రమాదేవి దాసరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరు 1955లో శ్రీమతి కోటేశ్వరమ్మ, పోలుకొండ చిట్టివెంకులు దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరింటి ప్రక్కనే ఉండే ప్రసిద్ధ నట దంపతులు శ్రీమతి సీతాకుమారి, బి.ఎన్. సూరిగార్ల నట జీవితం ఈవిడను ప్రభావితం చేయగా, ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత కె.ఎస్.టి. శాయి (బాపట్ల), ప్రముఖ నటీమణి శ్రీమతి కె. విజయలక్ష్మి (విశాఖపట్నం) స్ఫూర్తితో, తన భర్త ప్రముఖ రచయిత, సంగీత దర్శకుడు డి.ఆర్. మోహన్ ప్రోత్సాహంతో 1977 సంవత్సరంలో రంగస్థల ప్రవేశం చేశారు. ఫైన్ ఆర్ట్స్ – బాపట్ల, సాగరి- చిలకలూరిపేట, అరవింద ఆర్ట్స్ – తాడేపల్లి – కుంచనపల్లి, కళానికేతన్ – వీరన్నపాలెం మొదలగు సంస్థలు ప్రదర్శించిన పలు నాటక/నాటికల్లో ప్రధాన స్త్రీ పాత్రలు పోషించారు. సుమతి, పుటుక్కు జరజర డుబుక్కుమే, అక్షింతలు, గాజు పెంకులు, రూల్సు ఒప్పుకోవు, మృగమైదానం, ధ్వంసరచన, ఏరువాక సాగాలి, బీజాక్షరాలు, ఒక మహాపతనం వంటి శతాధిక నాటిక/నాటకాల్లో నటించారు. సాంఘిక నాటిక/నాటకాల్లోనే కాక పద్య నాటకాల్లోనూ చింతామణి, చంద్రమతి, మోహిని, తార, సీత, తిరుపతమ్మ తదితర పాత్రలు ధరించారు. పలు పరిషత్తులలో ‘ఉత్తమ నటి’గా అనేకానేక బహుమతులను కైవశం చేసుకున్న ఈవిడ రాష్ట్ర ప్రభుత్వంవారి ప్రతిష్ఠాత్మక నంది అవార్డును కూడా అందుకొన్నారు. కళావాణి – రాజమండ్రి వారిచే ‘రసజ్న’ అవార్డును, తెనాలి – పట్టణ కళాకారుల సంఘం వారిచే ఘన సత్కారాన్ని పొందారు.

మూలాలు[మార్చు]

రమాదేవి దాసరి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 78.