Jump to content

ముద్రణా యంత్రం

వికీపీడియా నుండి
Printing press from 1811, exhibited in Munich, Germany
Stanhope press from 1842

ముద్రణ యంత్రం అనునది ఒక అచ్చువేయవలసిన మాధ్యమం (కాగితం లేదా వస్త్రం) పై ముద్రణ సిరాతో అచ్చు వేసే యంత్రం.

చరిత్ర

[మార్చు]

అలెగ్జాండ్రియాలో పూర్వం ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది. జూలియస్ సీజర్ ఈ నగరాన్ని ముట్టడించినపుడు గ్రంథాలయం కొంతవరకు ధ్వంసం అయినది. సా.శ. 390 లో ధియోఫిలన్ అనే క్రైస్తవ మత గురువు ఇక్కడి నుంచి కొన్ని పుస్తకాలను తరలించాడు. సా.శ. 642 లో మహమ్మదీయులు ఈ నగరం పై దండెత్తి వచ్చినపుడు కాలిఫ్ ఉమర్ గ్రంథాలయం కాల్చివేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. సుమారు 4 లక్షల పుస్తకాలు మానవుని తెలివి తక్కువ తనానికి, ప్రతీకార వాంఛలకు బలైపోయాయి. ప్రాచీన సాహిత్య గ్రంథాలూ, జానపద గాథలూ, తరగని విజ్ఞాన సంపదా వాటిలో నిక్షిప్తంగా ఉండేవి. అవన్నీ రాయస గాళ్ళ చేత, బానిసల చేత, పండితుల చేత చేతితో రాయబడ్డవే. ఒక పెద్ద గ్రంథాలయం నాశనం కావడంతో కళలకు, సాహిత్యానికి, వేదాంత విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అపార జ్ఞాన నిధి తరువాతి తరాలకు శాశ్వతంగా దూరమైంది.

కానీ ఇలాంటి దుర్ఘటన ప్రపంచంలో మరెన్నడూ సంభవించదు. లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం, వాషింగ్టన్ లైబ్రరీ కాంగ్రెస్, పారిస్ లోని "బిబ్లియోధెక్ నేషనేల్ " సంపూర్ణంగా దగ్ధమైపోయినప్పటికీ, వాటి ప్రతులు ఇతరదేశాల లైబ్రరీల్లో నేడు లభ్యమవుతున్నాయి. నాగరికత మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లి కొనసాగినంత వరకూ పదిల పరచదగ్గ సమాచాన్నంతా ముద్రణ యంత్రం మనకోసం పదిల పరిచే ఉంటుంది. మానవ చరిత్రలో జరిగిన అనేక ఆవిర్భావాల్లో ప్రజల జీవన సరళినే కాకుండా వాళ్ళ మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క ముద్రణ విధానమే అని చెప్పవచ్చు.

ఆవిర్భావ చరిత్ర

[మార్చు]

దీని ఆవిర్భావం వెనుక పొంతన లేని అనేక కథలు అల్లుకుపోయాయి. కాగితం తయారు చేయటానికీ, ముద్రణ విధానం ప్రవేశపెట్టడానికీ శ్రీకారం చుట్టింది చైనీయులే, చైనా భాషకు సంబంధించిన సంకేతాలను కొయ్యపై చెక్కి, సక్రమంగా అమర్చి, వాటికి సిరా పూసి కాగితాలపై ఒత్తడంతో వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చైనా లిపిలో అక్షరాలుండవు. శబ్దానికి సంబంధించిన మాత్రా కాలాలకు (syllables) సంకేతాలుంటాయి. విడిగా ఉండే అచ్చులతో ముద్రించే విధానం చైనాలో 13 వ శతాబ్దంలోనూ, కొరియాలో 14 వ శతాబ్దంలోనూ ప్రారంభమైంది. అనేక శతాబ్దాలుగా దూర ప్రాచ్య దేశాల్లో బొమ్మలను ముద్రించే పద్ధతి నుంచి ఈ విధానం రూపొందిందని చెప్పవచ్చు.

ఐరోపాలో కూడా ముద్రణ మొదట్లో బొమ్మలతోనే ప్రారంభమైంది. కొయ్య దిమ్మలతో పటాలను చెక్కి చీట్ల పేకలను తయారుచేసేవారు. నానాటికీ అంటు రోగంలా వ్యాపిస్తున్న పేకాటకి విరుద్ధంగా చర్చి అధికారులు ప్రచారం సాగించటమే కాకుండా మతగురువుల పటాలను పెద్ద ఎత్తున ముద్రించటం ప్రారంభించారు. బొమ్మలతో పాటు కొన్ని పదాలను చేర్చాలనే అభిప్రాయం కలిగింది. కానీ వాటినన్నిటినీ కొయ్య దిమ్మపై చెక్కటం ఇబ్బందికరంగా ఉండేది. ఇదే సమయంలో పశ్చిమ ఐరోపాలో కొందరు కొయ్య లేదా లోహంతో అక్షరాల అచ్చులను తయారుచేసి, ముద్రించటానికి అనుకూలంగా వాటిని పదాలుగానూ, వాక్యాలుగానూ మార్చి ముద్రించాలని ప్రయత్నించారు. దీనికి కావలసిన కాగితం తయారీ అరబ్బుల పుణ్యమా అని చైనా నుంచి ఐరోపా ఖండానికి తీసుకు రాబడి అందరికీ లభ్యంగా ఉండేది.

చదవటం, రాయటం నేర్చుకున్న వాళ్ళందరూ పుస్తకాలు కావాలని తహతహలాడుతుండేవారు. చేతితో రాసిన పుస్తకాలు కొద్దిగానే ఉండడంచేత అవి ఆశ్రమాల లోని సన్యాసులకు, మత గురువులకు, చర్చి అధికారులకు, విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. విషయాలను తెలుసుకోవాలనీ, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనీ ఆకాంక్షించే సామాన్య ప్రజలకు ఇలాంటి సదుపాయం దుర్లభంగా ఉండేది. అచ్చుల సహాయంతో అక్షరాలను ముద్రించే విధానం ఈ నేపథ్యంలో ప్రారంభమైనదని చెప్పవచ్చు. Write by nazeer

ఆవిష్కరణ

[మార్చు]

ఈ విధానాన్ని ఎవరు కనుక్కున్నారనడంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. ఈ విధానాన్ని ఉపయోగించి మొదటి పుస్తకాన్ని లారెన్స్ కాప్టర్ ముద్రించాడని ప్రశంసిస్తూ హాలెండ్ లోని హార్లెం నగరంలో రెండు స్మారక చిహ్నాలున్నాయి. తొలి పుస్తకాన్ని ముద్రించినవాదు ఓ డాక్టర్ అని వెబుతూ ఫెల్టర్ అనే ఇటలీ నగరంలో మరో స్మారక చిహ్నం నెలకొల్పబడింది. స్ట్రాస్ బర్గ్, ప్రాగ్ నగరాల్లో కూడా ఈ ఘనత మాదే అంటూ స్మారక చిహ్నాలు వెలిశాయి. 500 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. 15 వ శతాబ్దం పూర్వార్థంలో లారెన్స్ కాస్టర్ అక్షరాల అచ్చులతో పుస్తకాన్ని ముద్రించినట్లు తెలుస్తున్నప్పటికీ జర్మనీలో మెయింజ్ కి చెందిన జోహన్ గ్యూటెన్ బర్గ్ అనేక కొత్త పద్ధతుల ద్వారా ముద్రణ విధానానికి మెరుగులు దిద్దాడని అంగీకరించకతప్పదు.

జోహన్ గ్యూటెన్ బర్గ్

[మార్చు]

గ్యూటెన్ బర్గ్ సంపన్న కుటుంబలో జన్మించాదు. చిన్నతనంలోనే స్టాన్న్ బర్గ్ కి వెళ్ళి కొయ్య దిమ్మలతో ముద్రించటం చేర్చుకున్నాడు. అద్దాలకు మెరుగుపెట్టడం, రత్నాలకు సానపెట్టడం కూడా కొన్నాళ్ళూ చేశాడు. ఈ హస్త కళల్లో అనేక కొత్త పద్ధతులను కనిపెట్టాడు. అక్షరాల అచ్చులను విడిగా తయారుచేసి వాటిని పదాలుగా, వాక్యాలుగా కూర్చే ఆలోచన స్ట్రాన్ బర్గ్ లోవున్నప్పుడె అతనికి తట్టినట్టు తెలుస్తోంది.

50 యేళ్ళ వయసులో అతడు తన జన్మస్థానానికి తిరిగి వచ్చి ఆలోచనల్ని ఆచరణలో పెట్టసాగాడు. ఒక్కొక్క అక్షరానికి ఒక అచ్చును తయారుచేసి, వీటి నుంచి ఒకే పరిమాణంలో ఉండే లోహపు అచ్చుల్ని తీర్చి దిద్దాడు. అప్పట్లో చేతితో రాయబడే అక్షరాలు కేవలం అలంకార ప్రాయంగా వున్నాయన్న కారణంతో ముద్రణకు సరిపోయేలా అక్షరాల తీరులో సరిక్రొత్త మార్పులు చేశాడు. అక్షరాలను కచ్చితంగా ఏర్పరిచే అచ్చులను తయారుచేసే సాధనాన్ని కూడా అతడే కనుగొన్నాడు. అచ్చులన్నిటికీ ఒకే పరిమాణంలో సిరా పూయటానికి మరో సాధనాన్ని, కావససినంత ఒత్తిడిని మాత్రమే కలగజేసే ఒత్తుడు యంత్రాన్నీ తయారుచేశాకనే అతడు ముద్రణకు పూనుకున్నాడు. వీటి నిర్మాణానికి అతడెంతో శ్రమ పడ్డాడు.

తొలిసారిగా అతడు ఒక పాత జర్మన్ పద్యాన్ని ముద్రించి చూశాడు. ఇది తృప్తి కరంగానె వుండటంతో లాటిన్ భాషలో బైబిల్ మొత్తాన్ని ముద్రించటానికి సాహసించాడు. ఒక పేజీకి 42 గీతలు చొప్పున 1282 పేజీలు గల ఆ గ్రంథాన్ని సరైన సదుపాయాలు లేని చిన్న సంస్థ ముద్రించటానికి పూనుకోవటం నిజంగా సాహసమే! అనేక సంవత్సరాలు శ్రమించి అతడీ బృహత్కార్యాన్ని 1456 లో పూర్తి చేశాడు.

పని పూర్తయ్యే సరికి అతనివద్ద చిల్లిగవ్వ కూడా మిగలలేదు. ఇంతవరకు డబ్బు సమకూరుస్తూ వచ్చిన అతని భాగస్వామి తన వాటా వెంటనే యిచ్చివేయమని పట్టు బట్టాడు. గత్యంతరం లేక ఇంటినీ, వర్క్ షాప్ నీ, ముద్రించిన ప్రతులనూ గ్యూటెన్ బర్గ్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అతని శేష జీవితం ఎలా గడిచిందో తెలియదు కానీ పదేళ్ళ తరువాత ఓ చర్చి అధికారి తన ఇంట్లో ప్రశాంతంగా జీవితం గడపాలని గ్యూటెన్ బర్గ్ ని ప్రార్థించగా, అతడక్కడే వుండి రెండేళ్ళలో శాశ్వతంగా కన్నుమూశాడు.

ముద్రణ ప్రారంభం

[మార్చు]

జర్మనీ తరువాత ఇటలీ, ఫ్రాన్స్, దేశల్లో ముద్రణ ప్రవేశపెట్టబడింది. ఇక్కడ ముద్రణా యంత్రాలను జర్మనీ దేశస్తులే స్థాపించారు. కొంత కాలానికి ఇంగ్లండ్ లో దీన్ని ప్రవేశ పెట్టారు. విలియం కాక్స్ టన్ అనే కెంట్ వర్తకుణ్ణీ ఒక ప్రముఖ వాణిజ్య సంస్థ బర్గండీ ప్రభువులతో వాణిజ్య ఒప్పందాలు చర్చించటం కోసం ఐరోపాకి పంపింది. 1471 లో అయడు కలోన్ ని సందర్శించినపుడు ఓ ముద్రణాలయం అతని కంటబడింది. దీన్ని చూసి ప్రభావితుడై వాణిజ్య సంస్థ ఉద్యోగానికి రాజీనామా చేసి, ముద్రణాలయంలో అప్రెంటీస్ గా చేరాడు. పని బాగా నేర్చుకున్న తరువాత హోమర్ రాసిన ఇలియడ్ గ్రంథాన్ని ఫ్రెంచ్ భాష నుంచి ఇంగ్లీషు లోకి అనువదించి తానే ముద్రించాడు. ఇంగ్లీషు భాషలో ముద్రించబడిన ఈ తొలి గ్రంథం 1474 లో విడుదలయ్యింది. రెండేళ్ళలో అతడు వెస్ట్ మినిస్టర్ లో ముద్రణా సంస్థను నెలకొల్పి వేదాంత సూక్తులు గల పుస్తకాన్ని ముద్రించటం ప్రారంభించాడు.

బాగా డబ్బు స్ంపాదించి పెట్టే వాణిజ్య రంగాన్ని వదిలిపెట్టేందుకు కాక్స్ టన్ ఎప్పుడూ చింతింజలేదు. ఇంగ్లండ్ లో తొలి ముద్రాపకుడిగా పేరు పొందటమే కాకుండా, అతడు చనిపోయే నాటికి ప్రపంచ సాహిత్యం లోని సూమరు 80 మహోన్నత గ్రంథాలను ముద్రించి తనదేశ ప్రజల చేతుల్లో పెట్టగలిగానన్న సంతృప్తి, గర్వం అతనికి మిగిలాయి. ఇంతే కాకుండా నిరంతరం మారుతూ అస్తవ్యస్త స్థితిలో ఉన్న ఇంగ్లీషు వ్యాకరణాన్ని, అక్షరాల కూర్పును అతడే ప్రమాణీకరించాడు.

ప్రజల్లో చైతన్యం

[మార్చు]

మధ్య యుగం అంతరించడానికి ముద్రణా విధానమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీని పర్యవసానంగా మానవుడి మేధస్సు వికసించింది. ఛాందసత్వం, అజ్ఞానం, దమన నీతితో కొట్టుముట్టాడుతున్న పాలక వర్గాల గుండెల్లో రైళ్ళూ పరిగెత్తేలా సుదూర ప్రాంతాల మధ్య భావ వినిమయం జరిగింది. ముద్రణా సౌలభ్యం వల్లనే భూమిని గురించి, స్వర్గాన్ని గురించీ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఇచ్చిన కొత్త వివరనలనూ, సముద్రాల కావల కనుక్కోవడిన కొత్త దేశాల సమాచారాన్నీ సామాన్య ప్రజలు తెలుసుకో గలిగారు. ప్రభువులు ప్రజల్ని అజ్ఞానాంధకారంలో అణచి పెట్టాలని ప్రయతినిస్తుండగా ముద్రాక్షరాలు మెరుపుతీగలా జ్ఞానకాంతులను ప్రసరించ సాగాయి. జర్మనీలో జరిగిన రైతాంగ విప్లవానికి ప్రజల్ని సమాయత్తపరిచింది ఆ నాటి కరపత్రాలే. మార్టిన్ లూధర్ కింగ్ రాసిన On the liberty of Archristian Man అనే సిద్ధాంత వ్యాసం వల్లనే పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో సంస్కరణోద్యమానికి అంకురార్పణ జరిగింది.

పత్రికలు,పుస్తకాలు

[మార్చు]

పుస్తకాలు, వార్తాపత్రికలు నాగరిక జీవనంలో అంతర్భాగంగా కలిసిపోయాయి. జాతి పరిణతకి అక్షరాస్యత విశ్వసనీయమైన కొలబద్దగా తయారైంది. కానీ గ్యూటెన్ బర్గ్ కాలం నుంచి సుమారు 3 1/2 శతాబ్దాల దాకా ముద్రణా విధానం యధాతథంగా కొనసాగింది. అచ్చులను చేతితో కూర్చడం, చేతితోనే ముద్రించడం జరుగుతూ వచ్చింది. ఇది చాలా నెమ్మదిగా జరిగేపని. రాను రాను సమాచారాలను త్వరగా అందించాల్సిన ఆవశ్యకత తీవ్రమైంది. తొలిసారిగా వార్యా పత్రికలాంటి పెద్ద పేజీలలో సమాచారాన్ని అందించడం 1529 లో జరిగింది. టర్కీ సైన్యాలు వియన్నాను చుట్టుముట్టగానే భయభ్రాంతులైన అధికార వర్గం ఇలాంటి పేజీలను ప్రకటించి, తమకు సాయం చేయవససినదిగా సమస్త క్రైస్తవ ప్రపంచానికి పిలుపునిచ్చింది. ఒక శతాబ్దం తర్వాత 1622 లో నెథేనియల్ బటర్ అనే ఆంగ్లేయుడు 'వీక్లీ న్యూస్ ' అనే తొలి పత్రికను ప్రచురించాడు. అంతర్యుద్ధం కాలంలోనూ, క్రాంవెల్ కాలంలోనూ అనేక పత్రికలు వెలువడ్డాయి. కానీ వీటన్నిటికీ ముందుగా లైసెన్స్ పొందాలనే నిబంధన ఉండేది. పత్రికల మహత్తర శక్తిని నిరంకుశ ప్రభువులూ, నియంతలూ అప్పటికే గుర్తించారు. అప్పటి నుంచీ పత్రికలకూ, పరిపాలకులకూ అడపా దడపా సంఘర్షణ చెలరేగుతూనే ఉంది. 1702 లో డెయిరీ కోరంట్ అనే తొలి దైనిక వార్తా పత్రికా ఇంగ్లండ్ లో ప్రచురింపబడే నాటికి పత్రికలపై ప్రభుత్వ నెన్సార్ షిప్ నిబంధనలన్నీ తొలగింపబడ్డాయి. అయితే వీటిని పరోక్షంగా నితంత్రించటానికి బ్రిటిష్ ప్రభుత్వం పత్రికా పన్నుని విధించింది. స్టాంప్ చట్టం పేరుతో ఇది 1855 దాకా అమలులో ఉండేది.

కోనిగ్ రూపొందించిన యంత్రం

[మార్చు]
Koenig's 1814 steam-powered printing press

టైమ్స్ పత్రిక పత్రికా సంస్థాపకుని కుమారుడు జాన్ వాల్టర్ ని 1812 లో ఒక రోజు ఒక మిత్రుడు కలసి, ముద్రణా విధానంలో జరిగిన పురోభివృద్ధి తెలుసుకోవాలంటె వైట్ క్రాస్ వీధిలోని వర్క్ షాప్ ని సందర్శించాలని కోరాడు. వాల్టర్ అక్కడికెళ్ళే సరికి ఫ్రీడిచ్ కోనింగ్ అనే జర్మన్ దేశస్తుడు తయారు చేసిన క్రొత్త ముద్రణా యంత్రాన్ని చూపెట్టాడు. ఇది ఆవిరి శక్తితో పనిచేస్తుంది. జర్మనీ దేశం అప్పట్లో అసంఖ్యాకమైన చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించబడి ఉండేవి. కొత్త యంత్రాల తయారీకి ఒక రాష్ట్రంలో పొందిన అనుమతికి ఇతర రాష్ట్రాల్లో మతింపు ఉండేది కాదు. ఈ కారణంగా ఇలాంటి ఇబ్బందులు లేని ఇంగ్లండ్ కోనిగ్ మకాం మార్చాడు. టైమ్స్, ఈవినింగ్ మెయిల్ పత్రికల కోసం రెండు యంత్రాలు కావాలని కోనిగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు వాల్టర్. ఇవి తయారు కావటానికి రెండేళ్ళు పట్టింది.

యిదివరకటి ముద్రణా విధానంలో అక్షరాల అచ్చులను ఒక పేజీకి సరిపడా వాక్యాలుగా కూర్చి పెట్టాక, రోలర్ సహాయంతో సిరా పూయటం జరుగుతుంది. దానిపై కాగితాన్ని ఉంచి చేతితో గానీ, కాలితో గానీ ఒత్తుడు కడ్డీ నెమ్మదిగా అదిమేలా చేస్తారు. దీంతో గంటకు 300 పేజీల కంటే ఎక్కువ ముద్రించడం వీలు కాదు. ఆవిరి శక్తిని ఉపయోగించి కోనిగ్ ఈ విధానంలో కొన్ని మార్పులు చేశాడు.

అచ్చులు కూర్చిన పలక సిరా పూసే స్తూపం కిందికి ముందుకూ, వెనుకకూ కదిలేలా అమర్చారు. చేతితో చేయవలసిందల్లా కాగితాలను అందించటమే. పలక మీద కాగితం యాంత్రికంగా అమర్చబడగానే మరో స్తూపం వల్ల ఒత్తిడి యేర్పడి, ముద్రించబదిన కాగితం యంత్రానికి ఆవలివైపున వెలువడుతుంది. ఇలా అయితే ఎక్కువ శ్రమలేకుండా గంటకు 1000 నుంచి 1200 కాగితాలు వరకూ ముద్రించవచ్చు.

కొత్త యంత్రాలను వాడితే బ్రతుకు తెరువు దెబ్బతింటుందని భయపడ్డ ముద్రాపకులందరూ కోనిగ్ ఫ్యాక్టరీ వద్ద గుమిగూడి యంత్రాలను అక్కడి నుండి టైమ్స్ కార్యాలయానికి తరలించకుండా అడ్డగించారు. వాల్టర్ తాత్కాలికంగా ప్రయత్నాన్ని విరమించుకొని, ఎలరికీ తెలియకుండా ఆ రాత్రే యంత్రాన్ని మరో భవనానికి తరలించి తెల్లవారే సరికి 1814 నవంబరు 29 తేదీ పత్రికను ముద్రించి విడుదల చేశాడు. ముద్రణా విధానంలో జరిగిన విప్లవాత్మక పరిణామాన్ని గురించి అందులో సంపాదకీయ వ్యాసం రాశాడు.

" ముద్రించడం ప్రారంభమైన తరువాత తొలిసారిగా ప్రవేశ పెట్టబడిన నూతన ముద్రణా విధాన ఫలితమే ఈ నాటి సంచిక. ఇప్పుడు పాఠకుని చేతిలో ఉన్న పత్రిక కొత్త యంత్రాన్ని ఉపయోగించి ముద్రించిన అనేక వేల కాపీలలో ఒకటి. శారీరక శ్రమను బాగా తగ్గించి అతి శీఘ్రంగా కాపీలను అందిచేలా ఓ కొత్త యంత్రం తయారు చేయ బడింది. దీన్ని నిర్మించిన వాడు జన్మతః సాగ్సన్(saxon). అతని పేరు కోనిగ్. అతని అవిశ్రాంత కృషివల్లనే ఈ సౌలభ్యం ఏర్పడింది. " ....... అని వాల్టన్ అందులో వివరించాడు.

కొత్త యంత్రాన్ని స్థాపించటం వలన జీవన భృతి కోల్పోయిన ముద్రాపకులందరికీ వేరే ఉద్యోగాలు దొరికేదాకా వాల్డర్ వేతనాలిచ్చాడు. మొదట్లో తిండీ, బట్టా హరించివేస్తుందని భయపడ్డ కొత్తయంత్రం ముద్రణావృత్తికే గొప్ప వరంలా పరిణమించింది. వార్తా పత్రికలు, పుస్తకాలు యాంత్రికంగా ముద్రించబడటంతో వాటిని చదవడం చదవడం సర్వత్రా వ్యాపించి వాటికి గిరాకీ అమాంతంగ పెరిగింది.

కొన్నాళ్ళకు కోనిగ్, అతని సహచరుడు బేయర్ ఐరోపాకి తిరిగి వెళ్ళారు. బవేరియాలో కొత్త ముద్రనా యంత్రాలను తయారుచేసి ఫ్యాక్టరీని స్థాపించి, అక్కది రైతు బిడ్డలకు మెకానిక్ లుగా శిక్షణ ఇచ్చారు. అచిరకాలంలోనే ఈ ఫ్యాక్టరీ మూడు పూవులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది.

రోటరీ ప్రెస్

[మార్చు]

ముద్రణా విధానంలో ఒక మైలు రాయి రోటరీ ప్రస్సు. ఈ యంత్రాన్ని 1863 లో విలియం బులక్ అనే అమెరికా దేశస్థుడు తొలిసారిగా నిర్మించాడు. ఇది జరిగిన కొద్ది కాలంలోనె ఓ ముద్రణాలయం ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోటరీ ప్రెస్సు పద్ధతినే యిప్పటి వార్తాపత్రికల్లో కూడావ వాడుతున్నారు. ముద్రించాల్సిన కాగితాన్ని పేజీల రూపంలో కాకుండా పెద్దపెద్ద చుట్టల రూపంలో ఈ యంత్రానికి అందిస్తారు. అచ్చులు కూర్చిన పలక చదునుగా కాకుండా స్థూపాకారంగా ఉంటుంది. కాగితం, సిరా, అచ్చుల పలక ఈ మూడూ గుంద్రంగా తిరుగుతున్న స్థూపాలపై ఉంటాయి. 24 స్థూపాలు గల ఆధునిక ముద్రణా యంత్రం గంటకు 12 లక్షల కాపీలను ముద్రించగలదు. కాగితాలను తగిన పరిమాణంలో కత్తిరించటం, మడచటం, నిర్ణీత సంఖ్యలో కాపీలను లెక్కపెట్టి కట్టలుగాఅ అందించటం అన్నీ యాంత్రికంగా జరిగిపోతాయి. రంగుల ముద్రన, బొమ్మల ముద్రణ కూడా ఇదే యంత్రంతో చేయవచ్చు.

లినోటైప్ విధానం

[మార్చు]

విదేశాలకు వెళ్ళీన మరో జర్మనీ దేశస్థుడు టైప్ రైటర్ లాంటి సాధనంతో యాంత్రికంగా అచ్చులను కూర్చే కొత్త పద్ధతిని కనుగొన్నాడు. ఇతనిపేరు మెర్గెంథలెర్. 1876 లో ఇతడు బాల్టిమోర్ వర్క్ షాపులో మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. యాంత్రికంగా అచ్చులు కూర్చే సాధనాన్ని నిర్మించటంలో తమకు సహాయపడమని కొందరు యంత్ర నిర్మాతలు ప్రాధేయపడ్డారు. దీనికోసం వాళ్ళూ ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ఎంతో శ్రమపడినా లాభంలేకపోయింది.

మెర్గెంధలేర్ అనేక నమూనాలపై పరిశోధనలు జరిపి తుదకు 1886 లో లినోటైప్ అనే సాధనాన్ని తీర్చిదిద్దాడు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో న్యూయార్క్ ట్రిబ్యూస్, కోరియర్ జర్నల్, చికాగో న్యూస్, వాషింగ్టన్ పోస్టు పత్రికా సంస్థల్లో ఈ కొత్త సాధనాన్ని ప్రవేశపెట్టాడు. శీఘ్రంగా పని జరిగేలా మరో అమెరికన్ శాస్త్రజ్ఞుడు బెంటన్ కొన్ని మార్పులు సూచించాడు. పుస్తకాలను ముద్రించడానికి టాల్బర్ట్ లాన్స్ టన్ 1880 దశకంలో మోనోటైప్ అనే మరో పద్ధతిని కనుకొన్నాడు. ఇందులో ఒకకీ బోర్డు ఉంటుంది. కాగితం చుట్టలపై ఇది ఒక పద్ధతి ప్రకారం రంధ్రాలను తొలుస్తుంది. ఈ రంధ్రాలు అక్షరాల అచ్చులను అతివేగంగా కూర్చేలా చేస్తాయి.

లినోటైప్ విధానం ప్రపంచమంతటా అసంఖ్యాక ముద్రణాలయాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ, విప్లవాత్మకమైన అనేక మార్పులు రావటంతో కొత్త రూపురేఖలను సంతరించుకొంది. ముద్రణ కోసం టైప్ చేసేటప్పుడు గీతలను సమానమైన పొడవు ఉండేలా నేయడంగాని, పదాల మధ్య ఎడం ఉండేలా చూడడం కానీ పాటించకుండా ఒక టేప్ నిఒ తయారు చేస్తారు. దీన్ని ముద్రాపకుల పరిభాషల్లో ఇడియట్ టేప్ అంటారు. దీన్ని కంప్యూటర్ సంధించి రంధ్రాలు గల మరో టేప్ ని తయారు చేస్తారు. ఈ దశలో గీతలన్నీ సమానమైన పొడవుతో వుండటం, పదాల మధ్య తగినంత ఎడం ఏర్పడటం జరుగుతాయి. తరువాతి దశలో అచ్చులు కూర్చబడి, ముద్రణా స్వయంచాలకంగా జరిగిపోతుంది.

ఫోటో విధానం

[మార్చు]

ఫోటో విధానంలో ముద్రించటం కొత్త పద్ధతి. ఈ విధానంలో ముద్రించాల్సిన సమాచారాన్ని కాగితం చుట్టపై రంధ్రాల్ రూపంలో టైప్ చేస్తారు. ఇది టైప్ చేసిన కాగితంలా ఆపరేటర్ కంటి ముందు కనబడుతుంది. అందులో ఏవైనా పొరపాట్లు కనబడితే, ఆ గీతలను మాత్రం రద్దుచేసి మళ్ళీ టైప్ చేయవచ్చు. అనేకకీ బోర్డుల సహాయంతో తయారుచేసిన రంధ్రాల టేప్ ని ఫోటో యూనిట్ కి సంధిస్తారు.ఇక్కడ ఆ రంధ్రాల కాగితం లేదా ఫిల్మ్ పై గాని అక్షరాలుగా మారుతాయి.

అధునాతన పద్ధతులు

[మార్చు]
  • లినోటైప్ కంటే అధునాతన పద్ధతికి న్యూయార్క్ లోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలలో కనుగొన్నారు. కంప్యూటర్ లో ఉండే మెమరీ లాంటి సాధనం ద్వారా అక్షరాల అచ్చులు కూర్చడం జరుగుతుంది. వెంటనే ఈ అక్షరాలు కాథోడ్ కిరణ నాళం లోని తెరమీద కనబడతాయి. మనం ఊహించరానంత వేగంతో అక్షరాలు కనబడటం, తెరముందుండే కెమేరా వీటిని ఎప్పటికప్పుడు ఫోటో తీయటం చకచకా జరిగిపోతాయి. ఈ ఫిల్ంతో అచ్చుపలక తయారవుతుంది. ఈ పద్ధతిలో ఒక సెకండుకు కొన్ని వేల అక్షరాల అచ్చులను తయారుచేయవచ్చు.
  • మరో విప్లవాత్మక మార్పు అమెరికా వార్తా పత్రికల్లో విస్తృతంగా వాడబడుతోంది. ఇందులో కంప్యూటర్ తో పాటు రెండు అధునాతన సాధనాలుంటాయి మొదటికి వీడియో డెస్ ప్లే టెర్మినల్. దీనిలో కాథోడ్ కిరణ లాళంతో పాటు టైప్ రైటర్ లాంటిది ఉంటుంది. రెండోది ఆప్టికల్ కారక్టర్ రీడర్. దీన్నిఉపయోగించి 1969 లో మొట్టమొదటి సాదా ప్రతి పుస్తకాన్ని ముద్రించారు.
  • ఏక కాలంలో ఒకే వార్తా పత్రికను నాలుగైదు పట్టణాల్లో ముద్రించే ఏర్పాటు టైప్ సెట్టింగ్ అనే విధానం వల్ల వీలవుతుంది. ఈ విధానాన్ని బ్రిటన్ లోని పెద్ద వార్తా పత్రికల సంస్థలు వాడుతున్నాయి. సమాచారాన్ని ఒక్కొక్క పేజికి సరిపడా తయారుచేసి దాన్ని టెలివిజన్ లాంటి కెమెరా స్కాన్ చేశాక ఇతర ప్రదేశలకు ప్రసారం చేయటం, అయా చోట్ల లోహ పలకల మీద పేజి పునరుత్పత్తి కావడం జరుగుతుంది. Wholepapge Facsimkile Transmitter అనే ఈ విధానాన్ని 1960 దశకంలో బ్రిటన్లో కనుగొన్నారు.

ఉపగ్రహ ప్రసారం ద్వారా ముద్రణ

[మార్చు]

ఉప గ్రహం ద్వారా ప్రసారం చేయబడి ముద్రించ బడిన తొలి వార్తాపత్రిక న్యూయార్క్ లోని వాల్ స్ట్రీట్ జర్నల్—కొన్ని ఆర్థిక కారణాల వల్ల మెసోచూసెట్స్ లో అచ్చులు కూర్చే యంత్రాన్ని, ప్లోరిడాలో ముద్రణా యంత్రాన్ని ఈ సంస్థ స్థాపించింది. రెండు ప్రదేశాల మధ్య వార్తా ప్రసారానికి అనువుగా ఓ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని, రెండు ప్రదేశాల మధ్య వార్తా ప్రసారానికి అనువుగా ఓ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని, రెండు ఎర్త్ స్టేషను లను కూడా నెలకొల్పింది. ఫాసిమిలీ విధానం ద్వారా మొత్తం పేజీలను ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రసారం చేశారు. ఈ విధానంలో ఒక పేజీ ప్రసారానికి మూడు నిముషాలు మాత్రమే పడుతుంది.

కాగితం అవసరం లేని ముద్రణ

[మార్చు]

రానురాను కాగితం మీద ముద్రించే అవసరమే లేకుండా మొత్తం పత్రికని టెలివిజన్ తెరలమీదనే పాఠకులకు అందించవచ్చు. బ్రిటన్ లో ఇందుకు గాను సీఫాక్స్, ఒరాకిల్ అనే రెండు పద్ధతులు ఉన్నాయి. మామూలు కార్యక్రమాలను టి.వీ కెమేరాలు ఫోటోలు తీసేటప్పుడు ఇతర తరంగ దైర్ఘ్యాలలో వార్తలను సంకేతాల రూపంలో మార్చి ప్రసారం చేస్తారు.టి.వి చూసే వాళ్ళకు ఈ సంకేతాలు మామూలుగా కనబడవు. ప్రత్యేకంగా ఒక అడాప్టర్ ని ఉపయోగిస్తే సంకేతాలు వార్తా పత్రిక లోని పేజీలలా టీవీ తెరమీద కనబడతాయి. ఒక ఛానల్ పై 300 పేజీలను ప్రసారం చేయటానికి వీలుంటుంది. కావలసిన పేజీలను తిరగదోడడానికి కూడా ఇందులో వీలు కల్పించారు.

మూలాలు

[మార్చు]