యానాం ప్రత్యేక ప్రతిపత్తి కారణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యానాం అనేది గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరి (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే, యానాం లకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి.

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలిపెయ్యలేదు?[మార్చు]

ఈ నాడు యానాం భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉండినప్పటికీ, పాలనా పరంగా అది పుదుచ్చేరితో అనుసంధానింపబడి ఉంది. యానాం, కారైకాల్, మాహే, పుదుచేరీలను కలిపి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచేరీగా వ్యవహరిస్తారు. ఇవి భిన్న రాష్ట్రాలలో ఉండి నప్పటికీ పరిపాలనా పరంగా పుదుచేరీని కేంద్రంగా చేసుకొని నియంత్రించబడుతూ ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతాలు ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఇవి ఒకప్పుడు ఫ్రెంఛ్ కాలనీలుగా ఉండటమే. వీటిలో ఒకటైన యానాంను పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేయకుండా ప్రత్యేకంగా ఎందుకుందో చూద్దాం.

ఈ రోజుకు కూడా యానాం ప్రత్యేకంగా ఉండటానికి ప్రధాన కారణం.[మార్చు]

ఫ్రెంచి వాళ్లు తమకాలనీలైన యానాం, పాండిచేరీ, మాహె, కారైకాలను వదిలి వెళ్లిపోయేటపుడు, భారత ప్రభుత్వంతో 1956 may 28 న విలీన ఒప్పందం (త్రేయ్తే దు సెసోఁ) ను చేసుకున్నారు. ఈ ఒప్పందములో రెండవ నిబంధన ఇలా చెపుతుంది.

The Establishments will keep the benefit of the special administrative status which was in force prior to 1 November, 1954. Any constitutional changes in this status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people. (సారాంశం: ఈ స్థావరాలన్నీ, 1 నవంబరు 1954 కు పూర్వము కలిగియుండినటువంటి ప్రత్యేక పరిపాలనావస్థితిని నిలుపుకుంటాయి. ప్రజల ఆకాంక్షలను ధృవపరుచుకొన్న తరువాతే ఈ రాజ్యాంగపరంగా ఈ అవస్థితి మార్చవలసి ఉంటుంది.)

1954 కు పూర్వం అంటే, అప్పుడు ఈ ప్రాంతాలు మిగిలిన స్వతంత్ర భారతావనిలో కలువకుండా ప్రత్యేకంగా ఫ్రెంచి వారిచే పరిపాలింపబడిఉన్నాయి. భారత స్వాతంత్ర్యానికి ముందు కూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే పరిగణింపబడ్డాయి.

పై వ్యాక్యాంశంలో ఆ ప్రత్యేకతను నిలబెట్టమనే కోరటం జరిగింది. అంటే ప్రత్యేక పరిపాలనావస్థితి కల్పించాలనేది ఫ్రెంచి వారి వెళ్లిపోయేముందు అడిగిన చివరికోరిక. దానికనుగుణంగా భారత ప్రభుత్వం 1963 జూలై 1 లో జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియను టెరిటరీ ఆఫ్ పాండిచేరీగా ఏర్పరిచింది. అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచటంద్వారా ప్రత్యేకావస్థితి కల్పించి ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చినమాటను భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇంతే కాక ఈ ఒప్పందంలో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతంలో అప్పటిదాకా ఉండిన ఫ్రెంచి సంస్కృతిని కాపాడమని, కోరింది కూడా. అప్పట్లో నెహ్రూ గారుకూడా ఈ ప్రాంతాలను Windows open to France అని అభివర్ణించాడు కూడా.

ఇంత చేసినా ఫ్రెంచ్ ప్రభుత్వం సంతృప్తి చెందక 1962 లో ఈ ప్రాంత ప్రజలకు భారత పౌరులుగా ఉంటారా లేక ఫ్రెంచ్ పౌరులుగా మారిపోతారా అని ఒక సౌహార్ధ్ర పూర్వక ఐచ్చికతను ఇచ్చింది. (రాత్రిపూట మూట ముల్లె సర్ధుకొని పోయిన బ్రిటిష్ ప్రభుత్వంతో పోల్చండి). అప్పటి దాకా ఫ్రెంచి సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా జీ్ర్ణించుకొన్న కొంతమంది ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకున్నారు. అప్పట్లో యానాం నుంచి పంతొమ్మిది కుటుంబాలు ఇలా ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందాయి. ఈ ఐచ్చికతగురించి ఎక్కువమందికి తెలియక పోవటంతో ఆ తరువాత కూడా కొద్దిమంది ప్రయత్నించుకొని ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందారు. 1987 లెక్కల ప్రకారం యానాంలోని ఫ్రెంచి పౌరుల సంఖ్య 91. వీరి సంతతిలో చాలా మంది ఫ్రాఁసులో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలోనే తమ మూలాలున్నాయన్న విషయాన్ని వీరేనాడు విస్మరించలేదు. వీరు ఉండేది ఫ్రాంసులోనైనా ఎక్కువమంది ఇక్కడి అమ్మాయిల/అబ్బాయిలనే పెళ్ళిల్లు చేసుకున్నారు. ఇలాగ ఫ్రెంచి పౌరసత్వాన్ని కలిగియున్న అమ్మాయిలను పెళ్ళి చేసుకోవటానికి పెద్ద పోటీ కూడాను.

యానాంలో ఉండిన వారిష్టులైన ఫ్రెంచి పౌరులకు ఫ్రెంచి ప్రభుత్వం నుండి నెల నెలా పించను (రెత్రేత్) అందుతుంది. ఇది భారత రూపాయిలలో మారేసరికి ముప్పై వేల రూపాయిల పైమాటే అవుతుంది. వృద్దాప్యంలో అదొక ముచ్చట.

ఇక పోతే ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చెయ్యాలని మొరార్జీ దేశాయ్ టైములో ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచేరీ, కారైకాల్ లను తమిళనాడులోను, మాహెను కేరళలోను కలిపేయటానికన్నమాట. దానిని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. మొరార్జీ దేశాయ్ కూడా 1956 నాటి ఒప్పందాన్ని చూసి నాలిక్కరుచుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటారు.

మరొక ప్రధాన కారణం ఆనాటి నాయకుల దార్శనికత.[మార్చు]

యానాం విమోచనోద్యమం సమయంలో, 1948 లోనే భారత-ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ప్రాంతప్రజలు రిఫరెండం ద్వారా వారు భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని తేల్చుకోవాలి. తదనుగుణంగా జూను పంతొమ్మిది, 1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీగా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయిపోయింది. పోలైన 12000 ఓట్లలో 7500 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్ అయ్యాయి. ఆ విధంగా ఆ ప్రాంతానికున్న ఫ్రెంచ్ కనెక్షను తుంచబడింది.

అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటంవల్ల చంద్రనాగురు ఈ నాడు ఈ అఖండ భారతావనిలో ఉండే వేన వేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది. ఇక మిగిలిన నాలుగు ప్రాంతాలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు. భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చేదాకా ఎదురుచూసింది. హైదరాబాద్ లాగా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు. అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె!

చంద్రనాగూర్లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్ట్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని, విదేశీ పాలనా చెరనుండి విడిపించి పొరుగు రాష్ట్రమైన బెంగాల్ లో విలీనంచేయటంలో కృతకృత్యులయ్యారు. కానీ అప్పటి యానాం నాయకులు పొరుగున ఉన్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక, పాండిచేరీ లోని నాయకుల నాయకత్వంలో నడిచారు. 1948 భారత్-ఫ్రెంచ్ ఒప్పందం ప్రకారం రిఫరెండం ప్రక్రియకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్ వలెనే యానాం కూడా, ఆంధ్ర ప్రదేశ్ లో ఏ విశిష్టతా లేని ఒక పంచాయతీగా మిగిలిపోయేది. కాకినాడ మునిసిపల్ కౌంసిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేసుకోవాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపు కలిగి పాండిచేరీతో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. పాండిచేరీతో తమ అనుబంధాన్ని త్రుంచుకోవాలని కలలో కూడా అనుకోలేదు. అపుడు మాత్రమే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును. పుదుచ్చేరీ నాయకులు ఈ నాటికీ కూడా యానాన్ని తమలో ఒక అంతర్భాగంగానే చూస్తున్నారు తప్ప వేరుగా చూడలేదు.ఢిల్లీకి ఇచ్చినట్టుగా పుదుచేరీకి కూడా స్టేట్ హుడ్ ఇస్తారని ఈ మధ్య వింటున్నాము. ఏమవుతాదో చూడాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • కాంప్రహెన్సివ్ హిస్టరీ ఆఫ్ యానాం, బి. రవీంద్రనాధ్.
  • ఫ్రెంఛ్ ఇండియా ఇన్ రిప్రీవ్ 1947-1954 వ్యాసం -రచయిత పాట్రిక్ పితోఫ్
  • గెజిటేర్ ఆఫ్ ఇండియా, యూనియన్ టెరిటరి ఆఫ్ పాండిచేరీ, వాల్యుమ్ 1
  • యానాం విమోచనోద్యమము పుస్తకం - రచయిత బొల్లోజు అహ్మదలీ బాబా