Jump to content

భోజరాజీయం

వికీపీడియా నుండి
(భోజరాజీయము నుండి దారిమార్పు చెందింది)
భోజరాజీయము
కృతికర్త: అనంతామాత్యుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1952, 1969


భోజరాజీయము 15వ శతాబ్దంలో రచించబడిన ప్రసిద్ధిచెందిన తెలుగు ప్రబంధము. దీనిని అనంతామాత్యుడు రచించెను.

ఇది రెండు వేల తొంబై రెండు పద్యాలతో కూడిన ఏడు ఆశ్వాసాల పద్య ప్రబంధం. ఇందులో మూడు పెద్ద కథలు, ఆ కథల్లో చిన్న కథలు, ఆ చిన్నకథలకు ఉపకథలు అల్లుకొని కావ్యరూపంలో శోభిల్లుతున్నాయి.

కవి జీవిత విశేషాలు

[మార్చు]

అనంతామాత్యుడు కృష్ణా మండలంలో నివసించేవాడు. ఇతడు 15వ శతాబ్దపు మొదటి భాగంలో నివసించేవాడు. ఇతనికి అనంతుడు అనే పేరు కూడా ఉంది. ఇతని తండ్రి తిక్కనామాత్యుడు, తల్లి మల్లాంబిక. ఇతనికి ఆరుగురు తోబుట్టువులు. కవి విశేషంగా అహోబల నరసింహస్వామి భక్తుడు. ఇతడు భోజరాజీయముతో బాటు, రసాభరణము, ఛందోదర్పణము అనే గ్రంథాలను రచించి; మూడింటిని భగవంతునికి అంకితం చేశాడు.

కథా సంగ్రహం

[మార్చు]

ఈ కావ్యం లాట దేశాధీశుడైన మహునికి దత్తాత్రేయుడు ప్రయాగాది క్షేత్ర మహాత్మ్యాలను చెబుతూ భోజ వృత్తాంతం వివరించడంతో ప్రారంభమౌతుంది. ఇది భోజ సర్పటుల మధ్య అనేక కథలతో నడచి భోజునకు అభినవ భోజుడు జన్మించి తన వంశాన్ని విస్తరింప జేయడంతో అంతమౌతుంది.

నిరాహారి సదాబ్రహ్మచారుల మహిమ, చెప్పుగూడతో పాయసం తోడి ఆతిథ్యమిచ్చిన ఫలితం, ఇంద్రుడు చెప్పిన మంటిముద్ద యోగికి పెట్టడం వలన కలిగే ఫలితం కథ, తినగా మిగిలిన అన్నం పెట్టిన ఫలితంగా ఛండాల దంపతులుగా పుట్టిన వైనం, పుష్పగంధి చరిత్ర, ఎలుక కథ, విప్ర ప్రభావం, రత్నమండనుడు బ్రహ్మ రాక్షసునికి చెప్పిన గోవ్యాఘ్ర సంవాదం, పులి ఆవుకు చెప్పిన చాకిత చెరచగా తపోమహిమ తగ్గి పందిగా పుట్టిన యోగి వివరం, ఆవు చెప్పిన మదనరేఖ పావకలోముల వృత్తాంతం, తండ్రి చెల్లెలి కొడుకును, తల్లి అన్న కొడుకును కాక పిచ్చుకుంటును పెండ్లాడిన రాజకుమార్తె కథ, అన్నదానం చేసే మరదిని వదినలు వేరింట కాపురం పెట్టించిన వైనం, అల్పాశనం పెడిచే వచ్చేఅనర్థం, విష్ణువు పరీక్షిస్తే ఇసుకను చెరిగి వండిపెట్టిన స్త్రీ వైనం, అన్నదాన ఫలితం, వంజరోపాఖ్యానం లాంటి కథలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.

ఇందులోని మరొక ఉన్నతమైన కథ పుష్పగంథి వృత్తాంతము.[1] భోజరాజీయములో జననమాది వివాహ పర్యంతముగా అభివర్ణితమైన పాత్ర పుష్పగంధి ఒక్కతియే. ఆనాడు యమునితో వాదించి భర్త ప్రాణములను పొందిన సావిత్రితో పోల్చదగిన మహత్తర శీలవతి పుష్పగంధి. అపురూప సౌందర్యవతిగా అద్భుత ప్రజ్ఞాపాటవములు కలిగిన మనోహరమూర్తిగా, విద్యావతిగా, ధైర్యశాలినిగా పుష్పగంధి పఠితల నలరిస్తుంది.

ధర్మో రక్ధతి రక్షితః అనే ఆర్యోక్తి ప్రకారం ఈ కథలన్నింటిలో ధర్మపరిపాలన మహిమ ప్రతి కథకు మకుటంగానో, ఫలశ్రుతిగానో నిబంధించబడి ఉంది. ఇవన్నీ మానవ జీవన ధర్మ ప్రబోధకాలు.

మూలాలు

[మార్చు]
  1. "అంతర్జాల పత్రిక పొద్దులో పుష్పగంధి". Archived from the original on 2016-03-04. Retrieved 2014-02-04.