మంజరీ మధుకరీయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఒక తెలుగు నాటిక. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు. ని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు.

కథ[మార్చు]

రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది. మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది. ఆమె సిగ్గుతో తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన పుట్టింటినుంచి మంజరి చెలికత్తె ఆమోదరేఖను రప్పించి, రాజకుమారికి ఆమె యౌవనం వివరించమని చెబుతుంది.

ఆమోదరేఖ సకల విద్యాప్రవీణ. ఆమె వల్ల వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గు పడుతుంది. రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా కుంభస్తని అనే చేటిక వచ్చి, చండయోగిని అనే యోగినిని చూడ్డానికి మంజరిని అంతఃపురానికి పిలుచుకొని పోతుంది. చండయోగిని క్షుద్ర మంత్రోపాసకురాలు. సామంతరాజకన్యలకు గురువు. మంజరి ఇద్వాంసురాలని ప్రసిద్ధి పొందినందున, ఆమెను వాదంలోనో మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని ఓడి పోతుంది.

ఆమోదరేఖకు సంయమి అనే స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. విరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోదరేఖా మంజరులకు వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒక రాజచంద్రునితో రతి సుఖ మనుభవించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు.

ఒకనాడూ మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించుకొని ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని కలుసుకున్న మధుకర రాజపరమేశ్వరుడు విరహి అయి అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరిపోతున్న హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న ఇద్దరిని ఒక ఇనుప పెట్టెలో బంధించి దాచి, మధుకరునితో పోరాడి మరణించాడని చెప్పింది. పెట్టె ఏమైందో మధుకరునికీ తెలీలేదు.

మంజరి వార్త తెలియక విలపిస్తున్న, అగ్నిప్రవేశం చేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక మణిఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి వస్తుందని, రాజయోగిని శాపంతో హండయోగిని పిచ్చిదై పోయిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనసు ఊరట చెందుతుంది.

మధుకర చక్రవర్తి భార్య హేలావతి ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్టె పడుతుంది. ఆమె ఆ పెట్టె తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు ఉండడం చూచి ఆశ్చర్య పడి వారిని అంతఃపురంలో రాజు కంట పడకుండా దాచింది. రాజు విచారంగా ఉండడానికి కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని కుంభస్తని అనే చేటి విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు.

విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.

జు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.


మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ[మార్చు]

ఆమో – హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా మంజరి – అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని నెమ్మనంబున నమ్మెదనే. ఆమో – హళా ఇట్లుంటివేమే మం – అత్తికా, నీవు నా చెంగట నుంటివే ఆమో – హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు గదా మం – అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే ఆమో – యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే మం – కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే ఆమో – ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు మం – అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే

మూలాలు[మార్చు]