మాధవ వర్మ
మాధవ వర్మ ప్రాచీనాంధ్రదేశానికి చెందిన రాజు. ఆయన వీర పరాక్రమములు చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాయి.
పూర్వరంగం
[మార్చు]మాధవవర్మ తండ్రి సోమదేవుడు కుందాపురమును రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన తండ్రి పేరు విజయపాలుడు, తాత పేరు నందభూవరుడు. ధర్మాచరణమును, దైవభక్తి యందు ఆసక్తి కలవాడు. మల్లికార్జున దేవుడిపై భక్తి.ఆయనకు గోసంపద అంటే బహు ప్రీతి. తన కోటలో వేలకొలదీ గోవులను పెంచి పోషించడమే కాకుండా సతీ సమేతంగా గోపూజలు కూడా చేసేవాడు.
ఆయన భార్య సిరియాలు దేవి. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఆమె గర్భము దాల్చింది. అయితే అదే సమయంలో కటక దేశరాజైన బల్లహుడు తమ దేశంపైకి దండెత్తి వస్తున్నట్లుగా వర్తమానం అందుతుంది. బల్లహుడు అంతకుముందు కుందాపురమునకు వచ్చి సోమదేవుడి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళి ఉంటాడు. ఆ సమయముననే కోట రహస్యాలను తెలుసుకును వెళ్ళాడని సోమదేవుడు, అతని మంత్రి తలపోస్తారు.
యుద్ధంలో ఫలితం ఎలాగైనా ఉండవచ్చని సోమదేవుడు మంత్రి సలహాతో నిండు చూలాలైన తన భార్యను అక్కడికి కొంత దూరములోనున్న అనుమకొండకు దాసీ సహాయంతో పంపించి వేస్తాడు.
పుట్టుక
[మార్చు]సిరియాలు దేవి అనుమకొండలోని బ్రాహ్మణ అగ్రహారం చేరుకుని అక్కడ అందరి అభిమానించే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తముడి ఇంట చేరుతుంది. ఆయన ఆమెను ఆదరించి జానకి అనే మారుపేరుతో ఎవరికీ అనుమానం రాకుండా కాపాడుతుంటాడు. కొద్దికాలానికి ఆమెకు మాధవ వర్మ జన్మించాడు. ఆపత్కాలములో తనను శ్రద్ధగా పెంచి పోషించిన మాధవ శర్మ పేరు మీదుగా ఆమె ఆ పేరు పెడుతుంది. యుద్ధంలో సోమదేవుడు బల్లహుని చేతిలో మరణిస్తాడు. రాజ్యం అతని వశమౌతుంది.
శతృశేషం
[మార్చు]బల్లహుడు యుద్ధంలో సోమదేవుని జయించినా ఆయన భార్య ఎక్కడికి పోయిందో అంతు చిక్కదు. శతృశేషం మిగల్చడం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి గూఢచారుల ద్వారా ఆమె ఎక్కడ ఉన్నదీ పసిగట్టి నిర్ధారించుకోవలసినదిగా మంత్రిని అనుమకొండకు పంపిస్తాడు. బల్లహుడి మంత్రి మాధవశర్మ దగ్గరకు వెచ్చి తను వచ్చిన పనిని తెలియ జేస్తాడు. ధర్మాచార పరాయణుడైన సోమదేవుని వంశం నిలబెట్టడం కోసం ఆయన రాణి అక్కడెక్కడా లేదని చెప్పి పంపేస్తాడు.
కానీ బల్లహుడి అనుమానం తీరదు. ఆ అగ్రహార బ్రాహ్మణులందరినీ అక్కడే గల పద్మాక్షీ దేవాలయములో విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. అందరితో పాటు జానకీ దేవిని కూడా వడ్డించమంటారు. సాధారణంగా బ్రాహ్మణులు ఇతరులు వడ్డిస్తే తినరు కాబట్టి అక్కడ ఆమెను క్షత్రియకాంతగా నిర్ధారించవచ్చని బల్లహుడి ఆలోచన. కానీ అక్కడున్న బ్రాహ్మణులందరూ మాధవ శర్మ, సోమదేవుడి మంచితనాన్ని ఎరిగుండటం వల్ల ఆమె వడ్డించినా సందేహించకుండా భోంచేస్తారు. దాంతో జానకీదేవి నిజంగా బ్రాహ్మణ స్త్రీయేనని, భర్త మరణం తట్టుకోలేక సిరియాలు దేవి కూడా మరణించి ఉంటుందని బల్లహుడు భావిస్తాడు.
అలా మాధవవర్మ పెరిగి పెద్దవాడవుతాడు. మాధవ శర్మ ఆధ్వర్యంలో సకల శాస్త్రాలు అభ్యసిస్తాడు.
తిరుగుబాటు
[మార్చు]చిన్నప్పటి నుంచి సిరియాలు దేవి అతనికి తండ్రి ఎవరో తెలియజేయకపోయినా నలుగురూ మాట్లాడుకునే మాటల ద్వారా విషయాన్ని చూచాయగా తెలుసుకుంటాడు. అతనికి పదహేరేళ్ళ వయసు రాగానే ఇక అతని జన్మ వృత్తాంతం గోప్యంగా ఉంచడం భావ్యం కాదని మాధవ వర్మ అతని తండ్రి సోమదేవుడి గురించి, బల్లహుడి చేతిలో సామ్రాజ్యాన్ని కోల్పోవడం గురించి తెలియజేస్తాడు.
మాధవ వర్మ ముందుగా అనుమకొండరు రాజైన ఎఱుక రాజును ఓడించి అతని సహాయంతో కుందాపురమును ముట్టడిస్తాడు. అప్పటికి బల్లహుడి అధికార ప్రతినిథి అక్కడ కోటను పరిపాలిస్తూ ఉంటాడు. కోటలో కొంతమంది కటక రాజ్యానికి చెందిన వారున్నప్పటికీ తెలుగు వారే అక్కడ ఉన్నారు. వారు మాధవ వర్మ దండయాత్ర తెలిసి సంతోషించారు. ఆ ప్రతినిథి ఉన్న కొద్ది కటక సైన్యంతోనే మాధవవర్మ సైన్యాన్ని ఎదుర్కుంటూ బల్లహుడికి వర్తమానం పంపించాడు. బల్లహుడు అక్కడికి రాగానే మాధవవర్మ అతన్ని యుధ్ధంలో జయించి తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు.
మూలాలు
[మార్చు]- చరిత్ర ధన్యులు - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - 45 వ పుట