మాల్దీవుల్లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాన్ హియాలా, అలీఫుల్హు కథ రమాయణానికి మాల్దీవుల రూపం. డాన్ హియాలా మరణాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు

మాల్దీవులలో హిందూమతం మాల్దీవుల ద్వీపసమూహంలో హిందూమత ఆచరణను వివరిస్తుంది. దేశం వజ్రయాన బౌద్ధమతం నుండి ఇస్లాంకు పరివర్తన చెందే క్రమంలో హిందూమతం విలసిల్లింది. సా.శ.8 లేదా 9వ శతాబ్దం నుండి పురావస్తు అవశేషాల్లో శివుడు, లక్ష్మి, అగస్త్య ఋషి వంటి హిందూ దేవతలు కనిపిస్తాయి.[1]

మాల్దీవుల జానపద కథలలో వశిష్ట మహర్షి గురించిన ఇతిహాసాలు కనిపిస్తాయి. వశిష్టుడిని, స్థానికంగా ఓడిటన్ కలేగే అనే శక్తివంతమైన మాంత్రికుడుగా భావిస్తారు. ఒడిటన్ కలేగే భార్య అందమైన దోగి ఐహా. ఆమెది తీవ్రమైన స్వభావం. ఆమె భర్త లాగా ఆమె కూడా శక్తివంతమైన మంత్రగత్తె. ఆమె పేరు సంస్కృత పదం యోగిని నుండి వచ్చింది.[2]

చివరి బౌద్ధ రాజు ఇస్లాంను ఎందుకు స్వీకరించాడో తెలియదు. 12వ శతాబ్దం నాటికి హిందూ మహాసముద్రంలో అరబ్బు వ్యాపారుల ప్రాముఖ్యత బహుశా దీనికి కారణం అయి ఉండవచ్చు. అతను దత్తత ముస్లిం పదవీ నామాన్ని, తన పేరునూ మార్చుకుని సుల్తాన్ ముహమ్మద్ అల్ ఆదిల్ అనే పేరు పెట్తుకున్నాడు. అతని తరువాత 1932 వరకు కొనసాగిన వారసత్వంలో 84 సుల్తానులు సుల్తానాలూ వచ్చారు. 1932 లో ఈ సుల్తానేటు ఎన్నికలు జరుపుకునే రాజ్యంగా మారింది.

మెరినిడ్ యాత్రికుడు ఇబ్న్ బటుటా ప్రకారం, ఈ మార్పిడికి కారణమైన వ్యక్తి మొరాకోకు చెందిన ముస్లిం సందర్శకుడు అబూ అల్ బరాకత్. అయితే, మరింత విశ్వసనీయమైన మాల్దీవియన్ సంప్రదాయం ప్రకారం అతడు తబ్రిజ్ కు చెందిన యూసుఫ్ షంసుద్దీన్ అనే పర్షియన్ సూఫీ. అతన్ని తబ్రిజుగేఫాను అని కూడా పిలుస్తారు. అతని సమాధి మాలే లోని శుక్రవారం మసీదు లేదా హుకురు మిస్కీలో ఉంది. 1656లో నిర్మించబడిన ఈ మసీదు మాల్దీవులలో అత్యంత పురాతన మైనది. [3]

డాన్ హియాలా, అలీఫుల్హు[మార్చు]

మాల్దీవుల జానపద కథలలో ఆత్మ, చేతబడి ఇతివృత్తం ఉండవు గానీ, అత్యంత ముఖ్యమైనది బహుశా "డాన్ హియాలా, అలీఫుల్హు". ఇద్దరు అందంగా కనిపించే ప్రేమికుల గురించిన ఈ కథ, రామాయణానికి మాల్దీవుల రూపం - బాగా రూపు మారిన రూపం. వీటి మధ్య అసమానతలు స్పష్టంగానే ఉన్నప్పటికీ, సాధారణ కథా నిర్మాణాన్ని [4] గమనిస్తే మాల్దీవుల కథలోని అంశాలకు భారతీయ ఇతిహాసానికీ కొన్ని పోలికలు కనిపిస్తాయి. (వీరోచిత వివాహిత జంట, శక్తివంతుడైన దుష్ట రాజు, అందమైన స్త్రీ అపహరన మొదలైనవి. ) రామాయణం ప్రకారం చూస్తే ఇది హిందూమతానికి, సాధారణంగా దక్షిణాసియాలోని మతపరమైన దృశ్యానికీ సంబంధించినది. ఇది ఊహించరానిదేమీ కాదు, ఎందుకంటే అన్ని దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోను స్థానికంగా వివిధ రీతుల్లో రామాయణం ఉంది. మాల్దీవులు కూడా దక్షిణాసియా సంస్కృతిలో భాగమే.[5]

మాల్దీవులలో భారతీయులు, వారి స్థితి[మార్చు]

2000 జనాభా లెక్కల ప్రకారం మాల్దీవులలో 9,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.

భారతీయ డయాస్పోరాలో ప్రధానంగా వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, మేనేజర్లు, ఇతర నిపుణులూ ఉంటారు. వారు దేశ మానవ వనరులను అభివృద్ధి పరచడంలో తోడ్పడుతున్నారు. ఈ బృందంలో టెక్నీషియన్లు, మేసన్లు, టైలర్లు, ప్లంబర్లు, కార్మికులు వంటి నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని సిబ్బంది కూడా ఉన్నారు.

చారిత్రాత్మకంగాను, వాణిజ్యపరంగానూ దక్షిణ కోస్తా భారతీయులు, ముఖ్యంగా కేరళీయులకు మాల్దీవులతో సన్నిహిత సంబంధాలుంటాయి. ఈ పరిచయాలు సమ్మిళిత సామాజిక-సాంస్కృతిక సమూహంగా రూపాంతరం చెందలేదు. బహుశా మాల్దీవులకు, దాని ప్రజలకూ ఉన్న ప్రత్యేక ఇస్లామిక్ గుర్తింపు కారణం కావచ్చు.

అధికారికంగా మాల్దీవుల పౌరుల్లో ఎవరూ హిందువులు కాదు. దేశంలో అధికారిక మతం సున్నీ ఇస్లాం. మత మార్పిడికి ఇక్కడ అనుమతి లేదు. మాల్దీవుల కస్టమ్స్ చట్టాల ప్రకారం పూజల నిమిత్తం విగ్రహాలను దేశం లోకి దిగుమతి చేసుకోవడం నిషిద్ధం. మాల్దీవుల్లోని హిందువులు ప్రధానంగా తమిళులు, మలయాళీలు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Xavier Romero-Frias, The Maldive Islanders, A Study of the Popular Culture of an Ancient Ocean Kingdom. Barcelona 1999, ISBN 84-7254-801-5
  2. Xavier Romero-Frias, The Maldive Islanders, A Study of the Popular Culture of an Ancient Ocean Kingdom. Barcelona 1999, ISBN 84-7254-801-5
  3. History of the Maldives
  4. Vladimir Propp, Morphology of the Folktale, Austin, Texas, 1984, ISBN 0-292-78376-0
  5. Xavier Romero-Frias, The Maldive Islanders, A Study of the Popular Culture of an Ancient Ocean Kingdom. Barcelona 1999, ISBN 84-7254-801-5

వనరులు[మార్చు]

  • రామాయణంలో ఆసియా వైవిధ్యాలు . కెఆర్ శ్రీనివాస అయ్యంగార్ ఎడిటింగ్. సాహిత్య అకాడమీ. ఢిల్లీ (1983).
  • జేవియర్ రొమేరో-ఫ్రియాస్, ది మాల్దీవ్ ఐలాండర్స్, ఎ స్టడీ ఆఫ్ ది పాపులర్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ ఓషన్ కింగ్‌డమ్ . బార్సిలోనా (1999), 
  • దోన్ హియాలా ఆయ్ అలీఫులు. అబ్దుల్లా సాదిగు, మూలి . నావెల్టీ ప్రెస్. మాలే (1996).