Jump to content

మాఠర రాజవంశం

వికీపీడియా నుండి

 

మాఠర రాజవంశం

సా.శ. 4 వ శతాబ్దం–సా.శ. 5 వ శతాబ్దం
పటం
Find spots and places of issue of the Mathara inscriptions
రాజధానిసింహపుర
మతం
హిందూమతం
ప్రభుత్వంరాచరికం
చారిత్రిక కాలంమధ్యయుగ రాజ్యాలు
• స్థాపన
సా.శ. 4 వ శతాబ్దం
• పతనం
సా.శ. 5 వ శతాబ్దం
Preceded by
Succeeded by
గుప్త సామ్రాజ్యం
పితృభక్త వంశం
వశిష్ఠ వంశం

సా.శ. 4వ, 5వ శతాబ్దాలలో తూర్పు భారతదేశంలోని కళింగ ప్రాంతాన్ని మాఠర రాజవంశం పాలించింది. ఆ కాలంలో కళింగను పాలించిన కొన్ని రాజకుటుంబాలలో అది ఒకటి (ఇతరులు వశిష్ఠ, పితృభక్త). వారి భూభాగం ప్రధానంగా ఒడిశా దక్షిణ భాగానికి, గోదావరి నదికీ మధ్య ఉంది.[1] వారు పితృభక్త రాజవంశం చేతిలో ఓడిపోయినట్లు కనిపిస్తోంది.

వంశావళి

[మార్చు]

మాఠర కుటుంబంలో క్రింది సభ్యుల గురించి తెలిసింది:[2]

  • శంకరవర్మ
  • శక్తివర్మ
  • ప్రభంజనవర్మ
  • అనంతశక్తివర్మ

మాఠర రాజులు నారాయణ (విష్ణువు) భక్తులు. [3]

చరిత్ర

[మార్చు]

గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడి దళాలు ఈ ప్రాంతం నుండి వైదొలగిన తర్వాత, 4వ శతాబ్దం మధ్యకాలం నుండి 5వ శతాబ్దం చివరి వరకు మాఠర రాజవంశం కళింగను పరిపాలించింది.[4] కళింగ ప్రాంతంపై నియంత్రణ కోసం వారు వసిష్ఠులు, పితృభక్తులతో పోరాడారు.[5]

శక్తివర్మ

[మార్చు]

శక్తివర్మ ఈ రాజవంశపు తొలి పాలకుడు. అతనికి కళింగాధిపతి అనే బిరుదు ఉంది.[6] అతని తండ్రి శంకరవర్మ. అతనికి బిరుదు ఏమీ లేదు.[7]

శక్తివర్మ పాలన 13వ సంవత్సరం నాటి రాగి ఫలక శాసనం, ఆయనను మహారాజస్య-శ్రీ శక్తివర్మణహగా వర్ణిస్తుంది. దీనిని ఆయన మంత్రి (అమాత్య) అర్జునదత్తుడు రచించాడు. ఈ శాసనాన్ని పిష్టపురంలో జారీ చేసాడు. ఇది ఆధునిక పిఠాపురం.[8] శ్రీకాకుళం జిల్లాలోని రాకలువ ప్రాంతాన్ని (ఆధునిక రాగోలు) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. ఈ ప్రాంతం కళింగ విషయం (జిల్లా)లో ఉన్నట్లు వర్ణించబడింది.[6]

ఈ శాసనం శక్తివర్మను వాసిష్ఠి కుమారుడిగా వర్ణిస్తుంది.[8] చరిత్రకారుడు స్నిగ్ధా త్రిపాఠి ప్రకారం, అతని తల్లి వసిష్ఠ రాజవంశం నుండి వచ్చిందని ఇది సూచిస్తోంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు వంటి పూర్వ రాజవంశాలు కూడా ఇటువంటి మాతృనామాలను ఉపయోగించాయి. పిష్టపుర మొదట వసిష్ఠ రాజవంశం నియంత్రణలో ఉండేది. శక్తివర్మ బహుశా దానిని తన తల్లి నుండి వారసత్వంగా పొంది ఉండవచ్చు. కొంతమంది పండితులు పిష్టపుర మాఠర ల రాజధాని అని భావిస్తారు. అయితే, శక్తివర్మ తరువాత వచ్చిన వారసులలో ఎవరూ పిష్టపుర నుండి శాసనాలు జారీ చేసినట్లు తెలియదు.[6]

ఈ శాసనం శక్తివర్మ కాలంలో కళింగ రాజ్యం దక్షిణాన గోదావరి నది వరకు విస్తరించిందని సూచిస్తుంది.[6] శక్తివర్మ మహానది కృష్ణవెన్న (కృష్ణ) నది మధ్య ప్రాంతాన్ని పరిపాలించాడని అతని కుమారుడు వేయించిన సింహపుర శాసనం పేర్కొంది. ఈ వాదన అతిశయోక్తిగా అనిపిస్తుంది: 5వ, 6వ శతాబ్దాలలో, గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని శాలంకాయనులు, ఆ తరువాత విష్ణుకుండినులు పాలించారు. అలాగే, మాఠర పాలన ఉత్తరాన మహానది వరకు విస్తరించిందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. శాసనంలో ప్రస్తావించబడిన "మహానది" ప్రస్తుత గంజాం జిల్లాలో వేరే నదిగా కనిపిస్తుంది; ఇది అస్కా సమీపంలోని రుషికుల్య నదిలో కలుస్తుంది.[9]

ప్రభంజనవర్మ

[మార్చు]

ప్రభంజనవర్మ తన తండ్రి శక్తివర్మ తరువాత రాజయ్యాడు.[9] ఇప్పటి వరకూ తెలిసిన, అతని ఏకైక శాసనం సింహపురం నుండి జారీ చేయబడింది. ఆ శాసనం అతన్ని సకల-కళింగాధిపతిగా వర్ణిస్తుంది.[6]

ఈ శాసనం నింగొండి అగ్రహార సృష్టిని వివరిస్తుంది. ఈ గ్రామం సముద్ర తీరంలో ఉంది. అయితే దాని స్థానం ఖచ్చితంగా తెలియదు. ఈ శాసనం జ్యేష్ఠుడిని రాజు వద్ద పనిచేసే దండనాయకుడు అని పేర్కొంది.[9]

అనంతశక్తివర్మ

[మార్చు]

అనంతశక్తివర్మ తన తండ్రి ప్రభంజనవర్మ తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. ఆయనకు కళింగాధిపతి అనే బిరుదు లభించింది. [3]

ఈ రాజు పాలన 14వ సంవత్సరం నాటి శాసనం లభించింది. దాని ఎక్కడ నుండి జారీ చేసారో ఇందులో ప్రస్తావించలేదు, బహుశా దాన్ని సింహపుర నుండి జారీ చేసి ఉండవచ్చు, తరువాత ఇది పితృభక్తుల నియంత్రణలోకి వచ్చింది. ఈ శాసనం ఆండోరెప్ప గ్రామాన్ని (శ్రీకాకుళం జిల్లాలోని ఆధునిక అంధవరం) బ్రాహ్మణులకు మంజూరు చేసినట్లు నమోదు చేస్తుంది. ఇది మాత్రవరుడిని రాజు అధికారిగా (దేశాక్షపతలాధికృత, దండనాయక ) పేర్కొంది. [3]

ఈ రాజు వేయించిన మరొక శాసనం, అతని 28వ పాలన సంవత్సరంలో జారీ చేయబడింది. ప్రస్తుతం ఇది ప్రస్తుతం మద్రాస్ మ్యూజియంలో ఉంది. ఇది అర్జునదత్తుడిని రాజ అధికారిగా (దేశాక్షపతలాధికృత ) పేర్కొంది; అతను శక్తివర్మ శాసనంలో ప్రస్తావించబడిన దండనాయకుడిలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. పితృభక్తుల రికార్డులలో కూడా అర్జునదత్త పేరు కనిపిస్తుంది.[3]

అనంతశక్తివర్మ‌ను పితృభక్త రాజు ఉమావర్మ పడగొట్టినట్లు తెలుస్తోంది.[10] మాత్రవరుడు అనే అతని అధికారి, ఆ తరువాత సింహపురలో ఉమావర్మ వద్ద దేశాక్షపతలాధికృతుడిగా పనిచేశాడు.[11] అనంతశక్తివర్మ తర్వాత పిష్టపుర, వశిష్ఠ రాజవంశం నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ఠ రాజు అనంతవర్మ ఈ నగరం నుండి ఒక శాసనాన్ని జారీ చేశాడు.[7]

శాసనాలు

[మార్చు]

మాఠర రాజులు కింది రాగి ఫలక శాసనాలు వేయించారు:[12]

కనిపించిన ప్రదేశం జారీ చేసిన వ్యక్తి జారీ చేసిన ప్రదేశం పాలనా సంవత్సరం ఉద్దేశం
రాగోలు శక్తివర్మ పిష్టపుర 13 రాకలువ గ్రామం (ఆధునిక రాగోలు) మంజూరు
తెలియదు ప్రభంజనవర్మ సింహపుర నింగొండిలో భూమి మంజూరు
అంధవరం అనంతశక్తివర్మ 14 అండోరెప్ప గ్రామం (ఆధునిక అంధవరం) మంజూరు
తెలియదు (ప్రస్తుతం మద్రాస్ మ్యూజియంలో ఉంది) అనంతశక్తివర్మ 28 సకునాక గ్రామ గ్రాంట్ (గుర్తింపు స్పష్టంగా లేదు)

ఈ శాసనాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. దక్షిణ శైలి బ్రాహ్మిలిపిలో రాసి ఉన్నాయి.[13]

మూలాలు

[మార్చు]
  1. କୃଷ୍ଣଚନ୍ଦ୍ର ପାଣିଗ୍ରାହୀ; Krishna Chandra Panigrahi; Kr̥ṣṇacandra Pāṇigrāhī; Krishna Chandra Panigrahi; Kr̥ṣṇacandra Pāṇigrāhī (1986). History of Orissa. State Committee for Compilation of History of the Freedom Movement Orissa.
  2. Snigdha Tripathy 1997, p. 8.
  3. 3.0 3.1 3.2 3.3 Snigdha Tripathy 1997, p. 7.
  4. Shishir Kumar Panda 1995, p. 11.
  5. Snigdha Tripathy 1997, p. 219.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Snigdha Tripathy 1997, p. 5.
  7. 7.0 7.1 Snigdha Tripathy 1997, p. 9.
  8. 8.0 8.1 Snigdha Tripathy 1997, p. 4.
  9. 9.0 9.1 9.2 Snigdha Tripathy 1997, p. 6.
  10. Dilip Kumar Ganguly 1975, p. 225.
  11. Snigdha Tripathy 1997, p. 12.
  12. Snigdha Tripathy 1997, p. xi, 4-8.
  13. Snigdha Tripathy 1997, pp. 17–18.