మన్సా మూసా I

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్సా మూసా I (c. 1280—c. 1337) పశ్చిమ ఆఫ్రికాలోని అత్యంత సంపన్నమైన మాలి రాజ్యాన్ని పరిపాలించిన పదవ మన్సా. [1][2][3][4][5][6] మూసా పట్టాభిషిక్తుడు అయ్యేనాటికి మాలి సామ్రాజ్యం అంతకుముందు ఘనా సామ్రాజ్యంలోని, ప్రస్తుత దక్షిణ మౌరిటానియలో భాగమైన ప్రాంతాలు, దాని చుట్టుపక్కల ప్రదేశాలు కూడి ఉండేది. "మెల్లె యొక్క ఎమిర్", "వంగారా గనుల ప్రభువు", "ఘనాటా ప్రాంత విజేత" వంటి అనేక బిరుదులు కలిగివుండేవాడు. [7] ఆయన పరిపాలన కాలంలో మన్సా మూసా 24 నగరాలు, వాటి చుట్టూ ఉన్న పరిపాలనా ప్రాంతాల్లోని గ్రామాలు, ఎస్టేట్ల సహా గెలిచాడని పేరొందాడు.[8] మాలి పరిపాలన కాలంలో, అపూర్వమైన గిరాకీతో బంగారం ఉండగా మాలి ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ బంగారు ఉత్పాదకుడిగా నిలిచాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడిగా మన్సా మూసా పేరొందాడు. విపరీతమైన సంపద కలిగివున్నాడని, ఊహించడానికే సాధ్యం కానంత సంపన్నుడని సమకాలీనులు పేర్కొన్నారు. "అతని సంపదను ఖచ్చితంగా లెక్క కట్టడానికి మార్గమే లేదు" అని మూసా గురించి సమకాలీనులు రాశారు.[9]

పేరు

[మార్చు]

మూసా కైటా అన్న ఆయన అసలు పేరు కాగా, పాశ్చాత్య వ్రాతప్రతులలోనూ, సాహిత్యంలోనూ సాధారణంగా మన్సా మూసాగా పేర్కొన్నారు. ఆయన పేరు కన్కౌ మూసా, కన్కన్ మూసా, కంకు మూసా అన్న రూపాల్లో కూడా కనిపిస్తుంది. కన్కౌ అన్నది మాండింకా స్త్రీలు పెట్టుకునే పేరు, కాబట్టి కన్కౌ మూసా అంటే "కన్కౌ కుమారుడైన మూసా" అని అర్థం చేసుకోవాలి.

ఇతర పేర్లలో మాలి-కోయ్ కన్కన్ మూసా, గొంగా మూసా, మాలి సింహం వంటివి ఉన్నాయి.[10][11]

వంశం - రాజ్యాధికారం

[మార్చు]
ఇబ్నె ఖుల్దూన్ రాసిన చరిత్ర ప్రకారం మాలి సామ్రాజ్యపు రాజుల వంశావళి[12]

మాలియన్ సామ్రాజ్యపు రాజుల గురించి తెలిసిన అంశాలను అరబ్ పండితులైన అల్-ఉమారి, అబు-సయ్యద్ ఉతమాన్ అద్-దుకాలీ, ఇబ్న్ ఖుల్దూన్, ఇబ్న్ బట్టుటా వంటివారి రచనల నుంచి స్వీకరించారు. ఇబ్న్-ఖుల్దూన్ రాసిన మాలియన్ రాజుల సంగ్రహ చరిత్ర ప్రకారం మన్సా మూసా తాత అబు-బక్ర్ కేటా (బకారీ లేక బొగారీ అన్న పదానికి అరబ్ సమానార్థకం, అసలు పేరు తెలియదు. సహాబీ అబూబక్ర్ ఇతను వేర్వేరని గమనించాలి) మాలియన్ సామ్రాజ్య నిర్మాతగా మౌఖిక చరిత్రలు పేర్కొన్న సుందైటా కైటా సోదరుల్లో ఒకడు. అబూ-బక్ర్ రాజ్యం పొందలేదు, అతని కుమారుడు, మూసా తండ్రి ఫాగా లాయ్ కి మాలి చరిత్రలో ఏ ప్రాముఖ్యతా లేదు.[13]

రాజు మక్కా యాత్రకు కానీ, వేరేదైనా ప్రయత్నంలో ప్రయాణమై వెళ్ళినప్పుడు కానీ ప్రతినిధిగా వేరొకరిని నియమించి, ఆ తర్వాత ఆ ప్రతినిధిని వారసునిగా నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఆ విధంగానే మన్సా మూసా కైటా పట్టాభిషిక్తుడై రాజ్యం పొందాడు. ప్రాథమిక మూలాల ప్రకారం, రెండవ అబూబక్రీ కైటా అనే రాజు అట్లాంటిక్ మహాసముద్రం హద్దులు అన్వేషిస్తూ సాహసయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన రాజప్రతినిధిగా మూసాను నియమించారు, ఆ సాహసయాత్ర నుంచి రెండవ అబూబక్ర్ కైటా తిరిగి రాలేదు. అరబ్-ఈజిప్షియన్ పండితుడు అల్-ఉమారీ వ్రాతలో మన్సా మూసా అన్నట్టుగా రాసుకున్న వ్యాకాలు ఇలా ఉన్నాయి:

నాకు ముందు పరిపాలకుడు భూమి చుట్టూ వ్యాపించిన మహాసముద్రం (అట్లాంటిక్ మహాసముద్రం) అంచుల వరకూ వెళ్ళడం అసాధ్యమని భావించలేదు. ఆయన అక్కడ దాకా చేరి తన ప్రణాళిక అమలుచేద్దామని ఆశించాడు. కనుక రెండువందల నౌకల నిండా జనం, మరెన్నో నౌకల్లో బంగారం, నీరు, తాను ఎన్నో సంవత్సరాల పాటు జీవించడానికి సరిపడేంత ఇతర సామాగ్రి ఇచ్చి నౌకాధిపతిని మహాసముద్రం ఆవలి అంచు చేరే దాకా కానీ, వారి వద్ద ఉన్న సరుకులు, నీరు ఖాళీ అయ్యేంతవరకూ కానీ వెనుదిరగవద్దని ఆదేశించాడు. అలా వారు ప్రయాణమై వెళ్ళారు. చాలాకాలం వారు తిరిగి రాలేదు, చివరికి కేవలం ఒక్క నౌక వెనుతిరిగి వచ్చింది. సుల్తాన్ ఏమైందని ప్రశ్నిస్తే నౌకాధిపతి, "రాకుమారా, మేం చాలాకాలం పాటు ప్రయాణం చేశాం. మహా సముద్రం మధ్యలో గొప్ప నదీ ప్రవాహం విపరీతంగా ప్రవహిస్తూ కనిపించింది. నా నౌక చివరిది; కానీ మిగిలిన నౌకలు నాకన్నా ముందే వెళ్తూ ప్రవాహంలోని సుడిగుండంలో పడి కొట్టుకుపోయాయి. నేను ఆ ప్రవాహం నుంచి తప్పించుకునేందుకు నా నౌకను వెనక్కితిప్పి వచ్చేశాను." అన్నాడు. కానీ సుల్తాన్ అతన్ని నమ్మలేదు. రెండువేల నౌకలు తానూ, తన సైన్యం బయలుదేరేందుకు, వెయ్యి నౌకలు తమకు నీరూ, ఇతర సరుకులు అందించేందుకు సిద్ధం చేయమని ఆదేశించాడు. తన పరోక్షంలో పరిపాలించేందుకు రాజప్రతినిధి పదవి నాకు ప్రసాదించాడు, ఆపైన బయలుదేరాడు. తిరిగి రావడం కానీ, జీవించి ఉన్నట్టు వార్త పంపడం కానీ జరగలేదు.[14]

మూసా కుమారుడు, వారసుడు అయిన మన్సా మఘా కైటా కూడా అలానే మూసా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు.[15]

ఇస్లాం ,  మక్కా యాత్ర

[మార్చు]

మూసా దైవభక్తి, మతనిష్ట కలిగిన ముస్లిం. ఆయన చేసిన మక్కా యాత్ర ఆయనను ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యాల్లో సుప్రఖ్యాతుణ్ణి చేసింది. మూసా ప్రకారం, ఇస్లాం అన్నది "సంస్కృతి విలసిల్లే తూర్పు మధ్యధరా ప్రపంచంలోకి ప్రవేశానుమతి". [16] తన సామ్రాజ్యంలో మత అభివృద్ధిని పెంపొందించేందుకు ఎంతో సమయాన్ని వెచ్చించాడు.

మూసా 1324-1325 వరకూ తన మక్కా యాత్ర సాగించాడు.[17][18] అతని సవారీలో వారిలో ఒక్కొక్కడూ 1.8 కేజీల బంగారు కడ్డీలు ధరించిన 12 వేల మంది బానిసలు,[19] పట్టుబట్టలు కట్టుకుని, బంగారు దండాలు ధరించిన వైతాళికులు, దూతలు సహా 60 వేలమంది పరివారం, సుశిక్షితమైన గుర్రాలు ఉన్నాయి. మూసా మొత్తం పరివారంలోని అందరు మనుషులు, అన్ని జంతువులకు సరిపడా ఆహార పదార్థాలు, అన్ని అవసరమైన వస్తువులు ముందుగా సిద్ధం చేసుకున్నాడు. అతని సవారీలోని జంతువుల్లో ఒక్కొక్కటీ 23 - 136 కేజీల బంగారు పొడి మోసేందుకు 80 ఒంటెలు కూడా ఉన్నాయి. దారిలో కనిపించిన పేదలందరికీ మూసా ఆ బంగారాన్ని పంచుకుంటూ సాగాడు.  కైరో, మదీనా మొదలైన మార్గమధ్యంలోని నగరాల్లో పంచడానికే కాక తన బంగారాన్ని జ్ఞాపకార్థంగా కొనుగోలు చేసిన వస్తువుల కోసం కూడా వెచ్చించాడు. ప్రతీ శుక్రవారం మార్గమధ్యంలో ఒక్కో చోట ఒక్కో మసీదు నిర్మిస్తూ సాగాడని ప్రతీతి.[మూలాలు తెలుపవలెను]

మూసా ప్రయాణం వివరాలు, విశేషాలను దారిపొడవునా ఆయన సంపదకు, భారీ పరివారంతో కూడిన సవారీకి సంభ్రమాశ్చర్యాలకు గురైన పలువురు ప్రత్యక్షసాక్షులు నమోదు చేశారు. దినచర్యలు, మౌఖిక కథనాలు, చరిత్ర రచనలు వంటి పలు పద్ధతుల్లో ఇవన్నీ నమోదు అయివున్నాయి. ఈజిప్టుకు చెందిన మామ్లూక్ సుల్తాన్ అల్-నాజిర్ మొహమ్మద్ ను 1324 జూలైలో మూసా కలిసినట్టు చెప్తారు.[20]

కానీ మూసా ప్రయాణం చేసిన ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలు అతను ఔదార్యంతో చేసిన దానాల వల్ల అనుకోని విధంగా నాశనమయ్యాయి. కైరో, మదీనా, మక్కా నగరాల్లో హఠాత్తుగా భారీ ఎత్తున బంగారం రావడంతో తదుపరి దశాబ్ది కాలం పాటు బంగారం విలువ పడిపోయింది. వస్తువులు, నిత్యావసర సామాగ్రి సహా అన్నిటి ధరలు పెరిగిపోయాయి. బంగారు విపణిలో ధరవరలు సరిదిద్దడానికి మూసా తాను తీసుకునిపోగలిగినంత బంగారాన్ని భారీ ఎత్తున కైరోలో వడ్డీ వ్యాపారుల నుంచి అత్యంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. మధ్యధరా ప్రాంతంలో బంగారు ధరలు మొత్తాన్ని ఒక్క మనిషి నేరుగా ప్రభావితం చేసి పెంచి, తగ్గించిన ఒకే ఒక్క సంఘటనగా చరిత్రలో నమోదు అయింది.

తర్వాతి పరిపాలన కాలం

[మార్చు]

1325లో మొదలై మక్కా నుంచి సుదీర్ఘంగా సాగిన అతని ప్రయాణంలో తన సైన్యం గావ్ ను తిరిగి పట్టుకుందని తెలిసింది. సగ్మాందియా అన్న తన సైన్యాధికారి ఒకడు ఈ దండయాత్రకు నాయకత్వం వహించాడు. అతని పూర్వ పాలకుడు సకురా పరిపాలన కాలానికి ముందు నుంచే గావ్ సామ్రాజ్యంలో భాగమే కాక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం, ఐతే ఈ ప్రాంతంలో చాలా తరచుగా తిరుగుబాట్లు సంభవించేవి. మూసా చుట్టుతిరిగి గావ్ సందర్శించి గావ్ రాజు కుమారులు అలీ కొలొన్, సులేమాన్ నార్ లను హామీ ఖైదీలుగా తీసుకుని వెళ్ళాడు. వారిద్దరినీ తీసుకుని నియాని చేరుకున్నాడు, వారిద్దరికీ తన ఆస్థానంలో ఉంచి చదువు చెప్పించాడు. మన్సా మూసా మక్కా యాత్ర నుంచి వెనుదిరిగి వచ్చేప్పుడు ఎందరో అరేబియన్ పండితులను, శిల్పులను తీసుకుని వచ్చాడు.[21]

మాలి నిర్మాణం

[మార్చు]

మూసా భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమానికి పూనుకుని, టింబక్టు, గావ్ నగరాల్లో మసీదులు, మదరసాలు నిర్మింపజేశాడు. ప్రత్యేకించి సుప్రఖ్యాత ప్రాచీన విద్యాకేంద్రమైన సంకోర్ మదరసా (లేక సంకోర్ విశ్వవిద్యాలయం) ఆయన పాలనాకాలంలోనే నిర్మించారు

నియానీ, మూసాల్లో రాజప్రాసాదం నుంచి ఒక ద్వారం ద్వారా చేరుకోగలిగేలా సభా భవనాన్ని నిర్మించారు. అది ఒక అపురూపమైన నిర్మాణం, పైన అద్భుతావహమైన రంగులు వేసిన లతలతో పెద్ద డోమ్ తో కూడి ఉంటుంది. పై అంతస్తులో కిటికీ చట్రాలు వెండిరేకులతో, కింది అంతస్తులోవి బంగారు రేకులతో తాపడం చేశారు. మాలీలోని జెన్నెలోని ప్రఖ్యాత గొప్ప మసీదులా, తింబక్తులో ఈ భవంతి రాళ్ళతో నిర్మితమై సార్వకాలీనమూ, వైభవోపేతమూ అయిన నిర్మాణంగా నిలిచిపోయింది.

ఈ కాలంలోనే, మాలీలోని ప్రధానమైన కేంద్రాల్లో నగర జీవితం అత్యున్నత నాగరిక స్థితికి చేరుకుంది. ఇటాలియన్ కళ, శిల్పశాస్త్ర పండితుడు సెర్గియో డొమైన్ ఈ కాలాన్ని గురించి రాస్తూ, "ఆ కాలం పట్టణ నాగరికతకు పునాది వేసింది. దాని అధికారం అత్యున్నత శిఖరంలో ఉండగా మాలిలో 400 నగరాలు ఉండేవి, నైజర్ డెల్టా ప్రాంతం బాగా జనసాంద్రత కలిగివుండేది"[22]

విద్య, ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

టింబక్టుగావ్ నగరాల మీదుగా మక్కాకు ప్రయాణించిన మన్సా మూసా, వెనుదిరిగివచ్చే సరికి వాటిని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడని చారిత్రకంగా నమోదు అయింది. నేటి స్పెయిన్ లో అంతర్భాగమైన అండలూసియా నుంచి, కైరో నుంచి శిల్పులను టింబక్టులో అద్భుతమైన ప్యాలెస్, గొప్ప జింగురెబర్ మసీదు నిర్మించారు, అవి కాలపరీక్షలను తట్టుకుని ఇప్పటికీ నిలిచివున్నాయి.[23]

టిబక్టు వేగంగా వాణిజ్య, సాంస్కృతిక, ఇస్లాం కేంద్రంగా మారింది. హౌసలాండ్, ఈజిప్టు, ఇతర ఆఫ్రికన్ సామ్రాజ్యాల నుంచి వ్యాపారులు తరలిరాగా, నగరంలో ఒక విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది (అలానే జెన్నె, సేగవ్ నగరాల్లో కూడా ప్రారంభించారు), ఇస్లాం వ్యాపార కేంద్రాల్లోనూ, విశ్వవిద్యాలయంలోనూ వ్యాపించి టింబక్టులో నూతన ఇస్లాం పాండిత్యం వ్యాపించింది.[24] మాలియన్ సామ్రాజ్య సంపద గురించిన వార్తలు మధ్యధరా సముద్ర తీరం నుంచి దక్షిణ ఐరోపా వరకూ ప్రయాణించి, వెనిస్, గ్రనడా, జెనోవాలలో వ్యాపారస్తులు తమ సరుకులను బంగారానికి అమ్మే కేంద్రాల్లో తింబక్తును కూడా చేర్చుకునేలా చేశాయి.[25]

టింబక్టులో సంకోరా విశ్వవిద్యాలయంలో న్యాయవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, గణితశాస్త్రజ్ఞులను మూసా పాలనా కాలంలో నియమించారు.[26] విశ్వవిద్యాలయం విద్యకు, సంస్కృతికి కేంద్రంగా వెలిగి, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం అంతటి నుంచీ టింబక్తుకు ముస్లిం పండితులను ఆకర్షించింది.

1330లో, మోసి రాజ్యం తింబక్తు నగరంపై దండయాత్ర చేసి, ఆక్రమించింది. అప్పటికి గావ్ ను మూసా సైన్యాధిపతి గెలిచాడు. వెనువెంటనే మూసా టింబక్టును తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుని, ప్రాకారం, రాతి కోట నిర్మించి, నగరాన్ని భవిష్యత్తులో ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు తగ్గ సైన్యాన్ని నిలిపివుంచాడు.[27]

మూసా రాజప్రాసాదం నశించిపోయినా, విశ్వవిద్యాలయం, మసీదు ఈనాటికీ నిలిచేవున్నాయి.

మన్సా మూసా పరిపాలన ముగిసేనాటికి, సంకోరె విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో అధ్యాపకులతో, చారిత్రకమైన అలెగ్జాండ్రియా గ్రంథాలయం తర్వాత ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద పుస్తక సేకరణతో నిలిచింది. సంకోరె విశ్వవిద్యాలయం 25 వేల మంది విద్యార్థులకు బోధించగల సమర్థతతో, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రంథాలయాల సరసన దాదాపు పది లక్షల వ్రాతప్రతులతో విలసిల్లింది.[28][29]

మరణం

[మార్చు]
మన్సా మూసా మరణ కాలం నాటికి మాలి సామ్రాజ్యం

మన్సా మూసా మరణం ఆధునిక చరిత్రకారుల్లోనూ, మాలి చరిత్రను వ్రాసివుంచిన అరబ్ పండితుల్లోనూ అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది. ఆయన వారసుల పాలనా కాలాలతో పోల్చి చూస్తే, కొడుకు మన్సా మఘన్ (పాలనాకాలం 1337-1341), అన్న మన్సా సులేమాన్ (పాలనాకాలం 1341-1360), మూసా పాలనా కాలంగా నమోదైంది 25 సంవత్సరాలు, మొత్తానికి లెక్కిస్తే మరణించినది 1337 అవుతుంది.[30] ఐతే కొన్ని రికార్డుల్లో మూసా తన కుమారుడు మఘన్ కు సింహాసనం దక్కాలని స్వయంగా తానే పదవి త్యజించాలని భావించాడని, కానీ మక్కా నుంచి 1325లో వచ్చాకా త్వరలోనే మరణించినట్టు ఉంది. ఇబ్నె ఖుల్దూన్ రాసినదాని ప్రకారం మన్సా మూసా 1337లో అల్గేరియాలోని ట్లెమ్సెన్ నగరం ముట్టడి సమయంలోనూ బ్రతికేవున్నాడు, దీనికి ఆధారంగా ఆయన విజేతలకు తన అభినందనలు తెలియజేసేందుకు ప్రతినిధిని పంపడాన్ని పేర్కొంటున్నాడు.

 మూలాలు, వివరణలు

[మార్చు]
  1. Lapidus, Ira M. A History of Islamic Societies. 3rd edn. New York, NY: Cambridge University Press, 2014, p. 455.
  2. Knoblock, Kathleen, "An Interview with Ibn Battuta", Primary Source Fluency Activities: World Cultures (In Sub-Saharan Africa), Shell Education, 2007. ISBN 978-1-4258-0102-1.
  3. Travels in Asia and Africa, 1325-1354, by Ibn Battuta, London 2005, p. 324, ISBN 0-415-34473-5.
  4. On page 256, Jan Jansen writes: "Mansa is generally translated as 'king,' 'ruler' or 'ancestor.' The Griaulians, however, often translate mansa as 'God,' 'the divine principle' or 'priest king,' although they never argue the choice for this translation, which has an enormous impact on their analysis of the Kamabolon ceremony."
  5. Macbrair, Robert Maxwell, A Grammar of the Mandingo Language: With Vocabularies, London, 1873, p. 5.
  6. Berkin, Carol, Christopher Miller, Robert Cherny, James Gormly & Douglas Egerton, Making America – A History of the United States, 5th edition, Boston, 2011, p. 13. ISBN 978-0-618-47139-3.
  7. Goodwin 1957, p. 109.
  8. C. Conrad, David (1 January 2009). Empires of Medieval West Africa: Ghana, Mali, and Songhay. Infobase Publishing. p. 36-36. ISBN 1438103190. Retrieved 1 November 2015.
  9. Davidson, Jacob. "The 10 Richest People of All Time". CNNMoney. Archived from the original on 2015-08-01. Retrieved 2018-02-02..
  10. Hunwick 1999, p. 9.
  11. Bell 1972, pp. 224–225.
  12. Levtzion 1963, p. 353.
  13. Levtzion 1963, pp. 341–347.
  14. "Echos of What Lies Behind the 'Ocean of Fogs' in Muslim Historical Narratives". muslimheritage.com. Retrieved 27 June 2015.
  15. Levtzion 1963, p. 347.
  16. Goodwin 1957, p. 110.
  17. Pollard, Elizabeth (2015). Worlds Together Worlds Apart. New York: W.W. Norton Company Inc. p. 362. ISBN 978-0-393-91847-2.
  18. Wilks, Ivor (1997). "Wangara, Akan, and Portuguese in the Fifteenth and Sixteenth Centuries". In Bakewell, Peter John (ed.). Mines of Silver and Gold in the Americas. Aldershot: Variorum, Ashgate Publishing Limited. p. 7. ISBN 9780860785132.
  19. de Graft-Johnson, John Coleman, "Mūsā I of Mali", Encyclopædia Britannica, 15 November 2017.
  20. Bell 1972, p. 224.
  21. Windsor, Rudolph R. (2011). From Babylon to Timbuktu: A History of Ancient Black Races Including the Black Hebrews (Windsor's golden series ed.). AuthorHouse. pp. 95–98. ISBN 1463411294.
  22. Mansa Musa, African History Restored, 2008, retrieved 29 September 2008
  23. De Villiers and Hirtle, p. 70.
  24. De Villiers and Hirtle, p. 74.
  25. De Villiers and Hirtle, pp. 87–88.
  26. Goodwin 1957, p. 111.
  27. De Villiers and Hirtle, pp. 80–81.
  28. See: Said Hamdun & Noël King (edds.), Ibn Battuta in Black Africa. London, 1975, pp. 52–53.
  29. "Lessons from Timbuktu: What Mali's Manuscripts Teach About Peace | World Policy Institute". Worldpolicy.org. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 24 October 2013.
  30. Levtzion 1963, pp. 349–350.

గ్రంథ పట్టిక

[మార్చు]