Jump to content

మహాక్ చౌహాన్

వికీపీడియా నుండి


మహాక్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ భారతీయ రగ్బీ క్రీడాకారిణి. కనీస వసతులు లేని మారుమూల గ్రామం నుండి అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈమె, క్రీడా విశ్లేషకులచే ‘భారత రగ్బీ భవిష్యత్తు’గా ప్రశంసలు అందుకుంటోంది.[1][2]

ప్రారంభ జీవితం, నేపథ్యం

[మార్చు]

మహాక్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గల భద్రాసు అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి అవనేంద్ర చౌహాన్‌ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. చిన్న వయసు నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్న మహాక్‌ రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ వంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో చురుగ్గా పాల్గొనేది. సొంత ప్రాంతంలో క్రీడా శిక్షణకు తగిన కనీస సౌకర్యాలు లేకపోవడంతో, ఎనిమిదో తరగతి పూర్తి కాగానే ఈమె తండ్రి ఈమెను డెహ్రాడూన్‌లోని ఒక పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఈమె పరుగు పందెంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.

రగ్బీ క్రీడలోకి ప్రవేశం

[మార్చు]

డెహ్రాడూన్‌ లో శిక్షణ పొందుతున్న సమయంలో రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక ట్రయల్స్‌లో మహాక్‌ పాల్గొని పరుగు పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమె ప్రతిభను గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా రగ్బీ జట్టు కోచ్ ఆయుష్ సైనీ ఈమెను రగ్బీ క్రీడకు ఎంపిక చేశారు. అంతకుముందు రగ్బీ క్రీడ గురించి కనీస అవగాహన లేకపోయినప్పటికీ, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమె 2023లో రగ్బీ క్రీడలో నిపుణుల పర్యవేక్షణలో అధికారికంగా అభ్యాసం ప్రారంభించింది.

క్రీడా ప్రస్థానం, విజయాలు

[మార్చు]

కఠిన సాధనతో స్వల్ప కాలంలోనే రగ్బీలో నైపుణ్యం సాధించిన మహాక్‌, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించింది. రగ్బీ ఆడటం ప్రారంభించిన ఏడాదిలోనే ఉత్తరాఖండ్ అండర్-18 గర్ల్స్ రగ్బీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయింది. ఈమె నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది.

  • అంతర్జాతీయ పోటీలు: మలేషియా లో జరిగిన అండర్-20 రగ్బీ పోటీలలో పాల్గొన్న భారత జట్టులో సభ్యురాలిగా ఉండి కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
  • సీనియర్ అంతర్జాతీయ టోర్నీ: ఉజ్బెకిస్తాన్‌ లోని తాష్కెంట్‌ లో మధ్య, దక్షిణ ఆసియా దేశాలలో రగ్బీని ప్రోత్సహించడానికి నిర్వహించిన ‘సెంట్రల్ అండ్ సౌత్ ఆసియా (CASA) రగ్బీ-7’ టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున పాల్గొంది. ఇది ఈమెకు మొట్టమొదటి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఈ పోటీలలో భారత జట్టు నాల్గవ స్థానంలో నిలిచింది.
  • అవార్డులు: సీఎఎ్‌సఏ (CASA) టోర్నమెంట్‌లో మహాక్ మొత్తం తొమ్మిది ‘ట్రైస్’ (Tris) సాధించి అత్యుత్తమ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కైవసం చేసుకుంది. ఇటీవలి కాలంలో భారత మహిళల రగ్బీలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసిన క్రీడాకారిణిగా ఈమె గుర్తింపు పొందింది.

మూలాలు

[మార్చు]
  1. ↑ "అనుకోకుండా వచ్చి.. 'రగ్బీ' స్టార్ అయింది". EENADU. Retrieved 2026-07-17.
  2. ↑ ABN (2026-06-04). "రగ్బీ మహాక్‌". Andhrajyothy Telugu News. Retrieved 2026-07-17.