యలమంచిలి వెంకటప్పయ్య
యలమంచిలి వెంకటప్పయ్య | |
---|---|
దస్త్రం:Yalamanchili Venkatappaya - Copy.jpg | |
జననం | 30 డిశెంబరు 1898 కృష్ణ జిల్లా కనుమూరు గ్రామం |
మరణం | 1997 మార్చి 1 |
Notable work(s) | స్వీయ జీవిత చరిత్ర - "బీద బ్రతుకు" |
భార్య / భర్త | బసవమ్మ దేవి |
పిల్లలు | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు | యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ |
యలమంచిలి వెంకటప్పయ్య, (1898 - 1997) స్వాతంత్ర్య సమర యోధుడు.రచయిత, హింది బాషాప్రచారోద్యమ నాయకుడు హేతువాది.
బాల్యం, విద్య
[మార్చు]వెంకటప్పయ్య గారు కృష్ణ జిల్లా కనుమూరు గ్రామంలో యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద రైతు కుటుంబం. వీరికి ఐదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.[1]
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంథాలతో పాటు అమర కోశము కంఠస్థం చేసారు. 1914 లో కురుమద్దాళి లో వారాలు చేసుకొని ఇంగ్లీషు నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో కమ్మ విద్యార్థి వసతి గృహంలో ఉండి యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో గాంధీజీ విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోధకుడిగా మారాడు.
1925 లో మైనేనివారి పాలెంకు చెందిన బొబ్బా బసవయ్య గారి కుమార్తె బసవమ్మ దేవి గారిని వివాహం చేసుకున్నారు. 1929లో గుంటూరు జిల్లా బోర్డ్ అద్యక్షునిగా ఉన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు రేపల్లె హైస్కూలో హిందీ పండితునిగా నియమిస్తే చేరకుండా తెనాలిలో సొంత పాఠశాల నడిపారు. 1935 లో అలహాబాదు వెళ్ళి హిందీ విద్యాపీఠంలో సాహిత్య రత్న కోర్స్ చదివారు. హిందీ - తెలుగు వ్యాకరణం పై పలు పుస్తకాలు రాసారు.
స్వాతంత్ర పోరాటంలో
[మార్చు]బందరు కాల్వ గట్టుపై గడ్డి కొసే విషయంలో 1921లో ప్రభుత్వానికి వెతిరేకంగా రైతులను రెచ్చ గొట్టాడనే నేరంపై రాజమండ్రి జైల్లో ఆరు నెలలు ఉన్నారు.
కాకినాడలో 1923 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో పాల్గోని బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈయన్ని సమర్దించారు.
1930లో ఉప్పుసత్యాగ్రహంలో యెర్నేని సుబ్రహ్మణ్యం (సాధు) గారితో కలిసి పాల్గోని కన్ననూరు జైల్లో ఒక ఎడాది పాటు ఉన్నారు. వీరి భార్య యలమంచిలి బసవమ్మ గారు గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారితో కలసి పాల్గోన్నారు.
1932 లో విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధోద్యమంలో పాల్గోన్నందులకు పోలీసుల వేదింపులతో పాటు ఆరు మాసాలు రాజమండ్రి జైల్లో ఉన్నారు.
1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఉద్యమ సమయం లో12-9-1942 న తెనాలిలో కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో శాంతి యుతంగా మొదలైన అందోళన వారి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది. రణరంగ చౌక్ వద్ద జరిగిన పోలిసు కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. దీనిలో పాల్గోన్నందులకు వెంకటప్పయ్యను రెండు సంవత్సరాలు బళ్ళారి జైల్లో ఉంచారు. ఆసమయంలో పాయిఖానాలు శుభ్రముగా లేవని జైలర్ తో వాదులాడి,పొట్టి శ్రీరాములు. యెర్నేని సుబ్రహ్మణ్యం, గౌతు లచ్చన్న లతోకలసి వాటిని శుభ్రపరిచారు.
వీరి వద్ద సుప్రసిద్ద రచయిత, సినిమా నిర్మాత చక్రపాణి, ప్రముఖ కవి ఆలూరి బైరాగి, స్వాతంత్ర్య యోధురాలు కల్లూరి తులశమ్మ వంటి అనేక మంది హిందీ భాషను నేర్చుకొన్నారు.
హేతువాద ఉద్యమం లో
[మార్చు]వెంకటప్పయ్య గారు భావ విప్లవకారుడు. కవి రాజు త్రిపురనేని రామస్వామి గారితో కలసి మంత్రాలులేని వివాహాలు, కులాంతర వివాహాలు పట్టుబట్టి చేయించారు. అంటరానితనం, మూఢ విశ్వాసాలకు వేతిరేకంగా, మద్యపాన నిషేధానికి కృషి చేసారు. ప్రముఖ నాస్తిక వాదులైన గోరా, గుత్తా రామస్వామి వంటి వారితో కలసి పనిచేసారు.
రచనలు
[మార్చు]వెంకటప్పయ్య గారి రచనలలో ఎక్కువ హేతుబద్ద నాస్తిక భావజాలంతో నిండి ఉంటాయి. మతం పేరుతో జరిగే దోపిడిని, వేదాలలో దాగిన రహస్యాలను బట్టబయలు చేసారు. వారు 1985 లో తన స్వీయ జీవిత చరిత్రను 'బీద బ్రతుకు" అనే పేరుతో రాసారు. ఆనాటి గ్రామీణ సామాజిక, ఆర్థిక జీవన పరిస్థుతులను ఇది మనకు పరిచయం చేస్తుంది. వీరు 'గాందీ సామ్యవాద పుస్తకమాలా పేరుతో తెలుగులో 54 పుస్తకాలు రచించారు.[2]
- వేదాలంటే ఇవేనా? 1984
- పుష్కరాలు ఎవరి కోసం? 1980
- తులసీ రామాయణమంటె ఇదేనా? 1987
- పెళ్ళెందుకు 1977
- శ్రాద్ధకర్మ ఎవరి కొరకు? 1976
- మంగళసూత్రం పవిత్రమైందా? 1979
- మతాలు ఎవరికొరకు? 1992
- బీద బ్రతుకు - స్వీయ జీవితం -1985
- కులమేది?
- ఈ స్వరాజ్యంకోసమేనా జనం త్యాగాలు చేసింది?
- లగ్నాల పెళ్ళిళ్ళ బండారము
- మన నల్ల దొరల నలుబది నాలుగు ఏండ్ల పరిపాలన ఇదేనా?
- ఆడవాళ్ళను ఆదుకోరా?
- విగ్రహారాధన వేద విరుద్ధం కాదా?
- మొక్కల పెంపకం
- బీద ఓటర్లకు మేలుకొలుపు
- స్వతంత్ర భారత దేశంలో బీదల బ్రతుకులింతేనా?
- తిరుపతి వెంకన్న తిండి తినుట, రోగాలు పోగొట్టుట నిజమేనా?
- కన్యలు కరువైపొయ్యే కాలం కంపెట్తుకుని కూర్చున్నది
- దేశం ఏమైపోయేటేటట్టు
- మన దేశం బాగు పడేదెలా?
- నేడు మన దేశం ఎటు పయనైస్తున్నది? ఉన్నత శిఖరం పైపుకా? అవినీతి అగాధం వైపుకా?
- నేడు జగమంతా స్వార్థమయం
- సామాన్య జనం తెలుసుకోవలసిన చేదు నిజాలు
- పెద్దలేమన్నారు? ఐదు భాగాలు.
- వైధిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి
- వేమన ఏమన్నాడు
- హిందీ - తెలుగు-ఇంగ్లీషు వ్యాకరణం (4 భాగాలు)
చరమాంకం
[మార్చు]వెంకటప్పయ్య గారికి ఒక కుమారుడు మురళీధర్, కుమార్తె కాట్రగడ్డ విజయలక్ష్మీ ఉన్నారు. వెంకటప్పయ్య గారి భార్య బసవమ్మ గారు 1976 లో మరణించింది. రచనా వ్యాసంగంలో కాలంగడిపిన వెంకటప్పయ్య గారు తన 99వ యేట 1997 మార్చి 1వ తేదిన విజయవాడలో మరణించారు. వారి వీలునామాలో కోరినట్లు వెంకటప్పయ్య గారి భౌతికకాయాన్ని విజయవాడలో సిద్దార్ద వైద్య కళాసాలకు దానం చేసారు. నేత్రాలను దానం చేసి ఇద్దరికి కంటి చూపును ఇచ్చారు.