మయన్మార్‌లో తెలుగువారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బర్మా, శ్రీలంక, థాయిలాండ్, భారత్ మొదలైన ఆసియా దేశాలు బ్రిటీష్ ఇండియాలో ఉండేవి. కాబట్టి మైదాన ప్రాంత ప్రజలు సముద్రాలు దాటి ఆవలి ఉన్న బర్మా, శ్రీలంక, థాయిలాండ్ మొదలైన దేశాలకు వలస వెళ్లారు. బర్మా 1936లో బ్రిటీష్ ఇండియా నుండి వేరు చేయబడింది. 1948లో రిపబ్లిక్‌గా మారింది. బర్మాను ప్రస్తుతం మయాన్మార్ అని దాని రాజధాని రంగూన్ను యాంగోన్ అని పిలుస్తున్నారు[1].

వలసలు[మార్చు]

బర్మా 1948 వరకు బ్రిటిష్‌వారి అధీనంలో ఉంది. అందువల్ల పనుల నిమిత్తం తెలుగు, తమిళం, బెంగాలీ, బీహార్, పంజాబీ, హిందీ మొదలగు ప్రజలు పనులు నిమిత్తం బర్మాకు వలస వెళ్లారు. అలా వలస వెళ్లిన వారిలో తెలుగు ప్రజలు కోస్తాంధ్ర నుండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో కూలీ పనుల నిమిత్తం వలసపోయారు. బారువ, కళింగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం (బందరు), మద్రాస్ ఓడరేవుల ద్వారా వీరు బర్మాకు ముఖ్యంగా రంగూన్కు వెళ్లి వస్తుండేవారు. రంగూన్ను ఈ ప్రాంత వాసులు రంగం అంటారు. రంగం ఆ రోజులలో సుసంపన్నంగా ఉండటం చేత ఉత్తరాంధ్రలో కరువులవలన, పేదరికం మూలంగా వేలాదిమంది కుటుంబాలను స్వగ్రామాలలో విడిచిపెట్టి రంగం వెళ్లి ఏవో పనులు చేసుకుంటూ నాలుగైదేళ్ళకు వెళ్లి వస్తుండేవారు. అందుకే ఈ ప్రాంతంలో ‘‘రంగంమెళ్లిపోయానో నారాయణమ్మ రంగూన్ పురం చూసానో నారాయణమ్మా’’ వంటి జానపద పాటలు పుట్టాయి. ‘‘ఎక్కడా ఒళ్ళు వంగని వాడికి రంగమెళ్తే ఒళ్లు వంగుతుందనే’’ సామెతలు పుట్టాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం నుండి అగ్నికుల క్షత్రియ (పల్లి) యాదవ (గొల్ల), వాడ బలిజ కులాలు అధిక సంఖ్యలోను, చాకలి, మంగలి, సొండి వంటి కులాలు తక్కువ సంఖ్యలో వలసపోయారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుండి కాపు, గవర, నాగవంశం, రెల్లి (చచ్చడి) వంటి కులాలు వారు అధిక సంఖ్యలో వలసపోయారు. గోదావరి, కృష్ణా జిల్లాల నుండి కూడా తక్కువ సంఖ్యలో వలసలున్నాయి. బర్మాలో తిండికి లోటులేకపోవడంతో, కూలీ పనులు దొరుకుతుండటంతో రంగూన్, మోర్మెన్, ఇలాంజాం, పిమ్మడాం, ఏరాసి, పియో, మిట్ల మొదలగు ప్రాంతాలో పనులు చేసుకుంటూ జీవనం గడిపారు. కొంతమంది తరువాత కుటుంబాలను కూడా తీసుకొని వెళ్లారు.

రెండవ ప్రపంచయుద్ధం[మార్చు]

ఇంతవరకు బాగానే ఉన్నా రెండవ ప్రపంచ యుద్ధంలో (1939-45) జపాన్ బర్మాపై బాంబులు వేయడంతో భీతిల్లిన తెలుగు ప్రజలు దిక్కు తెలియక చెల్లాచెదురైపోయారు. చాలామంది బర్మానుండి అస్సాం వరకు అడవుల మధ్య కాలినడకన ప్రయాణమయ్యారు. ఈ మజిలీ వింటే ఒళ్లు గగుర్పాటు చెందుతుంది. సుమారు రెండునెలలపాటు కాలినడకన కొంతమంది అస్సాం చేరుకున్నారు. అడవి మధ్య దిక్కుతెలియక, తిండి తిప్పలు లేక మంచినీళ్ళు దొరకక మార్గమధ్యలో చాలామంది ప్రాణాలు విడిచారు. మరికొంతమంది కలరా, డయేరియా వంటి వ్యాధులతో మార్గమధ్యంనే మరణించారు. కొంతమంది నడవలేకపోయినవారిని, రోగులను చెట్ల క్రిందే విడిచివచ్చారు. ఇక్కడ తండ్రి, కొడుకు, భార్య వంటి సంబంధాలు కూడా గుర్తుకురాలేదు. కాలినడకన అస్సాం చేరుకొనేవారికి అక్కడినుండి ప్రభుత్వం కల్పించిన రైలు సదుపాయాలతో స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికీ ఈ సంఘటనలపై జానపద పాటలున్నాయి. ‘‘రంగం జపానోడి బాంబులతో జలధి పుట్టేను మన అమెరికా వాడి బాంబులతో అందరమొచ్చెము’’ వంటి పాటలు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ పాడుకుంటారు. రంగం వెళ్లినవారికి గుర్తుగా రంగమోడు అని రంగంవారని పిలుస్తారు. ఇప్పటికీ ఈ ప్రాంతం (పలాస, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాలలో) బర్మా పెట్టెలు, బర్మా కత్తులు గుర్తుగా ఉన్నాయి.

కాందిశీకులు[మార్చు]

ఇక చావైనా, రేవైనా బర్మాయే దిక్కుని ఉండిపోయినవారు అక్కడే ఉండిపోయారు. అలా ఉండిపోయిన వారు 1966 వరకు ప్రశాంతమైన జీవితాన్నే గడపగా తరువాత వచ్చిన సైనిక పాలన మూలంగా అంతవరకు తమ మూలాలు ఎక్కడున్నాయో కూడా తెలియని తెలుగు ప్రజలు బ్రతుకు తెరువుకోసం బర్మా నుంచి విశాఖ ఓడరేవు ద్వారా విశాఖపట్నం చేరుకున్నారు. వారినే బర్మా కాందిశీకులని అన్నారు. వీరికి భారత ప్రభుత్వం విశాఖపట్నం, శ్రీకాకుళం, శృంగవరపుకోట మొదలైన ప్రాంతాలలో బర్మా కాలనీలు నిర్మించి ఎక్కువ శాతం మందికి ఉపాధి చూపింది. మరికొంతమందిని కరీంనగర్ పంపించి స్పిన్నింగ్ మిల్లులలో ఉపాధి చూపింది. వీరిలో ఎక్కువ మంది బర్మాలో జన్మించినవారే. తాత, ముత్తాతల కాలంలో బర్మా వెళ్లినవారే.

మయాన్మార్ లో తెలుగుసంతతి[మార్చు]

ఇక ఇప్పటికీ, బర్మాలో సుమారు 80 వేలు మంది తెలుగు ప్రజలున్నారు. ఎప్పుడో బర్మా వెళ్లిపోవటంచేత వీరికి తెలుగు భూమితో సంబంధాలు లేవు. అయితే భారతీయ సంప్రదాయాలను హిందూ, తెలుగు సంస్కృతులను కొనసాగిస్తూ వినాయకుడు, రామాలయం, కాళీమాత వంటి దేవాలయాలను, మరికొన్ని అమ్మవారి గుడులను నిర్మించుకున్నారు. తెలుగువారైతే భూలోకమ్మ, పోలేరమ్మ, సింగమ్మ, వడ్డిపోలమ్మ, పత్తినమ్మ వంటి అమ్మవారి గుడులను నిర్మించుకున్నారు.

కళలు, సంస్కృతి[మార్చు]

తెలుగు ప్రాంతాలనుండి తోలుబొమ్మలాట వంటి జానపద కళలు, పౌరాణిక నాటకాలు కూడా రప్పించి చూసేవారు. ఇక్కడి తెలుగువారు పగటి వేషాలు వంటి కళలను పండుగల పూట ప్రదర్శించేవారు. ప్రభుత్వ తెలుగు బడులు లేకపోయినా ఇచ్చటి తెలుగు ప్రజలు తెలుగు బడులను నడిపారు. పెద్దబాలశిక్ష (పాతతరం), వేమన శతకాలు, నీతి శతకాలు, భారతం, రామాయణం, భాగవతం గ్రంథాలు చదివి తెలుగు భాష, సంస్కృతులను పరిడవింపజేశారు.

భాషా సాహిత్యాలు, సాంఘిక జీవనం[మార్చు]

ఆంధ్రమిత్ర వంటి మూడు దినపత్రికలు ఇక్కడ నడిచాయి. మోల్మెన్‌లో కవులు, రచయితలు వెలిశారు. సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండేవి. అప్పటివరకు అనేక కుల సంఘాలు, మత సంఘాలుగా ఉన్న తెలుగు సమాజాన్ని ఏకం చేసి 1911లో అఖిల మ్యామా ఆంధ్ర ధార్మిక సమితి (కేంద్రం) (ఆంధ్ర మహాజన సంఘం) ఏర్పడింది. 1950లో ఈ సంఘం పునః స్థాపితం చేయబడి ఇటీవల (1911-2011) శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది.

వేమన పుస్తక బాండాగారం, ఆంధ్ర బౌద్ధ సమాజం, ఆంధ్ర హిందూ యువజన ధార్మిక సంఘం వంటి సమాజాలు తెలుగువారి కలయికకు తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఇచ్చట ప్రజలు తెలుగుదనం, తమ మూలాలను, కులాలను, భాషను మర్చిపోతున్నారు. అయితే బర్మాలో పుట్టి ఆంధ్ర దేశం వచ్చిన కొంతమంది పుట్టిన భూమిపై మమకారం వదలక కొంతమంది కాందిశీకులు అప్పుడప్పుడు కోలకతా, చెన్నై విమానాశ్రయాలుద్వారా బర్మా వెళ్లి వస్తున్నారు.

తెలుగు బడి[మార్చు]

అక్కడి ప్రజలకు తెలుగు నేర్చుకోవాలనే అభిలాష ఉంది. ‘డోలు మ్యూడో బాద డోటి’’ (మా జాతి భాష నేర్చుకోవాలని ఉంది) అనే అక్కడి తెలుగువారి మాటలు ఎట్టివారిలో ఐనా ఆర్ద్రత నింపుతాయి. ఇప్పటికే భీశెట్టి లక్ష్మణగారిలాంటి వాళ్ళు ‘విదేశాంధ్రులు’ వంటి పుస్తకాలు రాసారు. చందమామ వంటి తెలుగు పత్రికలు ఇప్పటికీ ఒకటి, అర అక్కడకు వెళ్తూనే ఉన్నాయి. ప్రభుత్వ విద్యావిధానం, సామాజిక మార్పులతో తమ సంస్కృతికి కష్టం వచ్చిందని బర్మా తెలుగు వాళ్లకర్థమైంది. తెలుగంటే సినిమా పాటలు కావు. తేటతెలుగు మాటలని, ఆ..తియతీయని తేనియ మాటలు తమ పిల్లలకూ నేర్పాలనుకున్నారు. మాతృభాషను కాపాడుకుంటేనే మాతృ సంస్కృతి నిలుస్తుందనే ఉద్దేశంతో తెలుగు బడులకు శ్రీకారం చుట్టింది బర్మా తెలుగు సంఘం[2]. 2003లో మౌల్మీన్ పట్టణంలో తొలి బడి ప్రారంభమైంది. ఆ బడిలో తెలుగు వచ్చిన వాళ్లు పంతుళ్లు, రాని వాళ్లు విద్యార్థులు. సాయంత్రం గంట సేపు చెప్పే తెలుగు పాఠాలు వినడాకిని స్పందన బాగానే వచ్చింది. ఆరేళ్ల పిల్లల నుంచి మూడు పదుల పెద్దల వరకు పలకా, బలపం పట్టుకున్నారు. అ, ఆ, ఇ, ఈలతో మొదలైన తెలుగు బడి గుణింతాలు, పదాలు దాటి ఎక్కాలు, వ్యాకరణం దాకా ముందుకు సాగింది. బర్మా తెలుగు సంఘం చేస్తున్న కృషికి తల్లిదండ్రుల తోడ్పాటూ తోడయింది. తెలుగు నేర్చుకోమని పిల్లలకు ప్రోత్సాహం అందించడం, వారిలోనూ నేర్చుకోవాలనే ఉత్సాహం పెంచేందుకు తెలుగు సంఘం అనుబంధంగా ఉన్న సంక్షేమ నిధితో కార్యవర్గం పిల్లల్ని ఆకట్టుకునేలా బడిని నిర్వహించడంతో విద్యార్థుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. తెలుగు బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఆ తర్వాత బడి గంటలు పెంచారు. 6-7 గంటల మధ్య ఒక బృందానికి, 7-8 గంటల మధ్య మరో బృందానికి తెలుగు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తెలుగు వారు అధికంగా ఉండే మౌల్మీన్ నగరంలో విజయవంతమైన ఈ ప్రయోగం వార్త ఇతర నగరాలకు వ్యాపించింది. అక్కడా తెలుగు బళ్లు పెట్టాలనే ఆకాంక్ష మొదలైంది. అదే పనిలో ఉన్న బర్మా తెలుగు సంఘం మౌల్మీన్ నగరంలో మరో 3 పాఠశాలలు, రంగూన్‌లో 2 పాఠశాలలు, బేక్‌లో మూడు పాఠశాలలతోపాటు పెగు, తటోన్, కోతాం పట్టణాలలో ఒక్కో పాఠశాలను నెలకొల్పింది. ఇలా నడుస్తున్న పాఠశాలలకు తెలుగు విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం సేవలూ చేరువయ్యాయి. బర్మాలో పుట్టి పెరిగిన ఎర్రన్నాయుడు బర్మీస్ తెలిసిన పిల్లల కోసం ఓ తెలుగు వాచకాన్ని 2011లో రూపొందించాడు. ఈ వాచకంలో ఏ ప్రమాణాలు ఉండాలో యూనివర్సిటీవారు నిర్దేశిస్తే, ఆ ప్రమాణాలకు అనుగుణంగా సుందర్‌రావుతో కలిసి వాచక రూపకల్పన చేశాడు ఎర్రన్నాయుడు. ఈ వాచకం, పెద్దబాల శిక్ష బర్మాలోని తెలుగు బడిలో పాఠ్యగ్రంథాలు. అంతేకాక ఎర్రన్నాయుడు తెలుగు - బర్మీస్ నిఘంటువును 10వేల పదాలతో నిర్మించాడు. బర్మా పిల్లల కోసం పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథల్ని అక్కడి భాషలోకి తర్జుమా చేశాడు[3]. చిన్న దేశంలో, ఒక చిన్న సమూహంగా బతుకుతున్న వాళ్లు తల్లిలాంటి సంస్కృతిని బతికించుకోవాలన్న తాపత్రయం, మా తాతల భాషను మేమూ నేర్చుకోవాలన్న పిల్లల పట్టుదల అందరికీ ఆదర్శనీయం.

మూలాలు[మార్చు]

  1. బర్మాలో తెలుగువెలుగులు - బద్రి కూర్మారావు[permanent dead link]
  2. "మయన్మార్‌లో తెలుగు బడి - నాగవర్ధన్ రాయల". Archived from the original on 2015-09-07. Retrieved 2015-11-20.
  3. సిసలైన భాషాప్రేమికుడు - డా. చింతకింది శ్రీనివాసరావు[permanent dead link]