భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రెండవ అశ్వాసం

[మార్చు]

ఇలా తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! ఆపై యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించుము " అని ఉత్సాహంగా అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. " ఆరాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించి నందుకు దుఃఖిస్తూ తమ్ములతో సహా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! చూసావు కదా భీష్ముడు కార్చిచ్చు వలె మన సేనలను కాల్చి వాసాడు. మనకు అతడిని చంపు మార్గం కనిపించుట లేదు లోక భీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసింది. భీష్ముని గెలవగలడని మనం అర్జునిని నమ్ముకున్నాము. ఈ రోజు అర్జునుడు తన పరాక్రమం ఏమీ చూప లేదు. భీముడు తన యావచ్ఛక్తి ఉపయోగించి యుద్ధం చేసాడు. నాకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అయినా ఎవరిని అనుకుని లాభం ఏమిటి ? మనకు సాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎర వేయడం కంటే యుద్ధం మానుకుని ఆకులు అలములు తినడం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక మేము క్షేమంగా ఉన్నాము. కనుక నీవు ఎలా చెపితే అలా చేస్తాము. మాకు కర్తవ్యం నీవే నిర్ణయించు " అని వేడుకున్నాడు. ధర్మనందనుని భయాన్ని పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! ఏమిటి ఈ ఆవేదన ఎందుకు చెప్పు. నీకు ఎదురు నిలువ గల సమర్ధులు ఎవరు. నీ తమ్ములు మూడు లోకాలను గెలువ సమర్ధులు. భీష్ముని చంపడానికి శిఖండి ఉన్నాడు భయ మెందుకు. సాత్యకి పరాక్రమం ఆశ్చర్యకరమైన అతని యుద్ధ రీతులు నీకు అవగతం కాలేదు. దృపదుడు, విరాటుడు నీకై తమ ప్రాణములు సహితం ఇవ్వ సిద్ధంగా ఉన్నారు. నీవు నిరుత్సాహ పడవద్దు. దృష్టద్యుమ్నుడు పరాక్రమానికి కౌరవ సేన నిలువజాలదు " అన్నాడు. ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి " నాడు కృష్ణుని ఆదేశం పై నిన్ను సర్వ సైన్యాలకు అధ్యక్షుని చేసాము. శ్రీ కృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్ర రాజులు నీకు సాయం ఉంటాము. నీ సర్వ శక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చు " అన్నాడుధృష్టద్యుమ్నుడు" ధర్మనందనా! నన్ను ద్రోణుడిని చంపుటకు మాత్రమే బ్రహ్మ శృష్టించిన విషయం జగమెరిగిన సత్యం. భీష్మునితో చేర్చి కురు సేనలను ఎలా మట్టు పెట్టగలనో చూడు " అన్నాడు. ఆ మాటలు విన్న పాడవులు, మిత్రరాజులు సంతసంచారు. ధర్మరాజు దృష్టద్యుమ్నునితో " పూర్వం దేవదానవ యుద్ధమున దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకర మయిన క్రౌంచ వ్యూహమును రేపటి యుద్ధములో మనసైన్యం కొరకు నీవు పన్నుము " అన్నాడు. తేలిక పడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ములతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసములకు వెళ్ళారు.

రెండవ రోజు యుద్ధం

[మార్చు]

మరునాటి ఉదయాన పాండవ సైన్యం నూతనోత్సాహంతో సిద్ధం అయింది. క్రౌంచ వ్యూహాన్ని పరిశీలించడానికి ధర్మరాజు బయలు దేరాడు. అర్జునుడు తన గాండీవంతో కపిధ్వజంతో చేరి క్రౌంచ వ్యూహం ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైభ్యుడు క్రౌంచ పక్షి నేత్ర స్థానంలో నిలిచాడు. ద్రుపదుడు క్రౌంచ పక్షి శిఖలా నిలిచాడు. దశార్ణ, శూరసేన, కిరాత దేశాధీశులు క్రౌంచ పక్షి కంథాకారంలో నిలిచారు. భీమసేనుడు దృష్టద్యుమ్నుడు క్రౌంచ పక్షి రక్కల స్థానంలో నిలిచారు. అభిమన్యుడు, పౌంఢ్రుడు, ఉపపాడవులు, చోళులు, పాండ్యులు భీమ సేనుని పక్కన నిలువగా నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబరులు, వత్సరాజులు ధృష్టద్యుమ్నుని పక్క నిలిచారు. కేకయ, కాశీ రాజులతో కూడి విరాటరాజు క్రౌంచ పక్షి జఘన భాగాన నిలిచారు. హోణపతి మొదలైన ప్రముఖులు చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంపక్షి వెన్ను భాగంలో నిలిచాడు. కౌరవ పక్షాన సుయోధనుడు " మీరు ఒక్కొకరు పాండవ బలాన్ని గెలువగల సమర్ధులు మీరంతా ఒక చోట ఉన్న మిమ్ము గెలువ సాక్షాత్తు పరమేశ్వరునికైనా సాధ్యం కాదు. కాని పాండవ సైన్యం క్రౌంచ పక్షి రూపంలో నిలిచినందున మనం అందుకు దీటైన వ్యూహం పన్నడం ఎంతో అవసరం " అన్నాడు. సుయోధనుని మాట మేరకు కౌరవ సేన భీష్ముని ఆధ్వర్యంలో ప్రతి వ్యూహంలో నిలిచారు. దుశ్శాసన, వికర్ణ, విందాను విందులు, శూరసేనుడు, త్రిగర్త రాజులు ఒక పక్క నిలువగా ద్రోణ, కుంతల, దశార్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్క నిలిచారు. భీష్ముడు మహా సైన్యంతో నడుమ భాగంలో నిలిచాడు. కృతవర్మ, శల్యుడు, అశ్మంత , కాశ్మీర రాజులు , కొంత మంది సుయోధనుని తమ్ములు సుయోధనుడు భీష్ముని వెనుక నిలిచారు.

రెండవ రోజు యుద్ధారంభం

[మార్చు]

దుర్యోధనుడు సజ్ఞ చేసి యుద్ధం ఆరంభించగానే కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి చొచ్చుకుని వెళ్ళింది. భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని చీల్చి చెండాడాడు. రెక్కలు చించాడు. కంఠమును త్రుంచి, తల పగుల కొట్టి క్రౌంచ వ్యూహాన్ని కకావికలు చేసాడు. అంతటా తానై విజృంభించాడు. అది చూసిన అర్జునుడు శ్రీ కృష్ణుని చూసి " బావా ! భీష్ముడు మన సేనలను చిందరవందర చేస్తున్నాడు. అయినా నా వైపు రావడంలేదు అతడి పొగరు అణచాలి రథాన్ని అతని వైపు పోనిమ్ము " అన్నాడు. శ్రీ కృష్ణుడు " అర్జునా ! అలాగే చేస్తాను. నా మాట కొంతవిను . కంగారు పడక నీ పరాక్రమంతో భీష్ముని సామర్ధ్యంగా ఎదిరించి శల్యాది కౌరవ ప్రముఖుల మనసును భయంతో నింపు " అన్నాడు. అర్జునుడు అడ్డు వచ్చిన శూరసేనుడి సైన్యాలను చిందరదర చేస్తూ భీష్ముని మీదకు భీకరంగా వచ్చాడు. ఇది చూసిన భీష్ముడు అర్జునుని డెబ్బై ఏడు కౄర బాణాలతో కొట్టాడు. ద్రోణుడు ఇరవై అయిదు బాణాలతోను, కృపాచార్యుడు అయిదు వందల బాణాలతోను, వికర్ణుడు మూడు బాణాలతోను, దుర్యోధనుడు అరవై నాలుగు బాణాలతోను, శల్యుడు తొమ్మిది బాణాలతోను అర్జునిని పై లంఘించాడు. శర వర్షాన్ని చూసిన అర్జునుడు కొండవలె స్థిరంగా నిలిచాడు. అర్జునుడు ఇరవై బాణములతో భీష్ముని, అరవై బాణాలతో ద్రోణుని, తొమ్మిది బాణాలతో కృపుని, వికర్ణుని, శల్యుని తలా మూడు బాణాలతో , దుర్యోధనుని అయిదు క్రూర బాణాలతో ఎదిరించాడు. ఆ సమయంలో సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు ఏభై బాణాలతో అర్జునిని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రధాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారధూలను హయములను తెగ నరికాడు. అర్జునిని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు " అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు అతడిని ఎదుర్కొన గలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరూ ఇలా చూస్తూ ఊరు కోవడం ఏమన్నా బాగా ఉందా " అన్నాడు. భీష్ముడు " నా శాయ శక్తులా యుద్ధంచేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి " అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్ళించి వికర్ణుడు, అశ్వధ్ధామ వెంట రాగా అర్జునిపై ఒక్క సారిగా లంఘించి బాణ వర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునినికి గాంగేయునకు మధ్య పోరు లోకభీకరంగా జరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేసాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది.

పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం

[మార్చు]

మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు ద్రోణుడు దానిని పొడి చేసాడు. ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు. ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.

భీమసేనుని భీకర యుద్ధం

[మార్చు]
దస్త్రం:Battle between Bhisma and Bhima.jpg
భీమ భీష్ముల యుధ్ధం

సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన, ద్రుపదుని పైన బాణములు సంధించాడు. ధర్మరాజు ఇంతలో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఛేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు. కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు. కేతుమంతునికి ధాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యారు. మిగిలి వారు పారి పోయారు. కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు. కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గదను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి, కేతనం విరగటమే కాక నిముషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది. భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేసాడు. అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రథాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా భీమసేనుడు బెదరక ఒక్క గదా ఘాతంతో శక్రదేవుని సంహరించాడు. కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై పదునాలుగు తోమరములు విసిరాడు. భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేసాడు. కళింగ రాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు. ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు. భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి. భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు. అది చూసిన కళింగరాజు ఒక్క సారిగా భీమసేనుని పైన పడమని తన గజ సన్యాలను పురికొల్పాడు. ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తోడములు నరక సాగాడు. రథికులను, సారధులను, రథములకు కట్టిన అశ్వములను నరక సాగాడు. ఇంతలో భీముని సారథి భీముని రథాన్ని తీసుకు వచ్చి అతని ముందు నిలుపగా భీమసేనుడు అతడిని శ్లాఘిస్తూ రథం ఎక్కి విల్లు తీసుకున్నాడు. కళింగుని అయిదు బాణాలతో కొట్టగా అతడు మూర్చిల్లాడు. కళింగుని చక్రరక్షకులు అయిన సత్యుడు, సత్యదేవులను చంపాడు. కౌరవ సేన కకావికలై పోయింది. కళింగుని సారథి అతడిని పక్కకు తీసుకు వెళ్ళాడు. భీమసేనుడు తన శంఖమును పూరించాడు. అది విన్న భీష్ముడు తిరిగి శంఖాన్ని పూరించి కౌరవ సైన్యాలను ఉత్సాహపరిచాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథానికి కట్టిన హయములను చంపగా భీముడు కోపించి రథం దిగి భీష్మునిపై ఉరికాడు. సాత్యకి భీమునికి భీష్మునికి మధ్యగా నిలిచి భీష్ముని రథసారథిని చంపాడు. రథాశ్వాలు సారథి లేని రథాన్ని భీష్ముని పక్కకు తీసుకు వెళ్ళాయి. అదను చూసి భీముడు కౌరవ సేనను దనుమాడాడు. భీముని ధాటికి తాళలేని కౌరవ సేనలు పలాయనం చిత్తగించాయి. ధృష్టద్యుమ్నుడు వచ్చి భీమసేనుని తన రథం పైకి ఎక్కించాడు. ఇంతలో సాత్యకి రథంపై వచ్చి భీమసేనా " ఒంటరిగా కళింగుని బలం అణిచావు. అతని పుత్రులను సోదరులను, ఆప్తులను ఒంటరిగా దునుమాడావు " అని భీమసేనుని ప్రశంసించాడు.

అభిమన్యుని యుద్ధము

[మార్చు]

కళింగరాజు పరాజయమును చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వధ్ధామ అక్కడకు వచ్చారు. వారిని చూసిన ధృష్టద్యుమ్నుడు భీముని కిందకు దింపి " భీమసేనా నీవు నా వెనుక ఉండి నన్ను రక్షించు " అని వారి వైపు రథం నడిపి అశ్వథ్థామ రథానికి కట్టిన హయములను తొమ్మిది బాణాలు వేసి చంపాడు. అశ్వథామ శల్యుని రథం ఎక్కి ధృష్టద్యుమ్నుని మీద అస్త్ర ప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు ఒంటరిగా అశ్వథ్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవడం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వథ్థామ, కృపులపై తొమ్మిది బాణాలు వేసాడు. శల్యునిపై బాణపరంపర కురిపించాడు. వారుకూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు పన్నెండు బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు ఏభై బాణాలతో లక్ష్మణుని తిప్పి కొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. కౌరవ సేన హర్షధ్వానాలు చేసాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకుని లక్ష్మణునిపై బాణవృష్టి కురిపించి అతని కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మరలించాడు. సుయోధనునికి సాయంగా భీష్మ, ద్రోణ ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చేయసాగాడు. అర్జునుడు ఇది చూసి దేవదత్తం పూరిస్తూ అభిమన్యునికి సాయం వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలకు సైగ చేసి అందరినీ అక్కడకు తీసుకు వచ్చాడు. అర్జునుడు వివిధ బాణములు వేసి కౌరవసేనను తుత్తునియలు చేస్తున్నాడు. అర్జునిని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. విరిగిన కరవాలములు, శరములు, గదలు, తలలు, మొడెములు మొదలైన వాటితో యుద్ధభూమి భాయానకంగా ఉంది. గజారోహకులు అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి " ఆచార్యా ! అర్జునుడు శ్రీకృష్ణుని సారధ్యంలో చెలరేగి పోయాడు. నన్ను కూడా లక్ష్యపెట్ట లేదు. అతడిని ఎదుర్కొనే వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసి పోయాయి. కనుక ఈ రోజుకు యుద్ధం చాలిస్తాము " అన్నాడు ద్రోణాచార్యుడు అందుకు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలకు సూచించి అందరూ తమ నివాసాలకు చేరారు.

మూడవ రోజు యుద్ధం గరుడవ్యూహం అర్ధ చంద్ర వ్యూహం

[మార్చు]

మూడవరోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడవ్యూహంలో నిలిపాడు. ఆవ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోను, కృతవర్మ, అశ్వథ్థామలు తలభాగంలోను నిలిచారు. త్రిగర్తలతో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రధుడు కంఠ భాగాన నిలిచారు. సుయోధనుడు, సుయోధనుని తమ్ములు వెన్ను భాగమున నిలిచారు. విందాను విందులు, కాంభోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు, కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా ధృష్టద్యుమ్నుడు ముందు నిలువగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకులసహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గర నిలిచాడు. భేరి తూర్య నాదాలు మిన్నంటాయి. మూడవ రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి.

అర్జున భీష్ముల పరాక్రమం

[మార్చు]

యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాండీవమును సారించి కౌరవ సేనలోని రథములను, రథమునకు కట్టిన హయములను, ధ్వజములను, సారధులను, రథికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారీ పుత్రులు ఉక్కుమ్మడిగా అర్జునుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమసైన్యములతో అర్జునినికి సాయం వచ్చారు. భీముని కనుసన్నలలో పాండవసైన్యం, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యకి, శైభ్యుడు, ఘతోత్కచుడు, ఉప పాండవులు, చేకితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతుంది, దుర్యోధనుడు తన రథమును భీముని వైపు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు అతడికి సాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రథమును వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మ, ద్రోణులపై శరసంధానం చేసి వారిని శరములతో ముంచెత్తాడు. అర్జునినికి సాత్యకి సాయం వచ్చాడు. ఇద్దరూ కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథం విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరములతో వేధించారు. యుధిష్టరుడు భీష్మునితో పోరు సాగించారు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేసాడు. భీముడు వాటిని మధ్యలో ఆపి వేసి సుయోధనుని వక్షస్థలముకు గురి పెట్టి ఒక్క బాణం వేసాడు. ఆబాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్చిల్లాడు. కంగారుగా సారథి సుయోధనుని పక్కకు తొలిగించాడు. కౌరవ సేనలు ఇది చూసి భీతిల్లాయి. ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తరమ సాగాడు. భీష్మద్రోణులు కౌరవ సేనలతో " సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు కంగారు పడకండి పారిపోకండి " అని అరిచినా ప్రయోజనం లేక పోయింది. సాత్యకి, అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధు జనాలతో పారి పోయాడు. మరొక పక్క అర్జునుడు కౌరవ సేనలను తరమ సాగాడు. సుయోధనుడు మూర్చ నుండి తేరుకుని తన రథమును పక్కకు తీసుకు వచ్చినందుకు సారథి మీద కోపగించుకున్నాడు. భీష్మ, ద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారి పోకుండా ఆపారు.

సుయోధనుని నిష్ఠూరపు మాటలు భీష్ముని రౌద్ర రూపం

[మార్చు]

సుయోధనుడు భీష్మ ద్రోణుల వద్దకు వెళ్ళి " పితామహా ! మూడు లోకములు ఒక్కటిగా వచ్చినా ఒంటరిగా పోరి గెలువగల సమర్ధులు మీరు ఉండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి మీరు పాడవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చ చెప్పి యుద్ధమునకు తీసుకు వచ్చే వాడిని నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనం ఏమిటి " అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరు నవ్వు నవ్వి " సుయోధనా ! దేవ సేనతో ఇంద్రుడు వచ్చినా పాండవులను గెలుచుట సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నీవు ఇలా మాటాడ తగదు. నా వంటి వృద్ధులు, ఇప్పటికే సగం చచ్చిన వారు, దుర్బుద్ధి కల వారిచే పాండుకుమారులు ఓడి పోరు. నాకు చేతనయినంత వారితో పోరాడుతాను " అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాడవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. హూంకారములు, అదలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ సైన్యం వీర విహారం చేస్తున్నాయి. విరిగిన రథములు, మొండెములు, రక్తపు మడుగులు, పడిన గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధ భూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంత మంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో వేయి బాణములు పుడుతున్నాయి. పాడవ సేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముని ఎదిరించడం ఎవరి శక్యం కావడం లేదు. ప్రళయ కాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతమయ్యాయి. ఇది చూసిన శ్రీ కృష్ణుడు " అర్జునా ! ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి " అన్నాడు. అర్జునుడు " అలా అనకు బావా. రధమును భీష్ముని ఎదుటికి పోనిమ్ము అతడి పని పడతాను " అన్నాడు.

శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేత పట్టుట

[మార్చు]
దస్త్రం:Bhisma saved from Krishna.jpg
భీష్మునిపై దయ చూపిస్తున్న శ్రీకృష్ణుడు

అర్జునుడు తన ఎదుటికి రాగానే భీష్ముడు అర్జునిని రథానికి కట్టిన హయముల మీద, అర్జునిని మీద, శ్రీకృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. అది చీసిన అర్జునుడు భీష్మునిపై ఒకే బాణం సంధించి అతని విల్లును విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకుని కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించి నొప్పించాడు. కృష్ణుడు చిత్రవిచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ భీష్ముడి ఆ బాణముల బారి నుండి అర్జునుడిని తప్పిస్తూ వచ్చాడు. అర్జునుడు కూడా భీష్మునిపై క్రూరమైన బాణములు విడిచాడు. శ్రీకృష్ణుడు బాగా అలసి పోయాడు బాగా గాయపడిన అర్జునిని చూసి ఇలా అనుకున్నాడు " పాండవ సైన్యం భీష్ముని ధాటికి ఆగలేక పోతున్నాయి. అర్జునుడు బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇలా కొనసాగితే దుర్యోధనుని సమస్త కోరికలు భీష్ముడు ఈ రోజే నెరవేర్చగలడు. కేకయరాజులు, పాంచాలురు, యాదవులు పారి పోతున్నారు. కౌరవ సేనలు ఉన్మాదంతో ఊగి పోతున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదు భీష్ముని వధించి ధర్మ తనయిని గెలిపిస్తాను " అన్నాడు. ఇంతలో భీష్ముడు అర్జునినిపై శరవర్షం కురిపించాడు. అర్జునుడు శరసంధానం చేయలేక పోతున్నాడు. ఇది గమనించిన కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా అర్జునిని వైపు తమ రథాలను మరల్చారు. సాత్యకి తన గజ బలమును అర్జునినికి సాయంగా నిలిపాడు. సాత్యకి పాండవ సేనలను చూసి " ఎందుకు పారి పోతున్నారు మీరు పలికిన పలుకులు మరిచారా భీష్ముడు మనలను ఏమి చేయలేడు. కౌరవ సేనలను నరకండి తరమండి " సేనలను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు " సాత్యకీ ! పోయే పిరికి వారిని ఎందుకు ఆపుతావు ఈ రోజు నేను భీష్ముని చంపి ద్రోణుని పని పడతాను. కౌరవ సైన్యాలను నాశనం చేసి ఈ నాలుగు సముద్రముల నడుమ ఉన్న రాజ్యమంతా పాండు తనయునకు కట్టబెడతాను " అని పలికి సుదర్శన చక్రాన్ని మనసున తలచిన వెంటనే శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. పగ్గములను నొగల మీద పెట్టి కట్టు పంచ జారుతున్నా లక్ష్యపెట్టక కోపంతో రగిలి పోతూ భీష్ముని పైకి లంఘించాడు " కౌరవ సేనలు నిశ్చేష్టులై చూస్తూ ఊరక ఉన్నారు. భీష్ముడు పారవశ్యంతో రథం దిగి శ్రీకృష్ణునికి ఎదురు వెళ్ళి " కృష్ణా ! రావయ్యా! నన్ను సంహరించి కృతార్ధుడిని చెయ్యి " అని చేతులు జోడిస్తూ ప్రార్ధించాడు. ఇది చూసిన అర్జునుడు రథం దిగి శ్రీకృష్ణుని వెనుక నుడి పట్టుకున్నాడు. కాని శ్రీకృష్ణుని బలానికి ఆగలేక చతికిల పడి తిరిగి లేచి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకుని " కృష్ణా ! నీ కోపం వదలవయ్యా యాదవులకు పాండవులకు నీవే దిక్కు నీవే ఇలా అధైర్య పడి అలిగిన పాండు పుత్రుల అందునా ధర్మతనయుని ధైర్యం, పరాక్రమం, వీర్యం ఏమి కావాలి . లోక నాయకా శాంతించ వయ్యా నీ సాయంతో కౌరవ సేనను రూపు మాపుతాను నాకు అపకీర్తి తీసుకు రాకయ్యా " అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు శాంతించి కోపం ఉపసంహరించి తిరిగి రథం ఎక్కి పగ్గములు చేత పట్టాడు. కృష్ణార్జునులు పాచజన్య దేవదత్తములు పూరించారు.

అర్జునిని ప్రతాపం

[మార్చు]

కృష్ణార్జునుల శంఖారావం విన్న భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్క సారిగా అర్జునినిపై శక్తి, గదా, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు వాటిని అన్నింటిని ఒక్కసారిగా తుంచి వేసి వారిపై ఇంద్రాస్థాన్ని ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం కౌరవ సేనలను విధవిధాలుగా నాశనం చేసాయి. అర్జునుడు భీష్మునిపై అతి క్రూరమైన బాణములు వేసాడు, భూరిశ్రవుని విల్లు విరిచాడు, తొమ్మిది బాణములను శల్యునిపై సంధించాడు. పాంచాల విరాట సైన్యాలు అక్కడకు చేరాయి. అర్జునిని పరాక్రమం చూసి కౌరవ సేన బెదిరి పోయింది. కౌరవులు అందరూ కలసి అర్జునిని రథమును చుట్టుముట్టారు. ఇంద్రాస్త్ర తాపనాకి కౌరవ సేనలు చాప చుట్టలా పడి పోతున్నాయి. హయములు, రథములు, ఏనుగులు కూలి పోతున్నాయి. ఆయుధములు, ఛామరములు, కేతనములు, ఛత్రములు తుక్కు తుక్కుగా అయినాయి. కృషార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించి సింహనాదం చేసారు. అర్జునిని ధాటికి ఆగలేని కౌరవ సేన ఆరోజుకు యుద్ధాన్ని ఆపి తమ నివాసములకు చేరుకున్నాయి. వంధిమాగదులు పాండవుల విజయానికి కీర్తిస్తుండగా పాండవ సేనలు తమ నివాసములకు చేరాయి.

నాల్గవరోజు యుద్ధం

[మార్చు]

నాల్గవ రోజు యుద్ధానికి భీష్ముడు అపారమైన సైన్యాలను తీసుకుని వచ్చాడు. ద్రోణుడు, సుయోధనుడు, బాహ్లికుడు రణరంగం చేరుకున్నారు. భీష్ముడు భీకరంగా శంఖనాదం చేసాడు. గజ సమూహాలు ఘీంకారం చేసాయి. పాండవ సేనలు కూడా రణరంగ ప్రవేశం చేసాయి. కృషార్జునులు సూర్య చంద్రులలా ప్రకాశిస్తూ పాంచజన్య దేవదత్తములు పూరించారు. మిన్నంటే భేరి తూర్య నాదముల మధ్య ఇరుపక్షాలు యుద్ధ సద్ధం అయ్యాయి. ఇరు పక్షాలు తలపడ్డాయి. తోమరములు, క్షురికలు, బల్లెములు, గదలు, కుంతములు మొదలైన ఆయుధములతో కాల్బలం పోరు సాగిస్తుంది. కరవాలములు తిప్పబడుతున్నాయి. గదలు, ముసలములు, ముద్గరములతో ఒకరిని ఒకరు మోదుకుంటున్నారు. భీష్ముడు అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. సుయోధనుడు, ద్రోణుడు, వివిశంతి, కృపాచార్యుడు, శల్యుడు, సోమదత్తుడు భీష్ముని వెన్నంటి ఉన్నాడు. ఇది చూసిన అభిమన్యుడు ఒక్కడే వారినీందరిని ఎదుర్కొని వారంతా ప్రయోగించిన బాణములను తుంచి వేస్తున్నాడు. భీష్ముడు అభిమన్యుని విడిచి అర్జునినితో పోరాడుతున్నాడు. భీష్మార్జునుల పోరు భీకరం కాగానే ఇరు పక్షముల వారి అది తిలకించ సాగారు.

అభిమన్యుని ప్రతాపం

[మార్చు]

అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుని కుమారుడు, చిత్రసేనుడు ఒక్కుమ్మడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడూ చిరు నవ్వు నవ్వుతూ అశ్వత్థామ గుండెలకు గిరి పెట్టి బాణమును విడిచాడు. భూరిశ్రవుని ఓడించాడు. అభిమన్యుని వంటి వీరుడు కౌరవ సేనలో కరువయ్యారు. అర్జునుడు అభిమన్యుని చూస్తూ కౌరవ సేనలను అంతటా తానై చీల్చి ఛండాడుతున్నాడు. సుయోధనుడు సుశర్మ, కృతవర్మ, కేకయ రాజులతో ముప్పై అయిదు వేల రథికులతో అభిమన్యుని చుట్టుముట్టాడు. అర్జునుని కొంత దూరంలో చూసిన ధృష్టద్యుమ్నుడు తన రథమును అటు పోనిచ్చాడు. అర్జునిని దాటి ముందుకు వెళ్ళి కృపాచార్యునిపై మూడు శరములను, శల్యునిపై పది శరములను, కృతవర్మపై ఒక్క బాణమును వేసి వారి హయములను, రథములను కూల్చాడు.

శల్యుని కుమారుని మరణం

[మార్చు]

అప్పుడు శల్యుని కుమారుడు ధృష్టద్యుమ్నుని మీద పది శరములు సంధించి అతని సారథిని మరొక పది అమ్ములతో కొట్టాడు. ధృష్టద్యుమ్నుడు కోపించి ఒక బల్ల బాణంతో శల్య కుమారుని విల్లును తుంచాడు. నాగాస్త్రమును సంధించాడు. శల్యతనయుని రథమును, హయములను కొట్టాడు. శల్యతనయుడు కిందకు దిగి కత్తి డాలుతో శత్రువులను తనుమాడు తున్నాడు. ధృష్టద్యుమ్నుడు గదాయుధంతో శల్యకుమారుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుని గదాఘాతముకు శల్యకుమారుని కత్తి, డాలు విరిగి పోయాయి. రెండవ దెబ్బకే శల్యకుమారుని తల పగిపోయింది. కుమారుని మరణం చూసి శల్యుడు క్రుద్ధుడై ధృష్టద్యుమ్నునిపై అద్భుత బాణములను సంధించాడు.

దృతరాష్ట్రుడు యుద్ధ పరిణామమునకు వగచుట

[మార్చు]

సంజయుని ద్వారా యుద్ధవిశేషాలు వింటున్న ధృతరాష్ట్రుడు " అయ్యో సంజయా ! దైవ బలం ముందు మానవ బలం నిష్ప్రయోజనం అని తెలియక పోయింది కదా. పాండవులు మన సేనలను నిర్మూలం చేయడం తధ్యం . నా కుమారుని దుర్బుద్ధి వలనే కదా ఇది అంతయు సంభవించింది. ఇంతటి దుర్వార్తలు వినవలసి వస్తుంది కౌంతేయులను గెలుచు మార్గం గోచరించుట లేదు " అన్నాడు. సంజయుడు " రాజా ! ఇప్పుడే ఏమి చూసావు ఇంకా ఎంతో మంది వీరులు చనిపోయారు చెపుతాను విను . శల్యుడు ధృష్టద్యుమ్నుని మీద శరవర్షం కురిపించి వివిధములైన అస్త్రములతో నొప్పించాడు. అది చూసిన అభిమన్యుడు ధృష్టద్యుమ్నునికి సాయంగా శల్యుని మీదకు వచ్చాడు. ఇది చూసి సుయోధనుడు దుర్ముఖుడు, దుర్మషణుడు, సత్యవ్రతుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివిశంతి వారి వారి సేనలతో అభిమన్య, ధృష్టద్యుమ్నులను ముట్టడించారు. వారినందరిని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొని అందరి పైన బాణములు సంధించాడు. నకుల, సహదేవులు కూడా వారికి సాయంగా నిలిచారు. శల్యుడు వారిని బాణములతో వేదించి తరిమి కొట్టారు. పాంచాల, మత్స్య దేశాధిపతులు వారికి ఇరువైఫలా నిలిచి శల్యునితో యుద్ధం చేసి కౌరవ సేనలను తరిమి కొట్టాడు. ఇది చూసిన మిగిలిన సేన శల్యునికి సాయం వచ్చారు. అప్పటి సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. భీమసేనుడు తీవ్రకోపంతో నీకుమారుడైన సుయోధనుని ముందుకు గదాయుధము పట్టుకుని నిలిచాడు. అది చూసిన నీ కుమారుడు కలవర పడ్డాడు. సుయోధనుడు మగధ దేశాధీశుని గజ బలముతో భీముని ఎదుర్కొనమని చెప్పాడు. మగధ దేశాధీసుని గజబలమును చూసిన భీముడు చిరునవ్వుతో గదను తన భుజం మీద పెట్టుకున్నాడు. సింహనాదం చేస్తూ పర్వతముల పైన ఇంద్రుడు పడినట్లు గజసమూహముల మీద పడ్డాడు. ఆ సింహనాదంకే ఏనుగుల గుండెలు పగిలాయి. మిగిలిన వాటిని దొరికిన దానిని దొరికినట్లు భీముడు చంపివేస్తున్నాడు. ఇంతలో నకులసహాదేవులు, ధృష్టధ్యుమ్నుడు, ద్రౌపదీ తనయులు భీమునకు ఇరు వైపులా నిలబడి ఏనుగుల సమూహంపై శరవర్షం కురిపించారు. మగధ రాజు తన ఏనుగును అభిమన్యునిపై నడిపించగా అభిమన్యుడు ఒక్క బాణంతో ఏనుగును, మరొక బాణంతో మాగదుని కొట్టాడు. మగధరాజు వెంటనే మట్టి కరిచాడు. ధృష్టధ్యుమ్నుడు ఏనుగులను చీల్చి చెండాడాడు. భీముడు వాటిని కొట్టి చంపుతున్నాడు. కొన్నిటికి తొండములు తెగిపడగా కొన్నిటికి దంతములు తెగిపడ్డాయి, మరి కొన్నిటికి కుంభస్థలములు పగిలాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపడ్డాయి. భీముని శరీరం రక్తసిక్తమై ఉంది. భీముని ధాటికి ఏనుగులు పారిపోనారంభించాయి. భీమాదులు వాటిని పశువులను తోలినట్లు తోలారు. ఇది చూసిన సుయోధనుడు కకావికలౌతున్న తనసైన్యములను కూడదీసి సుయోధనుడు భీమునిపై పురికొల్పాడు.

భీముని ప్రతాపం

[మార్చు]

సముద్రం పొంగినట్లు భీముని మీదకు ఉరికిన కౌరవ సేనలను భీముడు చెలియలి కట్టలా నిలువ రించాడు. ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ఉప పాడవులు భీమునికి అండగా నిలిచి శరపరంపరలతో కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కార్చిచ్చు అడవిని కాల్చినట్లు భీమసేనుడు కౌరవ సేనలను దహిస్తున్నాడు. గజరాజు తామరతూడులతో ఆడినట్లు భీమసేనుడు కౌరవ సేనల మధ్య ఆడుకుంటున్నాడు. కౌరవ సేనలు గుండెలు జారి కకావికలై ప్రాణభయంతో పారిపోసాగారు. ఇది చూసిన భీష్ముడు తన రథాన్ని భీముని వైపు మళ్ళించాడు. అప్పుడు సాత్యకి భీష్ముని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన అలంబసుడనే రాక్షస వీరుడు సాత్యకితో తలపడి పది బాణములతో సాత్యకిని కొట్టాడు. సాత్యకి నాలుగు బాణములతో అలంబసుని కొట్టాడు. సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు సాత్యకిని తొమ్మిది బాణములతో కొట్టాడు. సాత్యకి భూరిశ్రవుని బాణవర్షంలో ముంచెత్తాడు. ఇది చూసిన సుయోధనుడు తన తమ్ములతో భూరిశ్రవునికి సాయంగా వచ్చాడు. అందరూ ఒక్కుమ్మడిగా సాత్యకిని చుట్టుముట్టారు. ఇది చూసిన భీముడు రెచ్చి పోయాడు. సుయోధనుని మీద అతని తమ్ముల మీద బాణవర్షం కురిపించాడు. భీముని ధాటికి ఆగలేక సుయోధనుని తమ్ములు తలొక దిక్కుగా పారి పోయారు. తమ్ముల అవస్థ గమనించిన సుయోధనుడు భీముని పైన తొమ్మిది బాణములు ప్రయోగించాడు. భీముడు నేలపై నుండి రథము ఎక్కి సుయోధనునిపై పది బాణములు వేసాడు. మూడు బాణములు సుయోధనుని సారథిపై వేసాడు. ప్రతిగా సుయోధనుడు భీమునిపైన అతని సారథిపైన అరవై బాణములు వేసాడు. ఒక బాణంతో భీముని విల్లు తుంచాడు. భీముడు మరొక విల్లందుకుని బల్లె బాణం సంధించి సుయోధనుని విల్లు తుంచాడు. సుయోధనుడు వేరొక విల్లు అందుకుని వజ్రసమాన బాణంతో భీముని గుండెలు గురి చూసి కొట్టాడు. ఆ దెబ్బకు భీమసేనుడు మూర్చిల్లాడు. అది చూసిన అభిమన్యుడు ధృష్టద్యుమ్న, ఉపపాడవులతో ఒక్క సారిగా సుయోధనుని పైన పడ్డారు. ఇంతలో భీమసేనుడు సేదతీరి ఒక్క సారిగా కౌరవ సేన పై పడ్డాడు. వారంతా శల్యుని పై, సుయోధనుని పై శరపరంపర కురిపించారు. సింహమును చూసిన ఏనుగులా కౌరవ సేన పలాయనం చిత్తగించింది.

దృతరాష్ట్రకుమారులను భీముడు హతమార్చుట

[మార్చు]

ఆ సమయంలో దృతరాష్ట్ర కుమారులైన సేనాపతి, సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, భీముడు, భీమరధుడు, భీమబాహుడు, దుష్ప్రదర్షుడు, వివిత్సుడు, దుర్ముఖుడు మరి కొందరు ఒక్కుమ్మడిగా భీముని ఎదుర్కొని భీమునిపై బాణవర్షం కురిపించారు. భీముడు వారిపై పెద్దపులి బాలమృగములపై పడినట్లు పడి సేనాపతి శిరము తుంచాడు. మూడు బాణములు వేసి సుషేణుని వక్షము చీల్చాడు. మూడు బాణములతో జలసంధుని చంపాడు, భీమబాహుని అయిదు బాణములతో చంపాడు, ఉగ్రుని శిరము తుంపాడు, భీముని, భీమరధుని ఒకేసారి చంపాడు. సులోచనుని నాలుగు బాణములతో చంపాడు. భీముని వీరవిహారం చూసిన కౌరవ సైన్యం భభ్రాంతులకు లోనై పారిపోయింది. భీముని ఉగ్రరూపం చూసిన భీష్ముడు తన సేనలోని యోధాను యోధులను చూసి " యోధులారా ! భీముడు రాజ కుమారులను నరుకుతున్నాడు. ఉపేంక్షించక భీమసేనుని ఆపండి " అని హెచ్చరించాడు. అది విన్న భగదత్తుడు భీముని మీదకు తన ఏనుగును నడిపి భీమునిపై సూర్యుని పై మేఘాలు కమ్ము కున్నట్లు శరవర్షం కురిపించించాడు. భీముని రథం కొంత సేపు కనిపించనంతగా బాణాలు వేసాడు. ఇది చూసిన అభిమన్యుడు, ఉప పాండవులు కోపించి భగదత్తుని ఏనుగుపై బాణవర్షం కురిపించారు. భగదత్తుని ఏనుగు అదుపుతప్పి ఘీంకరిస్తూ పాండవ సేనను తొక్కుతూ తొండంతో విసురుతూ ఇష్టం వచ్చినట్లు పాండవ సేనను చంపి వేసింది. ఇది చూసి పొంగిపోతూ సుయోధనుడు తన ఏనుగును భీముని మీదకు తోలి భీమున గుండెలను తాకేలా పలుబాణములు వేసాడు. భీముడు కొంతసేపు దిమ్మెర పోయాడు. ఇది చూసిన ఘతోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. సాయంకాలం సమీపించడంతో అది తన మాయా యుద్ధమునకు అనువైనదని అనుకుని ఏనుగు ఎక్కి కౌరవ సేనను ఎదుర్కొన్నాడు. అతడు దిక్పాలకులను వెంట పెట్టుకుని ఇంద్రుడే వస్తున్నాడా అని భ్రమ కలిగించాడు. ఘతోత్కచుడు సుయోధనుని మీదకు తన ఏనుగును పోనిచ్చాడు. భగదత్తుడు ఘతోత్కచుని అడ్డుకున్నాడు. ఘటోత్కచుడు భగదత్తుని పట్టుకుని ఏనుగును చంపి భగదత్తుని విసిరి వేసాడు. ఘతోత్కచుడు తిరిగి సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన భీష్ముడు ద్రోణునితో " ఆచార్యా ! మాయా యుద్ధంలో ఘతోత్కచుడు ఆరితేరిన వాడు. ఇప్పటికే భదత్తుని ఏనుగుతోసహా చంపాడు. భదత్తుని వంటి మహా వీరుని ఒక్క దెబ్బతో మట్టికరిపించిన ఘటోత్కచుని చేతిలో సుయోధనుడు పడకుండా కాపాడాలి " అని చెప్పి " కౌరవ వీరులారా ! ఘటోత్కచుని నుండి సుయోధనుని కాపాడాలి రండి ఘతోత్కచుని ఎదుర్కొనండి " అని సేనలను సమాయత్తం చేసాడు.

ఘటోత్కచుని యుద్ధం

[మార్చు]

ఇది చూసిన ఘతోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. సాయంకాలం సమీపించడంతో అది తన మాయా యుద్ధమునకు అనువైనదని అనుకుని ఏనుగు ఎక్కి కౌరవ సేనను ఎదుర్కొన్నాడు. దిక్పాలకులను వెంట పెట్టుకుని ఇంద్రుడే వస్తున్నాడా అని భ్రమ కలిగించాడు. ఘతోత్కచుడు సుయోధనుని మీదకు తన ఏనుగును పోనిచ్చాడు. భగదత్తుడు ఘతోత్కచుని అడ్డుకున్నాడు. ఘటోత్కచుడు భగదత్తుని పట్టుకుని ఏనుగును చంపి భగదత్తుని విసిరి వేసాడు. ఘతోత్కచుడు తిరిగి సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన భీష్ముడు ద్రూణునితో " ఆచార్యా ! మాయా యుద్ధంలో ఘతోత్కచుడు ఆరితేరిన వాడు. ఇప్పటికే భదత్తుని ఏనుగుతోసహా చంపాడు. భదత్తుని వంటి మహా వీరుని ఒక్క దెబ్బతో మట్టికరిపించిన ఘటోత్కచుని చేతిలో సుయోధనుడు పడకుండా కాపాడాలి " అని చెప్పి " కౌరవ వీరులారా ! ఘటోత్కచుని నుండి సుయోధనుని కాపాడాలి రండి ఘతోత్కచుని ఎదుర్కొనండి " అని సేనలను సమాయత్తం చేసి తనూ అక్కడకు చేరుకున్నాడు . భీష్ముని పిలుపందుకుని కౌరవ సైన్యం ఘతోత్కచుని పై ఒక్కుమ్మడిగా పడ్డారు. ఇది చూసిన యుధిష్టరుడు మత్స్య, పాంచాల సైన్యాలతో దండనాయకులను చేర్చుకుని కౌరవ సేనలను ఎదుర్కొన్నాడు. యుద్ధం భీషణ రూపందాల్చింది. భీష్ముడు పాండవ సేనలను వీరవిహారం చేస్తూ తనుమాడు తున్నాడు. ఘతోత్కచుడు సింహనాదం చేసాడు అతడి సింహనాదం విన్న కౌరవ సేనలు నిజంగానే సింహం వచ్చినదని భ్రమపడి కకావికలై పోయారు. ఇది చూసిన భీష్ముడు ద్రోణునితో " ఆచార్యా ! సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఘతోత్కచుని బలం ఇక ద్విగుణీకృతం ఔతుంది కనుక ఇప్పుడు అతనితో పోరు ఆపదకు దారి తీస్తుంది కనుక మనం ఈ రోజుకు పోరు నిలిపి రేపు వస్తాము అన్నాడు. ద్రోణుడు అందుకు అంగీకరించి కౌరవ సేనలను వెనుకకు మరల్చాడు. భేరి, తూర్య, భీషణ గోషతో , సింహనాదం చేసుకుంటూ పాండవ సేనలూ నివాసములకు చేరాయి.

తనవారి పరాజయమునకు దృతరాష్ట్రుడు పరితపించుట

[మార్చు]

ఇది విన్న దృతరాష్ట్రుడు " సంజయా ! నీవు ఎప్పుడూ పాడవుల పరాక్రమం చెప్తూ నా వారిని తక్కువ చేసి మాట్లాడుతావు. భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు యుద్ధంలో పరాక్రమం చూపడం లేదా ! అయినప్పటికి పాండవులు విజయం సాస్ధించుటకు ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " ధృతరాష్ట్రా ! పాండవుల వద్ద ధర్మం, సత్యం తప్ప ఏ మంత్రం, తంత్రం, ఔషధం లేదు. నీ కుమారులు ధర్మం తప్పారు. వారు అధర్మ మార్గాన నడవడం నీకు తెలిసినా నీవు అది ఆపలేదు. ధర్మమేవజయతే అన్నది ఆర్యోక్తి కనుక పాండవుల విజయం కౌరవుల అపజయం సత్యము. విదురుడు చెప్పినది తెలుసుకదా ! నీలానే సుయోధనుడు భీష్ముని అడిగాడు. అందుకు భీష్ముడు ఏమి చెప్పాడో చిత్తగించండి " అని ఇలా చెప్ప సాగాడు.

భీష్ముడు నరనారాయణుల గురించి సుయోధనునికి వివరించుట

[మార్చు]

సుయోధనుని సందేహం తీర్చడానికి భీష్ముడు " సుయోధనా ! పాండవులకు వాసుదేవుడు సాయంగా ఉన్నాడని కనుక వారికి అసాధ్యం అయినది ఏదీ లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను నీవు విన లేదు. ఆ పరమేశ్వరుని మహాత్యం ఎరిగిన వారు ఎవరూ లేరు ఎరిగిన వారికి అపజయం లేదు పాండవులు శ్రీకృష్ణుని మహత్యం తెలిసిన అతడిని ఆశ్రయించారు. నీవు అతడి మాటలు పెడచెవిన పెట్టావు. ఒక సారి బ్రహ్మదేవుడు మానసరోవరం ఉత్తర పర్వత శిఖరాన దేవతలు, మునులు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారితో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు ఆకాశమార్గాన ఒక విమానం ఎగురుతూ ఉండటం చూసి ఆ విమానంలో పరమాత్ముడు తన సఖునితో ఉన్నాడని తెలుసుకుని దిగ్గున లేచి నమస్కరించి " ఈ లోకముల సృష్టి, స్థితి, లయ కారకుడవై మునిగణములతో అర్చించబడుతూ భయనిర్మూలనం గావించు నిర్గుణ మూర్తికి శుభకరుడికి ఇదే నమస్కారం " అని స్తుతించాడు. " నారాయణా ! నీవు నా తండ్రివి నేను నీ ఆనతిన సృష్టి కార్యము నెరవేర్చాను. నీ రక్షణలో వర్ధుల్లుతున్న ఈ లోకములు ఇప్పుడు తల్లడిల్లి పోతున్నాయి. అసుర ప్రవృత్తి ప్రబలుచున్నది. నీవు యదు వంశమున పుట్టవ వలసిన సమయం ఆసన్నమైంది. నీకు సఖుడైన నరుడు నీతో చేరి భూలోకమున జన్మించి నానా విధ దైత్యులను సంహరించి భూభారమును తగ్గించ వలసిన సమయమూ ఆసన్నమైంది స్వామి " అన్నాడు. నారాయణుడు బ్రహ్మదేవునికి కోరిన వరం అనుగ్రహించి వెళ్ళి పోయాడు. బ్రహ్మ కొలువులో ఉన్న వారు బ్రహ్మదేవునితో " దేవా ! నీవు వినమ్రుడవై నమస్కరించిన వీరెవరు ? " అని అడిగారు. బ్రహ్మ " వీరు ఆది పురుషులు పరమ మునులు నరనారాయణులు నాకు ఆరాధ్యులు అందుకే ధర్మసంరక్షణార్ధం వారిని భూలోకాన జన్మించమని కోరాను అందుకు వారు అంగీకరించారు. భూలోకమున జన్మించు వీరిని కేవలం మర్త్యులు అని అనుకున్న వారు చెడి పోతారు. వారి ఏడల భక్తి ప్రపత్తులు కనబరిచిన వారికి సకల శుభములు కలుగగలవు " అని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళగా మిగిలిన వారు కూడా వారి వారి లోకాలకు వెళ్ళారు. సుయోధనా నేను ఈ కథను పరశురాముడు, నారదుడు, వ్యాసుడు చెప్పగా విన్నాను . ఇంతకు మునుపే నేను, మహా మునులు నారనారాయణులతో వైరం మంచిది కాదని హెచ్చరించాము. కాని నీవు మదాంధుడవై వారి మాట విన లేదు . ఇప్పటికీ మించినది లేదు శ్రీకృష్ణుని శరణు వేడి పాండవులతో స్నేహం చేసి ఈ వినాశనాన్ని ఆపు " అన్నాడు. నీ కుమారుడు పితామహుని మాట పెడచెవిన పెట్టాడు. రాజా ! నువ్వు నీ కుమారులు మంచి మాటలు వినరు కదా ! అది సరే అయిదవరోజు యుద్ధం చెప్తాను విను " అని తరువాతి యుద్ధం వర్ణించ సాగాడు.

అయిదవరోజు యుద్ధం మకర వ్యూహం డేగవ్యూహం

[మార్చు]

అయిదవ రోజు యుద్ధానికి కౌరవ సేనల భీష్ముని సారథ్యంలో మకర వ్యూహంలో నిలిచాయి. ప్రతిగా పాండవ సేనలు శ్యేన వ్యూహంలో నిలిచాయి. వ్యూహాన్మికి ముఖ భాగాన భీమసేనుడు నిలబడ్డాడు. కన్నుల భాగాన ధృష్టద్యుమ్నుడు, శిఖండి నిలబడ్డారు. తల భాగాన సాత్యకి నిలిచాడు. మెడభాగాన అర్జునుడు నిలువగా ఎడమ రెక్కగా విరాటుడు, ద్రుపదుడు ససైన్యంగా నిలిచారు. కుడి రెక్క భాగాన కేకయరాజులు ససైన్యంగా నిలిచారు. తోక భాగాన నకులసహదేవులతో యుధిష్టరుడు నిలిచాడు. భేరి, తూర్య, శంఖనాదాలతో యుద్ధం ఆరంభం అయింది. ముందు భాగాన ఉన్న భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకొని పోయి సేన్యాన్ని కకావికలు చేసాడు. నేరుగా భీష్ముని ఎదుర్కోని శరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలోనే తుంచి తిరిగి భీమునిపై శరవర్షం కురిపించాడు. ఇంతలో అర్జునుడు భీమునికి సాయంగా రావడమే కాక భీష్మునితో తలపడి కౌరవ సేనలను చీల్చి చెండాడాడు. భీమార్జునులు కౌరవ సేనలను తనుమాడుతున్న సమయంలో సుయోధనుడు కలత పడి " ఆచార్యా ! మీరు కౌరవ సైన్యాలను పట్టి పల్లారుస్తారని అనుకున్నాను. భీష్ముడు అలిగిన దేవతలు కూడా అతని ముందు నిలువ లేరు అనుకున్నాను. కాని మీరిరువురు భీమార్జునుల విజృంభణను ఆపలేక చూస్తూ ఉన్నారేమిటి " అని నిష్టూరంగా అన్నాడు. ద్రోణుడు " సుయోధనా ! అర్జునుడు శౌర్యధనుడు. అతడి జయించుట అసాధ్యం అని నేను ముందే చెప్పాను. అయినా మాకు చేతనయినంత యుద్ధం చేస్తాము. యుద్ధాన్ని ఒక్క రోజులో గెలవడం ఎవరి తరం " అన్నాడు.

పాండవులతో ద్రోణ, భీష్ముల యుద్ధం

[మార్చు]

సాత్యకి ముందుగా ద్రోణుని మీద బాణవర్షం కురిపించాడు. ద్రోణుడు ప్రతిగా సాత్యకి మీద బాణ ప్రయోగం చేసాడు.ఇది చూసిన భీముడు సాత్యకి సాయంగా రథాన్ని నడిపిస్తూ వచ్చి చేరి ద్రోణునిపై అతి క్రూర బాణాలు సంధించాడు. ఇది చూసిన శల్యుడు ద్రోణ, భీష్ములకు బాసటగా నిలిచి భీమునిపై బాణవర్షం కురిపించాడు. ఇంతలో ద్రౌపతీ సుతులు, అభిమన్యుడు భీమునకు సాయంగా వచ్చారు. శిఖండి భీష్మిని ఎదుర్కొన్నాడు. భీష్ముడు పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన సుయోధనుడు ద్రోణుని శిఖండి మీదకు పురికొల్పాడు. ద్రోణుడు శిఖండిపై బాణాలను గుప్పించాడు. పోరు భీకర రూపం దాల్చింది. రథ, గజ, తురగ, పదాతి దళముల పదఘట్టనల హోరు మిన్నంటింది, ధూళి ఆకాశాన్ని కప్పేసింది. గుర్రముల ప్రేగుల గుట్టలు, ఏనుగుల కళేబరములతో రణభూమి భయానకంగా ఉంది. రక్తం కాలువలు కట్టింది. భీమార్జునుల, భీష్మ ద్రోణులు ఇరువైపులా నిలిచి భీకర పోరు సాగిస్తున్నారు.

భీమసేనుని పరాక్రమం

[మార్చు]

దృతరాష్ట్ర కుమారులంతా చేరి భీమునిపై మూకుమ్మడిగా పడ్డారు. ఎత్తైన కొండను మేఘాలు కప్పినట్లు భీమసేనుని ఎదుర్కొన్న నీ కుమారులను చూసిన అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చి వారి పై శరములు గుప్పించాడు. అర్జునిని గాండీవతాకిడికి ఆగలేక కౌరవ సేనలు భీష్ముని వెనుక చేరాయి. తన సేనలు పారిపోవడం చూసిన సుయోధనుడు చేయి వూపుతూ అక్కడకు చేరగానే అది గమనించిన కంభోజ, సౌవీర, సింధు, గాంధార, త్రిగర్త, కళింగ రాజులు తమ సేనలతో అక్కడకు చేరి భీమార్జునులను ఎదుర్కొన్నారు. ఇది చూసిన ధర్మరాజు చేది, కాశ, కరూస, విరాట సేనలను ధృష్టద్యమ్నునుని నాయకత్వంలో భీమార్జునులకు సాయంగా తీసుకు వచ్చాడు. విందాను విందులు కాశీరాజుని, జయద్రధుడు భీమసేనుని, సహదేవుని వికర్ణుడు, చిత్రసేనుడు శిఖండిని, సుయోధనుడు విరాటుని, త్రిగర్తలు నకులుని, ద్రోణుడు చేకితాన, సాత్యకులను, కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుని, అభిమన్యుడు సాళ్వ కేకయరాజులను, ధృష్టకేతు, ఘటోత్కచులు నీకుమారులను ఎదుర్కొన్నారు. సమరం సంకులమైంది. అస్త్ర, శస్త్రములు ఒకదానితో ఒకటి తాకి మంటలను రేపుతున్నాయి. ఏనుగుల ధాటికి నలిగిన రథములు రథముల ధాటికి దెబ్బతిన్న ఏనుగులు, గుర్రముల ధాటికి నేల కూలిన పదాతి దళములు యుద్ధరంగాన్ని బీభత్సం చేసాయి. భీముని పరాక్రమం చూసి భీష్ముడు వాడి అయిన బాణములు వేసి అతడిని నొప్పించాడు.

పాండవ కౌరవ సేనల మధ్య సంకుల సమరం

[మార్చు]

ఇది చూసిన సాత్యకి క్రూర బాణములను భీష్మునిపై గుప్పించాడు. భీష్ముడు కుపితుడై సాత్యకి సారథిని చంపాడు. సాత్యకి రథం ఊగిసలాడింది. రథముకు కట్టిన గుర్రములు కకావికలై పోగా వికల రథుడైన సాత్యకితో పోరు సల్ప ఇష్టపడక భీష్ముడు అతడిని విడిచి పాండవ సైన్యాలపై తన ప్రతాపం చూపసాగాడు. ఇంతలో విరాటుడు భీష్ముని ఎదుర్కొని మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలో త్రుంచి పది బాణములతో విరాటుని కొట్టాడు. భీష్ముని ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునిని అశ్వథ్థామ అడ్డం వచ్చి ఆరు బాణములతో అర్జునిని కొట్టాడు. అర్జునుడు నవ్వుతూ అశ్వథ్థామ విల్లును విరిచాడు. అశ్వథ్థామ మరొక విల్లందుకుని అర్జునిని మీద శరపరంపర కురిపించాడు. అశ్వథ్థామ అస్త్ర, శస్త్ర ధాటికి నరనారాయణులు బాగా నొచ్చుకున్నారు. కుపితుడైన అర్జునుడు అశ్వథామ శరీరాన్ని బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసాడు. భీష్ముని ఎదుర్కొన్న భీముని సుయోధనుడు అడ్డుకుని అయిదు బాణములు ప్రయోగించి భీముని కవచాన్ని ఛేదించాడు. ఇరువురి మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది. సుయోధనునికి సాయంగా భీష్ముడు, చిత్ర సేనుడు, పురుమిత్రులు వచ్చారు. వారిని అభిమన్యుడు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అభిమన్యుని బాణములను వారిరువురు సమర్ధవంతంగా ఎదుర్కొని అభిమన్యునిపై బాణవర్షం కురిపించాడు. అభిమన్యుడు కోపించి వేసవిలో అడవిని దావాగ్ని దహించిన విధంగా బాణపరంపర ప్రయోగించి చిత్ర సేనుని విల్లు విరిచి అతడి రథాశ్వాలను చంపాడు. అలా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న అభిమన్యుని సుయోధన కుమారుడైన లక్ష్మణ కుమారుడు ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ముందు లక్ష్మణుని గుర్రములను చంపి తరువాత సారథిని చంపి అతని రథమును విరుగ కొట్టాడు. విరధుడైన లక్ష్మణుడు శక్తి బాణమును అర్జునిపై ప్రయోగించాడు. అభిమన్యుడు దానిని మధ్యలోనే విరిచి లక్ష్మణుని శరీరం తూట్లు పడేలా బాణ ప్రయోగం చేసాడు. ఇది గమనించిన కృతవర్మ లక్ష్మణుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు పోయాడు. సుయోధనుడు తన సేనలను పోరుకు ఉత్సాహపరిచాడు. భీష్ముడు పాండవ సేనుని తనుమాడ సాగాడు. సాత్యకి తన శరములతో కౌరవ సేనలను చికాకు పరుస్తున్నాడు. ఇది గమనించిన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఎదుర్కొని సాత్యకిని చికాకు పరిచాడు. సాత్యకి పుత్రులు భూరిశ్రవుని ఎదుర్కొని " భూరిశ్రవా ! నీతో యుద్ధం చేసి వినోదించడానికి వచ్చాము. కనుక మాలో ఒకరిని ఎన్నుకుని నీ పరాక్రమం చూపించు " అన్నారు. భూరిశ్రవుడు " మీరంతా ఒక్కటిగా వచ్చినా నాకు భయం లేదు " అన్నాడు. వారంతా ఒక్కుమ్మడిగా బాణవర్షం భూరిశ్రవునిపై కురిపించగా భూరిశ్రవుడు వారిని శరపరంపరలో ముంచెత్తాడు. వీరోచితంగా పోరాడుతున్న సాత్యకి పుత్రులను భూరిశ్రవుడు వారి తలలు నరికి నేల కూల్చాడు. ఇది చూసిన కౌరవ సేనలోఉత్సాహం పెల్లుబికింది. తనకుమారుల మరణం సాత్యకిని ఆగ్రహోదగ్రుని చేయగా కౌరవ సేనపై విరుచుకు పడి దొరికిన వారిని దొరికినట్లు చంపి భూరిశ్రవుని రథాశ్వములు, సారథిని చంపాడు. భూరిశ్రవుడు కూడా సాత్యకి రథం విరుగ కొట్టాడు. ఇరువురు నేల మీదకు దుమికి కరవాలంతో యుద్ధం చేయసాగారు. ఇంతలో సాత్యకిని భీముడు భూరిశ్రవుని సుయోధనుడు తమ తమ రథములపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు. అర్జునుడు కౌరవ సేన మీదకు దూకి తన శరపంపరతో కౌరవ సేనుని నుగ్గు నుగ్గు చేసాడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్న తరుణంలో భీష్ముని ఆదేశంతో ఆనాటి యుద్ధం ముగుసింది.

ఆరవరోజు యుద్ధం

[మార్చు]

ఆరవ రోజు యుద్ధానికి అర్జునిని సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాలను మకర వ్యూహములో నిలిపాడు. తల ముందు భాగంలో అర్జునుడు, పాంచాలరాజు, కన్నుల భాగంలో నకుల సహదేవులు, నోటి భాగంలో భీముడు అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు దవడలుగా సాత్యకీ సమేత యుధిష్టరుడు కంఠభాగమున, ధృష్ట ద్యుమ్న సహిత విరాటుడు వెన్నుభాగమున, ఎడమ పక్క కేకయరాజులు, కుడి పక్క దుష్టకేతు, కరూశరాజు, కుంతిభోజ, శతానీకులు జఘన భాగమున శిఖండి, ఇరావంతుడు తోకభాగమున నిలిచారు. ఈ మరవ్యూహమునకు దీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహమును పన్నాడు. తలభాగమున కృతవర్మ సేనలతో నిచిచాడు. ద్రోణుడు, భీష్ముడు ముక్కు భాగమున నిలిచారు. కృపాచార్యుడు, అశ్వథామ కన్నులుగా నిలిచారు. శూరసేనుడితో సహా సుయోధనుడు కడుపుభాగమున నిలిచారు. కాంభోజ బాహ్లికులు కంఠ భాగమున నిలిచారు. సౌవీరుడు వీపు భాగమున నిలిచారు. విందానువిందులు ఏడమ వైపున, సుశర్మ కుడిపక్కన, యవన రాజు, శ్రుతాయువు, భూరి శ్రవుడు తోక వైపు నిలిచారు. యుద్ధం ఆరంభం కాగానే మకర వ్యూహ తలవైపు చొరబడుతున్న ద్రోణుని చూసి భీముడు తన రథాన్ని అతని మీదకు నడిపాడు. భీముని ధాటికి ద్రోణుని ముందు ఉన్న సేనలు పోరి పోవడం చూసి ద్రోణుడు ఉగ్రుడై భీమునిపై క్రూర బాణములు ప్రయోగించాడు. భీముడు ద్రోణుని సారథిని చంపాడు. తానే రథాన్ని తోలుతూ ద్రోణుడు వైరి వీరులను చెండాడు తున్నాడు. ఇది చూసి భీష్ముడు ద్రోణునికి సాయంగా వచ్చాడు. భీష్మద్రోణుల ప్రతాపానికి కేకయ రాజులు భయంతో వెనక్కి తగ్గారు. ఇది చూసిన భీముడు కౌరవ సేనలను చావకొట్టి చాపలా చుట్టి పారేస్తున్నాడు. ధర్మరాజు, సుయోధనులు తమ తమ సేనలను చేతులు ఆడిస్తూ ప్రోత్సాహ పరుస్తున్నారు. ఇరు సేనలు ఉత్సాహంగా పోరుతున్నారు.

దృతరాష్ట్రుని సందేహం

[మార్చు]

ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాలు వింటూ సంజయునితో " సంజయా ! మన సేనలో ఎంతో మంది ఉండి కూడా పాండవులను గెలవ లేక పోవడానికి కారణం ఏమిటి?. ఇది దైవ లీల కాక మరేమిటి? ఇలా జరుగుతుందని విదురుడు ముందే చెప్పాడు. దుర్మార్గుడైన నా కుమారుడు వినలేదు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు కదా! " అని విరక్తి చెందాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడు తెలియని వాడు. యుక్తా యుక్త వివేచన లేని వాడు. నాడు జూదం ఆడినప్పుడే మనం ఊరుకోకుండా ఆపి ఉంటే ఈ దారుణ యుద్ధం సంబవించేది కాదు కదా ! ఇక పశ్చాతాపం మాని యుద్ధక్రమాన్ని ఆలకించు " అన్నాడు. ఆ సమయంలో భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకుని పోతూ దృతరాష్ట్ర కుమారులైన దుశ్శాసనుడు, జయుడు, దుస్సహుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, చారుమిత్రుడు, సుదర్శనుడు, సువర్ముడు, దుష్కరణుడు ఒకచోట ఉండటం గమనించి రథాన్ని వారి ముందు నిలిపాడు. అది చూసి వారు " అడుగో భీముడు వాడిని అందరం కలసి చంపుతాము రండి " అని తమ సేనలతో ఒక్క సారిగా చుట్టుముట్టారు. భీముడు తన సారథితో చెప్పి రథాన్ని అక్కడే నిలిపి దిగి కాలి నడకన వారిని ఎదుర్కొని యుగాంతమున యమధర్మరాజు వలె కౌరవ సైన్యాన్ని చంపసాగాడు. ఏనుగుల కుంభస్థలములను మోదుతూ, హయములను చంపుతూ రథములను నుగ్గు చేస్తున్నాడు. నేలపై నిలబడి అందరితో ఒక్కడై యుద్ధం చేస్తున్నాడు. ద్రోణునితో యుద్ధం చేసి అలసి పోయిన ధృష్టద్యుమ్నుడు ఆ ప్రదేశానికి వచ్చి భీముని రథం చూసి ఖిన్నుడై సారథిని " భీముడెక్కడ ? అతడు నా బహిర్ప్రాణం అతడు లేక నేను ఉండ లేను " అని అడిగాడు. సారథి " మహారాజా ! అడుగో భీముడు నన్ను ఇక్కడ నిలిపి తాను అక్కడ ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు " అని భీముని చూపాడు. ధృష్టద్యుమ్నుడు భీముని చెంతకు వెళ్ళి " భీమసేనా ! నీ పరాక్రమం చూపు నేను కూడా నీకు సాయంగా కౌరవ సేనలను నుగ్గు చేస్తాను " అని కౌరవ సేనలను చేండాడం మొదలు పెట్టాడు. అది చూసిన నీ కుమారుడు " ఈ ధృష్టద్యుమ్నుని వదలకండి చంపండి " అన్నాడు. అది విని అతని సోదరులు ధృష్టద్యుమ్నుని చుట్టుముట్టారు. ధృష్ట ద్యుమ్నుడు తన గురువు ప్రసాదించిన ప్రమోహనాస్త్రం వదిలాడు. నీ కుమారులంతా మూర్చిల్లారు. భీముడు పక్కనే ఉన్న మడుగు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుని ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు తప్పుకున్న తరువాత పాంచాలరాజు ద్రోణునితో యుద్ధానికి తలపడ్డాడు. ద్రోణుని ధాటికి ఆగలేక పాంచాలరాజు పక్కకు తప్పుకున్నాడు. తన నుండి తప్పుకున్న ధృష్టద్యుమ్నుడు ఎక్కడా అని పరికించి చూడగా కౌరవ సేనలు ప్రమోహనాస్త్రానికి కట్టుబడ్డారని గ్రహించి ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి వారిని విముక్తులను చేసాడు. మూర్చ నుండి తేరుకున్న నీ కుమారులు ద్రోణుని అండ చూసుకుని భీమసేన ధృష్టద్యుమ్నుల మీదకు తిరిగి ఉరికారు.

యుధిష్టరుడు ధృష్టద్యుమ్నుడికి సాయం పంపుట

[మార్చు]

ఇది చూసిన యుధిష్టరుడు కేకయరాజులు, ఉపపాండవులను, ధృష్టకేతులను చూసి " మీరంతా అభిమన్యునితో కలసి భీమ, ధృష్టద్యుమ్నులకు సాయం వెళ్ళండి " అని ఆదేశించారు. వారి సాయంతో భీముడు పాదచారియై ఊచకోత కోస్తున్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. అతడు మరొక విల్లు తీసుకోగానే దానిని కూడా విరిచాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు అభిమన్యుని రథం ఎక్కాడు. అది చూసిన పాండవ సేనలు వెనుకక తగ్గాయి. సుయోధనుడు భీముని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుని సారథి మరొక రథం తీసుకు వచ్చి అందులో అతడిని ఎక్కించుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు తిరిగి ద్రోణుని ఎదుర్కొన్నాడు. విశోకుడు రథం తీసుకు వచ్చి భీముని ఎక్కించుకున్నాడు. భీముడు సుయోధనుని పై బాణములు గుప్పించాడు సంధించాడు. సుయోధనుడు భీముని శరములతో కప్పాడు. నీ కుమారులు ఎలాగైనా భీమును పట్టాలని ముందుకు కదిలారు. అభిమన్యుడు, ధృష్టకేతు, ఉపపాండవులు వారిని ఎదుర్కొన్నారు. భీముడు కూడా వారిని తరిమి కొట్టాడు. " ఈరోజుకు నా చేతిలో చచ్చారు " అంటూ వారిని తరుముతున్న భీముని సుయోధనుడు భీముని ఎదుర్కొమ్మని సైన్యాలను పురికొల్పాడు. భీమసుయోధనుల మధ్య పోరు సంకులమైంది. వికర్ణుడు, చిత్రసేనునితో కలిసి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఇరవై బాణములు ప్రయోగించి వికర్ణుని రథాశ్వములను కొట్టాడు. వికర్ణుడు చిత్రసేనుని రథం ఎక్కి పారిపోయాడు. ఉపపాండవులు భీమునికి అండగా వచ్చి సుయోధనుని ఎదుర్కొని సుయోధనుని శరీరాన్ని రక్తసిక్తం చేసారు. అయిదు బాణాలతో సుయోధనుని నొప్పించారు. గంగేయుడు పాండవ సేనను ధ్వంసం చేస్తుంటే అర్జునుడు గాంగేయుని ఎదుర్కొన్నాడు. రక్తం ఏరులై ప్రకాశిస్తున్నా యోధు లిరివురు ప్రారాక్రమాన్ని విడువక పోరు సాగిస్తున్నారు. వాయు నందనుడైన భీముడు సుయోధనుని ఎలాగైనా సంహరించాలన్న తలపుతో అతడికి ఎదురుగా నిలిచి " సుయోధనా ! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. కుంతీ దేవి దుఃఖం , ఆమె కోడలు ద్రౌపది పగ తీర్చుకునే సమయం వచ్చింది. నాడు శ్రీకృష్ణుని మాటలు లక్ష్య పెట్టనందుకు ఉలూకుని చేత పరుషమైన మాటలు పలికించినందుకు నా పరాక్రమంతో సమాధానం చెప్తాను " అని పలుకుతూ సుయోధనుని రథాశ్వాలను చంపి, కేతనమును విరుగకొట్టి, రథసారథిని చంపి, అతని విల్లు విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక విల్లు అందుకునే లోపల అతనిపై పది బాణములు విడిచాడు. సుయోధనుని శరీరం నుండి రక్తం పెల్లుబుకి మూర్చ వచ్చినంత పనైంది. ఇంతలో జయద్రధుడు తన సైన్యంతో వచ్చాడు. కృపాచార్యుడు తన రథంలో ఎక్కించుకుని సుయోధనుని తీసుకు వెళ్ళాడు. అభిమన్యుడు, ఉపపాండవులతో కలిసి భీమునితో జధ్రధ సైన్యాలను ఎదుర్కొన్నారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు రౌద్రంతో అభిమన్యునితో పోరాడుతున్నారు. అభిమన్యుడు వారిని ఎదుర్కొని ఒక్కొక్కరిని అయిదు బాణములతో కొట్టి వారి శరీరాన్ని రక్తసిక్తం చేసాడు. వికర్ణుడు మరొక రథం ఎక్కి సోదరులకు సాయం వచ్చాడు. అభిమన్యుడు వికర్ణుని విల్లుతుంచి, సారథిని చంపి, రథాశ్వములను చంపి, కేతనమును విరిచాడు. ఇది చూసిన కురు కుమారులు ఒక్క సారిగా అభిమన్యునిపై పడ్డారు. ఉపపాండవులు అభిమనునికి అడ్డుగా నిలిచి కురుకుమారులను ఎదుర్కొని వారి కేతనములు విరిచి వారిపై బాణవర్షం కురిపించాడు. నీ కుమారులు వారి ధాటికి ఆగలేక పోయారు. నకులుని కుమారుడైన శతానీకుడు తన సైన్యముతో కేకయ పాంచాల రాజులకు సాయం వచ్చి వారితో కలిసి కౌరవ సేనుని తనుమాడసాగారు. సూర్యుడు అస్తమించచగానే భీష్ముడి సూచన మేరకు ఆరవరోజు యుద్ధం చాలించారు.

బయటి లింకులు

[మార్చు]