రతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రతీదేవి
ప్రేమ దేవత
దేవనాగరిरति
సంస్కృత అనువాదంరతి
అనుబంధందేవి
ఆయుధములుఖడ్గం
భర్త / భార్యమన్మధుడు (కామదేవుడు)
వాహనంచిలుక

రతీదేవి(సంస్కృతం: रति, Rati) హిందువుల ప్రేమదేవత [1][2][3][4].సాధారణంగా ఆమె ప్రజాపతి, దక్షుడు ల పుత్రికగా చెబుతారు.

రతీ మన్మధ పరిణయం[మార్చు]

Rati on a composite horse.

మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్య వతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి.

మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలనుకున్నాడు మన్మధుడు. వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య. మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూలబాణాలను ప్రయోగించాడు. అందరి మనస్సులూ అల్లకల్లోలం అయ్యాయి. ఎంతో కఠోరమైన ఇంద్రియ నిగ్రహశక్తి కలిగిన వారంతా తమకలా కామ వికారం కలగటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడ శంభుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మథుడని తెలుసుకొని కోపాన్ని వహించాడు. శివుడు కోపాన్ని తట్టుకోలేక మన్మధుడు పక్కకు తొలిగాడు. ఇంతలో బ్రహ్మ కూడా వాస్తవస్థితి కొచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మథుడు శివుడి మూడో కంటి అగ్ని జ్వాలలకు అంతమవుతాడని శపించాడు.ఆ తర్వాత శివుడు, బ్రహ్మలాంటి వారంతా ఎవరి పనులలో వారు నిమగ్నమయ్యారు. శహవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడని పూర్తిగా గ్రహించిన మన్మథుడు మెల్లగా బ్రహ్మ దగ్గరకొచ్చి ‘నీవిచ్చిన వరాన్ని నేను పరీక్షించాను.. అంతే కానీ నా వైపు నుంచి మరేతప్పు జరగలేదు. ముక్కంటి కోపాగ్నికి నేను దగ్ధమయ్యేలా నీవు శపించటం సమంజసమా?' అని మన్మథుడు బ్రహ్మను వేడుకొన్నాడు. బ్రహ్మ మన్మథుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతో ఇలా జరిగింది. భవిష్యత్తులో శివుడి మూడోకంటి అగ్ని జ్వాలల్లో నీవు దగ్ధం కావటానికి లోకకల్యాణ కారకమైన కుమార జననం అనే ఓ దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుడి కోపాగ్నికి నీవు దగ్ధమైనా ఆ తర్వాత మళ్ళీ నీకు మేలే జరుగుతుంది అని బ్రహ్మదేవుడు మన్మథుడిని అనునయించాడు. అలా జరిగిన మరికొన్నాళ్ళకు దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకొచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడమని కోరాడు. ఆమె పేరు రతీదేవి అని, సర్వలోక సౌందర్యవతి అని చెప్పి రతికి, మన్మథుడికి దక్షప్రజాపతి వివాహం చేశాడు. మన్మథుడు రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి అనురాగం నిండిన మనస్సు కలవాడయ్యాడు. ఆ క్షణంలో మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. మదనుడు సహితం మోహానికి గురయ్యాడు.

బంగారు వన్నె శరీరంతో, లేడికళ్ళ వంటి కళ్ళతో ఓరచూపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. కందర్పుడు ఆ మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమలను చూసి ఇదేమిటి బ్రహ్మదేవుడు నా ధనుస్సును లాక్కొని ఈమె కనుబొమల స్థానాల్లో ఉంచాడా అని అనుకొన్నాడు. వేగవంతమైన ఆమె చూపులను చూసి తన బాణాల కన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోయాడు.ఆమె పూర్ణిమనాటి చంద్రుని పోలి ఉంది. చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో, ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. ఇలా ఆ రతీదేవి సర్వావయవ సౌందర్యం మన్మథుడిని సహితం నిశ్చేష్టుడిని చేసింది. మన్మథుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనంద సాగరంలో మునిగి తేలసాగాడు. బ్రహ్మ ఇచ్చిన శాపంలాంటివి ఏవీ అతడికి గుర్తు లేకుండా పోయాయి. రతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకొంటూ ఆనందాన్ని అనుభవించసాగింది. దక్షప్రజాపతి తన కుమార్తె, అల్లుడు ఆనందంగా ఉండటంతో ఆయన కూడా ఆనందించసాగాడు. ఒక యోగి ఆత్మ విద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మథుడు తన హృదయంలో నిలుపుకొని ప్రకాశిస్తూ పరవశించ సాగాడు. ఇలా రతీ మన్మథుల వివాహ ఘట్టాన్ని శివపురాణం వివరించి చెబుతోంది.

మూలాలు[మార్చు]

  1. Swami Ram Charran (2007). The Vedic Sexual Code: Enjoy a Complete and Fulfilling Relationship With Your Lover. AuthorHouse. pp. 151, 209.
  2. Dongier, Wendy (1993). Purāṇa perennis: reciprocity and transformation in Hindu and Jaina texts. SUNY Press. pp. 52, 75. ISBN 0-7914-1382-9.
  3. Patricia Turner and estate of Charles Russell Coulter (2000). Dictionary of ancient deities. Oxford University Press US. pp. 258, 400. ISBN 0-19-514504-6.
  4. Kramrisch pp. 253–4
"https://te.wikipedia.org/w/index.php?title=రతీదేవి&oldid=3888592" నుండి వెలికితీశారు