Jump to content

మల్లన్నసాగర్ జలాశయం

వికీపీడియా నుండి
మల్లన్నసాగర్ జలాశయం
మల్లన్నసాగర్ జలాశయాం
ప్రదేశంతొగుట-కొండపాక, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
స్థితివాడుకలో ఉంది
నిర్మాణం ప్రారంభం2020
ప్రారంభ తేదీ23 ఫిబ్రవరి, 2022
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
జలాశయం
సృష్టించేదిమల్లన్నసాగర్ జలాశయం
మొత్తం సామర్థ్యం50 టీఎంసీ
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeజలాశయం

మల్లన్నసాగర్ జలాశయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, తొగుట-కొండపాక మండలాల శివారులోని గుట్టల మధ్య ఉన్న జలాశయం. నీటిపారుదల రంగ చరిత్రలోనే సమతల ప్రాంతంలో 50టిఎంసిల నీటినిలువ సామర్థ్యంతో కూడిన మల్లన్న సాగర్ జలాశయం నుండి ఏడాది పొడవునా వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీరు అందించబడుతుంది.[1] కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తున్నారు.[2] కొమురవెళ్లి మల్లన్న దేవుని పేరుమీద ఈ జలాశయానికి మల్లన్నసాగర్ జలాశయంగా పేరు పెట్టబడింది.

ప్రారంభం

[మార్చు]
మీటనొక్కి గోదావరి జలాలను మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి విడుదలచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని మల్లన్నసాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు ఈ జలాశయానికి అనుబంధంగా సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్ ఏర్పాటుచేయబడింది. 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పంప్‌హౌస్ దగ్గర కొమురవెళ్లి మల్లన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తరువాత మీటనొక్కి గోదావరి జలాలను మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేసి, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు. మంత్రులు, అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించిన కేసీఆర్, పంప్‌హౌస్ ల దగ్గర గోదావరి నదిని పసుపు-కుంకుమలతో పూజలు చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి. హరీశ్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సి.హెచ్. మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4][5] ఈ ప్రాజెక్టు పూర్తిచేసి మ‌ల్ల‌న్న పాదాల‌ను క‌డుగుతాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా, సాయంత్రం కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామిని దర్శించుకున్న కేసీఆర్ గోదావ‌రి జ‌లాల‌తో మ‌ల్ల‌న్న స్వామికి అభిషేకం చేసి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించాడు.[6]

జలాశయం సామర్థ్యం

[మార్చు]

కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ అతి పెద్దది, అత్యంత ఎత్తున ఉన్నదీ ఈ జలాశయం.[7] 50టిఎంసిల నీటి నిలువ సామర్ధం ఉన్న ఈ జలాశయం భద్రతా ప్రామాణాల దృష్టా తొలి ఏడాది ట్రయల్ రన్‌గా 10.50టిఎంసీల నీటిని నింపగా, 2022 ఫిబ్రవరి 23న మరో 6.50టిఎంసీల నీటిని జలాశయంలో నింపారు. దాంతో ఈ జలాశయంలో నీటి నిలువ ఈ సీజన్‌లో 17టిఎంసిలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, రాజన్న, కామారెడ్డి, నిజామాబాద్, మేడ్చెల్, జనగాం, నల్లగొండ జిల్లాల్లోని 11.29 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయి.

ఇక్కడి నుంచి గజ్వేల్‌ రెవెన్యూ డివిజనులోని పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ జలాశయానికి 7టీఎంసీలు, నల్లగొండ-యాదాద్రి జిల్లాల్లో నిర్మించనున్న గంధమల్ల జలాశయానికి 9.5టీఎంసీలు, బస్వాపూర్‌ జలాశయానికి 11.3టీఎంసీల నీటిని తరలిస్తారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో సింగూర్‌ ప్రాజెక్టుకు అనుసంధానించి నీటిని సరఫరా చేయడంద్వారా సింగూరు జలాశయం కిందనున్న ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతుంది. అక్కడినుంచి ఖర్చు లేకుండానే నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సరఫరా చేసేందుకు ఈ మల్లన్నసాగర్ జలాశయం రూపొందించబడింది.[8]

భూ సేకరణ

[మార్చు]

2015లో మల్లన్నసాగర్‌ జలాశయ నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభమై, నిర్మాణంకోసం 17వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రతిపాదించబడింది. దీంతో, 8 గ్రామాలు (అయిదు రెవెన్యూ గ్రామాలు పూర్తిగానూ, మూడు రెవెన్యూ గ్రామాలు పాక్షికంగా) ముంపునకు గురవుతుండటంతో జలాశయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం భూనిర్వాసితులకు భరోసా కల్పించి, ప్రత్యేక ప్యాకేజీలను అందజేయడంతోపాటు, పునరావాసకాలనీలను నిర్మించి, ఒక్కొక్కటిగా ముంపు గ్రామాలను ఖాళీ చేయించింది.[9]

నిర్మాణం

[మార్చు]

అరుబయలు ప్రాంతంలోని సుమారు 17,600 ఎకరాల విస్తీర్ణంలో, 7400 కోట్ల రూపాయలతో, 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల పొడవు కట్టతో ఈ జలాశయం నిర్మాణం జరిగింది. 2018లో జలాశయం పనులను ప్రారంభించి రెండేళ్ళకాలంలోనే నిర్మాణ పనులు పూర్తిచేశారు. జలాశయం సామర్థ్యం 50 టిఎంసీలు కాగా, కట్ట నిర్మాణం ప్లస్ 557 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీనిని నిర్మించారు. 143 మీటర్ల పొడవుతో మత్తడి ఏర్పాటుచేయబడింది. తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి మల్లన్నసాగర్‌కు జలాశయానికి నీరు తరలించబడుతుంది. బండ్‌ లెవెల్ ప్లస్ 562.000 మీ., మినిమమ్ డ్రా డౌన్ లెవల్ ప్లస్ 532.165 మీ., ఫుల్ లెవెల్ వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం 59.00 చదరపు కిలోమీటర్లుగా ఉంది. జలాశయం పరివాహక ప్రాంతం 75 చదరపు కిలోమీటర్లు ఉంది. కట్టకు ఒటి స్లూయీస్‌లు ఏర్పాటు చేశారు. ప్యాకేజి 14, 15 వద్ద గ్రావిటి నీటి ప్రవాహానికి 2.525కి.మి వద్ద కాలువను నిర్మించారు. దీని ద్వారా ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తున్నారు. ఒటి స్లూయీస్2లో ప్యాకేజి 13, 17 కోసం 2.891 కి.మీ.ల వద్ద సమాంతర కాలువ నిర్మించబడింది. దీని ద్వారా 0.5 టిఎంసిల నీరు విడుదలవుతుంది. ప్యాకేజి 12కోసం 21.35 కిలోమీటరు వద్ద ఏర్పాటు చేశారు. దీని నీటి విడుదల సామర్దం 29.218 క్యూబెక్స్ గా ఉంది. దీని ద్వారా 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఒటి స్లూయీస్ 4 తపస్పల్లికి కి.మీ. 0.75 వద్ద నిర్మించబడింది. దీని ద్వారా 49.745 క్యూమెక్స్ నీరు విడుదలవుతుంది. ఒటి స్లూయీస్5ను కి.మి 4.800 వద్ద మిషన్ భగీరథ కోసం ఏర్పాటుచేయబడింది. రంగనాయకసాగర్ జలాశయం నుంచి విడుదలయ్యే నీటిని ప్రధాన కాలువ నుంచి మల్లన్న సాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు 8 మెగా పంపులను నిర్మించబడ్డాయి. ఈ పంప్‌హౌస్‌కోసం 47 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు.[2]

తొలివిడత పరీక్ష

[మార్చు]

జలాశయం ప్రొటోకాల్‌ ప్రాకారం, పూర్తిస్థాయి నిల్వమట్టాన్ని ఒకేసారి నింపకుండా విడతలవారీగా క్రమపద్ధతిలో ఒక్కోస్థాయి వరకు నీటిని నింపుతూ 60 మీటర్ల ఎత్తయిన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తున్నదో తెలుసుకోవడంకోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి. నిర్మాణ నాణ్యత, ఇనుప ఫిల్లర్లు, మెటల్‌ ఫిల్లర్లు, రాతి కట్టడాలు, డ్రైయిన్‌ సిస్టమ్‌ను మొదలైన అంశాలలో ఐఐటీ హైదరాబాద్‌, ఓయూ ప్రొఫెసర్ల ఎక్స్‌పర్ట్‌ కమిటీ, విశ్రాంత ఇంజినీరింగ్‌ అధికారులు అధ్యయనం చేసి, ధ్రువీకరించారు.

నీటి తరలింపు వివరాలు

[మార్చు]

2021 ఆగస్టు 7న తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్ హౌజ్ నుంచి మూడు మోటార్ల ద్వారా ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా గోదావరి జలాలు కాళేశ్వరం తాత్కాలిక కాలువలోకి విడుదల చేయబడి, అక్కడి నుంచి మల్లన్నసాగర్ లోకి మళ్ళించబడ్డాయి. ఆగస్టు 22 నుంచి 28 వరకు ఎనిమిది మోటార్ల ద్వారా 4.3 టీఎంసీల నీరు తరలించబడింది.[9] కొద్దిరోజుల తరువాత సెప్టెంబరు 17 నుంచి నీటిని విడుదల చేసి మరో ఆరు టీఎంసీల నీటి మల్లన్నసాగర్ లోకి పంపబడింది. జలాశయం ప్రారంభించేనాటికి 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది.[10]

ప్రత్యేకతలు

[మార్చు]
  • జలాశయం పూర్తి సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) +557 మీటర్లు.
  • 532 మీటర్ల వరకు (10 టీఎంసీలు) నీటిని నిల్వ చేస్తారు. ఇది డెడ్‌ స్టోరేజీ.
  • 532 మీటర్ల నుంచి 557 మీటర్ల వరకు నీటిని నిరంతరం వాడుకుంటారు. ఇవి 40 టీఎంసీలు
  • రిజర్వాయర్‌ కోసం 17,871 ఎకరాల భూమిని సేకరించారు.
  • రిజర్వాయర్‌ కట్ట పొడవు 22.6 కిలోమీటర్లు కాగా, కట్ట వెడల్పు 440 మీటర్లు.
  • ఆనకట్టకు 5 ఓటీ స్లూయిస్‌లు. వీటినుంచి కొండపోచమ్మ, బస్వాపూర్‌, గంధమల్ల, సింగూరు, దుబ్బాక ప్రాంతాలకు సాగునీరు అందుతుంది.
  • నాలుగో స్లూయిస్‌ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల నీరు మిషన్‌ భగీరథకు తరలించబడుతుంది.
  • కట్ట వెడల్పు- 440 మీటర్లు, రిజర్వాయర్ కట్ట పొడవు- 22.4 కిలో మీటర్లు[11]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-02-22). "మల్లన్నసిగలో గంగమ్మ తాండవం". Namasthe Telangana. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
  2. 2.0 2.1 telugu, NT News (2022-02-15). "మల్లన్న ఉప్పొంగంగా." Namasthe Telangana. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-22.
  3. telugu, NT News (2022-02-23). "మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
  4. Velugu, V6 (2022-02-23). "మల్లన్న ఒడికి గోదావరి జలాలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "CM KCR: మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్‌". EENADU. 2022-02-23. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
  6. telugu, NT News (2022-02-23). "గోదావ‌రి జ‌లాల‌తో కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు సీఎం కేసీఆర్ అభిషేకం". Namasthe Telangana. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
  7. telugu, NT News (2022-02-16). "Mallanna Sagar | తెలంగాణ జల కిరీటం.. మల్లన్నసాగరం". www.ntnews.com. Archived from the original on 2022-02-18. Retrieved 2022-02-22.
  8. Velugu, V6 (2022-02-23). "మల్లన్న సాగర్ జలదృశ్యం ప్రత్యేకతలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. 9.0 9.1 "మరో జలసవ్వడి". andhrajyothy. 2021-08-22. Archived from the original on 2022-02-22. Retrieved 2022-02-22.
  10. "23న మల్లన్నసాగర్‌ జలాశయ ప్రారంభోత్సవం". EENADU. 2022-02-16. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-22.
  11. V6 Velugu (23 February 2022). "మల్లన్న సాగర్ జలదృశ్యం ప్రత్యేకతలు" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)