భారత ఎన్నికల కమిషను
| భారత ఎన్నికల కమిషను | |
|---|---|
| అధికారిక లోగో[1] | |
| రాజ్యాంగ సంస్థ అవలోకనం | |
| స్థాపనం | 25 జనవరి 1950 (జాతీయ ఓటర్ల దినోత్సవం గా జరుపుకుంటారు) |
| అధికార పరిధి | భారతదేశం |
| ప్రధాన కార్యాలయం | నిర్వాచన్ సదన్, అశోకారోడ్, న్యూ ఢిల్లీ[2] 28°37′26″N 77°12′40″E / 28.62389°N 77.21111°E |
| ఉద్యోగులు | 300 |
| రాజ్యాంగ సంస్థ కార్యనిర్వాహకుడు/లు | జ్ఞానేష్ కుమార్[3], భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు[4], భారత ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి[5], భారత ఎన్నికల కమిషనర్ |
| వెబ్‌సైటు | |
| (only accessible in India) | |
భారత ఎన్నికల కమిషను, స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.[6]
కమిషను వ్యవస్థ
[మార్చు]దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.
ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.
ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ [7] రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. జాతీయ ఎన్నికల కమీషన్ కు వున్న అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వుంటాయి. రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.
ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం 6 లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.
కార్య కలాపాలు
[మార్చు]రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు ఇలా ఉన్నాయి.
- రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం.
- ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
- స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం
ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమిషను కొన్ని చర్యలు చేపట్టింది. వాటిలో కొన్ని:
- ఎలెక్ట్రానిక్ ఓటింగు మిషన్లను ప్రవేశపెట్టడం
- రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం
- ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం
- ఓటరు జాబితాల ఎలెక్ట్రానికీకరణ
- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించటం.
పదునెక్కిన కమిషను
[మార్చు]పూర్వపు రోజుల్లో కమిషను కార్యనిర్వాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో- ముఖ్యంగా 1990 నుండి - కమిషను మరింత చైతన్యవంతంగా, ప్రభావవంతంగా వ్యవహరిస్తూంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చెయ్యడంతో పాటు, కొన్ని కొత్త నియమాలను కూడా ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది
ఇవికూడా చూడండి
[మార్చు]- భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
- భారత ఎన్నికల కమిషనర్లు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
- తెలంగాణ రాష్త్ర ఎన్నికల సంఘం
- ఎన్నికల కమిషన్
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India". Government of India. Retrieved 21 March 2024.
- ↑ "Contact Us". Election Commission of India. Retrieved 1 January 2024.
- ↑ "Who is Gyanesh Kumar, the new Chief Election Commissioner". The Hindu. 18 February 2014. Retrieved 18 February 2024.
- ↑ "Gyanesh Kumar, Sukhbir Singh Sandhu take charge as Election Commissioners". The Indian Express. 15 March 2024. Retrieved 17 March 2024.
- ↑ "Gyanesh Kumar appointed next chief election commissioner". The Hindustan Times. 18 February 2014. Retrieved 18 February 2024.
- ↑ – via Wikisource.
- ↑ "Andhra Pradesh State Election Commission". AP Government. Archived from the original on 2021-01-24. Retrieved 2021-01-24.