మాహిమ్ కోట
| మాహిమ్ కోట | |
|---|---|
| మాహిమ్, ముంబై | |
బీచి నుండి మాహిమ్ కోట దృశ్యం | |
| భౌగోళిక స్థితి | 19°02′23″N 72°50′16″E / 19.039848°N 72.837768°E |
| రకము | తీరపు కోట ల్యాండ్ బ్యాటరీ |
| ఎత్తు | 25 metres (82 ft) |
| స్థల సమాచారం | |
| హక్కుదారు |
|
| సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | No |
| పరిస్థితి | శిథిలావస్థలో |
| స్థల చరిత్ర | |
| కట్టిన సంవత్సరం | 13వ శతాబ్దం |
| కట్టించింది | మహికావటి భీముడు |
| వాడిన వస్తువులు | బసాల్టు, సున్నం |
మాహిమ్ కోట మహారాష్ట్రలో, ముంబైలోని మాహిమ్‌లో ఉంది. [1] మాహిమ్ బేలో వ్యూహాత్మకంగా ఉన్న ఈ కోట దక్షిణాన వర్లీ, ఉత్తరాన బాంద్రా, తూర్పున మాహిమ్‌లను పర్యవేక్షిస్తుంది. కోట చరిత్ర మూలాలు అస్పష్టంగా ఉన్నాయి. అయితే ఇది, తరచుగా వివాదాస్పదమయ్యే వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. పరిపాలనా నిర్లక్ష్యం, మురికివాడల ఆక్రమణ, ఆటుపోట్ల కోతకు గురికావడం వల్ల ఈ కోట ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
చరిత్ర
[మార్చు]1516లో, పోర్చుగీస్ కమాండర్ డోమ్ జోవో డి మొనాయ్ మాహిమ్ క్రీక్‌లోకి ప్రవేశించి మాహిమ్ కోట అధిపతిని ఓడించాడు.[2] తరువాతి కాలంలో ఈ కోట పోర్చుగీసు వారికీ, ఒక గుజరాతీ పాలకుడికీ మధ్య తరచుగా జరిగే ఘర్షణలకు వేదికగా ఉండేది. 1534లో గుజరాత్‌కు చెందిన బహదూర్ షా నుండి పోర్చుగీసు వారు మాహిమ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1661 లో పోర్చుగీసు వారు మాహిమ్ ద్వీపాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెండవ చార్లెస్‌కు కట్నంగా ఇచ్చారు. ఆంగ్లేయులు కోటపై నియంత్రణ సాధించిన తరువాత, 1684 లో సర్ థామస్ గ్రాంథమ్ దీనిని బలోపేతం చేశాడు.[1] పోర్చుగీసు వారి నుండి, ఆ తరువాత మరాఠాల నుండి జరిగే దాడులపౌ నిఘాకు ఇది వ్యూహాత్మక కేంద్రంగా మారింది. [1]
1772లో, పోర్చుగీసు వారు ఈ కోటపై దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ బ్రిటిష్ వారు వారిని ఫిరంగి గుండ్లతో తిప్పికొట్టారు. [1] ఈ పోరాటంలో మౌంట్ మేరీ బాసిలికా దెబ్బతింది. చారిత్రక కథనాల ప్రకారం, ఆ సమయంలో కోటలో 100 మంది సైనికులూ, 30 ఫిరంగులూ ఉండేవారు.[1]
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధ సమయంలో ఈ కోటను బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్నారు.[3]
ఆక్రమణలు
[మార్చు]ఈ కోట, శివారు ప్రాంతాలను నగరంతో కలిపే మాహిమ్ కాజ్‌వేకు సమీపంలో ఉంది. మురికివాడలు ఈ కోటను తీవ్రంగా ఆక్రమించాయి. సముద్రపు అలల కోత, నిర్లక్ష్యం కారణంగా కోటలోని కొన్ని భాగాలు కూలిపోయాయి. ఈ ప్రదేశం గ్రేడ్ I వారసత్వ కట్టడంగా వర్గీకరించబడినప్పటికీ, దాని నిర్వహణకు పెద్దగా ఏమీ చేయలేదు. ఇసుకపై పెద్ద పెద్ద బండరాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మూడు మీటర్ల (పదిహేను అడుగుల) ఎత్తు ఉన్న పగుళ్లు కనిపిస్తాయి. ఈ కోట రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ, దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మధ్య మారుతూ ఉంటుంది.[4] 2004 లో స్థానిక అధికారులు ఆక్రమణలను తొలగించనందున ఐదు లక్షల రూపాయలను తిరిగి ఇవ్వవలసి వచ్చింది.[5] తరువాత, 2008 లో, మున్సిపల్ కమిషనర్ జైరాజ్ ఫాటక్ కోటకు కొత్త రూపు ఇవ్వాలని ప్రతిపాదించాడు.[6]
గ్యాలరీ
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 "Mahim Portal". Mahim. Dataflow. Archived from the original on 2015-02-12. Retrieved 2008-09-15.
- ↑ "Section III - Portuguese". Thana District Gazetteer. Retrieved 2008-09-15.
- ↑ Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. p. 61. ISBN 9788131300343.
- ↑ Sharan, Abhishek (2003-03-16). "A fortress falls to monumental neglect". Indian Express. Express Group. Retrieved 2008-09-15.[dead link]
- ↑ Choudhury, Chitrangada; Prarthana Gahitole (2004-04-05). "State is failing the caves: Jagmohan". Indian Express. Express Group. Archived from the original on 29 May 2004. Retrieved 2008-09-15.
- ↑ "Phatak proposes a beauty therapy". Daily News and Analysis. Diligent Media Corporation Ltd. 2008-02-05. Retrieved 2008-09-15.