భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం
CM KCR Inaugurated Bharatha Swathanthra Vajrostava DviSapthaham.jpg
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రక్రియభారత స్వాతంత్ర్య వేడుకలు
తేదీ(లు)2022 ఆగస్టు 15 (2022-08-15)
ప్రారంభం2022 ఆగస్టు 8 (2022-08-08)
ముగింపు2022 జూలై 22 (2022-07-22)
ప్రదేశంతెలంగాణ
దేశంభారతదేశం
పాల్గొనువారుతెలంగాణ ప్రజలు
నిర్వహణతెలంగాణ ప్రభుత్వం

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం, అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమం. ఇందులో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతోపాటు క్రీడా, ఒకృత్వ, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారురు.[1] 2022 ఆగస్టు 8న హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలను ప్రారంభించాడు.[2] 2022 ఆగస్టు 22న ఎల్.బి. స్టేడియంలో జరిగిన ద్విస్తాహ ముగింపు కార్యక్రమంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిసాయి.[3] దేశంలోనే 15 రోజులపాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాలతో రవీంద్రభారతికి అలంకరణ
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం ముగింపు వేడుకలలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

సమీక్షా సమావేశం[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు 2022 జూలై 23న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు (ఆగస్టు 8 నుండి 22 వరకు) మొత్తంగా 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్‌ అధికారులకు సూచించాడు.[4]

పదిహేను రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై 2022 ఆగస్టు 2న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శ్రీ కె. కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో రెండవ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.[5]

కమిటీ[మార్చు]

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు ఎంపీ కే. కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయబడింది. ఈ కమిటీలో మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వి. శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, ఎంపీ జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వివిధ శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.[6]

ప్రణాళికలు[మార్చు]

కార్యక్రమాల ప్రణాళిక[7][8]

 • గడప గడపనా జాతీయ జెండాలో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద, ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద, ప్రతి ప్రభుత్వ వాహనం మీద జాతీయ పతాకం ఎగరవేయడంకోసం 1 కోటి 20 లక్షల జాతీయ పతాకాల తయారీకి గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు ఆర్డర్లు ఇచ్చారు.
 • ఆగస్టు 9 నుండి రాష్ట్రంలోని 563 స్క్రీన్లలో రిచర్డ్ అటెంబరో రూపొందించిన ‘గాంధీ’ సినిమా ఉచిత ప్రదర్శన వేశారు. పిల్లల్లో దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీజీ సినిమా ప్రదర్శనను ఐమాక్స్ థియేటర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం కలిసి ప్రారంభించి, పిల్లలతో కలిసి ఆ సినిమాను వీక్షించారు. సుమారు 35 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మరోసారి కలుగచేసేందుకై ఏర్పాటుచేసిన సినిమా ప్రదర్శనను ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చూడడం దేశంలోనే మొదటిసారి.
 • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానాల్లో, షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక అలంకరణ చేశారు. రాష్ట్రంలోని ప్రజా సంచార ప్రాంతాలు, బస్టాండ్లు, ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌, పట్టణాల్లోని స్టార్‌ హోటళ్లు సహా ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా జాతీయ జండాను ఎగురవేశారు.
 • ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్ఠాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజులపాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలను ఏర్పాటుచేసి జాతీయ జెండా ఎగరవేశారు.
 • 15 ఆగస్టుకు ముందురోజు 14న తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించారు.
 • రాష్ట్రంలోని పీజీ, డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు సహా గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పోరేట్‌ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా అన్నిరకాల విద్యాసంస్థల్లో ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించారు.
 • జిల్లాకొక ఉత్తమ గ్రామపంచాయితీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు, డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అధికారి, తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించారు.
 • పదిహేను రోజులపాటు పత్రికల మాస్ట్‌హెడ్స్‌ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించారు. టీవీ ఛానల్స్‌లో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయడం. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారు.
 • రవీంద్రభారతిలో 15రోజుల పాటు స్వాతంత్ర్య సమర స్ఫూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
 • ప్రతి జిల్లా నుంచి 2 వేల మందిని తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాల నిర్వహణ జరిగింది.[9][10]

రాష్ట్రవ్యాప్త రోజువారీ కార్యక్రమాలు[మార్చు]

 1. ఆగస్టు 08: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలను ప్రారంభించాడు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి.. జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశాడు. 75 మంది వీణ కళాకారులచే వీణా వాయిద్య ప్రదర్శన, సాండ్‌ ఆర్ట్‌ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్యరూపకం, ప్యూజన్‌ ప్రదర్శన, లేజర్‌ షో జరుగాయి. ఆ తరువాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని అందించాడు.[11] ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్ పీ చైర్మేన్లు, మేయర్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే అందరు ఐఎఎస్, ఏపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులను, తదితర రెండు వేల మంది ఆహుతులు పాల్గొన్నారు.
 2. ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.[12]
 3. ఆగస్టు 10: వన మహోత్సవ కార్యక్రమంలో భాంగంగా రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 159 ఫ్రీడం పార్కులను ఏర్పాటుచేసి 72,130 మొక్కలు నాటారు. వజ్రోత్సవాల గుర్తుగా నాటే మొక్కల సంఖ్య 75, 750, 7,500 ఉండే విధంగానూ, 75 ఆకారం వచ్చే విధంగా ఉండేలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఏర్పాట్లు చేశాయి.
 4. ఆగస్టు 11: రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళలో ఫ్రీడం రన్ నిర్వహించారు. పలువు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 5. ఆగస్టు 12: రాఖీ పండుగ సందర్భంగా జాతీయ సమైకత్య రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది.
 6. ఆగస్టు 13: హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో త్రివర్ణ పతాకాలతో వజ్రోత్సవ ఫ్రీడం ర్యాలీలు నిర్వహించబడ్డాయి.[13]
 7. ఆగస్టు 14: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు జరిగాయి. తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించారు.
 8. ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలుతో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.[14]
 9. ఆగస్టు 16: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు `సామూహిక జాతీయ గీతాలాపన' కార్యక్రమం సందర్భంగా యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. ఉదయం సరిగ్గా 11.30గంటలకు నిమిషంపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. అబిడ్స్ జీపీవో స‌ర్కిల్ వ‌ద్ద జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఎంపీలు కేశ‌వ‌రావు, అస‌దుద్దీన్ ఓవైసీ, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.[15][16]
 10. ఆగస్టు 17: స్వాత్రంత్య్ర యోధుల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేయబడ్డాయి.[17]
 11. ఆగస్టు 18: 'ఫ్రీడం కప్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడలను నిర్వమించారు.
 12. ఆగస్టు 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ చేశారు.
 13. ఆగస్టు 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి.
 14. ఆగస్టు 21: ప్ర‌త్యేక హ‌రితహారం కార్య‌క్రమం నిర్వహించబడింది.[18] పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ‘సన్‌డే-ఫన్‌డే’, చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరిట సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కళాకారులు, సంగీతకారులతో ప్రదర్శనలు జరిగాయి.
 15. ఆగస్టు 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ ముగింపు వేడుకల్లో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలురంగాలకు చెందిన అతిరథ మహారథులు, రాష్ట్ర నలుమూలలనుంచి 30 వేల మందికిపైగా వచ్చారు.[19][20]

ముగింపు వేడుకలు[మార్చు]

వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌ కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌ సభావేదిక ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, డల్హౌసీ అరాచకాలు, సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాట ఘట్టాలతో సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ దీపికారెడ్డి, ఆమె శిష్యబృందం ‘‘వజ్రోత్సవ భారతి‘‘ పేరుతో శాస్త్రీయ నృత్యరూపకం ప్రదర్శించింది. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా ప్రఖ్యాత ఖవ్వాలీ కళాకారులు వార్సీ బ్రదర్స్‌ ఖవ్వాలీ గానం చేశారు.[21] ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది.[22]

స్వాతంత్య్ర సమరయోధులు, సైనిక కుటుంబాలతోపాటు, తెలంగాణకు చెందిన జాతీయస్థాయి క్రీడాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్మానించాడు. సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అంబేద్కరిస్టు అజయ్ గౌతమ్, కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు, కల్నల్ బి. సంతోష్ బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, వెయ్యి ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్ రామచంద్రారెడ్డి తనయుడు అరవింద్ రెడ్డి, హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య, రావెళ్ళ వెంకట రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల, మహ్మద్ హుస్సాముద్దీన్, సంగీత దర్శకులు శంకర్ మహదేవన్, కె.ఎం.రాధాకృష్ణన్, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్ తదితరులను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించాడు.[23]

రవీంద్రభారతిలోని కార్యక్రమాలు[మార్చు]

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 2022 ఆగస్టు 9 నుంచి 21 వరకు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్‌ను ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కేశవరావు ఆగస్టు 4న విడుదల చేశాడు.[24]

 • ఆగస్టు 9: కేశవరావు, వి. శ్రీనివాస్ గౌడ్, అయాచితం శ్రీధర్, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ తదితరులు విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే ‘వందేమాతరం’లో భాగంగా గురు కళాకృష్ణ బృందం (75 మంది)తో పేరిణి నాట్య ప్రదర్శన జరిగింది.[25]
 • ఆగస్టు 10: గాంధీజీ ఆశయ గీతాలతో జయలక్ష్మి బృందం వీణ కచేరి, ప్రమోద్‌ కుమార్‌రెడ్డి బృందం నృత్యాలు జరిగాయి.
 • ఆగస్టు 11: ప్రముఖ నాట్యాచార్యులు శ్రీమతి క్రాంతి పిడమర్తి గారి శిష్యులచే స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని రేకెత్తించే వందేత్వం భూదేవి, దేశమును ప్రేమించుమన్నా, వందేమాతరం నృత్యాలతో వీక్షకులలో ప్రేరణను, ఉత్సాహాన్ని, గౌరవ భావాన్ని కలిగించడంతోపాటు ఔన్నత్యాన్ని చాటిచెప్పే కూచిపూడి నృత్యాలు, "అమృతాంజలి – An ode to Our Nation" - మంగళ, రాఘవ్ రాజ్ భట్ (ఆకృతి కథక్ కేంద్రం) విద్యార్థులచే కథక్ నృత్య ప్రదర్శన జరిగింది.
 • ఆగస్టు 12: ప్రముఖ నాట్యాచార్యులు పద్మశ్రీ ఆనంద శంకర్‌ జయంత్‌ ఆధ్వర్యంలో కావ్యాంజలి, శంకరానంద కళాక్షేత్ర బృందంచే విశ్వకవి రవీంద్రుని గీతాలలోని దేశభక్తి అంశాలలో “కావ్యాంజలి” నృత్యనీరాజనం కార్యక్రమం జరిగింది. భరతదేశం, భరతమాత గొప్పతనం గురించి బెంగాలీ, తెలుగులో రాయబడిన కవిత్వంతో రవీంద్ర సంగీతం, కర్ణాటక సంగీతంలో ఆనంద శంకర్ జయంత్ గారిచేత కొరియోగ్రఫీ చేయబడి ప్రదర్శించే అద్భుతమైన నృత్యాలు ప్రదర్శించారు.
 • ఆగస్టు 13: అమెట్యూర్ ప్రొఫెషనల్ సింగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత గీతాలాపన ‘పాడవోయి భారతీయుడా..’ సినీ లలిత, దేశ భక్తి గీతాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘జయ జయ ప్రియ భారత జనయిత్రి’, ‘దేశమును ప్రేమించుమన్న’, ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు’, ‘ఏ మేరె వతాన్ కే లాగే’ వంటి సినీ లలిత, దేశ భక్తి గీతాలను ఆలపించారు.
 • ఆగస్టు 14: ఆకాశవాణి కళాకారుల బృందంచే ‘తల్లి భారతి వందనం’ (ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతాలను ఆలాపన) కార్యక్రమం జరిగింది.
 • ఆగస్టు 15: ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులచే భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ‘సారే జహాసే అచ్చా-హిందూ సితాహమారా’ సంగీత నృత్య కార్యక్రమం జరిగింది.
 • ఆగస్టు 16: తెలంగాణ సాహిత్య అకాడమీ సారథ్యంలో 'స్వాతంత్ర్య స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి' అంశంపై కవి సమ్మేళనం జరిగింది. దాదాపు వందమంది కవులు విచ్చేసి తమ కవితలను చదివారు.[26]
 • ఆగస్టు 17: రామాచారి శిష్య బృందంచే 'పుణ్యభూమి నా దేశం నమో నమామి' పేరుతో భారత స్వాతంత్ర్య సమరం భావనలతో పాటల కార్యక్రమం జరిగింది.
 • ఆగస్టు 18, 19: తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ కళా వైభవం-భిన్నత్వంలో ఏకత్వం దేశంలోని వివిధ నృత్యకళల సమహారం కార్యక్రమం జరిగింది.
 • ఆగస్టు 20: దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ సమర్పణలో 'భారత జాతీయోద్యమ ఘట్టాలపై' దీపికా ప్రసాద్ రచనలో (డా. కోట్ల హనుమంతరావు, డా. అనితారావు కోట్ల దర్శకత్యంలో రూపొందించిన 'వందే భారతం' నాటకం ప్రదర్శించబడింది.
 • ఆగస్టు 21: శ్రీ ఇండియన్ కాన్ సెర్ట్స్ ఆధ్వర్యంలో భారతరత్న లతా మంగేష్కర్ కు నివాళిగా 'లతా గీతమాల' పేరుతో సినీ దేశభక్తి గీతాల ఆలాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నేపథ్య గాయకులు మాళవిక, రమ్య బెహరా, కారుణ్య, శ్రీరామ్ చంద్రలు గీతాలను ఆలపించగా, సంగీత దర్శకుడు మణిశర్మ, నటులు ఆలీ, తనికెళ్ళ భరణిలు ముఖ్య అతిథులుగా హజరై గాయకులను అభినందించారు.

మూలాలు[మార్చు]

 1. "CM Kcr: ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలి: సీఎం కేసీఆర్‌". EENADU. 2022-07-23. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
 2. "CM KCR: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". EENADU. 2022-08-08. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
 3. "CM KCR : సాంస్కృతిక సంబరాల నడుమ వజ్రోత్సవాల ముగింపు". EENADU. 2022-08-23. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-23.
 4. telugu, NT News (2022-07-24). "స్వాతంత్ర్య స్ఫూర్తి.. వజ్రోత్సవ దీప్తి". Namasthe Telangana. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
 5. "CM KCR review: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-02. Archived from the original on 2022-08-02. Retrieved 2022-08-02.
 6. telugu, NT News (2022-07-26). "భారత వజ్రోత్సవాలకు 24 మందితో కమిటీ". Namasthe Telangana. Archived from the original on 2022-07-26. Retrieved 2022-07-26.
 7. telugu, NT News (2022-07-23). "దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా 'భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ' కార్యక్రమాలు : సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
 8. News18 Telugu (3 August 2022). "తెలంగాణలో 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. పూర్తి షెడ్యూల్​ ఇదే." Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022. {{cite news}}: zero width space character in |title= at position 69 (help)
 9. telugu, NT News (2022-07-28). "వైభవంగా వజ్రోత్సవాలు.. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు". Namasthe Telangana. Archived from the original on 2022-07-28. Retrieved 2022-07-28.
 10. "కోటి జెండాలతో పంద్రాగస్టు". EENADU. 2022-07-28. Archived from the original on 2022-07-28. Retrieved 2022-07-28.
 11. telugu, NT News (2022-08-08). "అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు.. జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
 12. telugu, NT News (2022-08-09). "Telangana | కన్నుల పండువగా..ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ". Namasthe Telangana. Archived from the original on 2022-08-09. Retrieved 2022-08-15.
 13. telugu, NT News (2022-08-14). "మువ్వన్నెల రెపరెపలు". Namasthe Telangana. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-16.
 14. "CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్‌". EENADU. 2022-08-15. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
 15. "Telangana News: 'జనగణమన'.. ఆలపించెను తెలంగాణ". EENADU. 2022-08-16. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
 16. telugu, NT News (2022-08-16). "అబిడ్స్ జీపీవో వ‌ద్ద జాతీయ గీతాలాప‌న‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
 17. telugu, NT News (2022-08-18). "ఉద్యమ స్ఫూర్తితో రక్తదానం". Namasthe Telangana. Archived from the original on 2022-08-18. Retrieved 2022-08-19.
 18. telugu, NT News (2022-08-21). "నేడు సామూహిక హరితహారం.. బొటానికల్‌ గార్డెన్‌లో మొక్క నాటిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-08-21. Retrieved 2022-08-21.
 19. telugu, NT News (2022-08-22). "ఎల్‌బీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
 20. "CM Kcr: దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు: సీఎం కేసీఆర్‌". EENADU. 2022-08-22. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
 21. telugu, NT News (2022-08-22). "ల‌హ‌రార‌హాహై దేకో ఆకాశ్ ప‌ర్ తిరంగా… వార్సీ బ్ర‌ద‌ర్స్‌కు కేసీఆర్‌ స‌లాం". Namasthe Telangana. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
 22. telugu, NT News (2022-08-22). "వ‌జ్రోత్స‌వ సంబురం.. అద‌రగొట్టిన‌ శంక‌ర్ మ‌హదేవ‌న్ గానం". Namasthe Telangana. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
 23. telugu, NT News (2022-08-23). "స్ఫూర్తిని పంచి.. కీర్తిని పెంచి!". Namasthe Telangana. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
 24. telugu, NT News (2022-08-05). "స్వాతంత్ర్య స్ఫూర్తి మేల్కొలిపేలా." Namasthe Telangana. Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-08.
 25. telugu, NT News (2022-08-10). "వజ్రోత్సవాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలి". Namasthe Telangana. Archived from the original on 2022-08-10. Retrieved 2022-08-15.
 26. "దేశాన్ని పాలించే వారికి కనువిప్పు కలిగేలా కవిత్వం రాయండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌". EENADU. 2022-08-17. Archived from the original on 2022-08-17. Retrieved 2022-08-17.