Jump to content

మైసూరులో దసరా ఉత్సవాలు

వికీపీడియా నుండి
మైసూరులో దసరా ఉత్సవాల సమయంలో జరిగే ఊరేగింపు

మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు కర్ణాటక రాష్ట్ర పండుగ (నదహబ్బ). ఈ నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో కలిపి పదిరోజులు వరుసగా జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వస్తుంది. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. తొమ్మిదిరోజులు వివిధ అవతారాల్లో మహిషాసురుని సేనలను నాశనం చేసిన పరాశక్తి తొమ్మిదోరోజున మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ  విజయానికి సూచనగా ఆ తరువాతిరోజు విజయదశమిగా పండుగ జరుపుకుంటారు ప్రజలు. మైసూరులోని అమ్మవారి పేరు చాముండేశ్వరీదేవి. మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ పదిరోజులు జరిగే, పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు దేశంలోని పర్యాటకులనే కాక, విదేశీయులనూ ఆకట్టుకోవడం విశేషం. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏడూ లక్షల సంఖ్యలో పర్యాటకులు మైసూరు వస్తూంటారు. 2010 నాటికి  ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 400 ఏళ్ళు అయ్యాయి.[1]

పండుగ విశేషాలు

[మార్చు]
దీపకాంతుల్లో వెలిగిపో తున్న  మైసూరు ప్యాలెస్.  (ఇందులోనే  దసరా  ఉత్సవాలు నిర్వహిస్తారు.)

15వ శతాబ్దంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు.[2] దీనికి మనకు చారిత్రక ఆధారులు కూడా లభిస్తున్నాయి. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ తన పుస్తకం మట్లా-ఉస్-సదైన్ వా మజ్మా-ఉల్-బహ్రెయిన్  అనే పుస్తకంలో విజయనగర సామ్రాజ్యంలో రాజులు జరిపిస్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నారు. ఈ పుస్తకంలో 1304-1470 వరకు ఆయనకు తెలిసిన ప్రపంచ చరిత్ర గురించి రాశారు.[3] అలా మనకు 15వ శతాబ్దం కన్నా ముందే దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవని తెలుస్తుంది.

విజయనగర సామ్రాజ్య పతనం తరువాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ I (1578-1617) 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టారు.[4] ఈ పదిరోజులూ మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ రెండూ చూడటనాకి కూడా పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. 1805లో కృష్ణరాజ ఉడయార్ III సమయం నుండి దసరా సమయంలో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది. ఈ దర్బారులో రాజబంధువులు, రాజకుటుంబాలు, అతిథులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొనేవారు. 2013 డిసెంబరులో శ్రీకంఠ ఉడయారు చనిపోయేంతవరకూ ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. కానీ ఆయన మరణానంతరం బంగారపు రాజసింహాసనంపై, రాచఖడ్గం అయిన "పట్టడ కత్తి"ని ఉంచి ఈ దర్బారు నిర్వహిస్తున్నారు.[5][6][7] నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "400th Mysore Dasara begins today". The Times Of India. 2010-10-07. Archived from the original on 2011-11-06. Retrieved 2016-10-11.
  2. "A.V. Narasimha Murthy, "Dasara 500 years ago", ourkarnataka.com". Archived from the original on 2012-10-04. Retrieved 2016-10-11.
  3. A History of Cathay: a translation and linguistic analysis of a fifteenth-century Turkic manuscript, 1995
  4. A detailed account of the Dasara festival celebrated at Mysore is provided by Ravi Sharma. "Mysore Dasara: A historic festival". Online Edition of The Frontline, Volume 22 - Issue 21, dated 2005-10-08:2005-10-21. 2005, Frontline. Archived from the original on 2007-07-16. Retrieved 2007-04-04.
  5. R. Krishna Kumar. "Emotional start to private Dasara". The Hindu. Retrieved 22 October 2015.
  6. http://www.deccanchronicle.com/140926/nation-current-affairs/article/no-scion-sword-%E2%80%98rules%E2%80%99-mysore-palace
  7. "Royal Sword takes king's place at Khas Durbar". Deccan Herald. Retrieved 22 October 2015.
  8. Detailed account of the Mysore Dasara festival is provided by Prabuddha Bharata. "Mysore Dasara - A Living Tradition". Webpage of eSamskriti.com. Shri Sanjeev Nayyar. Archived from the original on 2007-03-07. Retrieved 2016-10-11.