మంగళగిరి వస్త్రాలు
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లోని మంగళగిరి ప్రాంతంలో నేయబడుతున్న హస్తకళ.[1] ఈ కళకు భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం గుర్తింపు చిహ్నం లభించింది.[2]
చరిత్ర
[మార్చు]ఈ చేనేత వృత్తి సుమారు 500 సంవత్సరాల నుండి కొనసాగుతున్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది.కుతుబ్ షాహీ రాజ్య పరిపాలనలో అప్పటి పన్నుల భారం భరించలేక కొంతమంది చేనేత కార్మికులు వలస పోయారు.[3]
విశేషాలు
[మార్చు]చేనేత కళకు పుట్టినిల్లుగా ఉన్న మంగళగిరి సాంప్రదాయ చీరలకు పెట్టింది పేరు. మంగళకరమైన సందర్భాలన్నింటికీ మంగళాన్నిచ్చే చీరగా మంగళగిరి చీరకు గుర్తింపు ఉంది. ఈ చీరలు దేశ విదేశాలలో ఖ్యాతి పొందాయి. ఈ చీరలలో సుమారు వంద రకాల డిజైన్లు ఉంటాయి. ఒకే రంగుతో కూడిన చీరలకు కలంకారీ కళను ఇక్కత్ శైలిని జోడించి ఇక్కడి కళాకారులు వస్త్రాలను రూపొందిస్తారు.
వస్త్రం, అద్దకం
[మార్చు]ఒక వస్త్రం పడుగు పేకల ద్వారా దారాలను మగ్గము ద్వారా అల్లి వస్త్రాలను నేస్తారు. ఆ తరువాత ఈ వస్త్రాన్ని టై, డై పద్ధతిలో అద్దకం చేస్తారు.[4][5] "నిజాం డిజైన్" అనేది ఈ వస్త్రం యొక్క మరియొక లక్షణం.[6]
చీరలు
[మార్చు]జరీ, ట్రైబల్ డిజైన్లతో ప్రత్తి నుండి తయారుచేస్తున్న ఏకైక ప్రసిద్ధ చీరలు ఈ మంగళగిరి చీరలు. ఈ చీరలను స్థానికంగా గల నరసింహ దేవాలయంలో అర్చనచేయు సందర్భంగా వాడుతారు.[3]
జాతీయ హోదా
[మార్చు]జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని నాణ్యత, ప్రమాణాలున్న చేనేత చీరలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచన చేసింది ప్రభుత్వం. అందుకు దేశవ్యాప్తంగా వున్న చేనేత సంఘాలు, నేతల నుంచి తమ ఉత్పత్తుల్ని ఆహ్వానించింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, జమదాని ఇలా దేశంలో 76 రకాల పేరుబడ్డ చేనేత వస్త్రాలన్నీ నాణ్యతగల 'భారత చేనేత బ్రాండ్' గుర్తింపు కోసం పోటీపడ్డాయి. అలా తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడ్డ చేనేత చీరల్లో మన మంగళగిరి నుంచి పణిదపు వీరాస్వామి తయారుచేసిన చీర నెంబర్‌వన్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇలా మంగళగిరికి చెందిన మాస్టర్స్ వీవర్స్ అసోసియేషన్ సభ్యుడు వీరాస్వామి చేతిలోపడి మంగళగిరి చీర 'భారత చేనేత బ్రాండ్' గుర్తింపుతో మరోసారి తన గత వైభవపు ఉనికిని చాటుకుంది. పడుగు, పేక (నిలువు, అడ్డం) 80 కౌంట్‌గల అల్లిక, నిజామ్ డిజైన్ బోర్డర్, నాణ్యతగల రంగుల అద్దకం వంటి అంశాలు వీరాస్వామి రూపొందించిన చీరను నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాయి. ఇప్పుడు మంగళగిరి చీరంటే 'ఇండియా హ్యాండ్‌లూమ్'కే బ్రాండ్ అంబాసిడర్.[7]
నిజాం డిజైన్స్
[మార్చు]ఒకప్పుడు అంటే పాతిక ఇరవై ఏళ్ల క్రితం మంగళగిరి చేనేత వస్త్రాలంటే కేవలం పెద్దవయసు వారికే అన్నట్టుగా ఆ పరిధిలోనే వ్యాపారాలు సాగేవి. అప్పటిదాకా ఉన్న డిజైన్ల స్థానంలో నిజాం నిర్మాణాలను పోలిన డిజైన్లతో బోర్డర్లను (చీర అంచు) రూపొందించడం మొదలుపెట్టాక వ్యాపారసరళి మారింది. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా నిజాం డిజైన్స్‌తో మంగళగిరి చీరలు క్రమేణా మార్కెట్‌ని పెంచుకోవడం ఆరంభమైంది. నాటి నుంచి పిన్నలకూ పెద్దలకూ అందాన్నిచ్చే చీరలు మొదలుకొని, పంజాబీ డ్రెస్ మెటీరియల్, మగవారు ధరించే దుస్తులు వరకూ ఇలా మంగళగిరి ఉత్పత్తులో వైవిధ్యం పెరిగింది. ఇప్పటికీ మంగళగిరి చీరల్లో నిజామ్ బోర్డర్ డిజైన్‌లకే గిరాకీ ఎక్కువ. దీనికి కూడా ఓ కారణం ఉంది. అప్పట్లో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నిజామ్ డిజైన్లని చీర బోర్డర్లో నేయడం కేవలం మంగళగిరి చేనేతకారుల వల్లే సాధ్యమయ్యింది. ఆ కళానైఫుణ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Geographical Indication". The Hans India. 23 January 2016. Retrieved 24 January 2016.
- ↑ "State Wise Registration Details of G.I Applications" (PDF). Geographical Indication Registry. p. 6. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 24 January 2016.
- ↑ 3.0 3.1 "The Exquisite Sarees of Mangalagiri". AP Tourism Blog. Archived from the original on 1 ఫిబ్రవరి 2016. Retrieved 25 January 2016.
- ↑ Raparla, Deepa (10 May 2005). "The magnificent mangalagiri". The Hindu. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 24 January 2016.
- ↑ Rao, R. V. Rural Industrialisation in India: The Changing Profile (in ఇంగ్లీష్). Concept Publishing Company. p. 54. ISBN 9788170220176. Retrieved 24 January 2016.
- ↑ "APCO-The Andhra Pradesh State Handloom Weaves Co-Operative Society Limited". APCO Fabrics. Archived from the original on 2016-01-14. Retrieved 2016-01-26.
- ↑ "మంగళగిరి చీరలకు వీరస్వామీ భారత్ బ్రాండ్!!". Archived from the original on 2015-12-20. Retrieved 2016-01-26.