మనాలి
?మనాలి హిమాచల్ ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 32°16′N 77°10′E / 32.27°N 77.17°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 1,950 మీ (6,398 అడుగులు) |
జిల్లా (లు) | కులు జిల్లా |
జనాభా | 17,786 (2005 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 175131 • +910902 |
మనాలి (ఎత్తు. 1,950 మీ లేదా 6,398 అడుగులు), హిమాచల్ ప్రదేశ్ లోని పర్వతాలలో కులూ లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది. మనాలి పరిపాలనాపరంగా కులు జిల్లాలో భాగంగా ఉంది. జనాభా సుమారు 30,000. ఈ చిన్న పట్టణం ప్రాచీన కాలం నుండి లడఖ్‌తో వర్తకానికి మార్గ ప్రారంభంగా ఉండేది. అక్కడ నుండి కారకోరం కనుమ మీదుగా యార్కండ్, టరిం హరివాణంలోని ఖోటాన్కు చేరుతుంది.
మనాలి, దాని చుట్టుప్రక్కల ప్రదేశం సప్తర్షులకు నివాసంగా పేర్కొనబడటం వలన భారతీయ సంస్కృతి, వారసత్వంలో అమిత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
భౌగోళికం
[మార్చు]మనాలి 32°10′N 77°06′E / 32.16°N 77.10°E. నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టం నుండి 1800 మీటర్ల నుండి 2000 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]భారత దేశ జనాభా లెక్కల ప్రకారం,[2] మనాలి జనాభా 6265. జనాభాలో పురుషులు 64%, స్త్రీలు 36%. సగటు అక్షరాస్యత రేటు 74%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 80%,, స్త్రీలలో అక్షరాస్యత 63%. మనాలిలో 9% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు.
శీతోష్ణస్థితి
[మార్చు]మనాలి బాగా చల్లని శీతాకాలాలు,, మితమైన చల్లదనాన్ని కలిగిన వేసవికాల శీతోష్ణస్థితిని కలిగిఉంది. ఉష్ణోగ్రతలు సంవత్సరంలో 4సెంటీగ్రేడ్ నుండి 30సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వేసవికాలంలో సగటు ఉష్ణోగ్రతలు 14సెంటీగ్రేడ్ నుండి 20సెంటీగ్రేడ్ వరకు,, శీతాకాలంలో -7సెంటీగ్రేడ్ నుండి 10సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.
ఒక మాసంలో ఉండే అవపాతం నవంబరు నెలలో 24మిల్లీమీటర్ల నుండి జూలైలో 415మిల్లీమీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. శీతాకాలం, వసంత ఋతువులలో సగటు అవపాతం 45మిల్లీమీటర్లగా ఉండి, ఋతుపవనాలు సమీపించడం వలన వేసవిలో 115మిల్లీమీటర్లకు పెరుగుతుంది. సగటు సాంవత్సరిక అవపాత మొత్తం 1520మిల్లీమీటర్ల. ఈ ప్రాంతంలో సాధారణంగా మంచు డిసెంబరు నెలలో కురిసేది, గత పదిహేను సంవత్సరాలుగా ఆలస్యమై జనవరి లేదా ఫిబ్రవరి నెల ప్రారంభంలో కురుస్తోంది.
శబ్ద వ్యుత్పత్తి
[మార్చు]మనాలికి దాని పేరు బ్రాహ్మణ స్మృతి కర్త అయిన మనువు పేరు మీదుగా వచ్చింది. మనాలి అనే పదానికి సాహిత్యపరమైన అర్ధం “మనువు నివాసం”. పురాణాల ప్రకారం ఒక గొప్ప వరద ప్రపంచాన్ని ముంచి వేసిన తరువాత మరల మానవ జీవితాన్ని సృష్టించడానికి మనువు తన ఓడలో మనాలిలో అడుగుపెడతాడు. మనాలి ఉన్న హిమాచల్ లోని కులు జిల్లా "దేవతల లోయ"గా ప్రసిద్ధిచెందింది. పాత మనాలి గ్రామంలో మనువుకు ప్రాచీనమైన గుడి ఒకటి ఉంది.[3][4]
చరిత్ర
[మార్చు]ప్రాచీనకాలంలో, 'రాక్షసులు'గా పిలువబడే సంచార జాతి జనాభా ఈ లోయలో అక్కడక్కడా నివసించేవారు. తరువాత కాంగ్రా లోయ నుండి పశువుల కాపరులు వచ్చి, స్థిరపడి వ్యవసాయాన్ని చేపట్టారు. ఈ ప్రాంతంలో మొట్టమొదట నివసించిన వారిలో కొందరు, కులు లోయకు చెందిన ప్రత్యేక కులమైన 'నౌర్' లేదా 'నర్'కు చెందిన వారు. ప్రస్తుతం కొన్ని నౌర్ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మనాలికి పశ్చిమ అంచున హరిపూర్ కి సమీపంలోని సోయాల్ గ్రామంలోని నౌర్ కుటుంబం వారి స్వంతమైన విస్తృత భూసంపదకు, 'రాక్షసులను' వారి శ్రామికులుగా ఉంచే పద్ధతికి ప్రసిద్ధి చెందింది.
మనాలికి సహజమైన పుష్ప, వృక్ష సంపదలో భాగం కాని ఆపిల్ చెట్లను, జెల్లచేపను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. ఆపిల్ చెట్లను మొదటిసారి పెట్టినపుడు పండ్లు బాగా ఎక్కువ కాసి, వాటి భారం మోయలేక కొమ్మలు విరిగిపోయేవని చెప్తారు.[ఆధారం చూపాలి] ఈ నాటికీ చాలామంది నివాసితులకు ఆపిల్-తో పాటు ప్లమ్, చెర్రీ ఉత్తమమైన ఆదాయ మార్గంగా ఉన్నాయి.
1980లలో కాశ్మీర్లో తీవ్రవాదం పెరిగిన తరువాత మనాలిలో పర్యాటక రంగం ఊపందుకుంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం అనేక హోటళ్ళు, ఫలహార శాలలతో సందడిగా ఉండే పట్టణంగా మారింది.
రవాణా
[మార్చు]మనాలి జాతీయ రహదారి-21, జాతీయరహదారి 1 ల ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లేకు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది. న్యూ ఢిల్లీ నుండి మనాలి వెళ్ళే మార్గంలో ఉన్న పట్టణాలలో హర్యానాలోని పానిపట్, అంబాలా, (కేంద్రపాలిత ప్రాంతం) చండీగర్, పంజాబ్ లోని రోపార్, బిలాస్పూర్, సుందర్ నగర్, హిమాచల్ లోని మండి ఉన్నాయి.
మనాలికి రైలు ద్వారా వెళ్ళటం కష్టసాధ్యం. సమీపంలో బ్రాడ్ గేజ్ ముఖ్య కేంద్రాలు చండీగర్ 315 కిలోమీటర్లు, పఠాన్ కోట్ (325 కిలోమీటర్లు), కల్కా (310 కిలోమీటర్లు). సమీపంలోని నారో గేజ్ ముఖ్యకేంద్రం జోగిందర్ నగర్ వద్ద ఉంది (135 కిలోమీటర్లు)
సమీపంలోని విమానాశ్రయం భున్టార్, మనాలి నుండి సుమారు 50కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రసుతం, కింగ్ ఫిషేర్ రెడ్ ఢిల్లీ నుండి నిరంతరాయ సేవలను, ఎయిర్ ఇండియా వారానికి రెండు సార్లు నిరంతరాయ సేవలను, MDLR ఎయిర్ లైన్స్ ఢిల్లీకి వారానికి ఆరుసార్లు సేవలను అందిస్తున్నాయి.
మనాలిలో పర్యాటక రంగం
[మార్చు]మనాలి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్యాటక మజిలీ, హిమాచల్ మొత్తం పర్యాటకులలో నాల్గవవంతు మనాలి సందర్శిస్తున్నారు. భారతదేశ వేడి వేసవి కాలాలకు విరుద్ధంగా చల్లని మనాలి వాతావరణం ఉంటుంది.
మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ (బల్లకట్టు పోటీలు), ట్రెక్కింగ్ (నడక), కయకింగ్ (పడవ),, మౌంటైన్ బైకింగ్ (పర్వత మోటార్ సైకిళ్ళ పోటీ) వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ.[5] మనాలి దాని "తీవ్రమైన యాక్ క్రీడలకు" టైం పత్రిక వారి "బెస్ట్ అఫ్ ఆసియా"లో కూడా చూపబడింది.[5] మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు, టిబెట్, బుద్ధిస్ట్ ఆలయాలు ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా మనాలి హనీమూన్ లకు అభిమాన గమ్యస్థానంగా మారింది. సీజన్ (మే, జూన్, డిసెంబరు, జనవరి) లో రోజుకు సుమారు 550 జంటలు, ఇతర రోజులలో రోజుకు సుమారు 350 జంటలు హనీమూన్ కోసం మనాలి చేరుకుంటాయని గణాంకాలు సూచిస్తున్నాయి
కాంతులీనే గోమ్పాలకు (బౌద్ధ ఆశ్రమాలు) మనాలి పేరు పొందింది. కులు లోయ మొత్తంలో టిబెటన్ శరణార్ధుల సాంద్రత ఎక్కువగా ఉండటం వలన, 1969లో నిర్మించిన గదన్ తెక్చ్చోక్లింగ్ గొంపా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమం స్థానిక సమాజం నుండి అందే విరాళాలు, ఆలయానికి చెందిన కార్ఖానాలో చేతితో-నేసిన తివాచీల అమ్మకాలతో నిర్వహించబడుతుంది. ప్రొద్దుతిరుగుడు పూల తోటలో, చిన్నదిగా, ఆధునికంగా నిర్మించిన హిమాలయన్ న్యిన్గమప గొంప, బజారుకు దగ్గరలో ఉంది.
ఆసక్తి కలిగించే ప్రాంతాలు
[మార్చు]మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట, పాల సామ్రాజ్యపు చిహ్నం. శిలలు, రాళ్ళు, విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ రాష్ట్ర మహోన్నత, మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాతి కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది.
పాండవ యువరాజు భీముని భార్య, హడింబకు హిడింబా దేవి ఆలయం 1553 లో స్థాపించబడింది. ఈ ఆలయం దాని నాలుగు-అంతస్తుల గోపురం, సున్నితమైన దారు చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది.
రహ్లా జలపాతములు మనాలి నుండి 27కిలోమీటర్ల దూరంలో రోహతంగ్ కనుమ ఎక్కడానికి ప్రారంభంలో, సుందరమైన రహ్లా జలపాతాలు 2501మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
సోలంగ్ లోయ, స్నో పాయింట్ గా ప్రసిద్ధి చెందింది, మనాలికి వాయవ్యంగా 13 కిమీ దూరంలో ఉంది.
మనికరణ్, కులు నుండి 45 కిమీ. దూరంలో మనాలి మార్గంలో పార్వతి నది సమీపంలో ఉన్న ఈ ప్రదేశం వేడి నీటిబుగ్గకు ప్రసిద్ధి చెందింది.
రోహతంగ్, మనాలి నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన మంచు పడే ప్రాంతం, కానీ శీతాకాలంలో మంచు వలన మూయబడి ఉంటుంది.
మరింత చదవండి
[మార్చు]- వర్మ, వి. 1996. గడ్డిస్ అఫ్ దౌలాధర్: ఎ త్రాన్షుమంట్ ట్రైబ్ అఫ్ ది హిమాలయాస్ . ఇండస్ పబ్లిషింగ్ కో., న్యూ ఢిల్లీ.
- హాండ, ఓ. సి. 1987. బుద్ధిస్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ . ఇండస్ పబ్లిషింగ్ కో., న్యూ ఢిల్లీ. ISBN 81-85182-03-5.
మూలాలు
[మార్చు]- ↑ ఫాలింగ్ రెయిన్ జెనోమిక్స్, Inc - మనాలి
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ http://www.bharatonline.com/himachal-pradesh/travel/manali/manu-temple.html
- ↑ http://www.mapsofindia.com/manali/travel/manu-temple.html
- ↑ 5.0 5.1 "టైం ఆసియా పత్రిక: బెస్ట్ అఫ్ ఆసియా - ఎక్స్ట్రీం యాక్ స్పోర్ట్స్". Archived from the original on 2009-09-25. Retrieved 2010-03-11.