యాసర్ అరాఫత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాసర్ అరాఫత్
యాసర్ అరాఫత్


పలస్తీనా నేషనల్ అథారిటీకి తొలి అధ్యక్షుడు
ప్రధాన మంత్రి

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషనుకు 3 వ చైర్మను

వ్యక్తిగత వివరాలు

విశ్రాంతి స్థలం Arafat's compound, Ramallah, Palestine
జాతీయత పాలస్టీనియను
రాజకీయ పార్టీ ఫతా
జీవిత భాగస్వామి సుహా అరాఫత్ (1990–2004)
సంతానం 1
వృత్తి సివిల్ ఇంజనీరు
సంతకం యాసర్ అరాఫత్'s signature

మహమ్మద్ యాసర్ రెహమాన్ అల్ రవూఫ్ అరాఫత్ అల్-కుద్వా అల్ హుస్సేనీ (1929 ఆగస్టు 24[1][2]- 2004 నవంబరు 11) పాలస్తీనా రాజకీయ నాయకుడు. యాసర్ అరాఫత్ గా అతడు ప్రసిద్ధుడు. అతను 1969 నుండి 2004 వరకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్ఓ) చైర్మన్. 1994 నుండి 2004 వరకు పాలస్తీనా నేషనల్ అథారిటీ (పిఎన్ఎ) అధ్యక్షుడు. [3] సైద్ధాంతికంగా ఒక అతడొక అరబ్ జాతీయవాది. ఫతా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. 1959 నుండి 2004 వరకు అతడు ఆ పార్టీకి నాయకత్వం వహించాడు.

అరాఫత్ ఈజిప్టులోని కైరోలో పాలస్తీనా తల్లిదండ్రులకు జన్మించాడు. తన యవ్వనంలో ఎక్కువ భాగం అక్కడే గడిపాడు. కింగ్ ఫౌద్ I విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు అరబ్ జాతీయవాద, జియోనిస్ట్ వ్యతిరేక ఆలోచనలను స్వీకరించారు. 1948 లో ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడటానికి వ్యతిరేకంగా అతను 1948 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ముస్లిం బ్రదర్‌హుడ్‌తో కలిసి పోరాడాడు. కైరోకు తిరిగి వచ్చిన ఆయన 1952 నుండి 1956 వరకు జనరల్ యూనియన్ ఆఫ్ పాలస్తీనా విద్యార్థుల అధ్యక్షుడిగా పనిచేశారు. 1950 ల చివరి భాగంలో, అతను ఇజ్రాయెల్‌ను రద్దు చెయ్యాలనీ, దాని స్థానంలో పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పరచాలనీ కోరుతూ పారామిలటరీ సంస్థ అయిన ఫతాను స్థాపించాడు. ఫతా అనేక అరబ్ దేశాలలో పనిచేసింది. అక్కడ నుండి ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేసింది. 1960 ల చివరి భాగంలో అరాఫత్ స్థాయి పెరిగింది. 1967 లో అతను పిఎల్‌ఓలో చేరాడు. 1969 లో పాలస్తీనా నేషనల్ కౌన్సిల్ (పిఎన్‌సి) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. జోర్డాన్‌లో పెరుగుతున్న ఫతా ఉనికి ఫలితంగా అక్కడి కింగ్ హుస్సేన్ ప్రభుత్వంతో సైనిక ఘర్షణలు జరిగాయి. 1970 ల ప్రారంభంలో దాన్ని లెబనాన్‌కు మార్చారు. అక్కడ, జరుగుతున్న లెబనీస్ అంతర్యుద్ధంలో ఫతాహ్, లెబనీస్ నేషనల్ మూవ్‌మెంట్‌కు సహాయం చేసింది. ఇజ్రాయెల్‌పై దాడులను కొనసాగించింది. ఫలితంగా 1978, 1982 ల నాటి ఇజ్రాయెల్ దాడులకు ఇది ప్రధాన లక్ష్యంగా మారింది.

1983 నుండి 1993 వరకు, అరాఫత్ ట్యునీషియాలో స్థిరపడ్డాడు. ఇజ్రాయెలీలతో బహిరంగ ఘర్షణ అనే విధానం నుండి చర్చల వైపుగా అతడి ధోరణి మారడం మొదలైంది. 1988 లో ఇజ్రాయెల్‌కు ఉనికిలో ఉండే హక్కును అంగీకరించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి పరిష్కారంగా రెండు-దేశాలు ఉనికిలో ఉండాలని కోరాడు. 1994 లో అతను పాలస్తీనాకు తిరిగి వచ్చి, గాజా నగరంలో స్థిరపడ్డాడు. పాలస్తీనా భూభాగాలకు స్వపరిపాలనను ప్రోత్సహించాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, పిఎల్‌ఓకూ మధ్య ఉన్న సంఘర్షణను అంతం చేయడానికి వరుసగా చర్చలు జరిపాడు. వీటిలో 1991 మాడ్రిడ్ కాన్ఫరెన్స్, 1993 ఓస్లో ఒప్పందం, 2000 క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సమావేశం ఉన్నాయి. 1994 లో ఓస్లోలో జరిగిన చర్చలకు గాను అరాఫత్, యిట్జాక్ రబీన్, షిమోన్ పెరెస్‌లతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఆ సమయంలో, హమాస్ తదితర మిలిటెంట్ ప్రత్యర్థుల పెరుగుదలతో పాలస్తీనియన్లలో ఫతాకు మద్దతు తగ్గింది. ఇజ్రాయెల్ సైన్యం అతడి రమాల్లా కాంపౌండ్‌లో రెండేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన తరువాత, 2004 చివరలో, అరాఫత్ కోమాలోకి వెళ్ళి మరణించాడు. అరాఫత్ మరణానికి అనేక ఊహాగానాలకు కారణమైనప్పటికీ, రష్యన్, ఫ్రెంచ్ బృందాల దర్యాప్తులో ఎటువంటి కుట్ర జరగ లేదని తేలింది. [4] [5] [6]

అరాఫత్ వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు. తన ప్రజల జాతీయ ఆకాంక్షలకు ప్రతీక అయిన వీరోచిత స్వాతంత్ర్య సమరయోధుడుగా, అమరవీరుడిగా పాలస్తీనా ప్రజలలో ఎక్కువమంది ఆయనను చూస్తారు. దీనికి విరుద్ధంగా, ఇజ్రాయిలీలు [7] [8] అతన్ని పశ్చాత్తాపమన్నదే లేని ఉగ్రవాదిగా భావించారు. [9] [10] అయితే ఇస్లాం వాదులు, అనేక మంది పిఎల్‌ఓ వామపక్షవాదులతో సహా పాలస్తీనా ప్రత్యర్థులు అతన్ని అవినీతిపరుడిగానో, ఇజ్రాయిల్‌కు మరీ విధేయతతో ఉన్నాడనో విమర్శించారు.

మూలాలు[మార్చు]

  1. Arafat, a Political Biography, Alan Hart, page 67
  2. Encyclopedia of the Modern Middle East & North Africa: A-C, Philip Mattar, page 269, quote: Arafat and his family have always insisted that he was born 4 August 1929. in his mother's family home in Jerusalem. Nevertheless, an Egyptian birth registration exists, suggesting that he was born in Egypt on 24 August 1929– His father had ...
  3. Some sources use the term Chairman, rather than President; the Arabic word for both titles is the same. See President of the Palestinian National Authority for further information.
  4. "Yasser Arafat: French rule out foul play in former Palestinian leader's death". The Guardian. 16 March 2015.
  5. "France drops investigation into Arafat's death". Jerusalem Post. 2 September 2015.
  6. "Yasser Arafat investigation: Russian probe finds death not caused by radiation". CBS News. 26 December 2013.
  7. Major Richard D. Creed Jr., Eighteen Years In Lebanon And Two Intifadas: The Israeli Defense Force And The U.S. Army Operational Environment, Pickle Partners Publishing, 2014 p.53.
  8. As'ad Ghanem Palestinian Politics after Arafat: A Failed National Movement:Palestinian Politics after Arafat, Indiana University Press, 2010 p.259.
  9. Kershner, Isabel (4 July 2012). "Palestinians May Exhume Arafat After Report of Poisoning". The New York Times. Retrieved 5 August 2012.
  10. Hockstader, Lee (11 November 2004). "A Dreamer Who Forced His Cause Onto World Stage". The Washington Post. Retrieved 31 October 2007.