Jump to content

మచిలీపట్నం

వికీపీడియా నుండి
(మచిలీపట్టణము నుండి దారిమార్పు చెందింది)
మచిలీపట్నం
మాసులిపట్టణం, మాసుల, బందర్
కోనెరు సెంటర్, మచిలీపట్నం
కోనెరు సెంటర్, మచిలీపట్నం
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
స్థాపన14వ శతాబ్దం
Government
 • Typeమేయర్
 • Bodyమచిలీపట్నం నగరపాలక సంస్థ
 • శాసనసభ సభ్యుడుపేర్ని వెంకటరామయ్య (నాని) ([వైఎస్సార్సీపీ])
 • రెవెన్యూ డివిజనల్ అధికారియన్. యస్. కె. ఖాజావలి
విస్తీర్ణం
 • Total26.67 కి.మీ2 (10.30 చ. మై)
Elevation
14 మీ (46 అ.)
జనాభా
 (2011)
 • Total1,69,892
 • జనసాంద్రత6,875/కి.మీ2 (17,810/చ. మై.)
భాష
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్
521 xxx
ప్రాంతీయ ఫోన్‌కోడ్91-8672
Vehicle registrationAP-16

మచిలీపట్నం (బందరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తీర నగరం, జిల్లా కేంద్రం. ఇక్కడ 350 పడవల సామర్ధ్యం గల సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డులకు ప్రసిద్ధి.[1][2][3] ఇక్కడి తీరప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యం, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.

చరిత్ర

[మార్చు]

ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలంలో నుండి ఉందని, దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తుంది. దీనిని మసూలిపట్నం లేదా మసూల బందరు, మచిలీ బందరు అని పూర్వం పిలిచేవారు. మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అని పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు.

ఇంకొక కథనం ప్రకారం, మచిలీపట్నాన్ని మసుల అనీ మససోలియ అని గ్రీకు రచయితలు రాసారు. థీని అసలు పేరు మహాసాలిపట్నమ్. అథే మహాసలిపట్నమ్, మసిలిపట్నమ్ , మచిలిపట్నమ్ గాను కాలక్రమంలో మార్పు చెందింది. ఇక్కడినుండి రోము నగరానికి సన్ననేత వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఇది సాలీలు నివాసం. ఆదే దాని అసలుపేరు.

తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 1659 లో బ్రిటిషు వారు ఫ్రెంచివారిని మసూలిపటం ముట్టడిలో ఓడించి, వారి స్థావరాన్ని ఆక్రమించారు.[4]

భౌగోళికం

[మార్చు]

నగరం 16°10′N 81°08′E / 16.17°N 81.13°E / 16.17; 81.13 అక్షాంశరేఖాంశాలతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో వుంది.[5]

ఇది సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఇంది.[6]

సమీప పట్టణాలు

[మార్చు]

పెడన, గుడివాడ, రేపల్లె.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • హిందూ కళాశాల: పురాతన కళాశాల.
  • ఆంధ్ర జాతీయ కళాశాల (నేషనల్ కాలేజి). ఈ కళాశాలను కోపల్లె హనుమంతరావు 1910 లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ రెండు సార్లు విడిది చేశారు. ఈ కాలేజికి అడవి బాపిరాజు మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు.
  • కృష్ణా విశ్వవిద్యాలయం
  • దైతా మధుసూధన శాస్త్రి శివా ఇంజినీరింగ్ కళాశాల (స్థాపన 1981), మచిలీపట్నం
  • నోబుల్ కాలేజి
  • లేడీ యాంప్తెల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల.
  • సరస్వతీ ప్రాథమికోన్నత పాఠశాల:- విద్యను ఉచితంగా అందించవలెనను ఉద్దేశంతో, సర్కిల్‌పేటలోని ఈ పాఠశాలను, శ్రీ వేదాంతం యోగానందనరసింహాచార్యులు, 1928లో, ఏర్పాటుచేసారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలయిన చిన ఉల్లంగిపాలెం,పెద ఉల్లంగిపాలెం, ఎస్.సి.వాడ, రెల్లికాలనీ, ఫతులాబాద్, జలాల్‌పేట, తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ఈ పాఠశాలలో చేరుతారు.

సంస్కృతి

[మార్చు]

కలంకారి అద్దకం , ఇతర కళలు

[మార్చు]

మచిలీపట్నపు కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినవి. దుస్తులు, తివాచీలు, గోడకు వేలాడతీసే వస్తువులు (వాల్ హేంగింగ్స్) మొదలైనవి కలంకారీ చేసే వస్తువులలో ముఖ్యమైనవి. కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. కలం అంటే ఒక రకమైన పెన్ను. వెదురు బొంగుకి చివర ఖద్దరు గుడ్డ చుట్టి దానితో దుస్తుల మీద కాని తివాచీల మీద కాని రంగులు పులుముతారు. ఈ రంగులు నూనెగింజల నుండి లేదా కూరగాయల నుండి తయారు చేస్తారు. ఈ కలంకారీ పనిలో ఉతకడం, పిండడం, నానబెట్టడం, చలువ చేయడం (బ్లీచింగ్), కొన్ని మోడరెంట్లు, రంగులు కలపడం చేస్తారు.

నీలం రంగుకు నీలిమందు, ఎరుపు కొరకు మంజిష్ఠ, పసుపుపచ్చ కోసం మామిడి చెక్క, ఎండు కరక్కాయ, నలుపురంగు కోసం తాటిబెల్లం, తుప్పుపట్టిన ఇనుములను ఉపయోగిస్తారు. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ. కొన్ని చిన్న భాగాలు చేత్తో గీసినా, విస్తారమైన పెద్ద వస్తువులను అచ్చుతో అద్దుతారు. పౌరాణిక కథలు, పాత్రలు చిత్రించబడి గోడకు వేళ్ళాడదీసుకొనే వస్తువుల తయారీకి కాళహస్తి పేరుపొందినది. అదే విధంగా మచిలీపట్నం, చీరలలో ఉపయోగించే అచ్చుతో అద్దిన పెద్ద వస్తువులకు పెట్టింది పేరు. మచిలీపట్నంలో అచ్చులతోనూ, చేతితోనూ వేసే అద్దకం పనిలో పూలూ, మొక్కల డిజైన్లతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ అద్దకం పనులు స్థానిక పాలకుల ఆదరం పొందడమే కాక, బాగా ఎగుమతి కూడా అయ్యేవి. ఈ ఎగుమతులు మచిలీపట్నంపై ఐరోపా వర్తకులకు మోజు కలిగించాయి.

బందరు లడ్డు

[మార్చు]

బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు. గత 50 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో ఉన్నారు.బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాల కులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డులో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు.

సాహిత్య సంస్థలు

[మార్చు]

"సాహితీమిత్రులు" పేరుతో మినీకవిత పితామహుడు రావి రంగారావు వ్యవస్థాపకాధ్యక్షుడిగా గత 30 సంవత్సరాలనుండి ఈ సంస్థలో కృషిచేస్తున్నాడు. ఇప్పటివరకు సంస్థ పక్షాన 62 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 2000లో శతావధానం, 2001లో ద్విశతావధానం, కవిత్వశిక్షణ వర్కుషాపులు అనేకం నిర్వహించబడ్డాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
మచిలీపట్నం సాయిబాబా మందిరం
మచిలీపట్నం బీచ్ వద్ద సూర్యోదయం
  • శ్రీ పాండురంగస్వామి దేవాలయం, మచిలీపట్నం: ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురంలో ఉన్న దేవాలయం వలే ఇక్కడ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయంలోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం, గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావంతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.
  • మంగినపూడి బీచ్: మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారంగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రం లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాలలో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తారు.
  • శ్రీ దత్త ఆశ్రమం, మంగినపూడి: మైసూర్ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చే ప్రతిష్టించబడిన దత్తాత్రేయ అవతారాలైన శ్రీ నరసింహ సరస్వతి  పాదుకలున్నాయి . ఆశ్రమoలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ షోడశ రూపాలైన ఒకరు శ్రీ అనఘా దేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు.  బందరు బస్టాండు నుంచి 1 కి.మీ. లోపలే నే చేరుకోవచ్చును . ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైంది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ పన్నెండు బావులు నక్షత్ర  ఆకారం లో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.[7] అందువలన దీనిని దత్తరామేశ్వరం అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు.
  • ఘంటసాల: మచిలీపట్నానికి 21 కి.మీ. దూరములో ఉన్న ఈ గ్రామంలో పురాతన బౌద్ధ స్థూపాలు ఉన్నాయి.

ఇవీ చూడండి

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

మచిలీపట్నానికి చెందిన ప్రముఖులలో కొందరు:

సినీరంగ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Preparation of Bandar Laddu". Archived from the original on 2007-09-29. Retrieved 2007-08-23.
  2. "Heralding spring". Archived from the original on 2006-05-13. Retrieved 2007-08-23.
  3. "Catering for the Sweet tooth". Archived from the original on 2006-06-26. Retrieved 2007-08-23.
  4. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
  5. "redirect to /world/IN/02/Machilipatnam.html". fallingrain.com.
  6. "Machilipatnam Town". web.archive.org. 2017-06-08. Archived from the original on 2017-06-08. Retrieved 2021-01-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. http://www.dattapeetham.com/india/festivals/birthday99/history.html దత్తపీఠం

వెలుపలి లంకెలు

[మార్చు]