ముక్తపదగ్రస్తాలంకారము
ముక్తపదగ్రస్తాలంకారము అనగా విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిది. ముక్తం అంటే విడిచిపెట్టిన పదం, గ్రస్తం అంటే తిరిగి స్వీకరించడం. ఒక పాదంలో ఉపయోగించిన చివరి పదాన్ని తరువాత వచ్చే పాదం మొదట్లో తిరిగి ఉపయోగించడమన్న మాట.
ముక్తపదగ్రస్తం అంటే విడిచిన పదాన్ని అందిపుచ్చుకోవడం అని అర్థం. మన అంత్యాక్షరి ఆటలో చివరి అక్షరాన్ని అందుకొని క్రొత్త పాట మొదలు పెట్టినట్లు ఒక పద్య పాదంలోని చివరి పదంతో తరువాతి పాదం మొదలుపెట్టడమో, ఒక వాక్యం చివరి పదంతో తరువాతి వాక్యాన్ని మొదలుపెట్టడమో చేయడాన్ని ముక్తపద గ్రస్త అలంకారం అంటారు.
లక్షణం
[మార్చు]- ఒక వాక్యంలో ఉపయోగించిన పదం లేదా పదబంధం వెంటనే మరొక వాక్యం లేదా పదబంధంలో తిరిగి ఉపయోగించబడుతుంది.
- ఈ పునరావృతం అలంకారానికి ప్రత్యేకమైన లయను, అందాన్ని జోడిస్తుంది.
ఉదాహరణలు
[మార్చు]ఉదాహరణ 1
[మార్చు]ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
ఈ ఉదాహరణలో : 'జయించి' అనే పదం తర్వాత వెంటనే మళ్లీ 'జయించి' అనే పదానికి సంబంధించిన 'జయించి' అనే రూపం వాడబడింది. అలాగే 'పొందుము' తర్వాత 'పొంది' అనే పదం, 'పాలింపుము' తర్వాత 'పాలించి' అనే పదం వెంటనే వాడటం గమనించవచ్చు.
ఉదాహరణ 2
[మార్చు]సుదతీ నూతన మదనా-
మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా-
సదనామయ గజరదనా-
రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహా.
పై పద్యంలో పద్య పాదంలోని చివరి, మొదటి పదములను గమనించండి.పద్యపాదం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పద్యపాదం మొదలవుతుంది. దీనినే ముక్తపదగ్రస్తాలంకారం అంటాము.[1]
ఉదాహరణ 3
[మార్చు]లక్ష్మీ సువిభ్రమాలోక సుభ్రూవిభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం[2]
ఉదాహరణ 4
[మార్చు]మారసుందర! సుందర! ధీరమూర్తి!
మూర్తిగతలోక! లోకప్రపూజితాంగ!
అంగ సంగత గంగ! గంగాంతరంగ!
విశ్వరక్షక! స్వామి శ్రీ వేంకటేశ![3]
ఉదాహరణ 5
[మార్చు]ఉద్ధృత నగ! నగభిదనుజ! దనుజకులామిత్ర! మిత్రశశిదృష్టే!
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కార:[4]
ఉదాహరణ 6
[మార్చు]కాళిదాసు రఘువంశంలోని శ్లోకం:
ఆకారస్సదృశ ప్రజ్ఞః
ప్రజ్ఞయా సదృశాగమః |
ఆగమైః సదృశారంభః
ఆరంభైః సదృశోదయః ||
ఉదాహరణ 7
[మార్చు]“మనవేటికి నూతనమా
తనమానిన ప్రేమతనకు దక్కితిననుమా
ననుమానక దయతనర
దనరంతులు మాని సరస భవు రమ్మనవే.[5]
సినిమా పాటలలో అలంకారం
[మార్చు]ఈ సినిమాలో దాశరథి రచించిన పాట:
- గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది?
- వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది
- తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది
అనగనగా ఆకాశం ఉంది
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది
రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది
వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..
మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
పులినే తింటది చావు.. చావును తింటది కాలం..
కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
సుమంగళి" సినిమాలోని ఒక ప్రసిద్ధ పాటలో ఈ అలంకారం ఉంది. దీనికి ఆత్రేయ గారు రచయితగా, ఘంటసాల మరియు సుశీల గాయకులుగా ఉన్నారు.
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి.......... మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........ మనువూ.. ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........ సంసారం..
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర పాడిన పాట "కలలో తెర తీయాల". ఈ పాటలో వెన్నెలకంటి గారు ఒక కొత్త అలంకారం సృష్టించారు. కొత్త అలంకారం అనటంకంటే ముక్త పదగ్రస్తంకి అలంకారం అని చెప్పుకోవచ్చు. రెండవ వాక్యములోని మొదటి పదము, మొదటి వాక్యములోని చివరి పదము ఒకటే అయిననుఁ వాటి అర్థము వేరైవుండాలి (నానార్ధాలు).
కలలో తెర తీయాల
తీయగ ఎద వేగాల
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటీ
అంటుకున్న తీయని పగలుగ
పగలు రేయి కానీ చల్లగ
ఛల్లుతుంటె వలపులు జల్లుగ
ఝల్లుమంది హృదయం అదరగ
అథరాల మధుకీల సిగ్గిల్లగా
గిల్లింది గిలిగింత తాపాలుగా
పాలించగా నిరీక్షనం
క్షణమాగునా నా పై ఎద
ఎదల సొదల కధలా పొద్దిక
పొద్దు పొడుపు అసలే ఒద్దిక
ఒద్దికైన ముద్దే వాడక
వాడుకైన వరసే తోడిక
తోడాలి నయనాల సిరివెన్నెలా
నెలకొంది నెలవంక ఎదకోవెలా
వెలలేనిదీ విలువైనదీ
నదిచేరినా కడలే ఇదీ
మయసభ
[మార్చు]మయసభలో దుర్యోధనుని ఏక పాత్రాభినయంలోని అంశం:
వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబు.
రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లీ మతల్లికా సంభాసురంబు.
భాసుర పుష్ప గుచ్ఛ స్రవన్మధుర మధు రసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు.
మేదుర మధుకర ఘన ఘనాఘన శంకా నర్తన క్రీడాభిరామ మాయూర వార విస్తృత కలాపి కలాపరమణీయంబు
పాఠ్య పుస్తకాలలో గేయాలు
[మార్చు]"రింగు రింగు బిల్లా రూపాయి దండ" అనేది పిల్లల కోసం రూపొందించబడిన, తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ఒక ఆనందకరమైన గేయం.
రింగు రింగు బిళ్ల.. రూపాయి దండ
దండ కాదురా... తామర మొగ్గ
మొగ్గ కాదురా... మోదుగ నీడ
నీడ కాదురా... నిమ్మలబావి
బావి కాదురా... బచ్చల కూర
కూర కాదురా... కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా... మేదర సిబ్బి
సిబ్బి కాదురా.. చీపురు కట్ట
కట్ట కాదురా... కావడి బద్ద
బద్ద కాదురా... బారెడు మీసం
మీసం కాదురా... మిరియాల పొడుం
పొడుం కాదురా... పోతురాజు...!!