యానాం విమోచనోద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యానాం గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరి (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్దాలపాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో విమోచనం చెంది, స్వతంత్ర భారతావనిలో విలీనం చెందాయి.

భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రతి భారతీయునికి కొద్దో గొప్పో అవగాహన ఉంటుంది. కానీ 1947లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర భారతావనిలోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచివారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివినవారికి మాత్రమే తెలుస్తుంది. మరి, వారిని కూడా ఈ దేశం నుండి వెళ్లగొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి?, వాటిలో హీరోలెవ్వరు?, అసువులు బాసినదెవ్వరు? వంటి ప్రశ్నలకు వి.సుబ్బయ్య వ్రాసిన సాగా ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా, పాంచ్ రామలింగం ఆత్మకథ వంటి పుస్తకాలలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కానీ వీరంతా పాండిచేరికి చెందినవారు కావటంతో అందులోని విషయాలన్నీ పాండిచేరి స్వాతంత్ర్య పోరాటానికి చెందినవై ఉండటం, యానానికి సంబంధించిన అంశాల ప్రస్తావన తక్కువగా ఉండటమూ జరిగింది.

1954 జూన్ 13న జరిగిన యానాం విమోచన నేపథ్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ వ్యాసం.

ఘటన చారిత్రిక ప్రాముఖ్యత

[మార్చు]
యానాం కాలనీ - పాత కాలపు చిత్రం

సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం 1954 జూన్ 13న విమోచనం చెందింది. ఈ కాలంలోనే ఫ్రెంచి వారి వలసపాలన నుండి ఇండో-చైనా విమోచనం చెందటానికి ఘోరమైన యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ భారతదేశంలోని ఫ్రెంచి కాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత పద్ధతులద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు ఫ్రెంచి కాలనీలైన పాండిచేరి, మాహే, కారైకల్, యానాంలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే. ఎందుకంటే ఇలా జరగటంవల్ల యానాం ఓ క్రాంతదర్శిగా చరిత్ర కెక్కింది.

అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా యానాం విమోచనం భిన్నకోణాలలో ఈ విధంగా దర్శించబడ్డది.

  1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య శృంఖలాలనుండి విముక్తమై స్వతంత్ర భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమం.
  2. భారత ప్రభుత్వము యానాం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది.
  3. భారత ప్రభుత్వం తన దేశభక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది.
  4. యానాం నాయకులు ఆంధ్రాప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానాం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.

ఏ వాదన ఎలా సాగినా, యానాం ఫ్రెంచి పాలన నుండి విమోచనం చెంది, భారతావనిలో విలీనం చెందటం అనేది అప్పటికి ఒక చారిత్రక అవసరం. ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని నడిపించిన నాయకుల దేశభక్తిని శంకించలేము. వారు ఈ ఉద్యమాన్ని శాంతియుతంగాను, ప్రజాస్వామ్యయుతంగానూ నడిపించిన తీరు అనన్యమైనది. భారత్-ఫ్రెంచి కాలనీల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలచిన యానాం విమోచనమును జరిపించిన ఆనాటి నాయకుల దార్శనికత అత్యంత ఉన్నతమైనది.

విమోచనమంటే ఉన్నపళంగా బయటకు వచ్చేసి, మనల్ని మనం పునర్నింమిచుకోవటమే అని జేన్ ఫాండా అనే అమెరికన్ రచయిత్రి అంటుంది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ముడున్ ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమ పొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత, తరతరాలుగా జీర్ణించుకున్న "సంస్కృతి" పట్ల తమకున్న విధేయతనుంచి ఉన్నపళంగా బయటకు వచ్చేయడం కొంతమందికి అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమందికి తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మధ్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ఘర్షణ ఫలితమే యానాంలో జరిగిన విమోచనోద్యమము.

ఫ్రెంచి కాలనీల విమోచన నేపథ్యం

[మార్చు]

1947 లో బ్రిటిష్ వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టిపోవడంతో ఫ్రెంచికాలనీలలోని ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. అప్పటికి పాండిచేరి, కారైకాల్, మాహే, యానాం, చంద్రనాగూర్ అనే అయిదు ప్రాంతాలు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్నాయి. ఈ అయిదు ప్రాంతాలు భౌగోళికంగా దూరదూరంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండటంవలన వీటిని నియంత్రించటం ఫ్రెంచివారికి కష్టంగా ఉండేది. ఇవి భారతభూభాగంలో చాలా చిన్నచిన్న ప్రాంతాలు. అందుకే నెహ్రూ ఒక సందర్భంలో ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖంపై మొటిమలవలె ఉన్నాయి అని వ్యాఖ్యానించాడు.

1948 లో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ ఐదు కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ఐదు ఫ్రెంచి కాలనీల భవిత రిఫరెండం ద్వారా (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్ణయింపబడాలి. అంటే సామాన్య ఎన్నికలద్వారా ప్రజలందరూ వారు భారతదేశంలో విలీనం చెందాల ఒద్దా అనే విషయాన్ని తెలియజేయాలన్నమాట. (ఈ ప్రాంత ప్రజలందరూ భారతావనిలో కలసిపోవటానికి ఎగిరి గంతేస్తారని నెహ్రూ భావించాడు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆయన అంచనాలను తప్పని నిరూపించాయి. అందుచేతనే వీటి విలీనానికి 1954 వరకూ సమయం పట్టింది). ఈ ఒప్పందానికి అనుగుణంగా 1949 జూన్ 19 న అప్పటిదాక ఫ్రెంచి కాలనీగా ఉన్న చంద్రనాగూర్ ప్రజాభిప్రాయ సేకరణలో జనామోదంతో జరుపుకొని భారతావనిలో విలీనమయిపోయింది.

చంద్రనాగూర్లో జరిగినట్లు మిగతా కాలనీలలో జరగలేదు. ఈ కాలనీలలో తరువాత జరిగిన ఎన్నికలలో ఫ్రెంచిపాలన కొనసాగాలని కోరుకునే సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో రిఫరెండం ప్రక్రియ అటకెక్కింది. ఆతరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయభావాలు బలపడి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెచ్చుకొని ఫ్రెంచిపాలనను అంతమొందించటానికి 1954 వరకు నిరీక్షించవలసి వచ్చింది.

1954 లో పాండిచేరికి చెందిన గుబేర్, ముత్తుపిళ్లై, ముత్తుకుమరప్పరెడ్డియార్ల వంటి నాయకులు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ధిక్కరించి బయటకు వచ్చి, నెట్టుపాక్కం అనే ఊరిలో తాత్కాలిక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తరువాత ఫ్రెంచి ప్రభుత్వం దిగివచ్చి, 1-11-1954 నవంబరు 1న తన నాలుగు కాలనీలైన పాండిచేరి, మాహే, కారైకాల్, యానాంలను భారత ప్రభుత్వానికి వాస్తవికాంతరణ (డి-ఫాక్టో ట్రాన్స్‌ఫర్) చేసింది.

యానాం విమోచన నేపథ్యం

[మార్చు]

1948, 1951 లలో యానాంలో జరిగిన ఎన్నికలలో ఫ్రెంచిపాలనకు అనుకూలంగా ఉండే పార్టీల తరపున పోటీచేసినవారే విజయాలు సాధించటంతో ఇక్కడ ప్రజలలో విమోచన భావాలు విస్తృతంగా లేవని వ్యక్తమైంది. అంతేకాక అన్ని కాలనీలలోకెల్లా యానాం ఫ్రెంచివారికి పెట్టనికోట అని పెద్దపేరు తెచ్చుకుంది. 1951లో జరిగిన ఎన్నికలలో నెగ్గిన ప్రముఖ నాయకులు: మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకట రాజారావు, గిరి మాధవరావునాయుడు, నాటి చినవెంకన్న, కశిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సమతం కృష్ణయ్య, పంపన వీరాస్వామి, గుర్రపు వెంకటరత్నం, జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు. ఓడిపోయినవారిలో కామిశెట్టి పరశురాం, యర్రా లక్ష్మణరావులు ప్రముఖులు.

యానాంలో 1947 నుంచి 1953 వరకూ ఫ్రెంచి ఇండియా (ఏంద్ ప్రాఁసెజ్) పోరాట సంఘటనలు ఒకటి రెండు మినహా పెద్దగా ఏమీ జరుగలేదు. బహుశా అందుచేతనే ఫ్రెంచి వారు యానాంను తమనిష్టపడే ప్రాంతంగా అభివర్ణించుకొనేవారు.

యానాం విమోచనోద్యమానికి అంకురార్పణ

[మార్చు]

1954 మార్చి మూడున యానాంకు చెందిన జాతీయవాదులు, కామిశెట్టి పరశురాం అధ్యక్షతన ఒక విలీన కూటమిగా ఏర్పడ్డారు. యానాంలో స్థానిక ఫ్రెంచి అధికారులు కొంతమంది స్వార్ధపరులైన ఫ్రెంచి విధేయులతో చేతులు కలిపి, జాతీయ భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణచివేతకు గురిచేస్తున్నారని అప్పటి ఫ్రెంచి గవర్నర్ అయిన ఆఁద్రె మేనార్ కిచ్చిన టెలిగ్రాంలో వీరు ఆరోపించారు. ఈ ఉదంతంద్వారా యానాంలో ప్రజలకు ఫ్రెంచివారిపట్ల అసంతృప్తి ఉన్నట్లు అర్ధంచేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో 1954 ఏప్రిల్ 11 వ తేదీ రాత్రి పాండిచేరిలోని భారత కోఁసుల్ జనరల్ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో పాండిచేరీలోని జాతీయవాదులందరూ సమావేశమయ్యారు. ఫ్రెంచివారి నుండి ఫ్రెంచి కాలనీలు విముక్తమవ్వాలంటే ఈ కాలనీలలో దేన్నో ఒక దానిని సంపూర్ణంగా చేజిక్కించుకోవటమే సరైన మార్గం అని కేవల్ సింగ్ ఆ సమావేశంలో అనగా ఆ విధంగా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమావేశానికి యానానికి చెంది, పాండిచేరీ స్వాతంత్ర్యపోరాటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న దడాల రఫేల్ రమణయ్య కూడా హాజరయ్యారు. కేవల్ సింగ్ మాటలకు ఉత్తేజితుడైన దడాల, యానాంలోని ఫ్రెంచి స్థావరాన్ని కైవసం చేసుకొని యానాన్ని ఫ్రెంచిపాలన నుండి విముక్తం చేయటానికై పాండిచేరి నుండి బయలుదేరాడు. ఆ విధంగా యానాం విమోచనోద్యమానికి 1954 ఏప్రిల్ పదకొండున అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు.

యానాంలో ఉద్యమభావాలు రగల్చటం

[మార్చు]

1954, ఏప్రిల్ 6న ఫ్రెంచిపాలన కొనసాగాలని యానాం మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని యానాం ఎడ్మినిష్ఠ్రేటర్, పాండిచేరిలోని ఫ్రెంచి అధికారులు - యానాం ప్రజలందరూ ఫ్రెంచిపాలన కోరుకుంటున్నారనీ, వారంతా ఫ్రెంచివిధేయులనీ, ఇక్కడ జాతీయవాద ధోరణులు లేనే లేవనీ పెద్ద ప్రచారం చేసారు.

సరిగ్గా ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో దడాల యానాం వచ్చాడు. యానాం చుట్టూ ఉన్న తూర్పు గోదావరి జిల్లా నాయకులను కలిసికొని, కాకినాడ టౌన్ హాలులో సభ ఏర్పాటుచేసి, గంభీరమైన ఉపన్యాసమిచ్చి అక్కడి పెద్దలు, యువతలో ఉద్యమం పట్ల ఉత్సాహాన్ని కలిగించారు. ఇలా సంపాదించుకున్న కార్యకర్తలతో దడాల, లారీలపై యానాం వీధులలో తిరిగి, ఫ్రెంచి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారు.

యానాంలో ఫ్రెంచి వ్యతిరేక వాతావరణం వస్తూండడంతో, ప్రభుత్వం కలవరపడసాగింది. ఫ్రెంచివిధేయులు యానాంలో మీటింగులు పెట్టుకొని, ఫ్రెంచివారిపట్ల విధేయతను ప్రకటించటమూ, దడాల దిష్టిబొమ్మను తగులపెట్టటము జరిగేది. ఇటువంటి పరిస్థితులలో దడాల, యానాం వంతెన కివతలి ఆంధ్రాప్రాంతంలో ఒక టెంటు వేసి, తన అనుచరులతో ఉంటూ, లౌడ్ స్పీకర్ల సహాయంతో విలీనం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ఉండేవాడు.

అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను, గొడవలను ఈ ఉద్యమంలో పాల్గొన్న బొల్లోజు బసవలింగం, 1954, అక్టోబరు 30వ తేదీ మాతృసేవ అనే పత్రికలో విమోచనోద్యమ విశేషాలు అనే వ్యాసం ద్వారా వివరించాడు.

యానాం విమోచనోద్యమం

[మార్చు]

దడాల రాక యానాం లోని రాజకీయనాయకులలో విలీనం పట్ల సానుకూల ధోరణి ఏర్పడటానికి తోడ్పడింది. మొదట్లో దడాల ఆంధ్రా నాయకులైన భయంకరాచారి, డి.ఎస్.ఆర్. సోమయాజులు, కొంపెను సుబ్బారావు, కస్తూరి సుబ్బారావు వంటి వారితో కలసి తన పోరాటాన్ని సాగించారు. వీరి ఆధ్వర్యంలో సభలు, పికెటింగులు, రాలీలు, రాస్తారోకోలు వంటివి జరపటంవల్ల క్రమక్రమంగా యానాం ప్రజలలో కూడా ఉద్యమభావాలు కలగటం ఫ్రెంచివారి నుండి విమోచనం చెందాలన్న కోరిక ఉదయించటం జరిగింది.

ఈ సమయంలో జార్జి సాలా (అప్పటి యానాం పాలకుడు, ఫ్రెంచి దేశస్థుడు) ఫ్రెంచివారికి అనుకూలంగా ఉంటూ, ఫ్రెంచి పాలన కొనసాగాలని ఆశించే యానాం పౌరులను చేరదీసి వారి సహాయంతో విలీన వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నించాడు. వీరిలో ముఖ్యులు సమతం కృష్ణయ్య, బస్సా సుబ్బారావు, కాపగంటి బులిమంగరాజు, బళ్లా, మహమద్ జిక్రియా తదితరులు ముఖ్యులు.

ఇరవైతొమ్మిది, 1954 ఏప్రిల్ న యానాంకు చెందిన నాయకులు మద్దింశెట్టి, కామిశెట్టి, కోన, దవులూరి వెంకటరాజు తదితరులు తమ వేచిచూసే ధోరణిని విడనాడి, యానాం భారతావనిలో విలీనం చెందాలన్న అవసరమును గుర్తించి ఈ విధంగా తీర్మానం చేసుకున్నారు.

మా మాతృభూమి అయిన భారతావని పట్ల మేము సానుకూల ధోరణితో, దృఢంగా మమేకమైఉన్న కారణంగా, ఈ ప్రాంతపు (యానాం ) ఎన్నుకోబడిన నాయకులమైన మేము, భౌగోళికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా మాప్రాంతం భారతావనితో సారూప్యత కలిగిఉండటంచేత, ఈ ప్రాంతాన్ని రిఫరెండం లేకుండా భారతావనిలో తక్షణం విలీనం జరపాలని ఏకగ్రీవంగా కోరుచున్నాము. ఈ ప్రాంతాన్ని మా భారత మాతృభూమిలో కలుపుకోవటానికి అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని ఫ్రెంచిప్రభుత్వాన్నికోరుతున్నాము. సత్వరమే స్పందించి మాబలీయమైన ఆశలను నిజంచేసి, ఫ్రాంస్, ఇండియాల స్నేహాన్ని బలోపేతంచేయవలసినదిగా, ఫ్రెంచిప్రభుత్వ అధిపతి యొక్క విజ్ఞతకు, రాజనీతిజ్ఞతకు మేము విజ్ఞప్తి చేయుచున్నాము.

యానాంకు చెందిన ప్రముఖ పౌరులు యానాన్ని భారతావనిలో విలీనం చేయాలని కోరుతూ చేసుకున్న ఈ తీర్మానాన్ని అప్పటి భారత ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూకు, ఫ్రెంచిదేశ శాసనసభకి పంపించారు. దీని తదనంతరం జరిగిన అన్ని ఉద్యమ కార్యక్రమాలను వీరు దడాలతో కలసి సాగించారు. మద్దింశెట్టి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణం చూపి వారిని యానాం మేయర్ పదవినుంచి ఫ్రెంచ్ ప్రభుత్వం తొలగించింది.

20-5-1954 న భారతపతాకాలు ధరించి అయిదువందల మంది కార్యకర్తలు యానాం బ్రిడ్జి మీదుగా కదంతొక్కుతూ యానాంవైపు కదిలారు. వీరికి నాయకులు దడాల, మద్దింశెట్టి, కామిశెట్టి, కనకాల, యర్రా, కస్తూరి సుబ్బారావు, పి. భయంకరాచారి తదితరులు. ఈ సంఘటనతో ఉద్యమకారుల బలం పతాకస్థాయిలో ప్రదర్శితమైనది. ఈ పతాక ప్రదర్శనను విమోచన ఉద్యమకారులు చేసిన బలప్రదర్శనగా భావించిన ఉద్యమ వ్యతిరేకవాదులు ఉక్రోషంపట్టలేక ఉద్యమకారులపై దాడులను ముమ్మరం చేసారు.

ఆ దాడులలో ప్రధానంగా చెప్పుకోవలసినది మద్దింశెట్టి ఇల్లు దోపిడీ. 1954 మే 23న మద్దింశెట్టి ఇంటిపై విలీన వ్యతిరేకవాదులు, దాడిచేసి సుమారు 17 వేల రూపాయిల విలువచేసే నగలు, కొన్ని విలువైన పత్రాలు లూటీ చేసారు. వీరి తమ్ముడైన సత్తిరాజు ఇంటిపై కూడా దాడిచేసి 20 వేలరూపాయల నగలు, ఇతర వస్తువులు లూటీ చేసారు. దడాల ఇంటిపై కూడా దాడి చేసారు.

ఈ సంఘటనలకు అఘాయిత్యాలకు వెనుక సూత్రధారులు యానాం జడ్జి గిర్మేన్, ఫ్రెంచ్ పోలీసు అధికారి బొర్నెట్ అని ఆరోపిస్తూ అప్పటి ఫ్రెంచి సముద్రాంతరపు మంత్రికి యానాం నుంచి టెలిగ్రాములు వెళ్ళాయి.

ఈ సంఘటనలపట్ల విచారణ జరపటానికై ఫ్రెంచ్ సెక్రెతెర్ జెనెరాల్ ఎస్కర్గుయిల్ పర్యటించి, యానాంలో గూండాల దాడులు జరిగాయని అంగీకరించి, మద్దింశెట్టికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. యానాంలో ఉంటున్న ఫ్రెంచి దేశస్థులైన అధికారులకు రక్షణ ఉండదని భావించి, తనతో పాటు వారిని తీసుకుపోయారు.

యానాం విమోచనం

[మార్చు]
1954లో యానాంలో మొట్టమొదటి సారిగా భారత జాతీయ పతాకావిష్కరణ
యానాం విమోచన తరువాత స్వతంత్ర సేననుండి సైనిక వందనం స్వీకరిస్తున్న తాత్కాలిక ప్రభుత్వం అధినేత దడాల. అతని ప్రక్కన ఉన్నవారు మేయర్ మడించెట్టి, కామిచెట్టి.

యానాంలో దాడులు ప్రతిదాడులతో పరిస్థితులు జటిలమవుతూండడంతో జార్జి సాలా (యానాం అద్మినిస్త్రాతోర్) పాండిచేరీ వెళిపోయాడు. ఆ బాధ్యతలను యానాం జడ్జి, శివా స్వీకరించారు.

యానాన్ని ఫ్రెంచిపాలన నుండి విమోచనం కలిగించటానికి ఇదే సరైన సమయం అని ఉద్యమనాయకులు భావించారు. ఈ పోరాటనాయకుల రక్షణార్ధమూ, హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకూ\ అప్పటి కాకినాడ కలెక్టరు 200 సాయుధ బలగాలను రప్పించి వీరికి సహాయంగా ఉంచాడు.

అది ఆదివారం 1954 జూన్ 13, ఆరోజు ఉదయాన్నే మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దడాల, యర్రా సత్యన్నారాయణమూర్తి, కామిశెట్టి పరశురాం, కోన నరసయ్య కాకినాడకు చెందిన పి. భయంకరాచారి, ఓ వేయి మంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశించారు. ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతిబాంబులను వీరివైపు విసిరారు. విమోచన ఉద్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంగా వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరుగకుండా (ఈ సందర్భంలో) ఫ్రెంచ్ పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను కావించారు. వీళ్ల రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయశక్తులు తలోదిక్కుకు పోయి దాక్కున్నారు.

ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిష్ఠ్రేటర్ బంగళాను చేరుకుని అప్పటి అద్మినిస్త్రాతోర్-ఏఁషార్జేయ్ శివా నుండి అధికారాలను స్వాధీనపరచుకున్నారు. శివా పరిస్థితిని సమీక్షించి, ప్రతిఘటించినట్లైతే శాంతిభద్రతల సమస్య తలెత్తగలదని ఆలోచించి అధికారాలను బదలాయించాడు. ఆ రోజే శివా పాండిచేరీకి ఈ విధంగా టెలిగ్రాం ఇచ్చాడు:

ప్రజలు యానాం నిర్వహణను ఈనాడు ఉదయం 6 గంటలకు ప్రతిఘటన ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ప్రజల ఆధీనమై ఉన్నవి. ఎవరికీ ప్రాణహాని లేదు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రభుత్వోధ్యోగులకు యానాంలో ఉండి పనిచేయటమా లేక పాండిచేరీ వెళ్లిపోవటమా అనే చాయిస్ (ఎంపిక) ఈయబడినది.

ఫ్రెంచి పాలనలో యానాం నుండి పాండిచేరీకి పంపబడ్డ ఆఖరు అధికారిక సమాచారం ఈ టెలిగ్రామే.

ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు ఫ్రెంచి విధేయులైన కాపగంటి, బాజీ, ఉమార్‌ల ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేయటం జరిగింది. విలీన కార్యకర్తలు, సివిల్ దుస్తులలో ఉన్న కొంతమంది సాయుధ పోలీసులు యానాం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో యానాం ఇంచార్జ్ మేయర్, సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఫ్రెంచి విధేయుడూ అయిన సమతం కృష్ణయ్య (78 ఏండ్లు) వద్ద స్వీయరక్షణార్ధం ఉన్న పిస్తోలును చూసి, ఆయనే కాల్పులు జరపటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో ఆయనను కాల్చి చంపటం జరిగింది. యానాం విమోచనోద్యమంలో అసువులు బాసింది ఈయనొక్కడే.

ఉద్యమకారులు జాతిపిత గాంధీజీ, పండిట్ నెహ్రూల చిత్రపటాలను అలంకరించి పట్టణ వీధులలో ఊరేగింపు జరిపారు. ఆ తరువాత జరిగిన బహిరంగసభలో మద్దింశెట్టి మాట్లాడుతూ యానాం విమోచనమైనదనీ, భారతప్రభుత్వం దీని పాలన చేపట్టి, ఈ ప్రాంతమును రిఫరెండం లేకుండా భారతావనిలో విలీనం చేసుకోవాలని కోరాడు.

ఆరోజు మధ్యాహ్నం దడాల అడ్మినిష్ఠ్రేటరుగా బాధ్యతలు స్వీకరించాడు. మద్దింశెట్టి ప్రెసిడెంటుగా, కనకాల వైస్ ప్రెసిడెంటుగా, కామిశెట్టి, యర్రా సత్యన్నారాయణమూర్తి, కోనలు సభ్యులుగా పాలక మండలి ఏర్పరచి బాధ్యతలు చేపట్టారు. చిన్నాభిన్నమైన శాంతిభద్రతలను తిరిగి స్థాపించటంలో ఈ పాలక వర్గం ఎంతో కృషి చేసింది. అలా ఉద్యమకారులచే జరపబడిన యానాం విమోచనం గురించి ఆలిండియా రేడియో, పత్రికలు ప్రకటించాయి.

1954 జూన్ 27న యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచి పతాకాన్ని అవనతంచేసి భారత పతాకాన్ని ఎగురవేసారు. ఈ వేడుకలలో యానాం ప్రజలేకాక పరిసర ప్రాంతాలైన నీలపల్లి, జార్జిపేట, కాపులపాలెంలకు చెందిన ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆవిధంగా సుమారు 2 శతాబ్ధాల ఫ్రెంచిపాలనకు తెరపడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  • బొల్లోజు అహ్మదలీ బాబా రచన "యానాం విమోచనోద్యమము"
  • బొల్లోజు అహ్మదలీ బాబా బ్లాగ్ http://sahitheeyanam.blogspot.com/

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]