మార్కీస్ దే బుస్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుస్సీ-కాస్తెల్నూ యొక్క మార్కీస్, చార్లెస్ జోసెఫ్ పతిత్సీ

18వ శతాబ్దపు దక్షిణ భారతదేశ చరిత్రలో బుస్సీగా ప్రసిద్ధి చెందిన మార్కీస్ దే బుస్సీ-కాస్తెల్నూ (Marquis de Bussy-Castelnau) ఫ్రెంచి సైనికాధికారి. 1783 నుండి 1785 వరకు ఫ్రెంచి వలస స్థావరమైన పాండిచ్చేరి గవర్నరు జనరలుగా పనిచేశాడు. బుస్సీ అసలు పేరు చార్లెస్ జోసెఫ్ పతిత్సీ (Charles Joseph Patissier). మార్కీస్ దే బుస్సీ, పానగల్ రాజా, డచ్చెస్ ఆఫ్ విండసర్ లలాగా వంశపారంపర్యంగా కలిగిన నామప్రశస్తమే.

ఈస్టిండీసులో జోసెఫ్ ఫ్రాంషోయిస్ డూప్లే ఆధ్వర్యంలో అసాధారణ కార్యనిర్వహణ చేసి ఆర్డర్ ఆఫ్ సెయింట్ లూయి అందుకున్నాడు. 1748లో బ్రిటీషు వారి నుండి పాండిచ్చేరి తిరిగి చేజిక్కించుకోవటానికి దోహదం చేశాడు. ఈ కృషికిగానూ ఈయన గుడ్‌హోప్ అగ్రము ఆవల ఉన్న ఫ్రెంచి సేనలన్నింటికి సైన్యాధ్యక్షునిగా నియమించబడ్డాడు. అమెరికా స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన ఇండియన్ దాడులలో పియర్ ఆంధ్రే దె సఫ్రెన్ తో తన కార్యకలాపాలను సమన్వయపరచుకొని సంఖ్యాబలం కలిగిన బ్రిటీషు సేనలపై సమర్ధవంతగా పోరాడాడు.

బొబ్బిలి పాలకులపై జరిగిన పోరాటంలో చేసిన సహాయానికి కృతజ్ఞతతో విజయనగరం రాజు పూసపాటి పెద విజయరామరాజు బుస్సీకి యానాం ప్రాంతాన్ని బహూకరించాడు. 1750లో బుస్సీ తన సైనికబృందంతో హైదరాబాదులో స్థావరం ఏర్పరచుకొని ఉన్నప్పుడు, అనేకమంది సైనికులు మశూచి బారినపడి మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టమిట్టాడుతున్న బుస్సీకి విజయనగరం రాజు విజయరామరాజు ఆర్థిక సహాయంతో పాటు, తన సైనికదళాన్ని పునర్మించేందుకు సహాయం చేశాడు.

కర్ణాటక యుద్ధాలు

[మార్చు]

1753లో, దక్కన్ సుబేదారు సలాబత్ జంగ్, సుబాలో ఫ్రెంచి సేనల పోషణ నిమిత్తం, వారి సహాయానికి ప్రతిఫలంగా సాలీనా రెండు లక్షల ఆదాయం కల చికాకోలు, ఏలూరు, రాజమండ్రి పరగణాలను బుస్సీ ధారాదత్తం చేస్తూ ఫర్వానా జారీచేశాడు. బుస్సీ పది లక్షల ఆదాయం కలిగిన దక్కన్ సుబాలో అధికారం నిలబెట్టుకొనేందుకు సహాయపడ్డాడు. ఔరాంగాబాదులో ఫ్రెంచి, సలాబత్ జంగుకు మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై సలాబత్ జంగ్ యొక్క సయిద్ లష్కర్ యొక్క సంతకం చేశాడు. బుస్సీ, డూప్లే యొక్క కీలక అనుయాయి. ఉత్తర సర్కారులు, కోరమండల్ తీరం వెంటా ఫ్రెంచి కార్యకలాపాలను విస్తరించండంలో విశేషపాత్ర పోషించాడు. మైసూరుకు చెందిన హైదర్ అలీ కూడా ఈయన నేతృత్వంలో కొన్నాళ్ళు ఉన్నాడు.

1756లో బుస్సీ రాజమండ్రిని సందర్శించాడు. రాజమండ్రి వద్ద విజయరామరాజు ఎదురువెళ్ళి బుస్సీకి ఘనంగా స్వాగతం పలికాడు. విజయనగరం రాజులకు బొబ్బిలి పాలకులకు వచ్చిన భేదాభిప్రాయలు 1757, జనవరి 23న బొబ్బిలి యుద్ధానికి దారితీసాయి. ఆ యుద్ధంలో విజయరామరాజు పక్షాన బుస్సీ యుద్ధంచేశాడు. యుద్ధంలో బొబ్బిలి కోట పూర్తిగా నేలమట్టమైంది. అనేకమంది బొబ్బిలి సైనికులు మరణించారు. యానాంలో ఇప్పటికీ బుస్సీ పేరు మీద ఒక వీధి ఉంది.

మొఘల్ చక్రవర్తి రెండవ ఆలంగీరుతో సంబంధాలు

[మార్చు]

1755లో కొత్తగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొగల్ చక్రవర్తి రెండవ ఆలంగీరు, మరాఠా సేనలను అణచివేయటానికి ఫ్రెంచి సేనల సహాయాన్ని అర్ధిస్తూ బుస్సీకి ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖలో ఆలంగీరు వెయ్యి మంది ఫ్రెంచి సైనికదళాన్ని పంపించేందుకు వీలౌతుందా? అని కోరాడు. ప్రత్యుపకారంగా ఫ్రెంచి సేనల పోషణార్ధం పెద్దమొత్తం ముట్టజెబుతానని మాటిచ్చాడు. అంతేకాక కర్ణాటక యుద్ధాల గొడవలను ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీకి అనుకూలంగా పరిష్కరిస్తానని చెప్పాడు.[1]

బుస్సీ, డూప్లే యొక్క చివరి సవతి కూతురైన మరీని 1754 మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరి ఏకైక సంతానమైన కూతురు 1759లో పారిస్లో మరణించింది. బుస్సీ 1785లో పాండిచ్చేరిలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Nizam-British Relations, 1724-1857 - Sarojini Regani - Google Books. Books.google.com.pk. Retrieved 2012-08-02.