Jump to content

మడికి సింగన

వికీపీడియా నుండి
మడికి సింగన
జననం1425
మడికి
మరణం1500
జాతీయతభారతీయుదు
వృత్తికవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పద్మ పురాణోత్తర ఖండం, జ్ణాన వాశిష్ట రామాయణం.

మడికి సింగన (1425-15౦౦) ప్రముఖ కవి. ఈయన జీవన కాలం 1400-1450 అని, 1425-1500 అనీ రెండు వాదనలున్నాయి. ఈయన తండ్రి నివసించిన తూర్పుగోదావరి జిల్లా మడికి గ్రామం పేరే వీరి ఇంటి పేరు అయింది. మడికి సింగన తండ్రి తొయ్యేటి అనపోత భూపాలుని దగ్గర మంత్రిగా ఉన్నాడు. తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని, తొలి భాగవత భాగాన్ని (దశమస్కంధం) వెలువరించిన కవిగా సింగనను పేర్కొనడం జరిగింది. ఈ రెండు కావ్యాలు సబ్బి మండలం (కరీంనగర్ జిల్లా) లోని రామగిరి ప్రభువు గురజాల ముప్పభూపతి మంత్రి వెలిగందల కందనామాత్యునికి అంకితం కావటంవల్ల 1420-1440 మధ్య కావ్యరచన చేశాడని నిర్థారించవచ్చని తెలుగు సాహిత్య చరిత్రలో ఆచార్య ఎస్వీ రామారావు ప్రస్తావించారు.

సింగన కవి తన 40 ఏట పద్మ పురాణం రచించాడు. సింగన ఈ కావ్యాన్ని కందనమంత్రికి అంకితం ఇచ్చాడు.

జీవన కాలం, జీవన సంగ్రహం

[మార్చు]

సింగన తాను రచించిన పద్మ పురాణము ద్వారా రచనా కాలం శాలివాహన శకం సుమారు 1342 అని పేర్కొన్నాడు. దీని ప్రకారం సింగన 1375 ప్రాంతములోనివాడుగా చరిత్రకారులు చెపుతారు. అతడు తన 45 వ యేట పద్మపురాణం రచించాడు. తండ్రి అయ్యలమంత్రి గోదావరికి ఉత్తర దిక్కున పెద్దమదికిలో స్థిరమైన తోటలూ, పొలాలూ చాలా ఆర్జించి అఖిల జగత్తుకు అన్నదాత అన్న పేరుతో జీవించాడు. ఈ అయ్యల మంత్రి తొయ్యేటి అనపోతనాయుని మంత్రిగా ఉన్నాడు. ముసునూరి కాపయ నాయునికి ప్రతినిధిగా అనపోతనాయకుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. కాపయనాయుని కాలం సా.శ.1345 నుండి సా.శ. 1367 వరకు, ఆ తరువాతి తరంతో లెక్క చేసినా మడికి సింగన 1377 ప్రాంతం వాడవుతాడు.

తొయ్యేటి అనపోతభూపతి పరిపాలన తరువాత మడికి వంశం వారు రామగిరి దుర్గానికి వలస పోవలసి వచ్చింది. ఈ వంశంలో వలసలు వెళ్ళడం కొత్త కాదు. అసలు మడికి వారి వంశానికి ఆ పేరు రాక పూర్వం వాళ్ళు గుంటూరు జిల్లా గుంటూరు తాలూకా రావెల గ్రామంలో నివసించేవారు. మడికి సింగన తాతగారు అల్లాడ మంత్రి కృష్ణా నదికి దక్షిణ దిక్కున రావెల అగ్రహారాన్ని ఏక భోగ్యంగా ఏలుతూ ఉండేవాడు. రావెలలో కోవెల కూడా కట్టించాడు. అయితే వీరు ఆశ్రయించిన తొయ్యేటి అనపోతభూపతి యొక్క పెదతండ్రి కుమారుడైన కాపయ నాయుడు, ప్రతాప రుద్రుని పతనం అనంతరం ప్రొలభూపాలుని రాజ్యం తరువాత ఓరుగల్లుకు ప్రభువయ్యాడు. రాజ్యానికొచ్చాక కాపయ నాయుని తన బంధువులను వివిధ ప్రాంతాలను పరిపాలించడానికి నియమించాడు. అలా తొయ్యేటి అనపోతనాయుని గోదావరి ప్రాంతానికి పాలకునికిగా నియమించడంతో, అల్లాడ మంత్రి, అతని కొడుకు అయాలమంత్రి కృష్ణానది దక్షిణ తీరం నుంచి గోదావరి ఉత్తర తీరానికి వలస వచ్చారు. అయితే తొయ్యేటి అనపోతనాయక తరువాత, మడికివారి వంశం మరో కొమ్మ పట్టుకోవలసి వచ్చింది. అందుకే రాజమండ్రి నుంచి రామగిరి దుర్గానికి వలస వెళ్ళారు. అది తెలంగాణలో నేటి కరీంనగర్ జిల్లాలో ఉంది. అప్పటికి రామగిరి దుర్గం రాజాదానిగా సబ్బినాడుని పాలిస్తున్న ముప్పు భూపతి వారు, వారి దగ్గర మంత్రులుగా ఉన్న వాణస వారు మడికి వంశస్థులకు బంధువులు అయ్యి స్నేహ బంధుత్వం నెరిపారు. అలా రామగిరి దుర్గానికి వలస వెళ్ళిన సింగన కందనామాత్యుడుతో స్నేహం నెరిపి తన కృతులు వెలయించి ఆతనికి అంకిత మిచ్చాడు.

మడికి సింగన పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమస్కంధం, జ్ఞానవాశిష్ట రామాయాణం ప్రముఖ రచనలుగా తెలుస్తున్నాయి.

రచనలు

[మార్చు]

పద్మపురాణోత్తర ఖండం

[మార్చు]

మారన తర్వాత పురాణ రచనకు ఉపక్రమించినడి మదికి సింగన. మూల రచనకు సమయోచితంగా, అర్థవంతంగా, కథానువాదంగా - వ్రత కథలు, దశావతార కథలు విషయాలుగా ఉన్నాయి. పురూరవ చరిత్ర, సుందోపసుందుల కథ, మాఘస్నాన మాహాత్మ్యం కూడా చోటుచేసుకున్నాయి. మూడవ ఆశ్వాసంలోని గద్య పద్యాల్లో అహల్యా సంక్రందనుల కథని 67 పద్యాల్లో విపులంగా రచించాడు. మనోహర వర్ణనలతో అలరించే ఈ కావ్యంలో శ్రీకృష్ణుని కథతోపాటు అనేక వర్ణనల్లో కవితాస్పర్శ గోచరిస్తుందని, ఇందులోని అంత్యనుప్రాస రచన పోతనకు మార్గదర్శమైనదని భావిస్తారు. దీనిని వానస వంసీయుడైన కందనామాత్యుడికి అంకితం ఇచ్చాడు. సా.శ. 1420 లో రచించబడి 11 ఆశ్వాసాలతో అలరారుతున్నది. సంస్కృత మూలం సాత్యవతేయుని రచన. సింగన తెనిగించాడు. వీటి తాళపత్ర గ్రంథాలు, మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయములోను, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయములోను, తంజావూరు సరస్వతీ మహల్ లోను, శ్రీ మోది జగన్నామల్ గ్రంథాలయంలోనూ దొరుక్కుతున్నాయి. తెలుగుపరిశోధనలో దీని ప్రతి లభిస్తుంది.

భాగవత దశమస్కంధం

[మార్చు]

పోతనాదుల కన్నా ముందుగానే తొట్టతొలి భాగవత భాగాన్ని అనువాదం చేసిన కవి మడికి సింగన; అయితే, ద్విపద ఛందస్సులో విరచితమైన ఈ దశమస్కంధం పూర్తిగా అలభ్యం. కాండ విభాగాలుగా, మధుర, కళ్యాణ, జగదభిరక్ష కాండలున్నాయి. అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించే ఘట్టం నుండి శిశుపాల వధ వరకూ కథనాలు గోచరిస్తాయి. ఈ రచనలోని వర్ణనలు తరువాతి కవులకు మార్గదర్శమైనాయి.

జ్ఞానవాశిష్ఠ రామాయణం

[మార్చు]

శాస్త్రకావ్యంగా పేరుపొందిన జ్ఞానవాశిష్ఠ రామాయణంలో గురుకులం నుండి అయోధ్యకు వచ్చిన శ్రీరామునికి విశ్వామిత్రుని ఆదేశంతో వసిష్ఠుడు ఉపదేశ వేదాంతం ముఖ్య విషయం. లవణోపాఖ్యానాది పెక్కు ఉపాఖ్యానాలు ఇందులో చోటుచేసుకున్న ఈ రచనలో సరళ శైలి అధికంగా గోచరిస్తుంది. జ్ఞానవశిష్ఠ రామాయణం కంటే ముందే వెలువడిన సకలనీటి సమ్మతం వలెనే దైవాంకితం గల రాజనీతి పద్యాల సంకలనం. అర్థశాస్త్రం, రాజాశ్రితులు, రాజభ్రుత్యులు, షోడశ సంధులు, సప్త ఉపాయాలు, సప్త వ్యసనాలు మొదలైన అంశాలు ఉన్నాయి. భారతం, పంచతంత్రం, కేయూర బాహుచరిత్రం, శ్రీగిరి శతకం, బద్దెననీతి మున్నగు కావ్యాలనుంచే కాక కామందకం, పురుషార్థసారం, చారుచర్య, ఇతర శాస్త్రాలనుండి పద్యాలు యిందులో సంకలితాలు. చాటువులతో పాటు స్వీయపద్యాలు కూడా ఉన్నాయి.

"సకల నయశాస్త్ర మతములు సంగ్రహించి - గ్రంథ మొనరింతు లోకోపకారకముగను" అని సంకల్పించిన ఈ గ్రంథంలో ఐదు శ్వాసాలకు మూడు మాత్రమే లభ్యం.

సకల నీతి సమ్మత సారం, ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి (సా.శ.1 వ శతాబ్దం) తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు.

ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది ఒక ప్రాచీన నీతి మంజరి. భవ్యకవితా పారిజాతం, ఇది 6 మంది అజ్ఞాత కవుల రచనల సంకలనం. “అల్లకల్లోలమైన పాల సముద్రాన్ని చిలికి దేవామృతాన్ని వెలికి తీసిన విధంగా, గంధకారుడు ముందు గల వస్తువులను అందంగా కూర్చి సుగంధం జత చేసినట్లు, అడివి పువ్వుల తేనె తుమ్మెద జున్ను పట్టు విధముగా; ముత్యాలను పరిమాణం వారీగా గుచ్చి హారం చేసినట్లుగా ఈ గ్రంథం చేసాను “ అని సింగన సంకలనానికి ముందుమాటలో రాసుకున్నాడు. అతను ఏఏ గ్రంథాల నుండి తీసుకున్నాడో వరుసగా- అ) అజ్ఞాతము, ఆ) కామందకము, ఇ) కుమార సంభవము (నన్నె చోడుడు), ఈ) కేయూరబాహు చరిత్ర (మంచెన), ఉ) చాటువు, ఊ) చారుచర్య (అప్పనమంత్రి), ఎ) ధృతరాష్ట్ర నీతి (తిక్కన), ఏ) ధౌమ్యనీతి (తిక్కన), ఐ) నీతి తారావళి (కందనామాత్యుడు) ఒ) నీతిభూషణం (ఆంధ్ర భోజుడు), ఓ) నీతిసారం (రుద్రదేవుడు), ఔ) పంచ తంత్రి, అం) పద్మ పురాణము (మడికి సింగన), అః) పురుశార్థ సారము (శివదేవయ్య), క) బద్దన నీతి (బద్దెన), ఖ) భీష్మ పర్వం (తిక్కన), గ) మదీయము (మడికి సింగన), ఘ) మార్కండేయము (మారన), జ్ఞ) మిత్రనీతులు, చ) ముద్రమాత్యము (క్షేమేంద్ర లక్కా భట్టు), ఛ) విదురనీతి (తిక్కన), జ) శాంతి పర్వము (తిక్కన), ఝ) శాలి హోత్రము, ఇ) శ్రీగిరి శతకము (శ్రీగిరి), ట) శ్రీ రామాయణము, ట) సభాపర్వం, (నన్నయ), డ) సౌప్తిక పర్వము (తిక్కన).