Jump to content

మాలపల్లి (నవల)

వికీపీడియా నుండి

మాలపల్లి 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన తెలుగు అభ్యుదయ నవల. ఆంధ్రప్రదేశ్‌లో కులవర్గ దృక్పథంతో వెలువడ్డ తొలి అభ్యుదయ రచనగా దీన్ని విమర్శకులు గుర్తించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రముఖ సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు నవలా సాహిత్య వైతాళికుల్లో ఒకడు.

జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలుపాలైన ఉన్నవ లక్ష్మీనారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తిపూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఈ మాలపల్లి నవల ప్రగతిశీలక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మేలిమలుపుగా, సామాజిక దృక్పథంలో ఒక ముఖ్య ఘట్టంగా, సంఘ సంస్కరణ సాహిత్యంలో ప్రామాణికంగా నిలిచినట్టు సాహిత్య విమర్శకులు పేర్కొన్నారు.

ఈ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, సమున్నత మానవీయ విలువలకు పట్టం కడుతూ అస్పృశ్యుల జీవితాన్ని స్పర్శించిన ప్రామాణిక నవలగా ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా గాంధీజీ రాజకీయరంగ ప్రవేశం నాటి తెలుగు వారి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టిన ఈ నవల ఆయా చారిత్రక సామాజిక, ఆర్థిక ఉద్యమాల సందర్భాలలో వచ్చిన పరిణామాలను వాస్తవిక ధోరణితో సృజనాత్మకంగా తెలియచేసింది. ఈ నవలతో, తెలుగునాట సంఘ సంస్కరణ సాహిత్యంలో వ్యక్తమయ్యే దృక్కోణం సానుభూతి నుండి అభ్యుదయ వైపుగా, ఆదర్శాల నుండి ఆచరణాత్మక ఆలోచనలు రేకెత్తించే విధంగా సైద్ధాంతికభావజాల మద్దతుతో ప్రస్థానం ప్రారంభించింది. తెలుగు సాహిత్యంలో ఆధునిక ఇతిహాస కావ్యంగా పేరుపొందిన ఈ నవలను 1958లో ఎన్.జి.రంగా టాల్‌స్టాయ్ “వార్ అండ్ పీస్” నవలతో పోల్చతగినదిగా అభివర్ణించాడు.

నేపథ్యం

[మార్చు]

రచయిత

[మార్చు]

ఉన్నవ లక్ష్మీనారాయణ (1877-1958) గుంటూరులో జన్మించాడు. డబ్లిన్ యూనివర్సిటీ (ఐర్లాండ్) లో బారిస్టర్ చదువుతుండగా, అక్కడి ఐరిష్ హోమ్ రూల్ జాతీయ నాయకుడైన ‘డీవాలేరా’తో ఏర్పడిన పరిచయం అతడిని ప్రభావితుణ్ణి చేసింది. మద్రాసు హైకోర్టులో చేపట్టిన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తొలుత అతివాదిగా జాతీయోద్యమంలో ప్రవేశించినప్పటికి క్రమేణా గాంధేయవాదిగా మారాడు. కాంగ్రెస్ వాది అయినప్పటికీ మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని తను నమ్మిన విలువలకు కట్టుబడి నిర్మొహమాటంగా విమర్శించి చిత్తరంజన్ దాస్ వంటి నాయకుల మన్నన పొందాడు. స్వాతంత్రోద్యమాలలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన్ పుల్లరి సత్యాగ్రహం (1921), ఉప్పు సత్యాగ్రహం(1931), క్విట్ ఇండియా ఉద్యమం(1942) లలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. 1917 నాటి రష్యన్ బోల్షెవిక్ విప్లవం వల్ల ప్రభావితమైన తొలి తెలుగు మేధావులలో ఉన్నవ ఒకడు.

అకుంఠిత దీక్షతో సంఘ సంస్కరణాభిలాషతో ఉన్నవ విధవలకు, అనాధలకు, అణగారిన వర్గాల ఉన్నతికై పాటుపడ్డాడు. తన కులం నుండి ఎదురైన నిరసనలను లెక్కచేయకుండా గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపి “గుంటూరు వీరేశలింగం"గా పేరుపొందారు. గుంటూరులో వితంతు శరణాలయం (1902), కార్వే స్ఫూర్తిగా స్త్రీలకు వృత్తి విద్య కోసం ‘శారదా నికేతన్’ (1922) వంటి అనేక సంస్థలను స్దాపించాడు. దళితుల అభ్యున్నతిని దళితుల ఆలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాల వంటి కార్యకలాపాలకే పరిమితం చేయకుండా నిర్మాణాత్మక రీతిలో పాటుపడ్డాడు. కుల భేదాలు లేని సమ సమాజాన్ని ఆశించి కుల వ్యవస్ధను ప్రశ్నిస్తూ సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకొని అసమాన సామాజిక స్పృహతో దళితుల సమస్యలను కుల, ఆర్థిక కోణంలోనూ విస్తృతంగా పరిశీలించి మాలపల్లి అనే సుదీర్ఘ నవల (762 పేజీలు) ను రాయవెల్లూరు జైలులో వుండగా 1922లో రచించాడు.

అవిశ్రాంత సంఘసంస్కర్తగా, నిష్కళంక స్వాతంత్ర్యయోధునిగా, ఆచరణవాదిగా, మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ సృజించిన మాలపల్లి నవలతో, తెలుగునాట సంఘసంస్కరణోద్యమకవిత్వంలో వ్యక్తమయ్యే సాహితీ దృక్కోణం ‘సానుభూతి’ నుండి ‘అభ్యుదయo’ వైపుగా మరలింది.

1920-21 కాల వ్యవధిలో గాంధీజీ దేశ రాజకీయరంగ ప్రవేశం నాటి దేశ కాల పరిస్ధితుల నేపథ్యంలో ఈ నవల రాయబడింది. ఆనాటి సమాజంలోని దళితుల దుర్భర జీవన విధానం చూసి చలించిపోయిన కవి లోని ఆంతరంగిక కల్లోల భావజాలం నుంచి ఈ నవలావిర్భవించింది.

సాంఘిక నేపథ్యం

[మార్చు]

నాటి సమాజంలో వర్ణ వ్యత్యాసాలు, భూస్వాముల ఆర్థిక దోపిడీ వలన దళితుల సాంఘిక ఆర్థిక జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా మారాయి. దీనికి తోడు బ్రిటిష్ వలస పాలన తీరుతెన్నులలతో ఆనాటి గ్రామీణ జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా, అవ్యవస్థమై వున్న తరుణమది.

రాజకీయ నేపథ్యం

[మార్చు]

వలస పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలలో బలీయంగా వున్న స్వాతంత్ర్య కాంక్ష, దానికోసం జాతీయోద్యమాల పరంపర కొనసాగుతుండడం, దేశ రాజకీయరంగంలో గాంధేయ భావాలకు ఆదరణ పెరుగుతుండడం కనిపిస్తుంది. నానాటికి పెరుగుతున్న జాతీయోద్యమం సంఘసంస్కరణోద్యమాన్ని రాజకీయోద్యమంతో ఏకం చేయడానికి ప్రయాత్నిస్తున్న ఈ తరుణంలో ఒకవైపు స్వాభిమాన ఉద్యమస్ఫూర్తితో, సామాజిక అంతరాలను ప్రశ్నిస్తూ దళితులను తమవైపు ఆకర్షించడానికి జస్టిస్ పార్టీ చేసే మమ్మురయత్నాలు, మరోవైపు హరిజనోద్ధరణ ఉద్యమం పేరుతొ దళితులను జాతీయోద్యమంలో సమీకరించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ గాంధేయవాద భావజాలంతో జోరుగా చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో రష్యాలోని బోల్షెవిక్ ఉద్యమ ప్రేరణతో మన దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం పట్ల మధ్యతరగతి విద్యావంతులలో నూతన ఆలోచనలు, అభ్యుదయ భావాలు రేకెత్తడం ప్రారంభమైనాయి.

సాహిత్య నేపథ్యం

[మార్చు]

మాలపల్లి రచనా కాలం నాటికి తెలుగు సాహిత్యంలో భావకవిత్వ ధోరణి ప్రబలంగా ఉంది. దానికి సమాంతరంగా జాతీయోద్యమ సాహిత్యం, సంఘసంస్కరణోద్యమ సాహిత్యాలు రెండు పాయలుగా ఉన్నాయి. ఒక విధంగా 1920 నాటికి ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధానంగా మూడు దృక్పథాలున్నాయని చెప్పవచ్చు. 1. భావ దృక్పథం 2. జాతీయ దృక్పథం 3. సంఘ సంస్కరణ దృక్పథం. రాయప్రోలుని శృంగార, రస సంస్కరణ దృష్టికి, ‘ముసలమ్మ మరణం’తో కట్టమంచిని జాతీయ దృష్టికి, ఉదాత్త రచనలతో గురజాడని సంఘ సంస్కరణ దృష్టికి ప్రతీకలుగా భావించవచ్చు.

మాలపల్లి రచన కాలం నాటికి దళితుల సమస్యల పట్ల ఈ మూడు దృక్పథాలకు చెందిన సాహిత్య వైఖిరులును పరిశీలిస్తే – భావ కవితోద్యమం తనదైన కాల్పానిక జగత్తులో ఊహాప్రేయసిపై కవితలు అల్లుకొంటూ ఊహలలో మునిగిపోయిందే కాని సమాజంలో కళ్ళెదుట కనిపిస్తున్న అస్పృశ్యత లాంటి వాస్తవిక సమస్యల వైపు తొంగిచూసే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే నాటి జాతీయోద్యమం అస్పృశ్యత సమస్యను మతస్పృహలో గుర్తించి, దాని పరిష్కార మార్గాన్నికూడా మతంలోనే వెదికే ప్రయత్నం చేసింది. దాని మూలంగా జాతీయోద్యమ సాహిత్యం, ఆనాటి దళితుల దైన్య పరిస్థితులను కొంతవరకు సానుభూతితో స్పృశించినప్పటికి, అది ప్రధానంగా అస్పృశ్యులను జాతీయోద్యమంలో సమీకరించడమే లక్ష్యంగా పనిచేసింది. మరోవేపు సంఘసంస్కరణోద్యమ సాహిత్యం ప్రధానంగా బ్రాహ్మణ వర్గ సామాజిక సమస్యలకు ఇచ్చినంత ప్రాధాన్యం అస్పృశ్యత లాంటి దళిత సామాజిక సమస్యలకు ఇవ్వలేదు. ఒక విధంగా దళితుల సమస్యకు మూలకారణాలను సామాజిక, ఆర్థిక కోణాలలో విశ్లేశించడానికి, వారి సమస్యల పరిష్కారానికి కావలిసిన అభ్యుదయ సైద్ధాంతిక భావజాలం నాటి తెలుగు సాహిత్యానికి ఇంకా చేకూరలేదు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా బోల్షెవిక్ విప్లవ ప్రేరణతో, అభ్యుదయ భావాలతో కులవివక్షత లేని సమాజాన్ని, ఆర్థిక వ్యత్యాసాలు లేని సంఘాన్ని అకాంక్షిస్తూ ఉదాత్తంగా ఉన్నవ లక్ష్మినారాయణ 1922 లో మాలపల్లిని సృజించారు.

మాలపల్లి నవల కథా సంగ్రహం – సామాజిక చిత్రణ

[మార్చు]

కథా సారాంశం

[మార్చు]

దళితులలో అట్టడుగు వర్గాలకు చెందిన ‘మాలదాసరి’ కులస్థుడైన రామదాసు సాత్వికుడు. సాంప్రదాయ పరాయణుడు. గాంధేయవాది. కథంతా అతని కుటుంబం, సమాజాన్ని అల్లుకొని సాగుతుంది. రామదాసు భార్య మహాలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వెంకట దాసు, చిన్న కొడుకు సంగ దాసు, కూతురు జ్యోతి. పెద్ద కొడుకు వెంకట దాసు తండ్రికి సాయంగా సేద్యం చేస్తుంటాడు. చిన్నకొడుకు సంగ దాసు ఒక భూస్వామి వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. పొలం పనులలో కూతురు జ్యోతి సాయం చేస్తుంటుంది. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి. ఆమె కొడుకు అప్పాదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు ఇంటిపట్టునే పనులు చేస్తూ పెరుగుతుంటాడు. ఈ విధంగా తమకున్న కొద్దిపాటి భూమితో ‘మాలపల్లి’లో రామదాసు కుటుంబమంతా శ్రమిస్తూ జీవనం సాగించేది.

ఆ వూరి మోతుబరి, 800 ఎకరాల ఆసామి అయిన చౌదరయ్య కొడుకులైన రామానాయుడు, వెంకటయ్య నాయుడు అనే అన్నదమ్ములు కూడా ఈ నవలలో ముఖ్య పాత్రలుగా వుంటారు. సంగ దాసు ఈ చౌదరయ్య వద్దనే పాలేరుగా పనిచేస్తుంటాడు. పనివాడైన సంగ దాసు, యజమాని కొడుకైన రామానాయుడుల ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో స్నేహంగా సఖ్యతగా వుంటారు.

ఒక విధంగా రామదాసు కుటుంబంలోని వాళ్ళంతా కులమతాల పట్టింపుల్ని దుయ్యబట్టినవాళ్ళే. కొడుకులు వెంకట దాసు, సంగ దాసులు సంస్కరణ భావాలు కలిగినవాళ్ళు. కరడుగట్టిన భూస్వామి చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించేందుకు సంగం దాసు తోటి దళిత కూలీలను సంఘటితపరచి, వారిలో చైతన్యం కలిగించి, సమ్మెలకు నాయకత్వం వహిస్తాడు. దళితులకు విద్య నేర్పడం కోసం బడులు తెరుస్తాడు. దళితుల జీవితాలను సంస్కరించడానికి ఆతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ కృషిలో రామానాయుడు అతనికి సాయంగా వుంటూ ఆర్థికంగా చేయూతనిస్తాడు. ఇది భూస్వామికి కంటగింపుగా వుంటుంది. ఒకనాడు భూస్వామి సంగ దాసు తలపై పనిముట్టుతో గట్టిగా మోదడం వల్ల సంగ దాసు మరణించడం జరుగుతుంది. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిది నుండి తప్పించుకొంటాడు. నష్టపరిహారంగా భూస్వామి ఇవ్వబోయిన ధనాన్ని నిరాకరించి తమ కొడుకు చంపబడ్డ విషాదాన్ని రామదాసు దంపతులు మౌనంగా భరిస్తారు. దీనితో రామానాయుడు పేద రైతులకు మరింత దగ్గరై, దళితాభ్యున్నతికి పూర్తిగా అంకితమవుతాడు. సంగ దాసు ఆదర్శభావాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా “సంగ పీఠం” గ్రామంలో నెలకొల్పబడుతుంది. క్రమేణా ఈ సంగ పీఠం కృషిలో దళితేతర అగ్ర కులాలు కూడా చేరతాయి.

వెంకట దాసు (రామదాసు రెండవ కొడుకు) అడవులలో నివసిస్తూ తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతో ‘సంతాను’ లనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ఈ నవలలోని ‘సంతాను’ల ప్రసక్తి బంకిమచంద్రుని ఆనందమఠం నవల లోని ‘సంతాను’లను జ్ఞప్తికి తెస్తుంది. ‘ధర్మ కన్నాలు’ వేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి వెంకట దాసు నాయకత్వం వహిస్తాడు. అయితే పోలీసులతో జరిగిన సాయుధ ఘర్షణలో వెంకట దాసు గాయపడి పట్టుబడి చివరకు జైలు పాలవుతాడు. ఒక వ్యాజ్యంలో ఓడిన రామదాసు తన యావదాస్తిని భూస్వామి చౌదరయ్యకు స్వాధీనం చేయవలసి వస్తుంది. తన పొలం నుండి, ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన రామదాసు చివరకు ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళ జగ్గని సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో, ఆ “ధర్మ కన్నం”తో సంబంధం ఉందనే నెపంతో రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టుచేసి సెటిల్మెంటులో నిర్బంధ కూలీలుగా పనిచేయిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పెద్దకొడుకు వెంకట దాసుకు పరిచర్యల కోసం తల్లీ, తండ్రీ కొంతకాలం అక్కడుండటం జరుగుతుంది. వెంకట దాసు మరణిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులుతో పాటు కూతురు జోతి దుర్మరణం పాలవ్వడంతో అ బెంగతో భార్య మహాలక్ష్మికూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలన్నింటిని రామదాసు సహనంతో తన సహజ వేదాంతధోరణిలో శాంతంగానే స్వీకరిస్తాడు. క్రమేణా సంగపీఠం కృషి దినదిన ప్రవర్ధమానమవుతుంది. సహాయనిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాల వంటి ప్రజాఉద్యమాల ఫలితంగా స్వాతంత్ర్యం లభిస్తుంది. ఖైదీలు విడుదలవుతారు. వయోజన వోటింగు ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికవుతారు. రామదాసు కూడా జైలు నుండి విడుదలై తన గ్రామానికి వస్తాడు. రామానాయుడు తన యావదాస్తిని దళితుల అభ్యుదయానికి సమర్పించి రామదాసుని గ్రామంలోనే వుండి సంగ దాసు చేసిన కృషిని కొనసాగించమని కోరతాడు. కాని రామదాసు నిరాకరించి అడవుల కేగుతాడు. ఈ విధంగా అనేకానేక అంశాలు అల్లుకుపోయిన నేపద్యంలో చివరకు భూస్వాముల మదం అణిగిపోయి వారు తమ సర్వస్వాన్ని దళితుల అభ్యుదయానికి, గ్రామాభ్యుదయానికే సమర్పించుకొని, గ్రామసేవకి అంకిత మయినట్లుగా చెప్పబడింది.

మాలపల్లి లో ప్రధాన పాత్రలు

[మార్చు]
  • రామదాసు - ‘మాలదాసరి’ కులస్థుడైన రామదాసు సాత్వికుడు.గాంధేయవాది.
  • మహాలక్ష్మీ - రామదాసు భార్య
  • జ్యోతీ - రామదాసు కూతురు
  • సంగ దాసు - రామదాసు చిన్న కొడుకు. నవలలో మొదటి నాయకుడు. భూస్వామి చౌదరయ్య వద్ద పాలేరు. సంఘ చైతన్య స్ఫూర్తి కలిగిన నాయకుడిగా సంగ దాసు సమాజంలో కులపరమైన భేదాలు పోవడానికి, దళితాభ్యుదయానికి నిర్మాణాత్మకరీతిలో పాటుబడుతూ భూస్వామి చేతిలో మరణిస్తాడు.
  • వెంకట దాసు - రామదాసు పెద్ద కొడుకు. నవలలో రెండవ నాయకుడు. తమ్ముదు ‘సంగ దాసు’ మరణానంతరం అడవులకు పోయి తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతొ ‘ధర్మ కన్నాల ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు. వర్గచైతన్య స్పూర్తి నిండిన కలిగిన నాయకుడిగా సమాజంలో ఆర్ధిక అంతరాల నిర్మూలన కోసం విప్లవకారుడై సాయుధ పోరాటమార్గం అవలంబిస్తాడు. పోలీసులకు పట్టుబడి జైలు పాలై చివరకు మరణిస్తాడు.
  • అప్పాదాసు – రామదాసు మేనల్లుడు (చెల్లెలు కొడుకు). దళిత బడికి టీచర్ గా సేవల నందిస్తాడు.
  • చౌదరయ్య – ఊరికి మోతుబరి. నిరంకుశ భూస్వామి. మార్పుకి వ్యతిరేకి
  • వెంకటయ్య నాయుడు - భూస్వామి చౌదరయ్య పెద్ద కొడుకు
  • రామానాయుడు – భూస్వామి చౌదరయ్య చిన్నకొడుకు. సంగ దాసు సదాశయాలతో ఏకీభవిస్తూ అతనికి సాయంగా మంచి మిత్రుడుగా ఉంటాడు. దళితాభ్యదయానికి చక్కని కృషి చేసిన దళితేతరుడు.
  • కమల - రామానాయుడు భార్య. మోహనరావు తో లేచిపోతుంది.
  • తక్కెళ్ళ జగ్గడు - వెంకట దాసు మారుపేరు. ఈ పేరుతొనే వెంకట దాసు ‘ధర్మ కన్నాల’ ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు.

మాలపల్లి లో ప్రభోదాత్మక గేయాలు

[మార్చు]

మాలపల్లిలో ప్రభోదాత్మక గేయాలు అలనాటి వాడుక భాషలో రాయబడ్డాయి. ఆది కాలం నుంచి నేటి కాలం వరకు మానవ సమాజ పరిణామాన్ని విప్లవకారుడు తక్కెళ్ళ జగ్గని ధర్మ బోధలు రూపంలో వివరించబడింది. ప్రాచీన కాలంలో వర్గరహిత సమాజంలో ప్రజలందరూ అన్నదమ్ములవలె కలసి మెలసి ఆనందంగా జీవించేవారని, ప్రకృతి వనరులు, సంపద ప్రజలందరి సొత్తుగా ఉండేదని అనాటి ఆదిమ సంఘ పరిస్థితుల్ని కవి యిలా గేయరూపంలో వర్ణిస్తారు

“ఆది కాలమున అందరు జనులు అన్నదమ్ము లండి,
నదులు వనంబులు నానా మృగములు నాల్గు సంద్రములును,
కొండలు బండలు జలములు పొలములు గుంటలు సెలయేళ్లు
కాయలు, పండ్లు పాడి పంటలు ఘనమయినా యిండ్లు,
అంతరువులా భేదము లేక అందరి సొమ్మండి,
గుడవా గట్టా వొకరికి బెట్టా కొదవే లేదండి,
నా నీ భేధము లేక లోకము నడుస్తు వుండేది.
మనసు లోపల చీకు చింతలు మందుకైన లేవు. ”

ఆ తర్వాత ఏర్పడ్డ వర్గ సమాజంలో ప్రబలిన స్వార్ధపరత్వం, ధనిక పేద తారతమ్యం వల్ల కష్టజీవుల బాదలను ఇనుమడింపచేసాయని యిలా వర్ణిస్తారు.

“లోకమందున చక్రవర్తియై లోభు డేలుచుండు.
లోకములోని ద్రవ్యమంతయు లోభుల పరమయ్యె
అంతా నాదే అంతా నాదే అందురు జనులండి.
అంతా మనదే యనెడు రోజులు అంతరించెనండి.
భాగ్యవంతులకు బీదలెల్లరు బానిస లయినారు.
పొద్దుగూకులు చాకిరి చేస్తురు బొక్కుడు కూటికిగా,
ఎంత చేసిన తృప్తి లేదయా యజమానులకెల్ల,
రోగం రానీ నొప్పి రానీ నాగా దప్పదయా. ”

బోల్షెవిక్ విప్లవంతో ప్రభావితమైన ఈ నవల తెలుగు జాతీయోద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రామిక సమస్యలకు ప్రాధాన్యమిచ్చింది.

“ఉండ నిల్లా పండ నేలా–వండ పొయ్యా దండనుయ్యా-అండ లేకా మాలా లెండేరు-ఓ సంగ బావా! దండనుండా పస్తు లుండేరు.”
“చేతామంటే కూలీ లేదు- పోదామంటే నాలీలేదు, బిచ్చమంటే మాలీ గాదురా- ఓ సంగ దేవా దేవుడీకె జాలిలేదురా.”
“తినబోతే మెతుకే సున్నా- కట్టబోతో గుడ్డేదన్నా?తాగబోతే నీళ్లే సున్నరా ఓ లోకాసంగా పీల్చబోతే గాలే సున్నారా.”
“ఆసామిలా చెరణా కోలా - పోలీసులా పోడూ చాలా - యింత కంటే జైలూ మేలేరా ఓ గురునాధా మా జీవనమే మాకే గోలరా.”
“మొక్కాబోతే గుళ్లే లేవు, యెక్కాబోతే బళ్ళే రావు- కుడవ పూట కూళ్ళే లేవురా ఓ జ్ఞానా సంగా జదువనైనా బళ్లే లేవురా”

ఇటువంటి దోపిడిని అరికట్టి సమసమాజ నిర్మాణ కోసం జరిపే ఉద్యమంలో శ్రామికులు ఐకమత్యంతో పోరాడాలనీ, సమ్మెలతోనే శ్రామికుల సమస్యలు పరిష్కరించబడతాయని కవి ప్రబోదిస్తారు.

“కూలికి విలువగలదని మీరు గుట్టు తెలుసుకొండి
కూలికి దగిన విలువ పుచ్చుకొనే కూలికి మరి పొండి.
వీళ్ళకూలికి వొప్పుకొంటిరా నెనరు చెరవుకొంద్రు
పనివారందరు యేకమైతిరా ప్రపంచమే మీది.
ఐకమత్యమే అన్ని పనులకు ఆధారము సుండి.
శ్రేణులు గట్టి సమ్మెగట్టితే చెల్లును మీ మాట.
కొట్టావద్దు తిట్టావద్దు కోర్కెలు నెరవేరున్.
అసహాయ యోగము తరుణము చూచి అవలంబించండి.
దానికి మిగిలిన మంత్ర తంత్రములు ధరలో లేవండి. ”

మాలపల్లి – భావన - పాత్రల చిత్రణ

[మార్చు]

ఒక దళిత కుటుంబం సమాజంలో కలియడానికి చేసే ప్రయత్నాలు, అ ప్రయత్నంలో వారికి ఎదురైన చేదు అనుభవాలు, ఆ అనుభవాలతో రాటుదేలిన వ్యక్తులు చైతన్యమై సంఘటితమై సమాజంలో నిర్లక్షం చేయబడ్డ తమ ఉనికి కోసం, మెరుగైన స్ధానం కోసం చేసే పోరాటాలు వంటి అంశాలతో మాలపల్లి నవలలోని పాత్రలు ఉదాత్తంగా చిత్రీకరించబడ్డాయి.

మానవ పరిణామ క్రమంలో ఒకానొక పరివర్తన దశలో సమాజంలో ఉత్పన్నమైన మెటా స్టేబుల్ పరిస్థితులు, ఆ పరిస్థితులలో విభిన్న శక్తుల (సామాజిక వర్గాల) మద్య పెరిగిన వైరుధ్యాలు, సంతులన శక్తి సాధనకై దిగువ శక్తులు చేసే ఆరాట ప్రయత్నాలు, వాటిని నిలువరించే ఎగువ శక్తుల వ్యతిరేక యత్నాలు ఇత్యాది అంశాలతో, మానవ పరిణామ ప్రక్రియలో సామాజిక పరివర్తన దశలో అనివార్యంగా చోటుచేసుకొనే సంక్లిష్ట సంఘర్షణను, ఆ పరివర్తన దశలో మానవ సంబంధాల తీరు తెన్నులను రాజకేయ, సామాజిక నేపథ్యంలో చక్కగా చిత్రించిన నవల మాలపల్లి.

మానవ ప్రగతిశీల పరిణామ చరిత్రలో ‘మార్పు’ ప్రక్రియ చాలా కీలకమైనది. సహజమైనది. వాంచితమైనది. అనివార్యమైనది కూడా. ఎగుడుదిగుడులున్న మానవ సమాజంలో ఈ ‘మార్పు’ అనేది తప్పనిసరి అని గుర్తించి దానికి చోటిస్తేనే ఆ మానవ సమాజం సాఫీగా ఒక దశ నుండి వేరొక దశకు పరివర్తన చెందుతుంది. అలాకాకుండా అనివార్యమైన మార్పుని చూడ నిరాకరిస్తే సమాజంలో ఘర్షణ తప్పదు. సమాజంలో మార్పుని నిలువరించే శక్తుల మద్య, మార్పును కోరుకొనే శక్తుల మద్య కొనసాగుతున్న ఘర్షణ అవధులు దాటిపోయినప్పుడు, అందలి ఎగువ, దిగువ శక్తుల మద్య అంతర్గతపోరు చెలరేగి దాని మూలంగా ఆ మానవ సమాజం సంక్షోభితమవుతుంది. ఫలితంగా సఖ్యత చెదిరిపోయిన ఆ సమాజంలోని ఎగువ దిగువ శక్తుల మధ్య సంతులన శక్తి పునరుద్దారణకై జరిగే ఆధిపత్యపోరులో ఉత్పన్నమైన కల్లోలం యావత్ సమాజాన్ని అతలాకుతలం చేసి బలహీనపరుస్తుంది. ఫలితంగా బలహీనమైన ఆ సమాజం వేరొక దశకు పరివర్తన చెందే యత్నంలో తగినంత అంతర్గత బలాన్ని కూడగట్టుకోలేని కారణంగా తన పరివర్తన మార్గంలో ఎదురయ్యే బాహ్య శక్తుల నిరోద ప్రభావానికి గురై ఇక ముందుకు వెళ్ళలేక నిస్తేజనమవుతుంది. తిరిగి తొలిదశ అయిన ఆదిమ స్థితి లోనికి ప్రవేశించి ప్రగతి లేక స్తంభించిపోతుంది.

ప్రధాన చోదక శక్తులైన ఎగువ శక్తుల ప్రమేయంతో ఒక వేళ ఆ సంక్షోభిత సమాజం అత్యంత ప్రయత్నంతో రెండవ దశకు పరివర్తన చెందినప్పటికి, పరివర్తన మార్గంలోని బాహ్య శక్తుల నిరోధక ప్రభావం వల్ల సమాజంలోని ఎగువ శక్తులు క్రమేణా తమ శక్తిని పోగొట్టుకొంటూ వస్తూ రెండవ దశను చేరుకొన్న పిదప ఇక ఆ రెండవ దశలో ఆధిపత్యం చెలాయించే శక్తిని కోల్పోతాయి. అంతేగాక అప్పటికే సంఘటితమవుతూ వస్తున్న దిగువ శక్తుల సాముదాయక మహా శక్తిలో విలీనమైపోయి తమ తమ ఆధిపత్య అస్తిత్వాన్ని కోల్పోతాయి. అంటే మొదటి దశలో మార్పుని వ్యతిరేకించిన ఎగువ శక్తుల వల్ల సమాజం సంక్షోభితమై రెండవదశకు చేరుకోవడం కష్టం అవుతుంది. ఒక వేళ ఆ సంక్షోభిత సమాజం అతికష్టంతో రెండవ దశకు చేరుకున్నా, ఆ రెండవ దశలో ప్రవేశించిన పిదప ఆ ఎగువ శక్తుల ఆధిపత్యానికి చరమగీతం పాడబడుతుంది.

కనుక పరిణామ ప్రక్రియలో ఒకొక్క పరివర్తన దశను దాటుకుంటూ మానవ సమాజం ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఆ సమాజం తన అంతర్గశక్తులను (ఎగువ, దిగువ శక్తులను) కలుపుకొంటూపోవాలే కాని అంతఃకలహాలతో చిధ్రమవకూడదు. సమాజంలో నెలకొన్న అంతర్గత విభేదాలను రూపుమాపే దిశలో సఖ్యతకై ప్రయత్నించాలే గాని అంతర్గత వైమనస్యాలను పోషించే యత్నం చేయకూడదు. ఒక విధంగా చెప్పాలంటే తన అంతర్గత భేదాలను, అంతర్గత పోరును ఎంత తగ్గించుకొంటే అంత శక్తివంతంగా ఆ మానవ సమాజం రూపుదిద్దుకొని, తరువాయి రెండవ దశ (అభివృద్ధి దశ) లోనికి సాఫీగా పరివర్తన చెందగలుగుతుంది.

ఎగుడు దిగుడులున్న ప్రస్తుత మానవ సమాజం అసమానతల దశ (తొలిదశ) నుండి ఆర్థికాభివృద్ధి దశ (రెండవ దశ) లోనికి సాఫీగా పరివర్తన చెందాలంటే తొలిదశ లోని విభిన్న అంతర్గత శక్తుల ( దళితులు, పేదలు, శ్రామికులు వంటి దిగువ శక్తి స్థాయిలు, అగ్రవర్ణాలు, ధనికులు, భూస్వాములు వంటి ఎగువ శక్తి స్థాయిలు) మద్య నెలకొన్న సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గిపోతూ సమాజంలో సఖ్యత పెరగాల్సివుంటుంది. అప్పుడే పరివర్తన ప్రక్రియ సాఫీగా జరిగి సమాజం ఆర్థికాభివృద్ధి అనే నూతన దశ లోనికి విజయవంతంగా ప్రవేశిస్తుంది. ఇటువంటి సామాజిక పరివర్తన అనుభావిక సిద్ధంతాల కనుగుణంగా మాలపల్లి నవల కాన్సెప్ట్ వుందని స్థూలంగా చెప్పవచ్చు.

ఈ విధమైన కాన్సెప్ట్ తో పరివర్తన ప్రక్రియలో మార్పుకి సిద్దపడని, సమానత్వానికి సహకరించని ఆధిక్య శక్తులను (మార్పు నిరోధక శక్తులను) నియంత్రించేందుకు బలహీన దళితవర్గాలు,పీడిత వర్గాలు (మార్పును కోరే శక్తులు) చైతన్యంతో సుసంఘటితం కావాలని, పోరాటాలకు సిద్దపడాలని మాలపల్లి ప్రబోధించింది. ఈ భావనకు తగినట్లుగా కవి ఉన్నవ సమాజంలోని బలహీన దళితులు ఆర్థికాభివృద్ధి దశకు పరివర్తన చెందే యత్నంలో తగినంత అంతర్గత బలాన్ని కూడగట్టుకోవడానికి సంఘటితం కావాల్సిన ఆవశ్యకతను తెలియచేసారు. సమాజంలోని దిగువ స్థాయి శక్తులైన దళితులకు, పీడితులకు సంఘ పునర్నిర్మాణం కోసం అవసరమైతే పోరాటాలు చేయాల్సిన అవసరం తెలియచేసారు. తమ ఆశయాల సాధనకై నిమ్న వర్గాలకు చెందిన యువతరం చేసే సంఘటిత ప్రయత్నాలు, వాటిని నిలువరించే ఆధిక్య వర్గాల కుటిల యత్నాలను చక్కగా తెలియచేసారు. ఈ పోరాటంలో ఆధిక్యం చెలాయించే ఎగువ స్థాయి శక్తుల యొక్క కుటిల యత్నాలను నిలువరించడం కోసం గాంధేయ స్ఫూర్తితో సత్యాగ్రహలవంటి నిష్క్రియాత్మక ప్రతిఘటనలను, బోల్షెవిక్ విప్లవ స్ఫూర్తితో సమ్మెలు, కార్మిక ఉద్యమాల వంటి నూతన ప్రతిఘటనా పద్ధతులను దిగువ స్థాయి శక్తులైన దళిత, శ్రామిక వర్గాలకు పరిచయం చేసారు.

ఈ విధంగా సాంఘిక, ఆర్థిక అంతరాలు లేని సమ సమాజం కోసం సంఘ పునర్నిర్మాణ జయం కోసం ప్రయత్నించిన మాలపల్లి నవలకు ‘సంగ విజయం’ అన్న మరో పేరు సార్థకనామధేయమైంది. ఈ నవలలో సాంఘిక అసమానతల విషయానికి సంగ దాసు ప్రతీకగా, ఆర్థిక అసమానత విషయాలకు వెంకట దాసు నాయకుడిగా చిత్రించబడ్డారు. ఆర్థిక స్థితిగతులలో మార్పురాకపోతే దళితుల పరిస్థితి అస్తవ్యస్తమవుతుందని వెంకట దాసు పాత్ర ద్వారా కవి తెలియచేస్థాడు.

ఇంకా ఈ నవలలో వెంకటయ్య, కమల, మోహనరావు, పంతులు, పౌలు, క్రైస్తవ ఫాదరీలు తదితర పాత్రలు నాటి సమాజ తీరుతెన్నుల పరిణామంలో భాగస్వాములుగా కనిపిస్తారు. జోతి - అప్పాదాసుల నిష్కల్మష ప్రేమ, మోహనరావు – కమల (రామానాయుడు భార్య)ల అనైతిక బాంధవ్యం కథలో అంతర్భాగంగా వుంటుంది. మొత్తం మీద ఈ చైతన్యపూరిత నవలలో ఆశయాలుతో నిండిన యువతరానికి, అనుభవాలతో పండిన పెద్దతరానికి ప్రతినిధులు తర్కిస్తూ, చర్చిస్తూ కథను నడిపిస్తారు. కథలో అనేక పాత్రలు తమ అభిప్రాయాలను కథాగమనానికి సమాంతరంగా అయినప్పటికీ, కథలో అంతర్భాగంగానే చర్చిస్థాయి.

కుటుంబ పెద్ద రామదాసు ప్రధానంగా గాంధేయవాదిగా చిత్రించబడ్డాడు. కుల వివక్షతకు గురైనప్పటికీ సమాజంలో మార్పుని పెద్దతరానికి ప్రతినిధిగా తనదైన రీతిలో కోరుకుంటాడు. అయితే పెద్ద కొడుకు వెంకట దాసు ‘తక్కెళ్ళ జగ్గడు’ పేరుతొ ధర్మ కన్నాలు వేస్తూ సామజిక మార్పుని తిరుగుబాటు పద్ధతిలో కోరుకుంటాడు. తన కుమారుడి తిరుగుబాటు మార్గాన్ని ఆమోదించకపోయినా సామాజిక మార్పుకి ఏ మార్గం అనుసరణీయమో భవిష్యత్తు నిర్ణయిస్తుందని భావిస్తాడు. గాంధేయ భావజాలానికి, మార్క్సిస్ట్ దృక్పధానికి మద్య గల సంఘర్షణను ఉదారవాద దృష్టితో చిత్రించబడిన ఈ నవల సామ్యవాద వర్గ పోరాట ఆవశ్యకతను తెలియచేస్తుంది. అభ్యుదయంతో కులవివక్షత లేని సమాజాన్ని, ఆర్థిక వ్యత్యాసాలు లేని సంఘాన్ని కోరుకుంటుంది.

వాస్తవికత

[మార్చు]

కవి ఉన్నవ లక్ష్మినారాయణ తన చుట్టూ వున్న సమాజంలోని అగ్ర వర్ణాలు, జమిందారీ వ్యవస్థలు దళితులను, పేదలను, వ్యవసాయ కూలీలను, శ్రామికులను కులపరంగాను, వర్గ పరంగాను చేస్తున్న దోపిడిని చూసి సంఘ సంస్కర్తగా చలించి ఒక మేధావిగా లోతుగా సునిశితంగా పరిశీలించడం ద్వారా కుల, వర్గ అసమానతలను, దోపిడీ అంశాలను, వాటిపై తన భావాలను సూటిగా నిష్కర్షగా నవలారూపంలో ప్రతిఫలింపచేయగలిగారు. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొన్న ఉన్నవ ఉద్యమకారుడిగా తాను స్వయంగా ఎదుర్కొన్న సమకాలీన బ్రిటిష్ అధికారుల జులుంను, పోలీసు చట్టాల ఉక్కు పిడికిలిని, వ్యవస్థాపరమైన దౌష్ట్యాన్ని న్యాయవాదిగా గ్రహించిన అనుభవంతో ఆనాటి న్యాయ వ్యవస్థ లోని లొసుగులను, లిటిగెంటు వ్యవహారాలను, కక్షిదారుల అవస్థలను, రాయవెల్లూరు జైలులో ఖైదీగా వున్న కాలంలో స్వానుభావంతో గ్రహించిన జైలు ఇక్కట్లను, తోటి ఖైదీల అవస్థలను ఇత్యాది పలు వాస్తవ జీవితానుభవ అంశాలను తన నవలలో పొదిగి కళ్ళకు కట్టినట్లుగా చిత్రించగలిగారు. అందువలనే నవలలో కనిపించే అనేకనేక పాత్రలు, సంఘటనలు ఆనాటి సమాజలోని వ్యవస్థావ్యవస్థలకు వాస్తవ ప్రతిరూపాలుగా కనిపిస్తాయి.

ఉన్నవ సమకాలీన ఉద్యమాలచే ఎక్కువగా ప్రభావితమయ్యారు. డబ్లిన్ (ఐర్లాండ్)లో బారిస్టరు చదువుతున్నప్పుడే ఐరిష్ హోమ్ రూల్ జాతీయ నాయకుడైన ‘డీవాలేరా’వలన ప్రభావితమయ్యారు. తరువాత ముఖ్యంగా రష్యాలో విజయవంతమైన బోల్షెవిక్ విప్లవ ప్రభావాన్ని సునిశితంగా పరిశీలించారు. సోషలిస్టు ఉద్యమ ప్రభావాన్ని, అది మన దేశంలో పీడిత శ్రామికులపై తీసుకురాగల ప్రభావాన్ని ముందుగానే ఊహించారు. సోషలిస్టు ఉద్యమ పోరాట సాధనాలైన సమ్మెలు, శ్రామిక ఐక్యత, సంఘటిత పోరాటాలు మొదలగునవి విజయసాధనాలుగా నిరూపితo కావడంతో వాటిని మన దేశ కాల పరిస్థితులకనుగుణంగా అన్వయించి తెలుగు సాహిత్యంలో చిత్రించారు. మార్క్స్ వివరించిన ‘వర్గ అసమానత’ విషయానికి భారతీయ సమాజానికే ప్రత్యేకమైన ‘కులపరమైన అసమానత’ విషయాలను జోడించడం ద్వారా దేశీయ సమస్య అయిన అస్పృశ్యుల దుర్భర జీవితాలను ఇతివృత్తాంతంగా తీసుకొన్నారు. సమస్య పరిష్కారాలకై ఒకవైపు సమకాలీన జాతీయోద్యమ స్ఫూర్తితో గాంధేయ వాద సాధనాలైన ‘సత్యాగ్రహ’ఉద్యమాలను సూచించారు. మరోవైపు సమకాలీన అంతర్జాతీయ స్పూర్తితో విజయవంతమైన బోల్షెవిక్ విప్లవ సాధనాలైన ‘సమ్మెలు కట్టడం, కార్మిక సంఘటిత పోరాటాల’ను సూచించారు. అదనంగా ‘ధర్మ కన్నాల ఉద్యమo’ వంటి సాయుధ పోరాట మార్గాలను సైతం సూచించారు.

ఇలా ఒక సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధునిగా, ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, జైలు ఖైదీగా, మేధావిగా... ఇలా తన జీవిత ప్రతీ దశలోను ఉన్నవ లక్ష్మినారాయణ తన సమాజంతో నెరిపిన వాస్తవిక జీవితాన్ని, జీవితానుభవాలను, సామాజిక పరిచయాలను రంగరించి మాలపల్లిని రాసారు. తనను అమితంగా ప్రభావితం చేసిన సమకాలీన జాతీయ, అంతర్జాతీయ ఉద్యమ భావజాలాన్ని, శ్రామికోద్యమ పోరాట సాధనాలను సాహిత్య రూపంలో వాస్తవిక రీతిలో ప్రతిఫలింపచేయడం ద్వారా నవలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దగలిగారు.

నవల – ప్రత్యేకతలు

[మార్చు]

తెలుగు సాహిత్యంలో ఉన్నతమైన, ఉదాత్తమైన అభ్యుదయ భావాలతో వెలువడిన తొలి నవల ఇది. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమాజంలో సమతా ధర్మాన్ని స్థాపించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ నవల రాయబడింది.

ఈ నవలకు పీఠిక రాసింది దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఈ నవల గురించి ఆయన పీఠికలో ‘ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యమని, తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రధమ’ అని ప్రశంసించారు.

సాంఘిక చరిత్రను ఫ్రేమ్ కట్టి మనకు అందివ్వబడిన అతి కొద్ది నవలలో మాలపల్లి ముఖ్యమైనది. ముఖ్యంగా గాంధీజీ రాజకీయరంగ ప్రవేశం (1920-21) నాటి తెలుగు వారి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టిన తొలి రాజకీయ నవల ఇదే. ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు చక్కగా ప్రతిబింబించిన ఈ నవలలో ఆనాటి దేశ రాజకీయ వాతావరణం, గాంధీ మహాత్ముని ఆశయాలు, సహాయ నిరాకరణోద్యమాలు, కార్మికుల సంఘటిత ఉద్యమాలు, దళితుల అంటరానితనం తదితర సమకాలీన పరిస్థితులు పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా తెలుగు ప్రజల గ్రామీణ జీవితాన్ని ప్రతిభావంతకంగా చిత్రించిన నవలలో మొదటిది, ప్రామాణికమైనది కూడా ఇదే. ఈ నవలలో సాంఘిక దురాచారాలు, సామాజిక అంతరాలు, వర్ణ వ్యత్యాసాలు, క్రైస్తవ మతమార్పిడి యత్నాలు, దళితుల బాదలు, భూస్వాముల దౌర్జన్యాలు, బ్రిటిష్ అధికారుల దాష్టికాలు, పోలీస్ దమన చట్టాలు, అధికార న్యాయవ్యవస్థ సృష్టించే దుష్పరిణామాలు, న్యాయ వ్యవస్థ లోని లొసుగులు, జైళ్ళలోని ఖైదీల అవస్థలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. కొడవటిగంటి కుటుంబారావు గారి మాటల్లో చెప్పాలంటే - “ పరిపాలనలో ఉన్న భారతదేశపు కుళ్లు యావత్తూ ఈ నవలలో భూతద్దంలో చూసినట్టు కనిపిస్తుంది. ఒక చారిత్రిక గతిలో ముఖ్యమైన మలుపుల వద్ద ఒక నిర్దిష్ట కాలపు చారిత్రిక, సామాజిక, ఆర్ధిక పరిణామాలను ఉన్నతంగా చిత్రించిన మాలపల్లి నవల తిరిగి అలనాటి తెలుగు ప్రజల సామాజిక పరిశీలనకు నేటి తరం పరిశోధకులకు ప్రధాన సాహిత్యధారంగా నిలవడం ఒక విశేషం.

తెలుగు సాహిత్య చరిత్రలో అంతకుముందేన్నడులేని విధంగా ఒక హరిజన కుటుంబ గాధను తీసుకొని, దళితుల సమస్యను ఇతివృత్తాంతంగా స్వీకరించి మాలపల్లి నవల రాయబడింది. ఒక విధంగా గాంధీ హరిజనోద్యమాన్ని ప్రారంభించకముందే హరిజన సమస్యను ఈ నవల సమగ్రంగా చిత్రించగలిగింది. జాతీయోద్యమకాలంలో సమాజం గాంధేయ భావాలతో దళితుల అభ్యుదయం పేరిట వారి సామాజిక, ఆర్ధిక సమస్యల పరిష్కారాల వైపు నిర్మాణాత్మక దృష్టి సారించకుండా, ‘దేవాలయ ప్రవేశం’, ‘సహపంక్తి భోజనాలు’ వంటి ఆదర్శ భావాల పట్లనే కేంద్రీకృతమై వున్నప్పుడు, అటువంటి పరిస్థితులలో దళితుల జీవితాలపై సానుభూతితో వెలువడిన నాటి సాహిత్యానికి విభిన్నంగా మాలపల్లి నవల దళితుల యథార్థ జీవితాలను స్పృశించడమే కాకుండా, వారెదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను కూడా వాస్తవిక ధోరణితో విశ్లేషిస్తూ చిత్రించగలిగింది.

మాలపల్లి నవల నాటి సమాజంలోని ఆర్థిక, సాంఘిక అసమానతలను విపులంగా చిత్రించడంతోనే సరిపెట్టకుండా వాటిని రూపుమాపాలన్న సంఘ సంస్కరణాభిలాషను అభ్యుదయ దృక్పధంతో వ్యక్తం చేసింది. దీనికోసం నిజాయితీతో కార్మిక కర్షక పక్షం వహించిన, వర్గచైతన్య స్ఫూర్తి నిండిన తక్కెళ్ళ జగ్గని వంటి విప్లవపాత్రలను నాయకులుగా నిలిపింది. నిరుపేదలైన వ్యవసాయ కూలీలు రష్యా చూపించే నాటి బాటలో సంఘాలుగా సమ్మెలతో సహాయ నిరాకరణ పాటిస్తూ మాలమాదిగల హక్కుల కోసం ధర్మపోరాటాలు చేయాలని ఈ నవల పిలుపునిస్తుంది.

1922 నుండే తెలుగునాట జాతీయోద్యమంలో అంతర్భాగంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం గురించిన ఆలోచనలు కొనసాగాయని చెప్పడానికి మాలపల్లి నవల ఒక తార్కాణం. బోల్షెవిక్ విప్లవ ప్రభావం ఈ నవలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ ప్రభావంతోనే సమాజంలో దోపిడి వర్గాలున్నాయని. వ్యవసాయ కూలీలే ఆ సామాజిక దోపిడీకి బలి అవుతున్నారని, దోపిడిని అరికట్టే క్రమంలో సాగే సమసమాజ నిర్మాణ ఉద్యమంలో శ్రామికుల పాత్ర ప్రముఖమైనదనే భావాన్ని కవి చిత్రిస్తాడు. నాయకుడైన వెంకట దాసు ఆర్థిక అసమానతల గురించి, పేదలను దోచుకొనే ధనికుల దోపిడి గురించి కోర్ట్ రూమ్ లో ఇచ్చిన ఉపన్యాస నవలా భాగాలను నాటి కమ్మూనిస్ట్ పార్టీ కూడా వుపయోగించుకొని కర్రపత్రాల రూపంలో శ్రామికులకు అందచేసింది. రైతుకూలీల సమస్యల గురించి ఆలోచించేవారు, పీడిత జనుల పక్షాన్న నిలువడేవారు మాలపల్లిని తమ ‘మేనిఫెస్టో’గా ఎంచుకున్నారని తుమ్ముల వెంకటరామయ్య వంటి వారు తెలియచేసారు. 1934 తదనంతరం ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన రైతు రక్షణ సంఘాలు, కూలీ రక్షణ సంఘాల ప్రచారానికి కవి ఉన్నవ అనుకోకుండా మాలపల్లి ద్వారా గొప్ప ఆయుధాన్ని అందించారని కె.వి. రమణారెడ్డి అభిప్రాయపడినారు. ఒక విధంగా ఇటువంటి భయాలు ఆవరించడంతోనే బ్రిటిష్ ప్రభుత్వం మాలపల్లి నవలను నిషేదించిందని చెప్పవచ్చును.

జాతీయోద్యమ కాలంలో వ్యావహారిక భాషలో వెలువడిన తొలి రాజకీయ నవలగా మాలపల్లిని పరిగణిoచవచ్చు. వాడుక భాష బొత్తిగా ప్రచారంలో లేనికాలంలో నాటి వ్యవహారిక తెలుగు భాష నడక కనుకూలకంగా ఈ నవల రాయడం విశేషం. అలనాటి వాడుక భాష, మాండలిక పద ప్రయోగాలు అర్థం చేసుకోవడం నేటి తరం పాఠకులకు కాస్త కష్టoగానే వున్నప్పటికీ తెలుగు జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్ళు సమృద్ధిగా పొంగి పొరలే ‘మాలపల్లి’ భావంలోను, భాషలోను విప్లవాలను ఏకకాలంలో సాధించిన రచనగా నిలిచింది. ఒక తెలుగు పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువడ్డ తొలితరం తెలుగు వ్యవహారిక నవలలో మాలపల్లి దే ప్రముఖ స్థానం.

కాల్పానిక సాహిత్యం విశేషప్రచారంలో వున్న నాటి కాలంలో మాలపల్లికి ముందే తల్లాప్రగడ సూర్యనారాయణ వారి ‘హేలావతి‘ (1913), వేంకటపార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం‘ (1919) వంటి నవలలు మానవత దృక్పధంతో, దళితుల సమస్యలను సానుభూతితో స్పృశించాయి. అయితే వాటికన్నాఒక అడుగు ముందుకేసి సాంఘిక ఇతివృత్తాంతాన్ని కలిగివున్న మాలపల్లి నవల సాంఘిక, ఆర్థిక కోణంలో కూడా దళిత సమస్యను విశ్లేషిస్తూ, ఆధునిక ఉదారవాద దృక్పధంతో ఒక సైద్ధాంతిక భావజాలాన్ని ఆధారంగా చేసుకొని దళిత సమస్యకు పరిష్కారాన్ని సూచించింది కాబట్టే జాతీయోద్యమకాలం నాటి సంస్కరణరంగంలో ప్రామాణిక నవలగా గుర్తింపు పొందింది.

మాలపల్లి లోని ‘అభ్యుదయత’

[మార్చు]

మాలపల్లి నవలకు కావ్యాంశ పరంగానేమి, జాతీయోద్యమ పరంగా నేమి, సంఘసంస్కరణ పరంగానేమి, సామాజిక జీవన చిత్రణ పరంగా నేమి, వాడుక భాషా పరంగా నేమి ఎన్నో ప్రత్యేకతలున్నప్పటికి నవలలో వ్యక్తమైన అభ్యుదయ దృక్పధానికి వాటిని మించిన విశిష్టత ఉంది.

మార్క్స్ సిద్దాంతం చారిత్రిక భౌతికవాదం ఆధారంగా మాలపల్లి నవలలో సామాజిక విశ్లేషణ చేయబడింది. భూస్వామ్య వ్యవస్థలో సాంప్రదాయవాదుల తిరోగామి భావజాలాన్ని నిరసించింది. దళితుల పట్ల అవలంబించే వివక్షతను, అగ్రకులాధిక్యతను సూటిగా ప్రశ్నించబడింది. పేదలపై జరుగుతున్న సాంఘిక పీడనను, దౌర్జన్యాలను, ఆర్థికపరమైన అణిచివేతను ఎండగట్టబడింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ ఆవిర్భావం గురించి, కులమతాల పట్టింపుల గురించి, భూమి మీద ఏర్పడిన హక్కును గురించి మాలపల్లి నవలలో హేతుబద్దంగా విశ్లేషించబడింది. సంఘ చైతన్యం కలిగిన సంగ దాసు వంటి పాత్రలు, వర్గ చైతన్యం కలిగిన తక్కెళ్ళ జగ్గని వంటి పాత్రలు ఈ నవలలో చక్కగా చిత్రించబడ్డాయి.

సాంఘిక అసమానత, ఆర్థిక అసమానతలు ఈ రెండూ అనాది కాలం నుండి భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ముఖ్యమైన సమస్యలు. ఈ రెండు సమస్యలను ఉన్నవ వారు మాలపల్లి నవలలో సమగ్రంగా చర్చించారు. కేవలం చర్చకే పరిమితమై పోకుండా ఆయా అసమానతల పరిష్కారాల్లను అభ్యుదయ రీతిలో సూచించారు. కుల సంబంధమైన అసమానతలున్న సంఘాన్ని 'పునర్నిర్మాణం' జయం కోసం ప్రయత్నించిన ఈ నవలకు కవి ‘సంగ విజయం’ అని మరో పేరు పెట్టారు. సంఘ నిర్మాణానికి పూనుకొన్న నాయకుడికి ‘సంగ దాసు’ అని పేరు పెట్టారు. సాంఘిక అసమానతలు అనే సమస్యకు పరిష్కారంగా సంగ దాసును నాయకుడిగా చిత్రించారు.

సాంఘిక అసమానత అనే సమస్యకు ఇచ్చిన ప్రాధాన్యాన్నే కవి ఆర్థిక అసమానత అనే సమస్యకు కూడా ఇచ్చారు. నవలలో ఒకచోట “ .... దీనికి సాంఘికానికంటె ఆర్థికానికే ఎక్కువ సంబంధమున్నది అని చెప్పారు. సాంఘిక అసమానతకు వలెనే ఈ ఆర్థిక అసమానత విషయానికి కూడా ఒక నాయకుణ్ణి (వెంకట దాసు) నిలిపారు. సాంఘిక అసమానతల నిర్మూలనకు పాటుపడే సంగ దాసు మరణించిన తరువాత వెంకట దాసును ఆర్థిక అసమానతల నిర్మూలనకోసం ఉద్యమ నాయకుడిగా నిలిపి కవి కథను కొనసాగిస్థారు. చిన్నవాడైనప్పటికిని సంగ దాసును నాయకునిగా ముందు ప్రవేశపెట్టటాన్ని గమనిస్తే సామాజిక అసమానత రూపుమాపదగిన రుగ్మతే అయినప్పటికీ దానికంటే గొప్పది ఆర్థిక అసమానత అని, ఆర్థిక అసమానతను రూపుమాపగలిగితే సామాజిక రుగ్మత దానంతట అదే తొలగిపోతుందని కవి భావించినట్లు తెలుస్తుంది. మొట్టమొదట సాంఘిక అసమానత సమస్యను, ఆ పిదప ఆర్థిక అసమానత సమస్యను కవి ఎత్తుకోవటం మన భారతదేశంలో ఆయా సమస్యలు ప్రాధాన్యాన్ని వహించిన క్రమాన్ని సూచిస్థాయి.

కవి ఉన్నవ తన మాలపల్లి నవలలో చరమ గీతం, సమత ధర్మం అనే రెండు గేయ కవితలను సామాన్య ప్రజల వాడుక భాషలో జానపదగేయా రీతులలో రచించారు. సంఘంలోని అసమానతలను ఎత్తి చూపుతూ 'చరమ' గీతాన్ని, దేశంలోని ఆర్థిక దుస్థితిని వివరించి ఆర్థికాభివృద్ధిని సాధించే మార్గాన్ని చూపుతూ 'సమతాధర్మం'ను రచించినట్లు తెలుస్తుంది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య తెలియచేసినట్లు “మాలపల్లి నవలలో, మొదటి గీతంలో సాంఘిక అసమానతలు, రెండవ గీతంలో ఆర్థిక అసమానతలు చిత్రించబడ్డాయి. ఈ రెండు గీతాల వ్యాఖ్యానమే ఈ నవల” అని చెప్పడం సహీతుకంగా వుంటుంది.

ఈ విధంగా సాంఘిక అసమానతకు, ఆర్థిక అసమానతకు రెండింటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ 1922 లోనే రాసిన మొదటి అభ్యుదయ కావ్యంగా ఉన్నవ ‘ మాలపల్లి ’ నవల తెలుగు సాహిత్య వికాస చరిత్రలో నిలుస్తుంది.

మొత్తం మీద తమ సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కునే క్రమంలో సంప్రదాయ రీతులకు భిన్నంగా తమకు తామే ప్రయత్నించడం అనేది ఈ నవలలోని ఇద్దరు ‘మాల’ నాయకుల చర్యలలో కనిపిస్తుంది. సంగ దాసు కోరుకొనే సామరస్య ధోరణిలో సామాజిక మార్పు సిద్ధించకుండా విఫలమైతే, పీడితులకు సాయుధ పోరాట మార్గాలే శరణ్యమవుతాయనే సూచన వెంకట దాసు పాత్ర ద్వారా ఆనాటి సామాజిక ఆధిపత్య వర్గాలకు హెచ్చరికగా తెలియ చేయబడింది. మాలపల్లిలో వ్యక్తమైన ఈ సాహిత్య దృక్పధం నాటి ఆధిపత్యం చెలాయించే వర్గాల భావజాల ధోరణికి అడ్డుకట్టి మానవుడి ప్రగతిశీల పరిణామానికి దోహదకారిగా ఉండటంతో అభ్యుదయ రీతిలో వుందని భావించవచ్చు.

తెలుగు సాహిత్యంలో శతాబ్దాలపాటు క్షత్రియులే కావ్యనాయకులుగా ఏలిన సంప్రదాయ ఆనవాయితీని తోసిరాజని నూరేళ్ళ క్రితమే అభ్యుదయ దృక్పధంతో మొట్టమొదటిసారిగా సాహిత్యంలో అట్టడుగు వర్గాల వారిని (మాలలను) నాయకులుగా నిలిపిన అభ్యుదయ నవల మాలపల్లి.

తెలుగులో తొలి అభ్యుదయ కావ్యంగా ‘మాలపల్లి’

[మార్చు]

సాధారణంగా మహాకవి శ్రీశ్రీని ఆధునిక అభ్యుదయ సాహిత్యానికి ప్రతీకగా, అభ్యుదయ కవితోద్యమ ఆద్యుడిగా, మూలవిరాట్టుగా, ప్రవక్తగా, అభ్యుదయ కవితారీతి స్రష్టగా పేర్కొంటారు. ఈ అంచనాలు విమర్శనాత్మక దృష్టి లేనివీ, ఆరాధనా భావాలతో కూడినవీ. నిజానికి ఏ ఒక్క మనిషి ఒంటరిగా కొత్తగా ఒక ఉద్యమాన్ని కాని, ధోరణిని గాని సృష్టించజాలలేడు. శ్రీశ్రీ ముందు చెదురుమదురుగానే అయినా బలమైన అభ్యుదయ భావాలు, ధోరణిలు ఉన్నాయి. అయితే శ్రీశ్రీ అద్వితీయత ఏమిటంటే, ఆ ధోరణిని ఉద్యమంగా జ్వలింప చేసి సాహిత్య రంగంలోమహోన్నతంగా సుస్ధిరపరచడం. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’కు ముందే వెలువడిన ‘మాలపల్లి’ని తొలి అభ్యుదయ కావ్యంగా పరిగణించినంత మాత్రాన అభ్యుదయోద్యమ కవితారీతి ప్రభంజన కర్తగా, యుగకర్తగా శ్రీశ్రీ ప్రాధాన్యతను తక్కువ చేసినట్లు కాదు.

ఒకవిధంగా శ్రీశ్రీ కన్నా ముందే 1922 లోనే తెలుగులో అభ్యదయ భావాలతో ఉదాత్తంగా రచించబడ్డ మాలపల్లి నవలలో కనిపించే అభ్యుదయతను, అభ్యుదయ గీతాలును పక్కనబెట్టి, మహాకవి శ్రీశ్రీ నే అభ్యుదయ కవితోద్యమ ఆద్యుడిగా పేర్కొనడం సమంజసం కాదని, నిజానికి ఉన్నవ లక్ష్మీనారాయణనే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా అభ్యుదయ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన కవిగా పరిగణించాల్సివుంటుందాని వారి మాలపల్లి నవలనే తొలి అభ్యుదయ మహాకావ్యంగా ప్రముఖ మౌలిక పరిశోధకులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య “మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం“ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.

1) శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ 1934-40 లలో కళ్ళు తెరుస్తే 1922 లోనే ఉన్నవ ‘మాలపల్లి’ నవల అభ్యుదయ భావాలతో బోల్షెవిక్ విప్లవ ప్రేరణతో, ఆర్థిక అసమానతలను పోషించే దోపిడి వ్యవస్థలు, సాంఘిక అసమానతలకు దోహదంచేసే వర్ణ వ్యవస్థలను ప్రతిఘటించే భావజాలంతో వెలువడింది. రష్యాలో 1917 లో జరిగిన బోల్షెవిక్ విప్లవం నుండి స్ఫూర్తిని పొందిన తొలి తెలుగు కవి ఉన్నవ లక్ష్మి నారాయణయే అని చెప్పడంలో సందేహం లేదు.

2) తెలుగు సాహిత్యంలో భావకవిత్వం ఉప్పెనలా ఎగసిన కాలంలోనే ఆ భావ కవితాత్మక ఒరవడిలో కొట్టుకుపోకుండా తత్వ్యతిరేకంగా పూర్తి అభ్యుదయ దృక్పథంతో రచింపబడ్డ మాలపల్లి నవల.

3) ప్రాచీనకాలం నుండి సాంఘిక పరంగా, ఆర్థికపరంగా తీవ్ర అసమానతలు నెలకొన్న భారత సమాజంలో సంఘ సంస్కరణను కోరుకొనే ఏ సాహిత్యమైన ఈ రెండు అసమానతలను అనివార్యంగా స్పృశించే ప్రయత్నం చేయవలసి వుంటుంది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ వేళ్ళూనుకొన్న పేదరిక దేశంలో సంఘ హితాన్ని ఆకాంక్షించే ఏ అభ్యుదయ సాహిత్యమైన ఈ రెండింటిని స్పృశిస్తూ, సమన్వయంతో పరిష్కారాలు సూచిస్తూ సాగితేనే అది మన దేశ కాలపరిస్థితిగతుల కనుగుణంగా సమగ్రతను సంతరించుకొంటుంది.

అందువల్లనే కుల సమస్య, పేదరిక సమస్య రెండూ అనివార్యంగా పెనవేసుకొన్న భారతదేశంలో సామాజిక అసమానతలకు గీటురాయిగా వున్న ‘కులం’ ఉనికిని గుర్తించ నిరాకరించి, కుల వర్గ దృక్పధంతో నిండిన సాంఘిక అసమానతలను పట్టించుకోకుండా కేవలం ఆర్థిక అసమానతలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తూ సంఘ సంస్కరణాభిలాషను వ్యక్తం చేసే సాహిత్యానికి సమగ్రత చేకూరదు. కుల అసమానతలను చూడ నిరాకరించే అటువంటి అభ్యుదయ సాహిత్యానికి, కేవలం అటువంటి దృక్పధం వున్న వర్గాల సాహితీ మద్దతు లభించవచ్చునేమో కాని సర్వజనామోదం కాబోదు. పైగా అటువంటి సాహితీ దృక్పధం, తరాలు మారినా తమ తమ ఆర్థిక స్థితిగతులు మారినా కులవివక్షతను ఎదుర్కొంటున్న దళితుల ఆత్మగౌరవానికి అర్ధంకాని ప్రశ్నగానే తొలిచివేస్తుంది. దీనికి కొంతవరకు సమాధానంగానే అభ్యుదయ సాహిత్య వుద్యమానంతరం వచ్చిన దళితసాహిత్య వికాసాన్ని పరిగణించవచ్చు. అదేవిధంగా ఆర్థిక అసమానతలను పట్టించుకోకుండా కేవలం కుల అసమానతలను మాత్రమే ప్రశ్నిస్తూ సంఘ సంస్కరణాభిలాషను వ్యక్తం చేసే సాహిత్యానికి కూడా సార్వత్రికత చేకూరదు. ఆ విధంగా సాంఘిక అసమానతకు, ఆర్థిక అసమానతకు రెండింటికి కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తూ రాసిన మొదటి అభ్యుదయ కావ్యం ఉన్నవ ‘మాలపల్లి’ అయితే కేవలం ఆర్థిక అసమానతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, తరువాతి కాలంలో రాయబడ్డ అభ్యుదయ కావ్యం శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ అవుతుంది.

ఒక విధంగా మాలపల్లి నవల తరువాతి కాలంలో రాబోతున్న అభ్యుదయ కవిత్వోద్యమ ప్రభంజనానికి నాంది పలుకడమే కాకుండా మార్గదర్శిగా నిలిచింది. అయితే తరువాతి కాలంలో వచ్చిన అభ్యుదయ కవిత్వోద్యమంలో ఆర్థిక అసమానతలకే ప్రాధాన్యతనివ్వబడి, సాంఘిక అసమానతలను పట్టించుకోకపోవడంతో ఆ ఖాళిని కాలక్రమంలో వచ్చిన దళిత కవితోద్యమం కొంతవరకు పూరించింది. అంటే ఆర్థిక అసమానత, సామాజిక అసమానతలను వేర్వేరుగా ప్రశ్నిస్తూ తదనంతర కాలంలో వచ్చిన రెండు విభిన్న ప్రముఖ సాహిత్య ఉద్యమదోరణిల అభ్యుదయతను మాలపల్లి నవల ముందుగానే తనలో ప్రతిఫలించినదని చెప్పవచ్చును.

4) మాలపల్లి నవలలో సంఘ సంస్కరణను చేపట్టింది ఇతర అగ్ర కులాలనుంచి వచ్చిన నాయకులు కాదు. దళిత అట్టడుగు వర్గాలలో పుట్టిన మాలలే తమ సంఘాన్ని సంస్కరించడానికి తమకు తామే స్వయంగా పూనుకోవడం గమనించదగిన విషయం. పైగా తెలుగు సాహిత్యంలో శతాబ్దాలపాటు క్షత్రియులే కావ్యనాయకులుగా ఏలిన ఆనవయితిని తొలిసారిగా పక్కనబెట్టి అభ్యుదయ దృక్పధంతో మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాల వారిని (మాలలను) నాయకులుగా నిలిపిన మాలపల్లి నవల తొలి తెలుగు అభ్యుదయ కావ్యం అనడంలో సందేహం లేదు.

సాధారణంగా ఆనాటి సంస్కరణ ఉద్యమాలలో సంస్కరించబడే వారు ఎవరైనప్పటికీ, సంస్కర్తలు మాత్రం అగ్రకుల మధ్యతరగతి నుంచి దిగుమతై వచ్చిన వారు కావడం ఒక ఆనవాయితీగా కనిపిస్తుంది. దళితులను ఉద్ధరించవలసిన బాధ్యతను, వారి తరుపున మాట్లాడే ప్రాతినిధ్య బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొన్న వీరి తపన వారి సాహిత్యరచనలలో కథానాయకుల రూపంలో అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. సాహిత్యరచనలలో సాధారణంగా కనిపించే అటువంటి ‘పీడితులను మేల్కొలిపే, సంస్కరించే నాయకత్వ భాద్యతను తమ భుజాలపై వేసుకొనే అగ్రవర్ణ, మధ్యతరగతి కథానాయకుల’ ధోరణులకు విరుద్దంగా సాహిత్యంలో కథానాయకులు పీడితవర్గం నుండే ఆవిర్భవించడం, తమను ఉద్దరించడానికి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించకుండా ఆ పీడితులే తమను పీడించే దోపిడిదార్లకు వ్యతిరేకంగా తమంతటతామే సంఘటితమై మేల్కొనడం, గళమెత్తడం, పోరాడడం చేయబోవడం వంటివి అభ్యుదయ పోరాటాన్ని సూచిస్థాయి. మాలపల్లిలో పీడితులైన మాలలు నడిపింది ఇటువంటి అభ్యుదయ పోరాటాన్నే. ఇది శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ కన్నా ముందే ఉన్నవ ‘మాలపల్లి’లో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో క్షత్రియులే కథానాయకులుగా చిత్రించబడుతూ వచ్చారు. సాహిత్యం ఒక అవసరంగా కాకుండా కులవృత్తిగా మాత్రమే వున్నవారికి పోషణార్ధం ఇతరులను ఆశ్రయించాల్సినవసరం కలుగుతుంది. ముఖ్యంగా ఆశ్రితులు కవులైనప్పుడు తమ పోషకులైన క్షత్రియులనే కీర్తించడం, తమ తమ కృతులలో వారినే నాయకులుగా స్వీకరించడం పరిపాటి. అందువలన శూద్రులను నాయకులుగా నిలిపిన కావ్యాలు మచ్చుకైనా మనకు తెలుగు సాహిత్యంలో కనిపించవు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఒక ‘మాల’ను నాయకునిగా చేసి రచన చేసింది మొట్టమొదట ఉన్నవవారే. ఆధునిక సాహిత్య ప్రక్రియలను ప్రారంభించిన కందుకూరి రచనల్లో కూడా ‘శూద్రులు’, 'మాల'లు నాయకులుగా ఉండటం కనిపించదు. వారి నవల రాజశేఖర చరిత్రలో నాయకుడు రాజశేఖరుడు నియోగి బ్రాహ్మణుడు. అగ్రవర్ణాలవారిని కాకుండా శూద్రులను నాయకులుగా చేసి కావ్యం వ్రాసింది మొట్ట మొదట కట్టమంచి రామలింగారెడ్డి వారే. వారి 'ముసలమ్మ మరణము' లోని నాయిక ఒక సామాన్య కాపు స్త్రీ. తదనంతర కవులు గురజాడ కాని, రాయప్రోలు కాని శూద్రులను, అట్టడుగు వర్గాల వారిని నాయకులుగా, ప్రధాన పాత్రలుగా చేసి సాంఘిక రచనలు చేసినట్లు కనిపించదు. ‘పూర్ణమ్మ’ ఒక పూజారి బిడ్డ. సాంఘికేతర ఇతివృత్తాంతంతో కూడిన ‘లవణరాజు కల’ అనే ఖండికలో రాజైన లవణుడు ఒక 'మాలెత'ను పెళ్ళి చేసికొన్నట్లు చెప్పబడినా అది కూడా ఒక 'కల' గానే మిగిలింది.

1920 నాటికి ఆధునిక తెలుగు సాహిత్యంలో రాయప్రోలుది శృంగార, రస సంస్కరణ దృష్టి, గురజాడది సంఘ సంస్కరణ దృష్టి అయితే సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తీ త్యాగాన్ని కోరుకునే కట్టమంచిది ప్రధానంగా జాతీయ దృష్టి. నాటి తెలుగుసాహిత్యంలోని ఇటువంటి ప్రధాన దృక్పథాలకి విభిన్నంగా అసమానతలను రూపు మాపుకొంటూ ఆర్థికాభివృద్ధిని సాధించి దేశం ముందడుగేయాలని ‘మాలపల్లి’తో ప్రభోదిస్తున్నాడు కాబట్టి ఉన్నవది అభ్యుదయ దృష్టి.

మాలపల్లిలో వ్యక్తమైన సాహిత్య దృక్పదం ఆధిపత్యం చెలాయించే వ్యవస్థల (దోపిడి వ్యవస్థల, వర్ణ వ్యవస్థల) ధోరణికి అడ్డుకట్టి మానవుడి ప్రగతిశీల పరిణామానికి దోహదపడేటట్లుగా ఉంది. దళితుల స్ధితిగతులను విశ్లేషించడం ద్వారా, సమకాలీన సాంఘిక ఆర్థిక విషయాల పరిశీలించడం ద్వారా సమాజంలో దళితుల జీవన పరిస్దితులను మెరుగుపరిచే దిశలో మానవతావాద, ఉదారవాద, సామ్యవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నది కనుకనే మాలపల్లిలో వ్యక్త మైన సాహిత్య దృక్పధం అభ్యుదయం అని చెప్పవచ్చు.

సమాజంలోని కుళ్ళును బాదలను వెతలను పట్టించుకోకుండా, కళ కళ కోసమే అన్నట్లుగా భావ కవిత్వం ఉద్యమంగా కొనసాగుతున్న రోజుల్లోనే సంఘంలోని అసమానతలను ఎత్తి చూపుతూ రూపుమాపే ప్రయత్నంలో ‘చరమ’గీతాన్ని, దేశంలోని ఆర్ధిక దుస్దితిని వివరించి ఆర్ధికాభివృద్ధిని సాధించే మార్గాన్ని చూపుతూ ‘సమతాధర్మం’ను రచించి ఆ విధంగా శ్రీశ్రీ కన్నా ఎక్కువ విషయాలను ముందుకు తెచ్చి వర్గ చైతన్యం, కులవ్యతిరేక చైతన్యానికి ఫూలేవలే కృషి చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణనే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా అభ్యుదయ దృక్పథాన్ని ప్రవేశపెట్టిన కవిగా పరిగణిoచాల్సివుంటుందని, ఆచార్య అనుమాండ్ల భూమయ్య విశ్లేషిస్థారు.

తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సైద్ధాంతిక భావజాలమే ప్రసరించని కాలంలో, బోల్షేవిక్ విప్లవ ప్రేరణతో, అభ్యుదయ భావాలతో కులవివక్షత లేని సమాజాన్ని, ఆర్ధిక వ్యత్యాసాలు లేని సంఘాన్ని అకాంక్షిస్తూ, సాహిత్యంలో సామ్యవాద వర్గ పోరాట ఆవశ్యకతను తెలియచేస్తూ, దోపిడి వ్యవస్థలు, వర్ణ వ్యవస్థలను ప్రతిఘటించే భావజాలాన్ని ప్రవేశపెడుతూ ఉదాత్తంగా రాయబడ్డ మాలపల్లినే అభ్యుదయ సాహిత్యానికి నాంది పలికిన తొలి రచనగా పరిగణించాల్సివుంటుంది.

మాలపల్లి లోని అభ్యుదయత పట్ల తెలుగు ఉద్యమాలలో వ్యక్తమైన నిరాసక్తత – కారణాలు

[మార్చు]

మాలపల్లి నవలకు జాతీయోద్యమ కాలంలో ప్రజల్లో ఆదరణ లభించినప్పటికీ, నవలలోని అగ్ర కులాధిక్యతను సూటిగా ప్రశ్నిస్తూ రాసిన అభ్యుదయ గీతాలకు గాని, ప్రగతిశీల అభ్యుదయ భావాలకు గాని తెలుగు జాతీయోద్యమాలలో తగినంతగా ప్రాచుర్యంగాని, ప్రాధాన్యంగాని లభించలేదు. దళితుల ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు లాంటి ఆదర్శవాదాలతో దళితాభ్యుదయాన్నికాంక్షించిన నాటి సమాజంలో, దళితుల సామాజిక అంతరాలే కాకుండా ఆర్ధిక అంతరాలను కూడా పరిగణనలోనికి తీసుకొని సమస్య-పరిష్కార మార్గాలను నిర్మాణాత్మకంగా ఉద్యమరీతిలో సూచించిన మాలపల్లి నవల లోని ‘విశాల దృక్పదంతో కూడిన అభ్యుదయత’కు జాతీయోద్యమంలో ప్రాచుర్యం కలుగకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యమాలకు భవిష్యత్ దర్శనాన్ని సూచించిన ఈ ‘అభ్యుదయ దార్శనికత’ పట్ల వ్యక్తమైన నిరాసక్తతకు కారణాలు ఏమైనప్పటికిని ప్రధానంగా జాతీయోద్యమ నాయకత్వంలోను, సాహిత్యంలోను కొనసాగుతున్న అగ్రవర్ణ మధ్యతరగతి సామాజిక పట్టు అని భావించవచ్చు. నాడు సాంఘిక వ్యవస్థలో కొనసాగుతున్న అగ్రకుల దుర్నీతిని ఎండగట్టాలని ప్రబోధించే యత్నాలు ఆ వర్గాలకు రుచించకపోవడమేనని చెప్పవచ్చు.

చరిత్ర అనేది ఆధిక్య వర్గాల కనుగుణంగా ఎప్పటికప్పుడు తిరగరాయబడుతున్నది. దీనికి సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదు. మన సాహిత్య చరిత్ర కూడా ఎప్పటికప్పుడు అగ్రకుల సామాజిక వర్గ ఆధిపత్యానికనుగుణంగానే తిరగరాయబడుతున్నది. ఎప్పుడైతే తమ వర్గ ప్రయోజనాలకు భంగకరంగా సాహిత్యం సృజించబడుతుందో, ఏ సాహిత్యమైతే తమ ఆధిక్యతామూలాలను కదిలించే ప్రయత్నానికి పూనుకొంటున్నదో అటువంటప్పుడు సమాజంలోని ఆధిక్య వర్గాలు ఆ సాహితీ సృజనను ఆలవోకగా వెనక్కి నెట్టివేస్తూ వాటి స్థానంలో తమ ఆధిక్యతను స్థిరపరుచుకోవడానికి, తమ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా వుండే రచనలను ముందుకు తేవడం జరుగుతుంది. ఏ దేశ చరిత్రలో చూసినా, ఏ సాహిత్య చరిత్రలో చూసినా ఇది కనిపించే సత్యమే. మాలపల్లి నవల కులవర్గ దృక్పధంతో అగ్ర కులాధిక్యతను సూటిగా ప్రశ్నిస్తూ అస్పృశ్యతపై వెలువడిన సమగ్ర అభ్యుదయ కావ్యమైనప్పటికి దీన్ని నిరాసక్తతతో వదిలేసి దాని స్థానంలో నాటి అగ్రవర్ణ సంసృతిని, వారి చాందస కుల సమస్య ప్రభావాలను చిత్రించిన కన్యాశుల్కం నాటకాన్ని ప్రశంసలతో ముందుకు తీసుకువచ్చారనే విమర్శ కూడా ఈ కోణంలోనే పరిశీలించదగిన విషయం.

మన జాతీయోద్యమం అస్పృశ్యత సమస్యను మత దృక్పధంతో గుర్తించి, దాని పరిష్కారమార్గాన్ని మతంలోనే వెదికే ప్రయత్నం చేసింది. అందువలనే ఒక విధంగా మత దృక్పధంతో నిండిన బంకించంద్రుని ‘ఆనందమఠం’ నవల అగ్ర కులాధిపత్యాన్ని సవాల్ చేయకపోవడంతో, బెంగాల్ లోని అగ్ర వర్ణ మధ్య తరగతి సామాజిక వర్గం వారి నేతృత్వాన్నసాగిన జాతీయ ఉద్యమాలకు ఆ నవలలోని అభ్యుదయత ఆమోదయోగ్యమై స్వీకరించబడింది. మరి అదేవిధమైన జాతీయభావాలను కలిగివున్నప్పటికీ తెలుగులో కుల దృక్పధంతో రాయబడిన మాలపల్లికి ‘అభ్యుదయ కావ్యం’గా ప్రాచుర్యం లభించలేదు. దీనికి కారణం ఆంధ్రదేశంలో కూడా జాతీయ ఉద్యమాలకు నాయకత్వం వహించింది అగ్ర వర్ణ మధ్య తరగతి సామాజిక వర్గమే కాబట్టి ఆ వర్గాలు మాలపల్లి నవలలోని అభ్యుదయత, అభ్యుదయ గీతాలు తమను, తమ అగ్ర కులాధిపత్యాన్ని నేరుగా ప్రశ్నించే తీరులో వుండడంతో వాటిని కావాలనే మూలన పెట్టివుoడవచ్చు. అదే మాలపల్లిలో కుల దృక్పధం కాకుండా మత దృక్పధమే ప్రతిబింబించి వుంటే నాటి అగ్ర వర్ణ మధ్యతరగతి వర్గాలకు ఈ కావ్యం ఆమోదయోగ్యమై హితకావ్యమై మరింత సముచిత స్థానం దక్కివుండేది.

మాలపల్లి లోని ‘అభ్యుదయత’ పట్ల నిరాదరణ వ్యక్తం కావడానికి జాతీయోద్యమ కాలంలో కొనసాగిన జస్టిస్ పార్టీ యొక్క కుల రాజకీయాలు కూడా కొంత కారణమైనాయి. బ్రాహ్మణేతర ఉద్యమం యొక్క రాజకీయ రూపమైన స్ధానిక జస్టిస్ పార్టీని ప్రభావితం చేసిన ఆనాటి బ్రాహ్మణేతర సామాజిక వర్గం ఈ ఉదాత్త నవలలోని ప్రకటితమైన ఉన్నవ ప్రగతిశీల ఉద్దేశ్యాలను కులపరంగా శంకించారు. భూస్వామి చౌదరయ్యను దుష్టునిగా చూపడం, అతని కోడలు కమల లేచిపోవడం వంటి అంశాలను బ్రాహ్మణేతరులను అపనిందపాలు చేసే యత్నంలో భాగంగా, జస్టిస్ పార్టీని ప్రభావితం చేస్తున్న కమ్మ జమిందార్లను దుష్టులుగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా, అపోహలతో ఈ నవల చూడబడింది.

ఈ విధంగా మాలపల్లి నవల ఆనాడు ఆధిపత్యం చెలాయించే మూడు చోదక వ్యవస్ధలను ఏకకాలంలో దుయ్యబట్టడంతో ఆయా వ్యవస్థల నుండి బహిర్గతంగాను అంతర్గతంగాను తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఒక వైపు వలసపాలనకు వ్యతిరేకంగా నాటి రాజకీయ అధికార వ్యవస్థను విమర్శిస్తూ పీడిత శ్రామికులకు ప్రత్యామ్నాయ పోరాటపద్ధతులను సూచించడంతో ప్రభుత్వ నిషేధానికి గురైంది. మరో వైపు సామాజిక అంతరాలను నిరసిస్తూ అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని నవల సూటిగా ప్రశ్నించడంతో, వర్ణ వ్యవస్థలోని ఆధిక్య వర్గాలకు (అగ్రకుల వర్గాలకు) నవలలోని భావజాలం మింగుడుపడలేదు. ఇంకొక వైపు ఆర్థిక అంతరాలను అంతం చేసే ప్రయత్నంలో భాగంగా భూస్వాములపై సాయుధ పోరాటమార్గాలను నవల ప్రేరేపించడంతో, నాటి ఫ్యూడల్ వ్యవస్థలోని ఆధిక్య వర్గాలకు (జమిందారీ వర్గాలకు) సైతం ఈ నవలలోని అంశాలు నచ్చలేదు. అందుకే జాతీయోద్యమకాలంలో మాలపల్లి నవల లోని అభ్యుదయ భావాలు మానవుని ప్రగతిశీలక పరిణామానికి దారి తీసే భావాలైనప్పటికీ, ఆనాటి జాతీయోద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న ఫ్యూడల్ ఆధారిత వర్ణ వ్యవస్థ లోని ఆధిక్య వర్గాల యొక్క అభిమతాలకు విరుద్దంగా ఉండటంతో, వారి ప్రయోజనాలకు భంగకరంగా ఉండటంతో నవలలోని అభ్యుదయ అంశాలు నిరాసక్తంగా చూడబడి పక్కన పెట్టబడ్డాయి.

ఏ వ్యవస్థలైతే నవలలోని అభ్యుదతయతను చూడ నిరాకరించాయో, ఆ ప్రగతినిరోధక వ్యవస్థలకు కాలం చెల్లిన నేటి కాలంలో కూడా ఈ నవలకు ‘అభ్యుదయకావ్యం’గా రావలసినంత గుర్తింపు దక్కలేదు. దీనికి కారణం తెలుగు సాహిత్యంపై కొనసాగుతున్న అగ్ర వర్ణ మధ్య తరగతి సామాజిక పట్టు అని చెప్పాల్సివుంటుంది. ఎవరి పట్టును అయితే సమాజంలో సడలించాలని ఈ కావ్యం నేరుగా సూచించిందో వారి ఛాయ లో సాహిత్యం సేద తీరినంత కాలం ఈ మహాకావ్యానికి ‘అభ్యుదయ కావ్యం’గా రావల్సింత పేరు ప్రఖ్యాతులు దక్కలేదు. అయితే తదనంతరకాలంలో నవలలోని ‘అభ్యుదయత’ను తులనాత్మకంగా పరిశీలించాల్సిన అనివార్యత ఏర్పడినప్పుడు నవలలోని ‘సామాజిక చిత్రణ’ లాంటి అంశాలు ప్రశంసలతో ముందుకు తేబడి సమున్నత మానవీయ విలువలకు పట్టం కట్టిన ‘దళితాభ్యుదయత’ను వెనుకకి నెట్టే ప్రయత్నం చేయబడింది. అయితే ముందు చెప్పినట్లుగానే మాలపల్లికి తొలి ‘అభ్యుదయ కావ్యం’గా సాహిత్య చరిత్రలో రావాల్సినంత గుర్తింపు రాకున్నా తెలుగు క్లాసిక్స్ లలో ఎన్నదగిన ఉత్తమ ఇతిహాస కావ్యంగా పేరు గాంచింది.

నవల – ప్రచురణ - నిషేధం

[మార్చు]

కవి ఉన్నవ జైలు నుండి విడుదలైన తరువాత బెల్లంకొండ రాఘవరావుచే మాలపల్లి నవల రెండు భాగాలుగా 1922 లో ప్రచురించబడింది. ఈ నవల విడుదల ప్రగతి శీలక సాహిత్య చరిత్రలో మేలిమలుపు. మహాత్మా గాంధీ రాజకీయరంగ ప్రవేశం నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులకు చిత్రించిన ఈ రాజకీయ నవలలో బోల్షెవిక్ భావాలు వున్నాయని, ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వంపై దాడిచేసే విధంగా వుందని భావించిన అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయడం, కార్మికులను భూస్వాములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించడం అనే అభియోగాలపై 1923 ఏప్రిల్ 5 తేదీన నవలపై నిషేధించింది. మద్రాసు శాసనమండలిలో 1926 లో కాళేశ్వరరావు తదితరులచే ఆ నిషేదంపై చర్చ జరిగింది. నవల లోని కొన్ని భాగాలు తొలిగించిన పిదప మాలపల్లి ప్రచురణకు అనుమతి 1928 మార్చి 30 తేదీన లభించింది. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంచే ఇంటర్ పాఠ్య గ్రంధంగా ఎంపిక కాబడింది. తిరిగి 1936 మార్చి 7 న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం మాలపల్లి నవలపై రెండవసారి నిషేధం విధించి, పాఠ్య గ్రంధంగా తొలగించింది. 1937 లో రాజగోపాచారి ఆధ్వర్యంలో మద్రాసు లోని కాంగ్రెసు ప్రభుత్వం మాలపల్లి నవలపై నిషేదాన్ని రద్దు చేసింది. రెండు సార్లు బ్రిటిష్ ప్రభుత్వ నిషేదాన్ని ఎదుర్కొన్న ఈ నవలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించింది.

స్వాతంత్ర్యానoతరo శ్రీ మరుపూరి కోదండరామయ్యచే క్లుప్తీకరించబడిన ఈ తెలుగు నవలను (416 పేజీలు) 1976 లో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించింది. క్లుప్తీకరించబడిన ఈ నవలకు బెజవాడ గోపాలరెడ్డి ముందు మాట రాసారు. ‘సహవాసి’ చే తెలుగులో మరింతగా కుదించబడిన ఈ నవల సంక్షిప్త ప్రతి (68 పేజీలు) ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. డాII వాడపల్లి వి. బి. రామారావు చే ఆంగ్లంలోకి అనువదించబడిన ఈ నవలను (403 పేజీలు) 2007 లో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించింది.

నవల - నాటకీకరణ

[మార్చు]

మాలపల్లి నవలను నగ్నముని 1974లో అదే పేరుతొ నాటకీకరణ చేయగా మాలపల్లి నాటకానికి ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత శ్రీ ఎ.ఆర్. కృష్ణ దర్శకత్వం వహించి డెబ్భైమంది కళాకారులతో, సహజమైన సెట్టింగులతో ఆంధ్రదేశమంతటా నూటపదిసార్లు నాటకాన్ని ప్రదర్శించారు. గూడవల్లి రామబ్రహ్మం సందేశాత్మకచిత్రం ‘మాలపిల్ల’ ఉన్నవ వారి మాలపల్లి నవల ఆధారంగా రూపొందించబడినదన్న భావన నిజం కాదు. గుడిపాటి వేంకటాచలం వారి అముద్రిత కథను ఆధారంగా చేసుకొని గూడవల్లి వారు ‘మాలపిల్ల’ సామాజిక చిత్రాన్ని తీయడం జరిగింది.

మాలపల్లికి తెలుగు సాహిత్యంలో స్థానం – అంచనా

[మార్చు]

జాతీయోద్యమకాలంలో వ్యావహారిక భాషలో వెలువడిన తొలి రాజకీయ నవల 'మాలపల్లి'. నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, దళితుల జీవితాన్ని స్పర్శించిన సమగ్ర నవలగా ప్రసిద్ధి పొందింది. దేశ సామాజిక రాజకేయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సంఘం లోని సామాజిక, ఆర్థిక అసమానతలను ఎత్తి చూపుదమే కాకుండా ఆ సామాజిక, ఆర్థిక అంతరాలను రూపుమాపే ప్రయత్నాలను మార్క్సిస్ట్ సైద్ధాంతిక భావజాల నేపథ్యంలో విశ్లేషిస్తూ సంఘ సంస్కరణాభిలాషను వ్యక్తం చేస్తూ 1922 లోనే అభ్యుదయ భావాలతో వ్రాయబడ్డ తొలి నవలగా ఈ మాలపల్లికి తెలుగు సాహిత్య వికాసంలో విశిష్టస్థానం ఉంది.

అలనాటి తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్న భావకవిత్వ ధోరణి వెల్లువలో కొట్టుకు పోకుండా దానికి విభిన్న రీతిలో స్పందిస్తూ సామాజిక అంతరాలను ప్రశ్నిస్తూ సమాజహితాన్ని కాంక్షిస్తూ వ్రాయబడ్డ తొలి అభ్యుదయ కావ్యం. అసమాన సామాజిక స్ప్రహతో అభ్యుదయ భావాలతో ఉదాత్తంగా రాయబడ్డ నాటి నవలల్లో మాలపల్లిదే అగ్రస్థానం. సమున్నత మానవీయ విలువలకు పట్టం కడుతూ అస్పృశ్యుల జీవితాన్ని వాస్తవిక ధోరణిలో స్పర్శించినది, దళిత సమస్యలను సైద్ధాంతిక కోణంలో విశ్లేషించింది కాబట్టే సంస్కరణరంగంలో వచ్చిన ప్రామాణిక నవలగా ప్రసిద్ధి పొందింది.

ఒక హరిజన కుటుంబ గాథని ఇతి వృత్తాంతంగా ఎన్నుకొని సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఒక ‘మాల’ను నాయకునిగా చేసుకొని రాయబడ్డ తొలి తెలుగు నవలగా, సాంఘిక అసమానతకు, ఆర్ధిక అసమానతకు రెండింటికి కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తూ రాసిన మొదటి అభ్యుదయ కావ్యంగా ఉన్నవ ‘మాలపల్లి’ తెలుగు సాహిత్య చరిత్రలో ఖ్యాతి పొందింది. ఆర్థిక అసమానత, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ తదనంతర వేర్వేరు కాలాలలో వచ్చిన రెండు విభిన్న ప్రముఖ సాహిత్య దోరిణిల అభ్యుదయతను మాలపల్లి నవల ముందుగానే తనలో అంతర్లీనం చేసుకొని, రాబోయే అభ్యుదయ సాహితీ రచనలకు మార్గదర్శిగా నిలిచింది.

1920 కాలం నాటి చారిత్రిక, సామాజిక, ఆర్థిక పరిణామాలను, తెలుగువారి జీవన విధానాన్ని, సమకాలీన పరిస్థితులను సమున్నతంగా చిత్రించిన మాలపల్లి నవల తిరిగి అలనాటి చరిత్రకు, తెలుగు ప్రజల సామాజిక పరిశీలనకు నేటి తరం పరిశోధకులకు ప్రధాన సాహిత్యధారంగా నిలవడం ఒక విశేషం.

నూరేళ్ళు కావస్తున్నా మాలపల్లి పునర్ముద్రితమవుతున్నదంటే దానికి కారణం ఈ నవలలో చిత్రితమైన జీవిత వాస్తవికత, ఉదాత్త పాత్రలు, కళాత్మకత, అభ్యుదయత, ఉన్నత మానవీయ విలువలు, భవిష్యత్ దర్శనాలే. ఇటువంటి రచనలు తరాలు మారినా పాఠకులను ఆలోచింపచేస్తాయి. మానసిక సంఘర్షణను ప్రేరేపించి సమాజాన్ని ఆదర్శాల వైపు నడిపిస్తాయి. ఈ లక్షణాలే మాలపల్లి నవలను మహత్తర ఇతిహాస కావ్యంగా, తెలుగు సాహిత్యంలో క్లాసిక్స్ సరసన సమున్నతంగా నిలబెట్టాయి.

మూలాలు

[మార్చు]
  • మాలపల్లి : నూరేళ్ళ తెలుగు నవల 1878-1977 (పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం - పరిశీలన), రచన: సహవాసి, సంపాదకుడు: డి.వెంకట్రామయ్య, పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్, 2007. పేజీలు: 21-26.
  • ఆచార్య వకుళాభరణం రామకృష్ణ “ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు” - హైదరాబాదు బుక్ ట్రస్ట్ ప్రచురణ
  • డాక్టర్. వి. వీరాచారి “ తెలుగునాట సాంస్కృతిక పునర్జీవనోద్యమాలు కవులు – రచయితలు “
  • కంభంపాటి సత్యనారాయణ “అర్థ శతాబ్ద కాలంలో ఆంధ్రుల పైని అక్టోబరు విప్లవ ప్రభావం” - వికాస సమితి, మద్రాసు (1973) ప్రచురణ
  • డాక్టర్ కడియాల రామమోహనరాయ్ “20 వ శతాబ్ది తెలుగు కవిత్వం” – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2003) ప్రచురణ
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అనుమాండ్ల భూమయ్య “మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం“ - రస తరంగిణి, వరంగల్ (1990) ప్రచురణ
  • బి.యస్. రాములు వ్యాసం “ఎవరు ప్రజల మనిషి”