ముంబై సమాచార్
శ్రీ ముంబైనా సమాచార్ తొలి సంచిక | |
| రకం | దినపత్రిక |
|---|---|
| రూపం తీరు | బ్రాడ్షీట్ |
| యాజమాన్యం | కామా కుటుంబం |
| వ్యవస్థాపకులు | ఫర్దున్జీ మర్జ్బాన్ |
| సంపాదకులు | నీలేష్ ఎం దవే[1] |
| స్థాపించినది | 1822 |
| భాష | గుజరాతీ |
| కేంద్రం | హోర్నిమన్ సర్కిల్, ఫోర్ట్, ముంబై |
| నగరం | ముంబై |
| దేశం | భారతదేశం |
ముంబై సమాచార్ ఆసియాలో నిరంతరం ప్రచురణలో ఉన్న అత్యంత పురాతన వార్తాపత్రిక. 1822లో ఫర్దుంజీ మర్జ్బాన్ దీనిని స్థాపించాడు. ఇది గుజరాతీ భాషలో వెలువడుతుంది.[2] 1833 నుండి పత్రిక కామా కుటుంబం యాజమాన్యంలో ఉంది. 2022 లో పత్రిక ద్విశతాబ్ది ఉత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
పేరు, ప్రచురిత భాష
[మార్చు]పత్రిక తొలుత శ్రీ ముంబైనా సమాచార్ పేరుతో గుజరాతీ భాషలో మొదలైంది. ఆ తరువాత పత్రిక పేరును ముంబై సమాచార్ అని మార్చారు. పత్రిక గుజరాతీ భాషలో మాత్రమే వెలువడేది. మాస్ట్హెడ్లో పత్రిక పేరును గుజరాతీలో ముంబై సమాచార్ అనే ముద్రించేవారు. దాని కింద ఇంగ్లీషులో ది బాంబే సమాచార్ అని ముద్రించేవారు. అంతే తప్ప పత్రిక ఎప్పుడూ ఇంగ్లీషు భాషలో వెలువడలేదు. 1995 లొ బొంబాయి నగరం పేరు ముంబై గా మారాక, పత్రిక పేరును కూడా ముంబై సమాచార్ అని మార్చారు.[3]
చరిత్ర
[మార్చు]
ఆసియాలోనే అత్యంత పురాతనమైన, నిరంతరాయంగా ప్రచురితమవుతున్న వార్తాపత్రిక 'ముంబై సమాచార్', గుజరాతీ భాషలో, 1822 జూలై 1 న మొదలైంది. ఇందులో మూడు చిన్న క్వార్టో షీట్లు ఉండేవి. 10 అంగుళాలు 8 అంగుళాలు, అర షీట్ అనుబంధం, మొత్తం 14 పేజీల ముద్రిత విషయం ఉండేది.
పార్సీ పండితుడు, మతగురువూ అయిన ఫర్దూన్జీ మురాజ్బాన్ ఈ పత్రికను స్థాపించాడు. పశ్చిమ భారతదేశంలోని పాత్రికేయానికే కాకుండా, మొత్తం గుజరాతీ ముద్రిత సాహిత్యానికే మార్గదర్శకుడతడు. 1812 లో మొదటి దేశీయ ముద్రణాలయాన్ని స్థాపించి, 1814 లో గుజరాతీ క్యాలెండర్ను వెలువరించాడు. కలకత్తాలో మొదటి బెంగాలీ క్యాలెండరు ప్రచురించబడటానికి సరిగ్గా 6 సంవత్సరాల ముందే ఆయన ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 1822 లో ఆయన తన వార్తాపత్రిక 'ముంబై సమాచార్'ను ప్రారంభించాడు. వార పత్రికగా మొదలై, 1832 లో ద్వైవార పత్రికగా మారింది. 1855 లో దినపత్రికగా మారింది.
1822 లో ఫర్దూన్జీ పత్రిక నుండి తప్పుకున్నాడు. అప్పటి నుండి ఈ పత్రిక యాజమాన్యం వివిధ వ్యక్తుల చేతుల్లోకి మారింది. 1833 లో దాని ప్రస్తుత ప్రచురణకర్తలైన కామా కుటుంబం చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇది పెరిగి, విస్తరించి, నేడు ప్రచురణ రంగంలో అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకుంది.
1928 లో పత్రికను "ది బాంబే సమాచార్ ప్రైవేట్ లిమిటెడ్" అనే సంస్థ కిందకి తీసుకొచ్చారు.
వార్తాంశాలు, శీర్షికలు
[మార్చు]మొదటి సంచిక లోని విషయాల సంక్షిప్త వివరణ, ఆ రోజుల్లో ఒక భారతీయ పత్రిక ఎలా ఉండేదో ఒక అవగాహనను ఇస్తుంది. మొదటి పేజీలో ప్రకటనలు ఉన్నాయి, వాటిలో రెండు పోగొట్టుకున్న వస్తువుల గురించి, ఒకటి కొంత ఆస్తి అమ్మకం గురించి ఉన్నాయి, ఇవన్నీ పార్సీలకు సంబంధించినవే. ఆ తర్వాత "మన గురించి" అనే అంశంపై, ఒక వ్యాసం లాంటిది ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ, కోర్టు నియామకాలూ మార్పులూ, కోర్టు నుండి తీసుకున్న పవర్ ఆఫ్ అటార్నీల గురించి; ముంబైకి ఓడలు, యూరోపియన్ల రాకపోకల గురించి; యూరోపియన్ల మరణాల జాబితా ఉన్నాయి. అలాగే నౌకాశ్రయంలో సరుకులను ఎక్కించుకుంటున్న ఓడల గురించి నాలుగు నిలువు వరుసలలో చిన్న పేరాలు ఉన్నాయి. ఇండియన్ గెజెట్, కలకత్తా క్రానికల్ నుండి తీసుకున్న కలకత్తా (ఇప్పుడు కోల్కతా) వార్తలకు ఆరు నిలువు వరుసలు; మద్రాసు (ఇప్పటి చెన్నై) నగర ప్రభుత్వ గెజెట్ నుండి తీసుకున్న వార్తలకు ఒక నిలువు వరుస; లండన్ వార్తలకు రెండు నిలువు వరుసలు కేటాయించారు. చైనాలోని కాంటన్ నుండి వచ్చిన నల్లమందు ధరల వార్తలు పది పంక్తుల చిన్న పేరాలో ఇచ్చారు. పైన పేర్కొన్న, నియామకాల గురించిన చిన్న పేరా మినహా, ముంబై స్థానిక వార్తల గురించి చాలా తక్కువ సమాచారం ఉంది.
1857 మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో రాణి లక్ష్మీబాయి మరణం గురించిన వార్త ముంబై సమాచార్లో వచ్చింది.[4]
సంఘటనలపై నిష్పక్షపాతమైన, నిష్కపటమైన, లక్ష్యాత్మక, విమర్శనాత్మక విశ్లేషణలు చేసినందుకు గాను బ్రిటిషు, భారత ప్రభుత్వాల గౌరవం పొందిన ముంబై సమాచార్, భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది . మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు దీనిని తరచుగా ఉటంకించేవారు. దాని ప్రారంభం నుండి, వార్తలను సంచలనాత్మకం చేయకుండా, సంఘటనలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నివేదించడమే సంపాదకీయ విధానంగా ఉండేది. సంయమనం, అభిప్రాయాల స్వాతంత్ర్యం అనేవి నేటికీ నిలిచి ఉన్న లక్షణాలు. నేటికీ నిలిచి ఉంది. పత్రిక మరో ముఖ్యమైన లక్షణం, సాధారణంగా 'సోలస్ పొజిషన్' అని పిలవబడే స్థానంలో కేవలం ఒకే ప్రకటనదారుడిని మాత్రమే ఉంచకుండా, అనేక చిన్న ప్రకటనదారులను వారి ఉత్పత్తులను మొదటి పేజీలో ప్రచారం చేసుకోవడానికి అనుమతించడం.
2022 జూన్ 14 న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవంలో పాల్గొన్నాడు. ముంబై సమాచార్ 200 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని ఒక తపాలా బిళ్లను విడుదల చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Jain, Aditya (2016-07-02). "Mumbai Samachar is 195". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-06-07.
- ↑ "Newspaper readers in Mumbai prefer sports to business: MRUC survey". agencyfaqs!. 4 December 2003. Retrieved 22 March 2013.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "Media Heritage Mumbai Samachar: Asia's Oldest Newspaper to Digitise 200-Year Legacy". Deccan Herald (in ఇంగ్లీష్). Archived from the original on 2025-04-27. Retrieved 2026-05-19.
- ↑ "Media Heritage Mumbai Samachar: Asia's Oldest Newspaper to Digitise 200-Year Legacy". Deccan Herald (in ఇంగ్లీష్). Archived from the original on 2025-04-27. Retrieved 2026-05-19.
- ↑ "PM participates in Dwishatabdi Mahotsav of Mumbai Samachar – a newspaper which has been published continuously for 200 years". www.pmindia.gov.in. 14 Jun 2022. Retrieved June 14, 2022.