచ్చింది.[9] ఈ పేరు 18వ శతాబ్దానికి చెందినది, స్వతంత్ర ఇండోనేషియా ఏర్పడటానికి చాలా కాలం ముందు నుండి ఉంది. శ్రీవిజయ యుగంలో, చాలా మంది ఇండోనేషియన్లు భారతదేశంలోని నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.[10]

భారతదేశం నుండి పల్లవ లిపి, సంస్కృత భాషను స్వీకరించిన తర్వాత ఇండోనేషియా తన చారిత్రక కాలంలోకి ప్రవేశించింది. ఇండోనేషియాలోని ప్రాచీన రాజ్యాలైన కుటై యుపా, తరుమనగర తుగు ల కాలం నాటి శాసనాల నుండి, కళింగ్గ చారిత్రక రికార్డుల నుండి లభించిన ఆధారాలను బట్టి ఇది తెలుస్తోంది. శ్రీవిజయ, మేడాంగ్, సుండా, మజాపహిత్ వంటి భారతీయీకరించబడిన హిందూ - బౌద్ధ రాజ్యాలు ఇండోనేషియాలో ప్రధానమైనవి. సా.శ. 200[11] నుండి 16వ శతాబ్దం వరకు ఇవి కొనసాగాయి. చిట్టచివరిది బాలిలో ఉంది.

చారిత్రాత్మక భారతీయ సాంస్కృతిక ప్రభావం: గ్రేటర్ భారతదేశంలోని భారతీయ హిందూ-బౌద్ధ రాజ్యాలు ఇండోనేషియా ( శ్రీవిజయ, మజాపహిత్, కళింగ, కుటై, సింఘాసరి, తరుమనగర, పాన్ పాన్), ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో ( చంపా, ద్వారవతి, ఫునాన్, గంగాంకా నెగరా, ల్యాంగన్ చెలాక, ల్యాంగ నెగరా ) విస్తరించాయి.

రామాయణం, మహాభారతాలు ఇండోనేషియా సంస్కృతి, చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. నేటికీ ఇండోనేషియన్లలో ఇవి ప్రసిద్ధి చెందాయి. జావాలోని ప్రంబనన్ బహిరంగ థియేటర్లలో, జావానీస్ ముస్లింలు పౌర్ణమి రాత్రులలో రామాయణ నృత్యం చేస్తారు. ఇండోనేషియా చరిత్రలో లోతైన హిందూ-బౌద్ధ ప్రభావానికి ఉదాహరణ, తొమ్మిదవ శతాబ్దపు బోరోబుదూర్, ప్రంబనన్ దేవాలయాలు. ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా, రెండు దేశాల మధ్య సంబంధం బలంగా ఉంది; భారతదేశంలో ముస్లింలు గణనీయమైన జనాభా ఉన్నందున మాత్రమే కాదు. ఇండోనేషియా ఇస్లామిక్ వాస్తుశిల్పం, ముఖ్యంగా సుమత్రాలో, భారతీయ మొఘల్ వాస్తుశిల్పం ద్వారా లోతుగా ప్రభావితమైంది. ఇది ఆషేలోని బైతుర్రహ్మాన్ గ్రాండ్ మసీదు, మెడాన్ లోని గ్రేట్ మసీదులో స్పష్టంగా కనిపిస్తుంది.

సాంస్కృతిక అభిమానం ఏకపక్షంగా ఉండదు, భారతీయులు కూడా ఇండోనేషియా సంస్కృతికి, ముఖ్యంగా హిందూ బాలినీస్ సంస్కృతికి దగ్గరగా ఉంటారు. 1927లో జావా, బాలి పర్యటన సందర్భంగా, భారతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్, బాలి పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. "ద్వీపంలో ఎక్కడికి వెళ్ళినా, నాకు దేవుడు కనిపిస్తాడు" అని అన్నాడు. 23 సంవత్సరాల తరువాత 1950 లో, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బాలిని "ప్రపంచపు ఉదయం"గా ప్రశంసించాడు.[12]

భారతదేశం, ఇండోనేషియాలు అధికారికంగా 1951 మార్చి 3న స్నేహ ఒప్పందంపై సంతకం చేశాయి.[13] 1955లో అలీన ఉద్యమాన్ని స్థాపించిన ఐదుగురిలో, భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణోలు ఉన్నారు.

1965 లో భారత పాక్ యుద్ధ సమయం మినహా, భారత ఇండోనేషియా సంబంధాలు చాలావరకు సామరస్యపూర్వకంగాను, శాంతియుతంగానూ ఉన్నాయి. ఆ సమయంలో, ఇండోనేషియా పాకిస్తాన్‌కు సైనిక సహాయం అందించడానికీ, కాశ్మీర్ ఫ్రంట్ నుండి భారత దృష్టిని మళ్లించడానికీ భారతదేశం లోని 'అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనం చేసుకోవడానికి' ముందుకొచ్చింది, చివరికి పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి జలాంతర్గాములను సమీకరించింది. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు ఒప్పందం 1977 జనవరి 14న న్యూఢిల్లీలో కుదిరింది.[14]

1950లో జరిగిన భారత వార్షిక గణతంత్ర దినోత్సవ కవాతుకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2011 లో, అధ్యక్షుడు సుసిలో బాంబాంగ్ యుధోయోనో అదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[5]

వ్యూహాత్మక భాగస్వామ్యం

[మార్చు]
2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

చారిత్రిక సాంస్కృతిక సంబంధాల ద్వారా ఐక్యమైన భారతదేశం, ఇండోనేషియాలు, జాతీయ సముద్ర భద్రత, వాణిజ్య అనుసంధానం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశ దక్షిణాన ఉన్న అండమాన్, నికోబార్ దీవులు ఇండోనేషియాలోని ఆషే ప్రావిన్స్‌కు దగ్గరగా ఉన్నాయి, ఇది ఒక ముఖ్యమైన ప్రపంచ వాణిజ్య మార్గం. 2018 మేలో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియాను సందర్శించినప్పుడు "ఇండో పసిఫిక్‌లో సముద్ర సహకార భాగస్వామ్య విజన్" ఒప్పందంపై సంతకం చేశారు. తదనంతరం, భారత నావికాదళం, ఇండోనేషియా నావికాదళం 2018 నవంబరు నుండి జావా సముద్రం, అండమాన్ సముద్రంలో ద్వైపాక్షిక "సముద్ర శక్తి" నావికా విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 2002 "ఇండ్-ఇండో కార్పాట్" ఒప్పందం తర్వాత ఈ రెండు నావికాదళాల మధ్య కార్యాచరణను ఈ కసరత్తులు గణనీయంగా పెంచుతాయి. భారతదేశం, ఇండోనేషియా సబాంగ్ డీప్ సీ పోర్టును కూడా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత భారత నావికాదళ నౌకలు ఈ ఓడరేవును క్రమం తప్పకుండా సందర్శిస్తున్నాయి. అనేక భారత నావికాదళ నౌకలు నావికా విన్యాసాలు, ఇండోనేషియా సందర్శనలను చేపట్టాయి.

2011 జనవరి 25 న, భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బాంబాంగ్ యుధోయోనో ల మధ్య చర్చల తర్వాత, భారతదేశం, ఇండోనేషియాలు బిలియన్ల డాలర్ల విలువైన వ్యాపార ఒప్పందాలపై సంతకం చేశాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.[15]

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన 9వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం. 6వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో యుధోయోనో .

2009 అక్టోబరులో యుధోయోనో, రెండవ యునైటెడ్ ఇండోనేషియా క్యాబినెట్‌ను ప్రకటించాడు. ఆ సంవత్సరం ప్రారంభంలో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. యుధోయోనో రెండవ క్యాబినెట్‌లో ఉపాధ్యక్షుడు డాక్టర్ బోడియోనో. యుధోయోనో మొదటి మంత్రివర్గంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జుసుఫ్ కల్లా స్థానంలో బోడియోనో నియమితులయ్యారు.

ఇండోనేషియా సభ్యదేశంగా ఉన్న ASEAN తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశం ఇండోనేషియాతో మరింత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.[16]

2015 నాటికి రెండు దేశాలు 25 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి, ఇండోనేషియాలో భారత పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు చేరాయి.[4]

2025లో, పామాయిల్ వాణిజ్యంలో పెరుగుదలతో భారతదేశం - ఇండోనేషియా ఆర్థిక సంబంధాలు మరింత బలపడ్డాయి. భారతదేశం దిగుమతి సుంకాలను తగ్గించిన తరువాత, ఇండోనేషియా భారతదేశానికి చేసే పామాయిల్ ఎగుమతులు 5 మిలియన్ టన్నులను మించిపోతాయని అంచనా వేస్తోంది. 2024 లో ఇది 4.8 మిలియన్ టన్నులు. 2025–26 నాటికి పామ్ సాగును 1 మిలియన్ హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జాతీయ వంటనూనెల మిషన్-ఆయిల్ పామ్‌ కు మద్దతుగా ఇండోనేషియా 1,00,000 మొలకెత్తిన పామ్ విత్తనాలను కూడా సరఫరా చేస్తోంది. సహకారాన్ని బలోపేతం చేయడానికి, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, స్థిరమైన పామాయిల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి - రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, వ్యవసాయ సహకారాన్ని ప్రతిబింబిస్తూ - ఇండోనేషియా పామ్ ఆయిల్ కౌన్సిల్ (IPOC), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) లు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి.[17]

సంస్కృతి

[మార్చు]
ఉబుద్‌లోని సరస్వతి తోటలో ప్రదర్శించబడిన బాలినీస్ రామాయణ నృత్య నాటకం .

చారిత్రికంగా, ఇండోనేషియా ద్వీపసమూహం భారతదేశ ధార్మిక నాగరికత ద్వారా బాగా ప్రభావితమైంది. ఉదాహరణకు, ఇండోనేషియా నృత్య నాటక సంప్రదాయాలలో - ముఖ్యంగా జావా, బాలిలలో - రామాయణం ఒక ప్రధాన ఇతివృత్తం.

ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇండోనేషియా ప్రజలలో, ముఖ్యంగా మధ్యతరగతి నుండి దిగువ తరగతి ప్రజలలో, హిందూస్థానీ సంగీతాల ప్రభావాన్ని ప్రదర్శించే ప్రసిద్ధ ఇండోనేషియా డాంగ్‌డట్ సంగీతం ప్రాచుర్యంలో ఉంది. బాలీవుడ్ సినిమాలు, సంగీతం కూడా ఇండోనేషియాలో ప్రాచుర్యం పొందాయి.[18] ఇండోనేషియాలో భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, జవహర్‌లాల్ నెహ్రూ భారతీయ సాంస్కృతిక కేంద్రాన్ని 1989లో జకార్తాలో స్థాపించారు. ఇందులో లైబ్రరీ ఉంది. భారతీయ సంస్కృతిపై పాఠాలు అందించడంతో పాటు యోగా, భారతీయ సంగీతం, నృత్యం వంటి కళలను ఇది ప్రోత్సహిస్తుంది.[19]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  2. ↑ "5 Negara Yang Mengakui Kedaulatan Indonesia". uici.ac.id (in ఇండోనేషియన్). 24 August 2024.
  3. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  4. 1 2 "Indian pushes for early economic accord with Indonesia". IANS. news.biharprabha.com. 24 April 2014. Archived from the original on 24 ఏప్రిల్ 2014. Retrieved 24 April 2014.
  5. 1 2 Ram Bahukhandi (27 January 2011). "Letter: India and Indonesia – Natural allies". The Jakarta Post. Archived from the original on 28 September 2015. Retrieved 14 May 2015.
  6. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  7. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  8. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  9. ↑ Tomascik, T.; Mah, J.A.; Nontji, A.; Moosa, M.K. (1996). The Ecology of the Indonesian Seas - Part One. Hong Kong: Periplus Editions Ltd. ISBN 962-593-078-7.
  10. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  11. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  12. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  13. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  14. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  15. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  16. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  17. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  18. ↑ "Celebration of the 75th anniversary of the establishment of diplomatic relations between India and Indonesia on April 16, 2024". Indian Council For Cultural Relations. 19 April 2024. Archived from the original on 8 July 2024. Retrieved 3 July 2024.
  19. ↑ "5 Negara Yang Mengakui Kedaulatan Indonesia". uici.ac.id (in ఇండోనేషియన్). 24 August 2024.
  20. ↑ "Borobudur : A Wonder of Indonesia History". Indonesia Travel. Archived from the original on 14 ఏప్రిల్ 2012. Retrieved 5 ఏప్రిల్ 2012.
  21. ↑ K.A._Nilakanta_Sastri, A History of South India, pp 424–426
  22. ↑ "Balinese alphabet, language and pronunciation".

మరింత చదవడానికి

[మార్చు]
  • హోడ్లీ, MC (1991). ఆగ్నేయాసియాలో సంస్కృత కొనసాగింపు: జావానీస్ చట్టంలో షడాతతాయి, అష్టకోర. ఢిల్లీ: ఆదిత్య ప్రకాశన్.
  • హ్యూస్-ఫ్రీలాండ్, ఎఫ్. (1991). జావానీస్ దృశ్య ప్రదర్శన, భారతీయ నిగూఢత. ఢిల్లీ: ఆదిత్య ప్రకాశన్.
  • లోకేష్, చంద్ర, & ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ కల్చర్. (2000). ఆగ్నేయాసియా సమాజం, సంస్కృతి: కొనసాగింపులు, మార్పులు. న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఆదిత్య ప్రకాశన్.
  • ఆర్.సి. మజుందార్, ఆగ్నేయాసియాలో సంస్కృత అధ్యయనం
  • ఆర్.సి. మజుందార్, చంపా, ప్రాచీన భారతీయ కాలనీలు దూర ప్రాచ్యంలో, వాల్యూమ్.1, లాహోర్, 1927. ఐఎస్‌బిఎన్ 0-8364-2802-1 యొక్క కీవర్డ్లు
  • ఆర్.సి. మజుందార్, సువర్ణద్వీప, ప్రాచీన భారతీయ కాలనీలు దూర ప్రాచ్యంలో, వాల్యూమ్.II, కలకత్తా,
  • ఆర్.సి. మజుందార్, కంబోడియాలోని కంబోడియా దేశ లేదా ఒక పురాతన హిందూ కాలనీ, మద్రాస్, 1944
  • ఆర్.సి. మజుందార్, దూర ప్రాచ్యంలోని హిందూ కాలనీలు, కలకత్తా, 1944,
  • ఆర్‌సి మజుందార్, భారతదేశం, ఆగ్నేయ ఆసియా, ISPQS చరిత్ర, పురావస్తు శాస్త్ర సిరీస్ వాల్యూమ్. 6, 1979, .
  • ఆర్.సి. మజుందార్, ఆగ్నేయాసియాలో ప్రాచీన భారతీయ వలసరాజ్యాలు; ఆగ్నేయాసియాలో హిందూ వలసరాజ్యాల చరిత్ర, హిందూ సంస్కృతి
  • దుర్గాదేవి ప్రయాణం: భారతదేశం, జావా, బాలి బై అరియాటి, ని వాయన్ పసేక్, 2016, , ఆదిత్య ప్రకాశన్, న్యూఢిల్లీ