మంచీ-చెడూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంచీ-చెడూ అన్నది శారద (అసలు పేరు ఎస్.నటరాజన్) 1953-54 మధ్యకాలంలో రాసిన నవల. నవల జరిగిన ప్రాంతం విజయవాడ, కథాకాలం 1950.

రచనా నేపథ్యం[మార్చు]

మంచీ చెడూ నవలను రచయిత శారద 1953-54లో రచించారు. విజయవాడ నేపథ్యంగా, 1950లు రచనా కాలంగా స్వీకరించి ఈ నవల రాశారు. రచయిత శారద అసలు పేరు ఎస్. నటరాజన్. ఏడో తరగతి చదువుతున్న సమయంలో చదువు వదిలిపెట్టి, మద్రాసు నుంచి తెనాలి ముసలి తండ్రితో పాటుగా వచ్చేశారు శారద. ఆయన బంధువు ఎల్లాప్రగడ భీమారావు హోటల్లో పనికి కుదిరి, కష్టపడి తండ్రినీ, తననీ పోషించుకునేవారు. ఆ వయసులో తెలుగు తెలుసుకుని, కూడబలుక్కుని అక్షరాలు నేర్చుకుని సాహిత్యం చదవడం ప్రారంభించారు. ఆయన జీవన నేపథ్యం నవలకు తాత్త్విక భూమిక సమకూర్చిందని విమర్శకుల అభిప్రాయం. ఆయన నివసించిన తెనాలి పట్టణం కూడా రచనకు నేపథ్యాన్ని సమకూర్చింది. తెనాలిలోనే నాస్తికోద్యమం, నవ్య మానవవాదం, మార్క్సిజం వంటివి ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో శారద రచించిన మంచీ చెడూ నవలను 1953, 1954 కాలంలో ఆంధ్రపత్రికలో నవలను సీరియల్ గా ప్రచురించారు.[1]

ఇతివృత్తం[మార్చు]

ఒకప్పుడు నాగాయిలంక వాస్తవ్యులైన సుదర్శనం, భద్రయ్యలు విజయవాడలో జాయింట్ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం వారికి బాగా లాభించింది. భద్రయ్య ఏకైక కుమారుడు భాస్కరం చెన్నైలో ఇంటర్ చదువుతున్నాడు. భద్రయ్య భార్య మరణించినా సంసారం పట్ల విరక్తి ఉన్నదా అనిపించేలా కాలం గడిపేశాడు. చిన్ననాటే భర్త పోయిన సోదరి వంట చేసి, ఇల్లు గడుపుతూంటే లోటు తెలియకపోయినా స్నేహితుడు సుదర్శనం ఆడదిక్కు లేకుండా కుటుంబం పడివుండకూడదంటూ భద్రయ్యని రెండో పెళ్ళికి ఒప్పించాడు. అప్పటికే సుదర్శనానికి మూడో పెళ్ళి అయింది. భద్రయ్యని పెళ్ళికి ఒప్పించి, పేదరికంతో కుమార్తె పెళ్ళి చేయలేకపోతున్న తన దూరపు బంధువు కూతురుని తెచ్చి ఇంట్లో విడిది చేయించి పెళ్ళి చూపులు జరిపించారు.
అప్పుడే యౌవనంలోకి అడుగుపెట్టి దీపకళికలాగా ఉన్న పెళ్ళికూతురు పద్మని చూసి భద్రయ్య మతిపోయింది. ఐతే మధ్యవయసు గడిచిపోయి, వార్థక్యం మీదపడుతున్న భద్రయ్యని చూసి ఎటూ ఈ పెళ్ళి తప్పదు, ఈయనే కాస్త జుట్టు నల్లబడి, ముడతలు పోయి ఏదో శక్తి వల్ల పాతికేళ్ళ వయసు తరిగిపోతే బావుణ్ణని పద్మలో ఊహలు నడిచాయి. నీ ఇష్టం చెప్పమని సుదర్శనం అడిగితే, ఏమీ చెప్పలేక లోపలికి వెళ్ళిపోయింది.మౌనాన్నే అంగీకారంగా తీసుకుని పద్మకి భద్రయ్యతో వివాహం జరిపించారు. తనంత ఎత్తు ఎదిగిన కొడుకు భాస్కరానికి పెళ్ళి సంగతి చెప్పడానికి భద్రయ్య మొహం చెల్లలేదు. పరీక్షలు ముగించుకుని విజయవాడ రాగానే అతనికి విషయం తెలిసింది. లేత వయసులో ఉన్న అమ్మాయిని, వృద్ధాప్యంలోకి జారుకుంటున్న తండ్రి పెళ్ళిచేసుకోవడం అతని మనసును చివుక్కుమనిపించి, అయ్యో ఎంత దారుణం అనుకున్నాడు.
కొడుకు వరస అయ్యే భాస్కరాన్ని గురించి ఊహల్లో తేలి, ఉద్రేకంతో ఊగిపోయింది పద్మ. అతన్ని కట్టిపడేసుకోవాలని ఆఖరి నిమిషంలో చాలాసార్లు ధైర్యం కోల్పోయి, రక్తంలో ఇంకిపోయిన సాంసారిక ధర్మాలు వెనక్కిలాగగా వెనకడుగు వేసింది. నిజానికి భాస్కరాన్ని గురించి పొరపాటు అంచనా వేసి దెబ్బతింది.
సుదర్శనానికి జీవితంలో అతిపెద్ద విషాదం ఆయన కూతురు సరోజినికి ఒక ప్రమాదంలో నుదురు, కళ్ళు తప్ప మొహం అంతా కాలిపోయి మాడిపోయి ఉండడం. శరీరలావణ్యం, శ్రావ్యమైన కంఠం వంటి అన్ని గుణాలు ఉన్నా ఇది పెద్ద లోపంగా ఉండడంతో ఆమె నిరంతరం మేలిముసుగు వేసుకునే ఉంటుంది. భాస్కరరావును అల్లుణ్ణి చేసుకోవాలని సుదర్శనం ఆరాటపడ్డా మేలిముసుగు తొలగిన సరోజిని ముఖం చూసి భాస్కరం షాక్ కు గురవుతాడు. ఈ జన్మకి అసలు పెళ్ళే చేసుకోనంటాడు. దీనితో సుదర్శనం, భద్రయ్యల మధ్య వ్యాపార బంధం తెగిపోతుంది, తప్పుడు లెక్కలు కట్టి భద్రయ్యని పగపట్టి ముంచేస్తాడు సుదర్శనం. కుంగిపోయిన భద్రయ్య గుండెపోటుతో మరణిస్తాడు. దెబ్బ మీద దెబ్బగా భాస్కరం, పద్మ, భద్రయ్య సోదరి ఉంటున్న అద్దె ఇల్లు కాలి సమస్తం బూడిదైపోతుంది. భాస్కరం బట్టల కొట్టులో గుమాస్తాగా కుటుంబాన్ని నడుపుకొస్తూంటాడు.
భర్త పోయిన నాలుగు నెలలకే పద్మ ప్రవర్తన, వేషంలో మార్పు వచ్చింది. ఎదుటి డాబా కుర్రాడు తనకేసి వెకిలిగా చూస్తూ, పది రూపాయల నోటు రెపరెపలాడిస్తే ముందు చీదరించుకున్నా క్రమంగా లోబడిపోయింది. డబ్బు, శారీరక సుఖాలకు లొంగిపోయిన ఆమె గర్భవతి కావడంతో ముఖం చెల్లక కృష్ణకి స్నానానికి వెళ్ళి ఆడపడుచు కళ్ళుగప్పి గుడివాడ చేరుకుంది. అక్కడి నుంచి బందరు చేరింది. బిడ్డ పుట్టింది, పోషించడానికి చేతులు మారింది. జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది.
సుదర్శనం డబ్బు ఎరచూపి సరోజినికి ఓ పనికిమాలినవాణ్ణి ఇచ్చి పెళ్ళి చేశాడు. సానికొంపలు మరిగిన అతను, తగిలించుకున్న సుఖవ్యాధులు అమాయకురాలైన భార్యకు అంటించాడు. డబ్బుయావతో మామని ఆర్పేయాలని చూసినా, ఘటికుడైన సుదర్శనం అతని వేషాలకు లొంగలేదు. చివరకి సరోజిని భర్త అంటించిన రోగాలతో వేగి వేగి మరణించింది. కూతురు శవంపై పడి ఏడ్చిన సుదర్శనం, తేరుకుని అల్లుణ్ణి అవతలకి గెంటి తలుపేసుకున్నాడు. సుదర్శనం అల్లుడి ప్రాపకంలో ఆ కొన్నాళ్ళు పద్మ సుఖంగానే జీవించింది, అతను అధోగతి పాలవడంతో దారితప్పినవాళ్ళ వాడలో పూరిగుడిసెలోకి మారింది.
పెద్దమనుషుల్లా చలామణి అయ్యే దొంగలు, రాక్షసుల్లాంటి పోలీసులు పీక్కుతినగా శవప్రాయంగా మారిపోయిన పద్మకు ఆ చీకట్లో వెలుగులా భాస్కర్రావు ఎదురయ్యాడు. పిన్నిని పెద్దమనసుతో ఇంటికి ఆహ్వానించినా నిరాకరించింది. నేనెలాగూ అగాథంలో పడ్డాను, దీనిలోంచి బయటపడడం అసంభవం. నువ్వు పాపను తీసుకెళ్ళు అని కోరగా నిద్రపోతున్న పాపను కన్నీళ్ళతో భాస్కరం భుజాన వేసుకుని బయలుదేరడంతో నవల ముగుస్తుంది.

మూలాలు[మార్చు]

  1. (జంపాల ఉమామహేశ్వరరావు), సహవాసి (హైదరాబాద్). నూరేళ్ళ తెలుగు నవల. 2015: పర్ స్పెక్టివ్స్. pp. 103–108. {{cite book}}: Check date values in: |date= (help)CS1 maint: location (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మంచీ-చెడూ&oldid=1884193" నుండి వెలికితీశారు