Jump to content

మిత్రాయిజం

వికీపీడియా నుండి

మిత్రాయిజం/ మిత్రేయిజం. పర్షియా దేశంలో (నేటి ఇరాన్‌) పుట్టి, ఒకప్పుడు రోమన్‌ సామ్రాజ్యం అంతటా విస్తరించిన మతం. ‘మిత్ర’ అంటే సూర్యుడు. అమరకోశం ఇచ్చిన సూర్యుడి 37 పేర్లలో ఒకటి ‘మిత్ర’. రోమన్‌ సామ్రాజ్యంలో వర్ధిల్లిన మిత్రాయిజం ప్రకారం దేవుడు సూర్యుడే. కాని, అక్కడి చరిత్ర గ్రంథాలలో ‘మిత్ర’ బదులు ‘మిత్రాస్‌’ అని కనిపిస్తుంది. అది బహుశ గ్రీకు భాషా ప్రభావం కావచ్చు. ఈ మతంలో రహస్యమైన ఆచారాలు చాలా ఉండేవని అంటారు. ఈ మతం ఇండియాలోనే పుట్టి, పర్షియాకు అక్కడి నుంచి రోమన్‌ సామ్రాజ్యం అంతటికీ విస్తరించి ఉంటుందని ఒక వాదం ఉంది. ఈ మతానికి పవిత్ర గ్రంథాలు అంటూ ఏవీ లేవు. కొండ గుహలలో, లేక గుహల వలె నిర్మించిన కట్టడాలలో రహస్యారాధనలు జరిగేవి. రహస్య కర్మకాండలో ఒకటి ఎద్దును బలి ఇవ్వడం. ఇందుకు ఆధారంగా ఇటలీ మొదలైన దేశాలలో శిల్పాలు కనిపిస్తున్నాయి. రహస్య సమావేశాలలో పురుషులు మాత్రమే పాల్గొనేవారని చాలా కాలం పాటు చాలా మంది విశ్వసించారు. కాని, 20వ శతాబ్ది చివరలో లభ్యమైన కొన్ని ఆధారాలను బట్టి కొన్ని కర్మకాండలలో స్త్రీలు కూడా పాల్గొనేవారనే అభిప్రాయం కలుగుతున్నదని పరిశోధకులు అంటున్నారు. క్రీస్తు శకం మొదలైన తొలి నాళ్లలో క్రైస్తవానికి ఎదురు నిలచిన మతంగా మిత్రాయిజం చరిత్రలో స్థానం సంపాదించుకొన్నది. ‘మిత్ర’ దేవుడి కోసం కట్టిన ఆలయం ‘మిత్రియం’ అని అలనాటి లిఖిత ఆధారాల వల్ల తెలుస్తున్నది.