మరువాడ శంభన్న శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మరువాడ శంభన్న శాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. అభినవ గౌతమ, తర్క వేదాంత విద్యా విశారద ఆయన బిరుదులు.[1] ఆయన పేరూరు సంస్థానాదీశుడైన వేంకట భానోజీ రామర్సు ప్రభువు ఆస్థాన పండితుడిగా పనిచేసేవాడు. ఈయన పద్మ పురాణం అనే గ్రంథంలోని భూమిఖండాన్ని తెలుగులోకి అనువదించి రాశాడు.

జీవితం[మార్చు]

ఆయన 1874 సంవత్సరం జూలైలో చాంద్రమాన భావ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి నాడు, స్వాతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు. ఆయన జన్మనామం సాంబశివుడు. ఆయన తల్లిదండ్రులు శ్రీరాజరాజేశ్వరి, లక్ష్మణయ్యలు. ఆయన స్వగ్రామం విలస. ఈ గ్రామం పేరూరు గ్రామ జమీందారులగు జిల్లెళ్ళ వంశీయుల ఆధీనంలో ఉండేది. ఆయనకు ఐదో ఏటకే అక్షర జ్ఞానం అబ్బడంతో అప్పుడే ఉపనయనం గావించారు. దాంతో ఆయన వేదాద్యయనం ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించడంతో వైరాగ్యం చుట్టుముట్టింది. ఒక సద్గురువును ఆశ్రయించి శాస్త్రాలను అభ్యసించాలనే కోరికతో పేరూరు గ్రామ వాస్తవ్యుడైన చన్నయ్య శాస్త్రి దగ్గర చేరి కావ్య, నాటక, అలంకార తర్క శాస్త్రాలను చదివాడు. తరువాత న్యాయశాస్త్రం చదవడానికి విజయనగరం వెళ్ళాడు. అక్కడ సంస్థాన పండితుడైన గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి దగ్గర ఎనిమిది సంవత్సరాల పాటు న్యాయవిద్యనభ్యసించాడు.

మరల స్వగ్రామానికి తిరిగి వచ్చి పీఠికా పురం ఆస్థాన విద్వాంసుడు, తర్క కేసరి అని బిరుదు కలిగిన శ్రీపాద లక్ష్మీనరసింహ శాస్త్రి దగ్గర మరి కొన్ని న్యాయశాస్త్ర గ్రంథాలు చదివాడు. తరువాత మళ్ళీ ఆదిగురువైన చన్నయ్య శాస్త్రి దగ్గర శంకరుని బ్రహ్మసూత్ర భాష్యాలు చదివాడు. తరువాత ఉర్లాం, ఖాశింకోట, విజయనగరము, పిఠాపురము మొదలైన సంస్థానాలలో పండిత సభలందు పలు ప్రశంసలు అందుకున్నాడు.

ఆస్థాన ప్రవేశం[మార్చు]

పేరూరు గ్రామ వాస్తవ్యుడు, జమీందారు అయిన జిల్లెళ్ల రామోజీ భానో వారు ఆయనకు ఆస్థాన పండితుడిగా ఉండమని ఆహ్వానించాడు. పేరూరు గ్రామ సమీపాన యిచ్చమ్మగ్రహారంలో నివాసిస్తూ ఆంధ్రదేశంలో శాస్త్ర ప్రసంగాలు చేస్తుండే వాడు. అప్పుడప్పుడూ వారణాసి లాంటి ప్రదేశాలకు తీర్థయాత్రలకు పోయి అక్కడ రాఖాల్ న్యాయ భట్టాచార్య, వామాచరణ భట్టాచార్య, శివ కుమార పండేజీ మొదలైన వారితో న్యాయ సంవాదములు చేసి వారితో సత్కారం పొందాడు. ఇంకొకసారి కంచి కామకోటి పీఠాధిపతియైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ప్రేరణతో ముక్కామల అనే గ్రామంలో బ్రహ్మసప్తాహ సభలో అందరి పండితుల మధ్యన ప్రస్థాన త్రయం గురించి మంచి ఉపన్యాసమిచ్చి ఆయన ఆశీస్సులందుకున్నాడు. వేదాంతం శేషాద్రి శాస్త్రి, కొల్లూరి సోమశేఖర శాస్త్రి, నౌడూరి కామేశ్వర శాస్త్రి ఆయన శిష్య ప్రశిష్యుల్లో కొంతమంది.

ఆయనకు సంస్కృత భాషయందే కాక తెలుగులో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఒకసారి రామోజీ భానో భార్యయైన వేంకట లక్ష్మాంబ ఆయనను పద్మపురాణమును తెలుగులోకి అనువదించమని అభ్యర్థించింది. వార్థక్యంలో ఉన్ననూ అందుకు ఆయన అంగీకరించి అదే ఆస్థానంలో జ్యోతిష శాస్త్ర పండితుడైన మంధా గోపాలశాస్త్రి రాత సహాయంతో పద్మపురాణంలోని ఆరు ఖండాలలో మూడు ఖండాలను తెలుగులోకి అనువదించాడు.

మరణం[మార్చు]

ఆగస్టు 24, 1953న పరమపదించాడు.

మూలాలు[మార్చు]

  1. మరువాడ, శంభన్న శాస్త్రి (1953). పద్మపురాణం, భూమి ఖండము. తెనాలి: సాధన గ్రంథ మండలి. p. 1. Retrieved 13 July 2016.