యాత్రాస్మృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాత్రాస్మృతి దాశరథి కృష్ణమాచార్య రాసిన ఆత్మకథాత్మక రచన. ఈ పుస్తకంలోని పలు వ్యాసాలు దాశరథి కృష్ణమాచార్యుల జీవితం, ఆసక్తులు, ఆలోచనలు ప్రతిబింబించడమే కాక ఆనాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులూ కనిపిస్తాయి.[1]

ఈ పుస్తకంలోని వ్యసాలలో దాశరథి ఆనాటి తెలంగాణ పరిస్థితులను, నిరంకుశ పరిపాలన కింద నలిగిపోయిన ప్రజల ఇక్కట్లను, రాక్షసమైన ఏలుబడిలో అణచి వేయబడిన ప్రజల భాషల దయనీయస్థితిని, సంస్కృతిని, ఆనాటి చెరసాలలోని పరిస్థితులను, సమాజాన్ని చక్కగా చిత్రించాడని 1988లో వెలువడిన తొలి ప్రచురణకి రాసిన ముందుమాటలో దేవులపల్లి రామానూజ్రావు రాసాడు.

నేపథ్యం[మార్చు]

పురాణం సుబ్రహ్మణ్య శర్మ ప్రేరణతో దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1980లలో దాదాపు 70 వారాలపాటు వ్యాసాలు రాసాడు. తరువాత ఆ వ్యాసాలను స్వయంగా ఆయన చేసిన మార్పులతో ఉన్న ప్రతిని అతని మరణానంతరం తొలిసారిగా ప్రచురించారు. ఈ యాత్రాస్మృతిని దాశరథిగారు ముందు స్వీయచరిత్రగా ఉద్దేశించి రాసినట్లు లేదు. మొదటి ప్రకరణాలలో స్వీయచరిత్రకన్నా సాహిత్య విషయాలు, పరిచితులైన సాహితీకారుల గురించి, సాహితీ ఉద్యమాల గురించి చెప్పిన కబుర్లే ఎక్కువ. పుస్తకంలో శీర్షికలలో రుబాయీలు, ఇక్బాల్ కవిత, గోలకొండ పత్రిక, ముషాయిరాలు, గాలిబ్ గజల్, చెళ్ళపిళ్ళ ఇలా ఉంటుంది వరుస. ఆలంపురంలో 1953 జనవరి11న జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏడవ మహాసభల గురించి చాలా ప్రకరణాలున్నాయి. ఆ సభలలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవుల గురించి విశేషాలున్నాయి.

పుస్తకం మధ్య భాగంలో దాశారథి జైలు అనుభవాల గురించి, ఆ సమయంలో తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న సంఘటనల గురించి ఉంది. ఆ కాలంలో తెలంగాణాలో ముఖ్యమైన వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఉద్యమాల గురించి తెలియజేసాడు.

తెలంగాణా విమోచనం తర్వాత విశాలాంధ్ర నిర్మాణం గురించి భిన్నాభిప్రాయాలు వినవచ్చాయి. దాశరథి అభిలాష మాత్రం మహాంధ్రనిర్మాణమే. “కోటితమ్ముల కడ రెండు కోట్ల తెలుగుటన్నలను గూర్చి వృత్తాంతమందజేసి మూడు కోటుల నొక్కటే ముడి బిగించి” మహాంధ్రసౌభాగ్యగీతి పాడిన దాశరథి  మహాంధ్రోదయం అన్న ఖండకావ్య సంపుటిని ప్రచురించారు. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఈ యాత్రాస్మృతి అంతమౌతుంది.[2]

మూలాలు[మార్చు]

  1. నెమలికన్ను, మురళి. "యాత్రాస్మృతి". nemalikannu.blogspot.in. Retrieved 25 May 2016.[permanent dead link]
  2. "పుస్తకం » Blog Archive » దాశరథి కృష్ణమాచార్య "యాత్రాస్మృతి" – తెలంగాణా విమోచన పోరాట స్మృతి, మహాంధ్రోదయ కృతి" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-29.