Jump to content

ముదిగొండ సిద్ద రాజలింగం

వికీపీడియా నుండి

ముదిగొండ సిద్దవీర రాజలింగం వరంగల్లు జిల్లాకు చెందిన తొలి మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. సాధనా సమితి అనే సాహితీ సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఉపమంత్రిగా పనిచేశాడు.

జననం

[మార్చు]

ఈయన ఫిబ్రవరి 9, 1919లో తెనాలి దగ్గర ఈమనిలో జన్మించారు. ఈయన తండ్రి వీరలింగశాస్త్రి,[1] తెనాలి సమీపంలో ఈమని వాస్తవ్యుడు. ఈయన తల్లి వరంగల్లుకు చెందినది. రాజలింగం పుట్టి పెరిగింది వరంగల్లే. ఈయన కుటుంబం వరంగల్లులోనే స్థిరపడింది.[2]

రాజలింగం బి.ఏస్సీ, ఎల్.ఎల్.బి పట్టభద్రుడై వరంగల్లులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1939లో నిజాం కళాశాలలో విద్యార్ధిగా ఉన్న రోజుల్లోనే అనేక రాజకీయ, సాంఘీక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1940లో నిజాం కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక, పిట్టలవానివలే మారువేషంలో నిజాం పోలీసులను తప్పించుకొని వార్ధా చేరి,[3] 1940లో మహాత్మా గాంధీ ఆశ్రమం వార్ధాలోని గ్రామోద్యోగ విద్యాలయంలో, కుటీరపరిశ్రమల విభాగంలో సామాజికసేవలో రెండు సంవత్సరాలు శిక్షణ పొందాడు.[1]

1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో టి.హయగ్రీవాచారి నాయకత్వంలో పనిచేశారు. ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ 1942లో మహాత్మాగాంధీ జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఈయనకు జైలుశిక్ష పడి, ఏడాదిన్నరపాటు వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్నాడు. అంతటితో ఆగకుండా, ఆంధ్ర మహాసభ, రాష్ట్ర కాంగ్రేసు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. బ్రిటీషు ప్రభుత్వం వరంగల్ జిల్లాలో విధించిన ఆంక్షలు ఉల్లంఘించి, 1946, జనవరి 8 నుండి 1947 ఫిబ్రవరి 6 వరకు మరలా జైలుశిక్ష అనుభవించాడు.[1]

స్వాతంత్ర్యం తర్వాత 1952లో వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957లో చిల్లంచెర్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. వరంగల్‌లో 1949లో మొగిలయ్య హాలు నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు ఒక కుమార్తె, నలుగురు కుమారులు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు పరమపదించారు.

రాజలింగం, తన 82 ఏట, బాపూజీతో గడిపిన కాలపు స్మృతులను గ్రంథస్తం చేస్తూ, "బాపూ - నేను" అనే పుస్తకాన్ని వ్రాశాడు. దీనికి 82 మంది ప్రముఖులు పరిచయవాక్యాలు వ్రాయగా వాటన్నింటినీ మూలగ్రంథానికి అనుబంధంగా అచ్చువేశారు.[4]

ముదిగొండ సిద్దవీర రాజలింగం, జనవరి 23, 2012న అనారోగ్యంతో బాధపడుతూ, 92 ఏళ్ల వయసులో హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.[5][6] ఈయన శతజన్మోత్సవం సందర్భంగా, 2019లో భారత తపాలాశాఖ ప్రత్యేక తపాలా కవరును విడుదల చేసింది.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Mudigonda Siddaveera Rajalingam". amritmahotsav.nic.in. Retrieved 16 June 2025.
  2. "Some biographical details of Sri M.S. Rajalingam". Retrieved 29 June 2025.
  3. Bapu - Nenu (M.S.Rajalingam). Hyderabad: UDAYAMBICA PUBLICATIONS. 2002. p. 19. Retrieved 29 June 2025.
  4. Bapu _nenu ( M.S.Rajalingam) Abhiprayam-Samputi (PDF). Hyderabad: UDAYAMBICA PUBLICATIONS. 2002. Retrieved 29 June 2025.
  5. "MS Rajalingam passes away". missiontelangana.com. January 24, 2012. Retrieved 29 June 2025.
  6. "Veteran Congress leader passes away". The Times of India. Jan 24, 2012. Retrieved 29 June 2025.
  7. "India Special Covers Maxim Cards & Event Cover". collectorbazar.com. Retrieved 16 June 2025.