Jump to content

మామిడిపిక్కనూనె

వికీపీడియా నుండి
మామిడిపిక్క నూనె
సంతృప్త క్రొవ్వులు 45-50

అసంతృప్త క్రొవ్వులు 50-55
Monounsaturated 40-46
 • Omega-6 fatty acids 3-4

ధర్మములు
ద్రవీభవన స్థానం 32–43 °C (90–109 °F)

Solidity at 20 °C semi-solid

అయోడిన్ విలువ 32.0-60.7
మామిడిచెట్టు-కాయలతో
మామిడిపూత
పండిన మామిడి పళ్ళు
టెంక-లోపలి విత్తనం
మామిడి టెంక

మామిడి టెంకల లోని పిక్కనుండి తీసే నూనెను మామిడి నూనె అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ, ఘనమధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వల్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు, ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (స్టియరిక్) ఎక్కువ వుండటం వలన, 38-400C ( మిగతా నూనెలు 23-27° సెంటీగ్రేడు) వద్ద ద్రవీభవిస్తుంది. అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు లేదా మామిడి వెన్న అనికూడా అంటారు. మామిడికి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇవి మాంగిఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలు. మామిడి వృక్షశాస్త్ర నామం మాంగిఫెర ఇండికా మామిడి మూల జన్మస్థానం దక్షిణ ఆసియా, తూర్పుభారతదేశ ప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం, మామిడి ఆసియా ఖండం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి ఇరాన్) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడింది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా ఆఫ్రికాకు వ్యాపింపచేయబడింది. ఆఫ్రికన్లచే బ్రెజిల్కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడింది.[1] అతితక్కువ కాలంలోనే అమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగింది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించింది.

నూనె ఆవశ్యకత

[మార్చు]

భారతదేశంలో ఉత్పత్తి అగుచున్న వంటనూనెల పరిమాణానికి, అవసరానికి భారీగా తేడా ఉంది. ఏడాదికి 80-100 లక్షల టన్నుల నూనెను (ముఖ్యంగా సోయా, పామాయిల్) దిగుమతి చేసుకుంటున్నారు. ఈఅవసరాన్ని దృష్టిలో వుంచుకొని ఒకవైపు నూనెగింజల సాగు విస్తీర్ణాన్ని పెంచు ప్రయత్నాలు చేస్తూ, మరోవైపు సంప్రదాయేతర చెట్లు వేప, కానుగ, ఇప్ప, సాల్, అడవి ఆముదం (జట్రొఫా), కుసుమ్ (కుసుమనూనె కాదు), కొకుం, మొక్కలైన గోగు, పొగాకు, పుచ్చ, వెర్రిపుచ్చ గింజల నుండి నూనెను ఉత్పత్తిచెయ్యు ప్రయత్నాలు గత 3-4 దశాబ్దాలుగా చేస్తున్నారు. చెట్ల గింజల నుండి తియ్యు నూనెలలో ఏక్కువ నూనెలు వంటనూనెగా పనికిరావు.కాని సబ్బులు, కొవ్వు ఆమ్లం, గ్రీజులు, హైడ్రిజెనెసను ఫ్యాట్స్, తయారికి వుపయోగపడును. ఆమేరకు వంటనూనెలను ఆయా పరిశ్రమలలో వాడకుండ ఆరికట్టవచ్చును. సాల్ (sal), మామిడిపిక్కనూనె, పుచ్చగింజల నూనెలను వంటనూనెగా, వనస్పతి తయారిలో వాడవచ్చును.

ఎడాదికి దాదాపు 70-80 లక్షల టన్నుల మామిడి పళ్లను పండిస్తూ, మామిడి ఉత్పత్తిలో భారతదేశం ప్రథమస్థానంలో ఉంది. మామిడిపండులో 15-20% శాతం టెంక వుండునన్న అంచనా ప్రకారం కనీసం 10 లక్షల టన్నులు టెంక వుత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. టెంకలో పిక్క 65-70% వుండును, అనగా కనీసం 70వేల టన్నులపిక్క వచ్చును. పిక్కలో నూనె/ఫ్యాట్, 6-9% వరకు వుండును. అందునుంచి 40-50 టన్నుల నూనెను పొందవచ్చును. కాని వాస్తవానికి అందులో10% నూనెకూడా ఉత్పత్తి కావడంలేదు. గత 10 సం. (1999-2009) లలో 7,056 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయినది (annual report, SEA., 2008-09). 2001-02లో తక్కువగా 17 టన్నులమామిడిపిక్క నూనెను తీయగా, 1999-2000లో 3,900 టన్నులు,2004-05లో 2,233 వుత్పత్తి అయ్యినది. ఇంతతక్కువగా ఉత్పత్తి అవ్వటానికి కారణం పిక్కలసేకరణలో ఎదురవ్వుతున్నఇబ్బంది. ఉత్పత్తి అయ్యిన పళ్లలో ఎక్కువశాతం ఎగుమతి చెయ్యడం, దేశంలో ప్రజల వాడకం వివిధ ప్రాంతాలకు, దూరంగా విస్తరించి వుండటం, తిన్న తరువాత టెంకలను బయట పడెయ్యటం వలన సేకరణ కష్టంగావుంది. పళ్ళడి పళ్ళరసం, జామ్ తయారుచెయ్యు పరిశ్రమల నుండి, పచ్చళ్లు (pickles) చెయ్యు పరిశ్రమల నుండి మాత్రమే నేరుగా సేకరించ వీలున్నది. కాని ఇటువంటి పరిశ్రమలు తక్కువసంఖ్యలో ఉన్నాయి. టెంకలను సేకరించి పరిశ్రమలకు అందించగలిగినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు.

మామిడిపిక్క

[మార్చు]

మామిడి పండులో టెంక మధ్యకొంచెం వుబ్బెత్తుగా వుండి, రెండు చివరలు కొద్దిగా కోసుగా వుండి, అంచులు దగ్గరిగా నొక్కబడి వుండును. పొడవు పండురకాన్ని బట్టి 2-4 అంగుళాలుండును. టెంక పైభాగం పీచు కల్గి గట్టిగా వుండును. టెంకలో పిక్క 65-70% వుండును. టెంక 10-20% వుండును. ఆకారంలో కొద్దిగా మూత్రపిండాన్ని పోలి వుండును. పిక్క పైభాగంలో మైనపు పొరవంటి పొరవుండును. పిక్క యొక్క పరిమాణం పండు రకాన్ని బట్టి 1.5-2 అంగుళాలుండి మీగడ రంగులో వుండును. మామిడి పిక్క/గింజలో మామిడి రకాన్ని బట్టి నూనె/కొవ్వు 6-9%, మాంసకృత్తులు 5-10.0%, జీర్ణమైయ్యే పోషకాలు 70% వుంటాయి.[2] పిండిపదార్థాలు30-43.0% వరకు డును.

మామిడిపిక్క యొక్క పోషకవిలువలు [3]

పోషక పదార్ధాలు శాతం
కొవ్వు 6-10
సిలికా 2.5
పీచు 8.0
మాంసకృత్తులు (ప్రోటీను) 5-6
మొత్తం జీర్ణమగు పోషకాలు 70.0

పిక్కలోని అమీనోఆమ్లాల శాతం [3]

అమీనోఆమ్లం శాతం
లైసిన్ 0.4
మిథియోనైన్ 0.16
సిస్టీన్ 0.11
థ్రియోనైన్ 0.43
ట్రిప్టోఫేన్ శూన్యం

మామిడిపిక్కనూనె/కొవ్వు

[మార్చు]

మామిడి పిక్కనూనె (Mango kernel oil) లేత పసుపురంగులో లేదా మీగడ రంగులో వుండును. ద్రవీభవన ఉష్ణోగ్రత ఎక్కువ కావడంచే తక్కువ ఉష్ణోగ్రతవద్ద గడ్దకట్టును. అందువలన దీనిని మామిడిపిక్కల కొవ్వు (mango seed fat) అనికూడా పిలెచెదరు. మామిడిలో పలు రకాలుండటం వలన మామిడిపిక్కలోని నూనెలోని కొవ్వు ఆమ్లాల సమ్మేళనశాతం రకాన్నిబట్టి కొంత భిన్నంగా వుంటుంది. ప్రధానంగా మామిడి నూనె స్టీరిక్, ఓలిక్ ఆమ్లాల మిశ్రమం. పామ్ నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె తదితర వంటనూనెలతో పోల్చుకుంటే మామిడి నూనెలో స్టీరిక్ అమ్లం దాదాపు 20 రెట్లు ఎక్కువ శాతంలో ఉంది.[4] మామిడిపిక్కనూనెను అసిటోనుతో పాక్షీకరణ చేసి SOS (స్టీరిన్-ఒలిన్-స్టియరిన్) వున్న గ్లిసెరైడు భాగాన్ని వేరుచేసి, పామ్‌మిడ్‌ ఫ్రాక్షనులో కలిపి మార్జరిన్‌, సాలడు తయారిలో వాడెదరు. మామిడిపిక్క నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం, కొకో బట్టరును పోలివుండటం వలన కోకో బట్టరుకు ప్రత్యామ్నాయంగా వుపయోగిస్తారు.[5]

నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం [3]
ఫ్యాటిఆమ్లము శాతము
పామిటిక్‌ ఆమ్లం, C16:0 5.5
స్టియరిక్ ఆమ్లం, C18:0 40-45
ఒలిక్ ఆమ్లం, C18:1 40-46
లినొలిక్ ఆమ్లం, C18:2 3-4
అరచిడిక్ ఆమ్లం, C20:0 2-2.5

మామిడి పిక్కల నూనె లక్షణాలు [6]

మామిడిపిక్కనూనె భౌతిక లక్షణం మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4550-1.4570
ఐయోడిన్‌విలువ 32-60.7
సపోనిఫికెసను విలువ 190.1-195.1
ద్రవీభవన ఉష్ణోగ్రత 35-430C
అన్‌సపోనియబుల్‌ పదార్థం 1.2%గరిష్ఠం
స్టెరొల్ 0.22-0.58
విశిష్టగురుత్వం,300Cవద్ద 0.9991
టైటెర్ (Titer) 0C 30.5-39.2
జారు (slip) ఉష్ణోగ్రత 30.5-39.20C
బెల్లియరు సంఖ్య0C 38.5

మామిడిపిక్క నుండి నూనెను తీయడం

[మార్చు]

మామిడిపళ్ల సీజనులో మామిడిటెంకలను సేకరించుటకై ఏజెంటులను నియమించెదరు. వారు టెంకలను వీధులమ్మట తిరిగి సేకరించుటకై కొందరిని రోజువారి వేతన పద్ధతిలో లేదా సేకరించిన పిక్కలకు కిలోకు ధరను యింత అని నిర్ణయించి యిస్తారు. సేకరించిన టెంకపైన యింకను వున్న గుజ్జును, మలినాలను తొలగించుటకై నీటితీబాగా కడిగి, కళ్లంలో ఆరబెట్టి పిక్కలోని తేమ శాతాన్ని తగ్గించెదరు. టెంకలను సేకరించినప్పుడు, అవి పచ్చిగా వుండి తేమను 30-40% వరకు కలిగి వుండును. కళ్ళెంలో ఆరబెట్టి తేమను 25% వరకు తగ్గించెదరు. యిప్పుడు టెంకలను కార్మికులనుపయోగించి, చేతులతో చిన్న సుత్తులవంటి వాటినుపయోగించి పగలగొట్టి టెంకలనుండి పిక్కలను వేరుచేయుదురు లేదా హెమరుమిల్‌ వంటి బీటరు నుపయోగించి టెంకల నుండి పిక్కలను వేరుచేయుదురు. దీనిని మ్యాంగోస్టొను డికార్టికెటరు అనికూడ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం‌లో వున్న ఒ.టి.ఆర్.ఐ. (oil Technology Research institute) వారు టెంకల నుండి పిక్కలను వేరుచెయ్యు డికార్టికేటరును రూపొందించారు. మామిడిపిక్క నూనెపై కొంత పరిశోధనలు చేశారు. డికార్టికెటరులో మధ్య ఇరుసుకు కత్తులవంటి పట్టిలు వుండును, అడుగునచిన్న ఖాళి లుండెలా స్టీలుపట్టిలు బిగించి వుండును. బీటరుఆర్మువలన నలగగొట్టబడి పిక్కలు, టెంకనుండి విడిపోవును. పిక్కలు తొలగించిన టెంకభాగాన్ని బాయిలరులో ఇంధనంగా వాడెదరు.

ఆతరువాత బ్యాచ్‌ పద్ధతిలో డ్రమ్‌రోస్టరులో పిక్కలను రోస్ట్‌చేసి తేమశాతాన్ని తగ్గించడం జరుగుతుంది, అంతేకాదు రోస్ట్‌చెయ్యడం వలన ఫంగస్నశించును, నూనెలోని F.F.A. పెరగకుండ నిరోధించడం జరుగుతుంది రోస్టింగ్‌డ్రమ్ము నూనెలను నిల్వవుంచు పీపావలే వుండును. డ్రమ్మును పొడగుభాగం భూమికి సమాంతరంగా వుండి, ఇరువైపులవున్న ఇరుసువలన గుండ్రంగా తిరుగునట్లు అమర్చెదరు.డ్రమ్ముకు చివరవున్నహండిలు తిప్పడం ద్వారా డ్రమ్ము తనచుట్టుతాను తిరుగును. డ్రమ్ముకు మడతబందులున్న ఒకమూత వుండును. మూతను తెరచి అందులో పిక్కలనువేసి మూతను బిగించెదరు, డ్రమ్ముకు దిగువన చిన్నమంటను వేసి (అగ్రో వేస్త్‌లేదా పిక్కలు తీసిన టెంకను పయోగించి మంటపెట్టెదరు), హెండిల్‌ద్వారా డ్రమ్మును తిప్పుతూ లోపలికి పిక్కలను వేడిచెయ్యుదురు.పిక్కలలోని తేమఆవిరిగా మారి బయటకువెళ్లుటకు ఒకగొట్టం వుండును. అలాగే డ్రమ్ములోని పిక్కల ఉష్ణోగ్రతను చూడటానికి డ్రమ్ముకు ఒక థర్మామీటరు బిగించివుండును. పిక్కలలు తగినవిధంగా రోస్ట్‌అయ్యి, తేమతగ్గిన తరువాత బయటకు తీసి చల్లార్చెదరు. తిరిగి మరికొన్ని పిక్క్లను డ్రమ్ములో చేసి రోస్టింగ్‌ను కొనసాగించెదరు.

మామిడిపిక్కల నుండి, మాములుగా నూనెగింజల నుండి నూనె తీయుటకుపయోగించు ఎక్సుపెల్లరులు పనిచెయ్యవు. మామిడిపిక్కలలో నూనెశాతం6-9% వరకు వుండటం వలన సాల్వెంట్‌ప్లాంట్్‌ ద్వారామాత్రమే నూనెను సంగ్ర హించ వీలున్నది. మామిడిపిక్కలనుండి సాల్వెంట్‌ప్లాంట్లో నేరుగా నూనె తీయుటకు వీలుకాదు. మామిడిపిక్కలను మొదటగా ఫ్లెకరుమిల్‌లో ఫ్లేక్స్‌చేసి లేదా, పిక్కలను పల్వరైజరులో (పిండికొట్టు యంత్రం) పొడిగా చేసి పిల్లెట్‌మిల్‌లో గుళికలుగా చేసి, సాల్వెంట్‌ప్లాంట్‌కు పంపి నూనెను తీయుదురు.[7]

నూనెతొలగించిన మామిడిపిక్క, నూనెల ఉపయోగాలు

[మార్చు]

భారతదేశంలో మామిడిపిక్కల నుండి 30 సం.ల నుండి మామిడిపిక్కల నుండి నూనెను 'హనుమాన్ మైనరు ఆయిల్స్‌ లిమిటెడు వారు ఉత్పత్తి చేస్తున్నారు. మరికొందరు కూడా ఉత్పత్తి చేస్తున్నప్పటికి వారి వివరాలు అందుబాటులో లేవు

1. శుద్ధి చేసిన నూనెను కోకో బట్టరుకు బదులుగా వాడుచున్నారు.[8] వనస్పతిలో కూడా వాడెదరు.

2. ఎక్కువ ఎఫ్.ఎఫ్.ఎ. వున్న నూనెను సబ్బులు, ఫ్యాటిఆమ్లాలు. హైడ్రొజెనేటెడ్ ఫ్యాటిఆమ్లాలు, గ్రీజుల తయారీలో వాడెదరు.

3. అసిటోను ఫ్రాక్చనెసను ద్వారా తీసిన SoS (స్టియరిన్-ఒలిన్-స్టియరిన్) ను మార్జరినులలో వాడెదరు.

4. నూనెతీసిన మామిడిపిక్కల పిండిని పశువులు, కోళ్లకు దాణాగా వాడెదరు [9].

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "HISTORY". champagnemango.com. Retrieved 2015-03-06.
  2. "Utilization of Mango seed" (PDF). ifrj.upm.edu.my. Retrieved 2015-03-06.
  3. 3.0 3.1 3.2 SEA :SEA News circular,Vlo:2,issue:3,june'99
  4. "Extraction and Characteristics of Seed Kernel Oil from Mango" (PDF). maxwellsci.com. Retrieved 2015-03-06.
  5. "Images". google.co.in. Retrieved 2015-03-06.
  6. SEA HandBook-2009 By Solvent Extractors'Association of India
  7. "Mango Kernel Based Solvent Extraction Plant". trade.indiamart.com. Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-06.
  8. "Production of cocoa butter equivalent from mango seed almond fat and palm oil mid-fraction" (PDF). ajofai.info. Retrieved 2015-03-06.
  9. [1][permanent dead link]

1.SEA :SEA News circular, Vlo:2, issue:3, june'99