ముళ్ళపూడి శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముళ్ళపూడి శ్రీరామమూర్తి

ముళ్ళపూడి శ్రీరామమూర్తి పేరుగాంచిన మృదంగ విద్వాంసులు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

శ్రీరామమూర్తి తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించారు. ఇతని తండ్రి ముళ్ళపూడి లక్ష్మణరావు, తాత వడలి వెంకటనారాయణ, ముత్తాత వడలి చంద్రయ్యలు కూడా మృదంగ విద్వాంసులుగా ప్రసిద్ధి చెందినవారు. ఇతనికి వంశపారంపర్యంగా మృదంగ విద్య అబ్బింది. ఇతనికి చిన్నతనంలోనే మాతృవియోగం కలిగితే తండ్రి విరక్తితో పెద్దాపురం విడిచిపెట్టి విజయనగరం వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ అతను 1955 నుండి తండ్రి వద్ద మృదంగ విద్యను అభ్యసించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో నౌడూరు వెంకట్రావు, కాట్రావులపల్లి వీరభద్రరావు, ధర్మాల వెంకటేశ్వరరావు, వంకాయల నరసింహమూర్తి, ముళ్ళపూడి సూర్యనారాయణ తదితరులు ఇతని సహాధ్యాయులు. ఇతను ఒక సంవత్సరంలోనే సాధన చేసి 1956లో కాకినాడలో జరిగిన సంగీత పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి పొందారు. తరువాత ఇతను విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో కోటిపల్లి గున్నయ్య గారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. ఇతడు మృదంగం, వయొలిన్ రెండూ సాధన చేస్తూ 1963లో జరిగిన అఖిల భారత సంగీత పోటీలలో ద్వితీయ స్థానం సంపాదించుకుని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా సత్కరించబడ్డారు.[2] ఇతడు ప్రముఖ సంగీత కళాకారులు పాల్గాట్ మణి అయ్యర్, కోలంకి వెంకటరాజు, తిరుపతి రామానుజ సూరి, మహదేవ రాధాకృష్ణరాజు, దండమూడి రామమోహనరావు, వి.కమలాకరరావు, ధర్మాల రామమూర్తి మొదలైన వారి కచేరీలకు మృదంగ సహకారం అందించాడు. ఇతడు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తుని, రాజమండ్రి, భీమవరం, నరసాపురం, విజయవాడ, మద్రాసు, ఢిల్లీ, ఖరగ్‌పూరు, భువనేశ్వరం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మొదలైన చోట్ల జరిగిన అనేక సంగీత కార్యక్రమాలకు మృదంగం వాయించాడు.

అతను జూలై 12, 2014న తన 71వ యేట మరణించాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Mullapudi Sriramamurthy passes away".
  2. 2.0 2.1 "Percussionist dead".

బయటిలంకెలు[మార్చు]