యుద్ధసంచిక
![]() | |
తరచుదనం | వారపత్రిక |
---|---|
రూపం | టాబ్లాయిడ్ |
ముద్రణకర్త | వార్ పబ్లిసిటీ డైరెక్టర్, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం |
మొదటి సంచిక | మార్చి 22, 1941 |
ఆఖరి సంచిక | 1945 |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | మద్రాసు |
భాష | తెలుగు |
యుద్ధసంచిక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు నుంచి తెలుగులో వెలువరించిన యుద్ధ సమాచార వారపత్రిక. ఈ వార్తా పత్రిక తొలి సంచిక 1941, మార్చి 22వ తేదీన వెలువడింది.[1] ఈ పత్రిక ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రింపబడి వార్ పబ్లిసిటీ డైరెక్టర్‌చే ప్రచురితమయ్యింది.
విషయము
[మార్చు]ఈ పత్రికలో యుద్ధానికి సంబంధించిన వార్తలు ప్రచురింపబడ్డాయి. "జపాను వారి నెదుర్కొనుటకై దేశీయ యుద్ధరంగమును సిద్ధము చేయుడు" అనే నినాదం దాదాపు ప్రతి సంచికలో కనిపించింది. ప్రతి సంచికలో మొదటి పేజీలలో "ఈ వారంలో యుద్ధవార్తలు" క్రింద సంక్షిప్త వార్తలు, తరువాతి పేజీలలో విపులమైన వార్తలు, వ్యాఖ్యలు ప్రచురించేవారు. యుద్ధానికి చెందిన ఛాయాచిత్రాలు, మ్యాపులు తరచూ ప్రచురించేవారు.
ఈ పత్రికలో వచ్చిన వార్తా శీర్షికలు కొన్ని:
- ఆఫ్రికా యుద్ధము - బ్రిటీషు వారి విజయగాథ
- స్పెయిను దేశ పరిస్థితులు జర్మను పక్షం చేరుతుందా, చేరదా?
- భారతీయ సైనికుల అద్భుతమైన చర్యలు
- జపాను రాజ్యకాంక్ష
- 9 నెలలలో కోటి రూపాయల యుద్ధ నిధి
- ఈ యుద్ధం క్రైస్తవ మతం కోసమే కాదు
- మధ్యధరా యుద్ధంలో యుక్తి
- కష్టాలు, ధైర్యసాహసాలను ఎక్కువ చేసేయి - లండనులో ఒక స్త్రీ అనుభవాలు
- అమెరికా యుద్ధంలో చేర సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు రూజువెల్టు గారి ప్రకటన
- యుద్ధానంతరం యేర్చాటులు: అమెరికా సూచనలు
- యుద్ధంలో లాభనష్టాలు
- డామస్కసు ముట్టడిలో భారతీయ సైనికుల ప్రతిభ
- మధ్య ప్రాచ్యము నందలి రక్షణ యేర్పాటులు
- భారత సంస్థానముల యుద్ధ సహాయము
- జర్మనీ ఆక్రమించిన దేశాల దౌర్భాగ్యం
- రూజువెల్టు - చర్చిలు సమావేశము
- టర్కీ బల్గేరియాలందు నాజీ కుట్రలు
- "ప్రపంచంలో కల్లా గొప్ప యోధులు" సిరియాలో సిక్కు సైనికుల చర్యలు
- హిట్లరు సాహసం - మసులోనీ ఉబ్బసం
భాష
[మార్చు]ఈ పత్రికలో వాడిన భాష చక్కగా ఉండి సామెతలు, జాతీయాలు, నుడికారాలతో సామాన్య ప్రజలకు అర్థం అయ్యే విధంగా ఉంది. “ విభీషణ శరణాగతి”, "భగీరథ ప్రయత్నం", "శల్య పరీక్ష", "ధ్వజమెత్తి" "భగవత్కటాక్ష బలము", "కీలుబొమ్మ ప్రభుత్వము" "పులుసులో ముక్కలవలె", "కంకణము కట్టుకొను", "రామ రావణ యుద్ధం", "వజ్రపు తునక" "హుష్ మహాకాళీ" వంటి పదప్రయోగాలు ఈ పత్రికలో కనిపిస్తాయి.
"ఏ పని చేసినా పూర్తిగ చేయాలి లేకుంటే నాశనం కావాలి", "బలం కలవాడిదే రాజ్యం", "ఎవడురా నా కెదురాడి పోరాడు వాడీయేడు జగంబులందు? నా శౌర్య వీర్య ప్రతాప ప్రభావంబుచే ముల్లోకంబులు అల్లకల్లోలమై తల్లడిల్ల గలవు!", "ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ", "బ్రహ్మచారీ శత మర్కటః", "గోడ దూకితే అదే సందు" లాంటి వాక్యాలు, సూక్తులు సందర్భానుసారంగా ఉపయోగించారు.
యుద్ధవార్తలైనా పాఠకులను ఆకట్టుకునే విధంగా ఈ పత్రిక ఎలా చెప్పిందో ఈ క్రింది ఉదాహరణలో చూడవచ్చు.
సామాన్యంగా అప్పులవానితోను చెప్పులవానితోను కలిసి తిరుగకూడదంటారు. ఆ మాటలో అనుభవసిద్ధమైన అర్థం కొంత లేకపోలేదు. అప్పు ఇచ్చినవానికి అప్పు పుచ్చుకొన్నటువంటివాడు లోకసహజంగా లోకువగా కన్పిస్తాడు. అప్పు పుచ్చుకొన్నటువంటి వానిని తన చేతిక్రింది తాబేదారుగానో, తన క్రింద పనిచేసే నవుకరుగానో భావిస్తూవుంటాడు. ఏదో ఒక పని ఒప్పజెప్పి చేయించుకొంటూ వుంటాడు. అప్పులవానితో కలిసి ప్రయాణంచేస్తే వానికి లొంగి వంగి సలాములుచేస్తూ వానికి సమస్తోపచారాలు చేస్తూవుండాలి. ఆవిధంగా వినయవిధేయతలతో పని చెయ్యకపోతే, తన బాకీ తనకు యిచ్చివేయవలసినదని ఒత్తిడిచేస్తాడు. కనుక, అటువంటి వానిని వెంటబెట్టుకొని తిరిగితే, చాలా అవస్థలు పడవలసివస్తుంది. హరిశ్చంద్ర మహారాజు అంతవాడు నక్షత్రకుని వెంటబెట్టుకొని తిరిగితే, ఆ మహారాజును నక్షత్రకుడు నానా అవస్థలు పెట్టాడు. చెప్పులు తొడుగుకొని నడచేటువంటివానితో కలిసి చెప్పులులేనివాడు కలిసి తిరగడం చాలా అవస్థగానే వుంటుంది. చెప్పులున్నవాడు రాళ్లు రప్పలు వున్నాసరే, లక్ష్యంచెయ్యకుండా ముళ్ల కంపలు పల్లేరుకాయలు వున్నాసరే, త్రొక్కుకొని నడచిపోతూ వుంటాడు. అటువంటివాని వెంట చెప్పులులేనివాడు అడ్డదోవలలో పడి నడవలేడు. సమ ఉజ్జీగా వుంటేనే సమానంగా నడక సాగుతుంది. దీనినిబట్టి బాగా ఆలోచిస్తే, ఏదైనా ఒక పెద్ద విషయం తలపెట్టినప్పుడు, ఇంకొకనితో జోడుకలిసి పనిచేయవలసినప్పుడు, ఇద్దరి తత్వం సమానంగా కలిస్తే ఆ జాయింటు వ్యవహారం సాగుతుంది. నెయ్యానికి, కయ్యానికి, వియ్యానికి సమాన హోదా, సమాన సంప్రదాయ సంస్కార వికాసం వుండాలి. సంస్కారంగాని, సరసత్వంగాని లేకుండా కేవలం మొండి సాహసం గల రౌడీతో కష్టసుఖాలు తెలిసిన సరసుడైన ఒక గృహస్థుగాని పెద్దమనిషిగాని సంస్కారిగాని ఒక పెద్ద వ్యవహారంలో జోడుగా కలిసి పనిచేస్తే, పరువు ప్రతిష్ఠలు లేనివాని సంపర్కంవల్ల అడ్డమైన గడ్డీ తినవలసివస్తుంది.
హిట్లర్, ముస్సోలినీల కలయిక గురించి తెలియజెప్పిన వ్యాసంలోనిది పై ఉపోద్ఘాతం.[2]
ఈ పత్రిక సంపాదకుని పేరు ప్రచురించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Yudha Sanchika 1941 03 22 Volume No 01 Issue No 01". archive.org. Retrieved 21 February 2025.
- ↑ సంపాదకుడు (11 December 1942). "హిట్లరు సాహసం - మసులోనీ ఉబ్బసం". యుద్ధ సంచిక. No. సంపుటి 2 సంచిక 49. వార్ పబ్లిసిటీ డైరెక్టర్, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. Retrieved 21 February 2025.