Jump to content

మిహిర్ సేన్

వికీపీడియా నుండి

 

మిహిర్ సేన్
జననం(1930-11-16)1930 నవంబరు 16
పురూలియా, మన్‌భూమ్‌, బెంగాల్ ప్రసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణం1997 జూన్ 11(1997-06-11) (వయసు: 66)
వృత్తిబారిస్టరు, వ్యాపారవేత్త
భాగస్వామిBella Weingarten Sen
పిల్లలుసుప్రియా సేన్, చంద్రా సేన్, దేబికా సేన్, సుమంత సేన్
పురస్కారాలు1959 లో పద్మశ్రీ
1967 లో పద్మభూషణ్
1967 లో బ్లిట్జ్ నెహ్రూ ట్రోఫీ

మిహిర్ సేన్ (1930 నవంబరు 16) – 1997 జూన్ 11) భారతీయ ఈతగాడు, న్యాయవాది. అతను 1958లో డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియన్.[1] అంతేకాదు, అత్యంత తక్కువ సమయంలో (14 గంటల 45 నిమిషాలు) అది సాధించాడు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో (1966) ఐదు ఖండాల మహాసముద్రాలను ఈదిన ఏకైక వ్యక్తి అతను. వీటిలో పాక్ జలసంధి, డార్డనెల్లెస్, బోస్ఫరస్, జిబ్రాల్టర్, పనామా కాలువ ఉన్నాయి. [2] ఈ ప్రత్యేక విజయం అతనికి "ప్రపంచంలో కెల్లా గొప్ప సుదూర ఈతగాడు"గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిపెట్టింది.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

మిహిర్ సేన్ పశ్చిమ బెంగాల్‌ లోని పురులియాలో 1930 నవంబరు 16న బైద్య-బ్రాహ్మణ కుటుంబంలో [4] వైద్యుడు రమేష్ సేన్‌గుప్తా, అతని భార్య లీలాబతి దంపతులకు జన్మించాడు. అతని తల్లి లీలాబతి కృషి కారణంగా, కటక్‌లో మెరుగైన పాఠశాలలు ఉండటంతో, మిహిర్‌కు ఎనిమిదేళ్ల వయసులో సేన్‌ కుటుంబం కటక్‌కు మారింది.[2]

మిహిర్ భువనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. బార్‌కు సిద్ధమయ్యేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లాలని అనుకున్నాడు కానీ నిధుల కొరత కారణంగా ఇబ్బంది పడ్డాడు. అయితే, 1950 లో అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ ఆర్థిక సహాయంతో అతను తన చదువును కొనసాగించడానికి ఇంగ్లాండ్‌ ఓడ ఎక్కాడు.

ఇంగ్లాండ్‌లో జీవితం

[మార్చు]

ఇంగ్లాండ్‌లో, సేన్‌ను భారత రాయబారి కృష్ణ మీనన్ ఇండియా హౌస్‌లో నియమించాడు. ఆయన 1951 ఫిబ్రవరి 21 న లింకన్స్ ఇన్‌లో లా చదవడానికి చేరాడు. లైబ్రరీ నుండి అరువు తెచ్చుకున్న పుస్తకాలను స్వయంగా తానే చదువుకున్నాడు. 1954 నవంబరు 23 న ఆయనను లింకన్స్ ఇన్‌లోని బార్‌కు ఆహ్వానించారు.[2]

ఈత కెరీర్

[మార్చు]
లండన్‌లోని ఇండియా హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో కౌన్సెల్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరపున లార్డ్ ఫ్రీబర్గ్ సేన్‌కు సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు.

1950 లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి అమెరికన్ మహిళ ఫ్లోరెన్స్ చాడ్విక్ గురించి స్థానిక వార్తాపత్రికలో సేన్ ఒక కథనాన్ని చదివాడు. తన దేశం కోసం ఈ ఘనతను తానూ చెయ్యాలని అతనికి ప్రేరణ కలిగింది. అప్పటికి అతనికి ఈతలో అనుభవం లేదు. కాబట్టి అతను ఫ్రంట్ క్రాల్ (ఫ్రీస్టైల్) టెక్నిక్‌లో ప్రావీణ్యం సంపాదించే వరకు స్థానిక YMCAలో నేర్చుకున్నాడు.[2]

1958 సెప్టెంబరు 27న, డోవర్ నుండి కలైస్ [5] వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను నాల్గవ అత్యధిక వేగవంతమైన సమయంలో (14 గంటల 45 నిమిషాలు) ఈదాడు. దాంతో అతనికి పేరు వచ్చింది. ఒక హీరోగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతని తరంలో అత్యంత ప్రముఖమైన యువ చిహ్నాలలో ఒకడిగా పరిగణించబడ్డాడు. 1959లో, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు పద్మశ్రీని ప్రదానం చేశాడు.

ఆ తరువాత అతను ఒక క్యాలెండర్ సంవత్సరంలో (1966) ఐదు ఖండాల మహాసముద్రాలను ఈదిన మొదటి వ్యక్తిగా అవతరించాడు. ప్రారంభంలో, పాక్ జలసంధి ఈతను రికార్డ్ చేయడానికి, నావిగేట్ చేయడానికి భారత నావికాదళానికి చెల్లించడానికి అతను రూ. 45,000 సేకరించాల్సి వచ్చింది. సేన్ స్పాన్సర్ల ద్వారా (ముఖ్యంగా కోల్‌కతా దినపత్రిక, ది స్టేట్స్‌మన్ ) సగం డబ్బును సేకరించాడు. మిగిలిన మొత్తాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అందించింది. పాక్ జలసంధి ఈతకు అతనితో పాటు రావడానికి ఆమె భారత నావికాదళం (ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ శారద) పూర్తి మద్దతును అందించింది. సేన్ 1966 ఏప్రిల్ 5-6న సిలోన్ (శ్రీలంక), ధనుష్కోడి (భారతదేశం) మధ్య 25 గంటల 36 నిమిషాల్లో పాక్ జలసంధిని ఈదాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆగస్టు 24 న అతను జిబ్రాల్టర్ జలసంధిని 8 గంటల 1 నిమిషంలో దాటాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియన్ అయ్యాడు. సెప్టెంబరు 12న 40 మైళ్ల పొడవైన డార్డనెల్లెస్ (గల్లిపోలి, యూరప్ నుండి సెడుల్బాహిర్, ఆసియా మైనర్ వరకు) 13 గంటల 55 నిమిషాల్లో ఈదాడు. ప్రపంచంలోనే దీన్ని ఈదిన మొదటి వ్యక్తి అతడు. అదే సంవత్సరంలో సేన్, బోస్ఫరస్ (టర్కీ)ను 4 గంటల్లో ఈదాడు. అది సాధించిన మొదటి భారతీయుడతడు. అక్టోబరు 29–31న 34 గంటల 15 నిమిషాల్లో పనామా కాలువ మొత్తం పొడవును (50-మైళ్ల పొడవు) ఈదాడు. ఈ ఘనత సాధించినవారిలో ప్రపంచంలోకెల్లా మూడవ వ్యక్తి, మొదటి అమెరికనేతర వ్యక్తి - సేన్. [2]

ఈ ఘనత అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిపెట్టింది. 1967లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడు. అదే సంవత్సరంలో, అతను 'ప్రపంచంలోని ఏడు సముద్రాలలో సాహసోపేతమైన విజయాలు' సాధించినందుకు బ్లిట్జ్ నెహ్రూ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు.

భారతదేశంలో జీవితం

[మార్చు]

1958 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత (ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తర్వాత), ఇక్కడ, "శ్వేతజాతీయులకు మాత్రమే" అనే విధానం కారణంగా అతనికి క్లబ్‌లలోకి ప్రవేశం నిరాకరించబడింది. దీని వలన ఈ నియమాన్ని రద్దు చేయాలని ఆయన పెద్దయెత్తున మీడియా ప్రచారం చేసాడు. ఫలితంగా, భారతదేశమంతటా ఉన్న క్లబ్‌లన్నీ భారతీయులందరికీ ప్రవేశం కల్పించాయి. అతను మొదట్లో కలకత్తా హైకోర్టులో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేశాడు గానీ, ఆ తరువాత వ్యాపారంలో దిగి విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు.[2]

1977లో, కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బసు అతన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరపున ప్రచారం చేయమని అతన్ని అభ్యర్థించాడు. ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవిని అతనికి ఇవ్వజూపాడు. కానీ సేన్ ఆ పదవిని తిరస్కరించాడు. ఎన్నికాల్లో సీపీఐ(ఎం) విజయం సాధించాక బసు, సేన్ వ్యాపారంపై దాడి చేసి, దాన్ని శాశ్వతంగా మూసివేయవలసిన పరిస్థితికి తెప్పించాడు.[2]

మరణం

[మార్చు]

సేన్ 1997 జూన్‌లో 66 సంవత్సరాల వయసులో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల బారినపడి మరణించాడు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "OUR SPORTSMEN". 123india.com. the original నుండి 27 September 2007 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 September 2007. Archived 27 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  2. 1 2 3 4 5 6 7 8 "Begging recall". Statesman News Service. The Statesman, 6 January 2013. the original నుండి 25 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2013.
  3. "Mihir Sen Hailed Greatest". The Indian Express. 1 January 1970. p. 16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 April 2017.
  4. "OUR SPORTSMEN". 123india.com. the original నుండి 27 September 2007 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 September 2007. Archived 27 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  5. Bose, Anjali, Samsad Bangali Chariutabhidhan, Vol II, (in Bengali)p. 268, Sishu Sahitya Samsad Pvt. Ltd., ISBN 81-86806-99-7