యులేలియా విరిడిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యులేలియా విరిడిస్
Scientific classification
Kingdom:
Phylum:
Class:
పాలికీటా
Order:
ఫైలోడోకిడా
Family:
ఫైలోడోకిడే
Genus:
యులేలియా
Species:
E. viridis
Binomial name
Eulalia viridis
Synonyms[2]
  • Eulalia (Eumida) microceros Claparède, 1868
  • Eulalia annulata Verrill, 1873
  • Eulalia brevisetis Saint-Joseph, 1899
  • Eulalia virens Ehlers, 1864
  • Eumidia vivida Verrill, 1873
  • Nereis viridis Linnaeus, 1767 (original)
  • Phyllodoce gervillei Audouin & Milne Edwards, 1833

యులేలియా విరిడిస్ (Eulalia Viridis) అనేది సముద్రపు నీటిలో నివసించే ఒక పురుగు (marine worm). సుమారు 5 నుంచి 15 సెంటీ మీటర్ల పొడవుతో సన్నగా వుండే ఈ పురుగు ఆకుపచ్చని రంగులో వుంటుంది. దీనిని గ్రీన్ లీఫ్ వార్మ్ (Green Leaf Worm) అని కూడా వ్యవహరిస్తారు. సాదారణంగా ఇది ఈశాన్య అట్లాంటిక్ మహా సముద్ర జలాలలోని రాళ్ళ పగుళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది క్రియాశీలకమైన ప్రిడేటర్ కాదు. చనిపోయిన నత్తలు, పీతలు, పాలికీటా పురుగులు మొదలగు జంతువుల నుండి మృత కణజాలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని జీవిస్తుంది. దేహం అనేక ఖండాల సమూహంగా ఉంటుంది. అనెలిడా (annelid) వర్గంలోని పాలికీటా (Polychaeta) తరగతికి చెందిన ఈ సముద్ర పురుగు శాస్త్రీయనామం యులేలియా విరిడిస్ (Eulalia Viridis)

ఆవాసం-వ్యాప్తి

[మార్చు]

ఈ సముద్ర పురుగులు సముద్ర జలాలలోని రాళ్ళ పగుళ్లలోనూ, సముద్రపు పాచి పేరుకున్న ప్రాంతాలలోను (Kelp Holdfasts), క్రస్తేషియన్ గుల్లలు వున్న ప్రాంతాలలోను ఎక్కువగా కనిపిస్తాయి. గులక రాళ్ల తీరాలలో, షెల్ గ్రావెల్ ప్రాంతాలలో కూడా ఇవి కనిపిస్తాయి. [3]

ఈశాన్య అట్లాంటిక్ మహా సముద్ర జలాలు వీటికి ప్రధాన ఆవాస ప్రాంతం. ముఖ్యంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, ఫారో దీవులు, డిస్కో దీవులకు చెందిన అట్లాంటిక్ సముద్ర జలాలలో ఇవి ఎక్కువగా వ్యాపించి వున్నాయి. గతంలో ఈశాన్య అట్లాంటిక్ జలాల విస్తృత పరిధిలో (యు.కె తీర జలాలతో కలిపి) ఈ పురుగులు ఎక్కువగా ఉన్నాయని భావించారు. అయితే భూ స్వరూపశాస్త్ర, బయోకెమికల్ అధ్యయనాల వల్ల యు.కె యొక్క దక్షిణ తీర జలాలలో కనిపించే జాతిని ఒక ప్రత్యేక జాతిగా యులేలియా క్లావిజెరా (Eulalia clavigera) గుర్తించడం జరిగింది. [4]

ఇతర ఆవాస ప్రాంతాలు: ఈశాన్య యూ.ఎస్.ఏ తీరజలాలలోను, తెల్ల సముద్రం (White sea), మధ్యధరా సముద్ర జలాలలో ఈ పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందివున్నాయి.

లక్షణాలు

[మార్చు]
యులేలియా విరిడిస్

అనెలిడా వర్గంలోని పాలికీటా తరగతికి చెందిన ఈ సముద్ర పురుగులు ఫైలోడోకిడే (Phyllodocidae) కుటుంబంలోని యులేలియా (Eulalia) ప్రజాతికి చెందినవి. 1767 లో లిన్నేయస్ ఈ పురుగులను తొలిసారిగా శాస్త్రీయంగా వర్ణించాడు. ఇవి సగటున 2.5 సెంటీ మీటర్ల వెడల్పుతో వుంటాయి. 15 సెంటీ మీటర్ల వరకు పెరుగుతాయి. శరీరం లేత ఆకుపచ్చ, ప్రకాశవంతమైన ముదురు ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. సన్నగా, బల్లపరుపుగా (flat) వున్న దీని దేహంలోని ఖండిత విభాగాలు 200 వరకు వుంటాయి. [5] దీని తల నిర్దిష్టంగా ఉంటుంది. తలలో రెండు పెద్ద కళ్ళు, ఐదు యాంటెన్నాలు, 4 జతల ఉపాంగాలు (cirris) లు వుంటాయి.

దీని ముఖ పూర్వభాగం (Prostomium) లో గల ఐదు యాంటెన్నాలలో కళ్ళ ముందున్న యాంటెన్నా కాస్త పెద్దది కాగా దాని కిరువైపులా పక్క భాగాలలో గల 2 జతల యాంటెన్నాలు కొంచెం చిన్నవిగా ఉంటాయి. [5] ఈ ముఖ వెనుక భాగంలో టెంటకిల్స్ వలె వుండే 4 జతల ఉపాంగాలు (cirris) వుంటాయి. ఈ ఉపాంగాలు దీని దేహంలోని ఆరవ ఖండిత భాగానికి చేరేంత పొడుగుంటాయి.[5]

ఈ పురుగు తలలో పొడవైన ఒక స్థూపాకారపు తొండం (Proboscis) వుంటుంది. ఈ తొండానికి సులభంగా తల నుంచి బయటకు, బయట నుంచి తల లోపలకు రాగల సామర్ధ్యం వుంది. ఒక సూక్ష్మ అంకురంలో (papillae) ఈ స్థూపాకారపు తొండం అమరి వుండటం వల్ల, ఈ పురుగు అవసరమైనప్పుడు తన తొండాన్ని శరీరం లోపల నుంచి బయటకు పంపగలదు. అదేవిధంగా తొండాన్ని బయట నుంచి లోపలకు లాక్కొనగలదు. ఈ తొండం ఆహారసేకరణకు, కణజాలంలోని రసాలను పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆహారం

[మార్చు]

ఈ కుటుంబానికి చెందిన అనేక పురుగులు ప్రిడేటర్స్ గా ఆహారం కోసం వేటాడి జీవిస్తున్నప్పటికీ, ఈ యులేలియా విరిడిస్ పురుగులు మాత్రం ఆహారం విషయంలో మరింత ప్రత్యేకతను కనపరుస్తాయి. ఇవి క్రియాశీలకమైన ప్రిడేటర్స్ కావు. కేవలం చనిపోయిన జంతువుల యొక్క మృత కణజాలాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. ముఖ్యంగా మొలస్కా, పీతలు, ఇతర పాలికీటా పురుగులు లాంటి చనిపోయిన జంతువుల మాంసాన్ని స్వీకరిస్తూ ఈ సముద్ర పురుగులు పరిశుభ్రకారులుగా (scavengers) కూడా వుంటాయి .

ప్రత్యుత్పత్తి

[మార్చు]
యులేలియా విరిడిస్ పురుగు యొక్క గుడ్డు
యులేలియా విరిడిస్ పురుగు యొక్క గుడ్డు

ఇవి ఏకలింగ జీవులు. ఆడ మగ పురుగులు వేర్వేరుగా ఉంటాయి. ఇవి కనీసం రెండు సంవత్సరాల వయస్సు దాటిన తరువాతనే సంతానోత్పత్తి చేస్తాయి. అయితే ఇతర సంబంధిత జాతుల వలె ఇవి తమ సంతానోత్పత్తిని పెద్ద సంఖ్యలో గుంపులుగా చేయాలని భావించవు.[6] సంతానోత్పత్తి కాలం జులై, ఆగస్టు నెలలు. ఫలదీకరణం సముద్ర జలంలోనే జరుగుతుంది. ఈ పురుగులు తమ ఆకుపచ్చని గుడ్డు పదార్ధాలను (egg masses) జిగురుతో సముద్ర కలుపు మొక్కలు, బ్రౌన్ ఆల్గే వంటి వాటికి అతికిస్తాయి. తొమ్మిది వారాల వ్యవధిలో ఆ గుడ్లు, నాలుగు లార్వాదశలను దాటి చివరకు ఐదు నుంచి తొమ్మిది ఖండిత భాగాలు గల లార్వా గా రూపాంతరం చెంది సముద్ర భూతలంపై చేరుకొంటాయి.[6]

రిఫరెన్సులు

[మార్చు]
  • John D. Fish, Susan Fish: A Student's Guide to the Seashore. Cambridge University Press, Cambridge 2011. 540 Seiten. Eulalia viridis (Linnaeus), S. 167.
  • Hayward, P. J. & Ryland, J. S. (1995). Handbook of the Marine Fauna of North-West Europe. Oxford University Press. New York

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Linnaeus (1767). Systema naturae. Vol. 1(2) (12th ed.). Holmiae: Laurentii Salvii. p. 1086.
  2. 2.0 2.1 Geoffrey Read, Kristian Fauchald & Gérard Bellan (2012). G. Read & K. Fauchald (ed.). "Eulalia viridis (Linnaeus, 1767)". World Polychaeta database. World Register of Marine Species. Retrieved 25 July 2017.
  3. de Kluijver, M.J. "Eulalia viridis". Macrobenthos of the North Sea – Polychaeta. Marine Species Identification Portal. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 23 July 2017.
  4. Fish, J.D.; Fish, S. (2011). A Student's Guide to the Seashore. Cambridge University Press. p. 167. ISBN 978-1-139-49451-9.
  5. 5.0 5.1 5.2 "The Marine Life Information Network". The Marine Life Information Network. The Marine Biological Association of the UK. Retrieved 17 February 2019.
  6. 6.0 6.1 Australian Biological Resources Study (2000). Polychaetes & Allies: The Southern Synthesis. Csiro Publishing. pp. 145–147. ISBN 978-0-643-06571-0.